• facebook
  • whatsapp
  • telegram

Free Coaching: కొలువుల దిక్సూచి!

* ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఉచితంగా శిక్షణ



కోచింగ్‌ సెంటర్లు కాసుల కార్ఖానాలుగా మారాయి! అరకొర శిక్షణనిచ్చి డబ్బుల అంతస్తులు పోగేసుకుంటున్నాయి! చాలా సంస్థలది ఇదే తీరు... ఇలాంటి రోజుల్లో ఉన్నతోద్యోగం వదిలి మరీ విద్యార్థులకు ఉచితంగా తర్ఫీదునిస్తున్నాడు చింతల రమేశ్‌. అతడి శిష్య రికంలో పదుల మంది ప్రభుత్వ కొలువుల్లో కుదురు కున్నారు. వందలమంది ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందారు. విద్యార్థులు, నిరుద్యోగులకు దిక్సూచిలా మారిన అతడితో మాట కలిపింది ఈతరం.

లక్ష జీతం.. కేంద్రప్రభుత్వ ఉద్యోగం.. కుదుపుల్లేని జీవితం... సాఫీగా సాగిపోతున్న ఈ కెరియర్‌ని ఎవరు వదులుకుంటారు? రమేశ్‌ కాదనుకున్నాడు. నిరుద్యోగులు, గ్రామీణ విద్యార్థుల కోసం అవన్నీ వదిలేసి ఉచిత శిక్షణ సంస్థ ప్రారంభించాడు. ఉన్నత విద్యావకాశాల శిక్షణ కోసం విద్యార్థులు లక్షల రూపాయలు వెచ్చించడం.. ఏళ్లకొద్దీ పరీక్షలు రాసినా నిరుద్యోగులు కొలువు సంపాదించుకోలేకపోవడం చూసి వాళ్లకు అండగా నిలవాలనుకున్నాడు రమేశ్‌. ఒకరిద్దరికి పాఠాలు చెప్పాలంటేనే ఎన్నో వ్యయప్రయాసలుంటాయి. అలాంటిది ఐఈఎస్, గేట్‌లో ప్రవేశ పరీక్షల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కలిపి ఎనిమిది వందల మందికి ఉచితంగా శిక్షణనిస్తున్నాడు.
 


  అమ్మకి చేదోడుగా   

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రమేశ్‌ సొంతూరు. మొదట్నుంచీ చదువులో చురుకే. మంచి మార్కులతో ఎంటెక్‌ పూర్తి చేశాక బీఎస్‌ఎన్‌ఎల్‌లో జూనియర్‌ టెలికాం అధికారిగా ఉద్యోగం వచ్చింది. కుటుంబం కాస్త కుదురుకుంటోంది అనుకుంటున్న సమయంలో సింగరేణి ఉద్యోగి అయిన రమేశ్‌ నాన్న అకస్మాత్తుగా మరణించారు. దీంతో ఒంటరైన తల్లికి చేదోడువాదోడుగా ఉండేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగొచ్చాడు. కొన్నాళ్లయ్యాక వరంగల్‌లోని ఓ కళాశాలలో అధ్యాపకుడిగా చేరాడు. కాస్త ఖాళీ సమయం దొరకడంతో సొంతంగా ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (ఐఈఎస్‌) సాధన ప్రారంభించాడు. యూపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్షకు ఎలాంటి శిక్షణ లేకుండానే తొలి ప్రయత్నంలోనే 127వ ర్యాంకు సాధించాడు. తమిళనాడులో టెలీకమ్యూనికేషన్‌ విభాగంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయ్యాడు. సివిల్స్‌లాగే ఐఈఎస్‌ క్లిష్టమైన పోటీ పరీక్ష. దానికోసం రమేశ్‌ సొంతంగా నోట్సు తయారు చేసుకున్నాడు. సమాచారం సేకరించాడు.


