• facebook
  • whatsapp
  • telegram

PGECET: పీజీఈసెట్‌లో 18,829 మంది పాస్‌  

* అన్ని కళాశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేస్తాం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీ ఇంజినీరింగ్‌  ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్‌)లో 91.28% మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 19 సబ్జెక్టులకు కలిపి 20,626 మంది  పరీక్షలు రాయగా, వారిలో 18,829 మంది కనీస మార్కులు పొంది.. కౌన్సెలింగ్‌లో కన్వీనర్‌ కోటా సీటు పొందేందుకు  అర్హత సాధించారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, జేఎన్‌టీయూహెచ్‌ ఇన్‌ఛార్జి ఉపకులపతి బుర్రా వెంకటేశం, రాష్ట్ర  ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఇతర అధికారులు జేఎన్‌టీయూహెచ్‌లో మంగళవారం సాయంత్రం  ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ.. ఎంటెక్‌ కళాశాలలు ఏటేటా తగ్గుతుండగా..  ఎంఫార్మసీ కళాశాలలు పెరుగుతున్నాయని తెలిపారు. మొత్తం 13,559 సీట్లుండగా 18,829 మంది ఉత్తీర్ణులయ్యారని,  పోటీ పెద్దగా లేదన్నారు. లింబాద్రి మాట్లాడుతూ... పీజీఈసెట్‌కు గత ఏడాది 16 వేల మంది దరఖాస్తు చేయగా..  ఈసారి 22,712 మంది చేశారని చెప్పారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు వెంకటరమణ, కార్యదర్శి  శ్రీరాం వెంకటేశ్, జేఎన్‌టీయూహెచ్‌ రెక్టార్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ ఆచార్య వెంకటేశ్వర్‌రావు, కన్వీనర్‌  ఎ.అరుణకుమారి, కో-కన్వీనర్‌ ఆచార్య రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.

విద్యా ప్రమాణాలపై కఠినంగా వ్యవహరిస్తాం 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని అన్ని కళాశాలల్లో విద్యార్థులకు, ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరు  తప్పనిసరి చేస్తామని, దానిపై త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. వచ్చే మూడు  రోజులపాటు ఇంజినీరింగ్‌ కళాశాలల పరిస్థితిపై సమీక్షించి.. అనుబంధ గుర్తింపు జారీ చేస్తామని తెలిపారు. ప్రిన్సిపాళ్లు,  బోధన సిబ్బంది లేకున్నా అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. విద్యా ప్రమాణాల విషయంలో కఠినంగా  వ్యవహరిస్తామన్నారు. బీటెక్‌లో దాదాపు లక్ష మంది చేరుతుండగా... ఎంటెక్‌కు వచ్చేసరికి 5 వేలకు కూడా ఎందుకు  మించడం లేదన్న ప్రశ్నకు రెక్టార్‌ విజయకుమార్‌రెడ్డి సమాధానమిస్తూ బీటెక్‌తోనే ఎక్కువ మందికి ఉద్యోగాలు  దక్కుతున్నాయని, దానికితోడు విదేశాల్లో విద్యార్జనకు పెద్దసంఖ్యలో విద్యార్థులు వెళ్తున్నారని.. దాంతో పీజీలో చేరేవారు  తగ్గిపోతున్నారని తెలిపారు.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లౌడ్‌ కంప్యూటర్‌లో ఉద్యోగాల మథనం

‣ డిజిటల్‌ బిజినెస్‌ కోర్సులో అడ్మిషన్లు

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌

‣ బైపీసీ తీసుకుంటే.. కెరియర్‌ అవ‌కాశాలివే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.