  అనుభవమే పెట్టుబడిగా  

అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్నాడు. ఆ శ్రమ, అనుభవాన్ని ఇతరులకు ఉపయోగపడేలా చేయాలనుకున్నాడు. సరైన శిక్షణ లేక పేద పిల్లలు  ఇబ్బంది పడటం అతడిని కలచివేసింది.  దీర్ఘకాలిక సెలవు పెట్టి కరీంనగర్‌ వచ్చేశాడు. ‘చదువుకొందాం కాదు.. చదువుకుందాం’ అనే నినాదంతో శిక్షణ ప్రారంభించాడు. తను అక్కడే చదువుకోవడం.. చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ఆ పట్టణాన్ని ఎంచుకున్నాడు. ముందు ఇద్దరితో శిక్షణ ప్రారంభించాడు. ఏడాది తిరిగేసరికి ఆ సంఖ్య 30కి చేరింది. ఆ సమయంలో శిక్షణ కేంద్రం అద్దె, నిర్వహణ ఖర్చులకు రమేశ్‌ స్నేహితులు సాయం చేశారు. కొన్నాళ్లయ్యాక ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకున్నాడు. పెద్ద హోదా.. పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. లక్ష రూపాయల జీతం.. వదులుకోవడమేంటని అంతా ఆశ్చర్యపోయారు. నీ కెరియర్‌ వదులుకొని వేరేవాళ్లకి సాయం చేయడమేంటని దగ్గరివాళ్లు హితవు పలికారు. అయినా రమేశ్‌ అడుగు ముందుకే వేశాడు. క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. తర్వాత ఆన్‌లైన్‌లోనూ గేట్, ఐఈఎస్‌ శిక్షణ ప్రారంభించాడు. ఉదయం, సాయంత్రం రెండు గంటల చొప్పున ఆన్‌లైన్‌లో... రాత్రి తొమ్మిదివరకు ఇంటి దగ్గర పాఠాలు బోధిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం 750మంది అంతర్జాలంలో, 30 మంది ప్రత్యక్షంగా అతడి దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో పాఠాలు వినాలనుకునేవాళ్లు ఏడాదికి కేవలం రూ.600 చెల్లించి చేరవచ్చు. తన దగ్గరికి వచ్చేవాళ్లకైతే ఉచితంగా పాఠాలు చెప్పడమే కాదు.. మెటీరియల్‌ కూడా తనే అందజేస్తున్నాడు. 


   మెరుగైన ఫలితాలు  

పేరున్న శిక్షణ సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా రమేశ్‌ దగ్గర శిష్యరికం చేసిన ఎంతోమంది ఉద్యోగాలు పొందారు. నలభై మంది ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశం పొందారు. విజయనగరం అమ్మాయి జ్యోత్స్నప్రియ గేట్‌లో ఆలిండియా స్థాయిలో పదో ర్యాంకు సాధించింది. బ్యూరో ఆఫ్‌ ఇండియా స్టాండర్డ్స్‌లో శాస్త్రవేత్తగా ఎంపికైంది. పలాస కుర్రాడు కార్తీక్‌ బెంగళూరులో మీడియా టెక్‌లో రూ.25 లక్షల ప్యాకేజీతో చేరాడు. ఆశ్రిత అనే అమ్మాయి ఎన్‌వీఐడీఐఏలో రూ.51 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికైంది. పొన్నం సౌమ్య అనే అమ్మాయికి గేట్‌లో 87వ ర్యాంక్‌తో రెండు కేంద్రప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైంది. 

రమేశ్‌.. కంప్యూటర్‌ తెరపై ‘కలలకు వాస్తవ రూపం ఇద్దాం’ అనే స్లోగన్‌ ఉంటుంది. దాన్ని పాటిస్తూ.. తన కలలు కాదు, ఇతరుల కలలు నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు.


  శిక్షణతో సులువు  

‘గ్రామీణ, పేద విద్యార్థుల్లో ప్రతిభకు కొదవ లేదు. వారికి సరైన శిక్షణ, మార్గనిర్దేశనం చేసేవారు లేక వెనకబడిపోతున్నారు. నా పరిధిలో కొంతైనా చేయడానికే ఉచిత శిక్షణకు శ్రీకారం చుట్టాను. నా దగ్గర శిక్షణ పొందినవారు ఉన్నత స్థానాల్లో స్థిరపడుతుంటే నా శ్రమకు తగ్గ ఫలితం దక్కుతోంది అనిపిస్తుంటుంది. వాళ్లు సైతం ఇంకొందరికి సాయం చేయడం మొదలు పెడితే ఇంకెంతోమంది బాగు పడతారు. ఈ ప్రయాణంలో నా శ్రీమతి వీణ అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.