• facebook
  • whatsapp
  • telegram

NEET: నీట్‌లో 67.55 శాతం ఉత్తీర్ణత

* రాష్ట్రంలో 43,858 మందికి అర్హత మార్కులు

* దేశవ్యాప్తంగా 67 మందికి ఒకటో ర్యాంకు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నుంచి నీట్‌ యూజీ పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 67.55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 64,931 మంది పరీక్ష రాయగా వారిలో 43,858 మంది విద్యార్థులు కనీస మార్కులు సాధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా ఈసారి 23.33 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వారిలో 13.16 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67 మందికి సమాన పర్సంటైల్‌ (99.997129) రావడంతో వారందరికీ ఒకటో ర్యాంకు కేటాయించారు. అందులో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కె.సందీప్‌ చౌదరి, జి.భానుతేజసాయి, పి.పవన్‌కుమార్‌రెడ్డి, వి.ముకేశ్‌చౌదరి ఉన్నారు. రాష్ట్రానికి చెందిన ఎం.జశ్వంత్‌రెడ్డి 90వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో తొలి పది ర్యాంకర్లలో రాష్ట్రం నుంచి కె.సందీప్‌ చౌదరి, పి.పవన్‌కుమార్‌రెడ్డి, వై.రేష్మా నిశితకు స్థానం లభించింది. గత నెల 5వ తేదీన నీట్‌ యూజీ జరిగింది. వాటి ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) మంగళవారం విడుదల చేసింది. 

వచ్చే వారంలో రాష్ట్రస్థాయి ర్యాంకర్ల జాబితా వెల్లడి

జాతీయస్థాయి ర్యాంకులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థుల వివరాలతో కూడిన నివేదిక వచ్చే వారంలో వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అందుతుంది. దీనిని అనుసరించి రాష్ట్ర విద్యార్థుల ర్యాంకర్ల జాబితాను విశ్వవిద్యాలయం విడుదల చేస్తుంది. నీట్‌ యూజీని తెలుగుతో కలిపి 13 భాషల్లో నిర్వహించారు. 

సీట్ల వివరాలు ఇలా..

రాష్ట్రంలో మొత్తం 6,209 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో కలిపి కన్వీనర్‌ కోటాలో 3,856, జాతీయస్థాయిలో 460, బి కేటగిరీలో 1,317, సి కేటగిరీలో 576 సీట్లు భర్తీ చేస్తారు.

ఏయూ, ఎస్వీయూ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,439 సీట్లు ఉన్నాయి. ఇందులో 408 సీట్లను జాతీయస్థాయి కోటాలో భర్తీ చేస్తారు.

ఏయూ, ఎస్వీయూ పరిధిలోని ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో 3,420 సీట్లు ఉన్నాయి. ఇందులో బి కేటగిరీలో 1,317, సి కేటగిరీలో 553 సీట్లు భర్తీ చేస్తారు. 

విజయవాడలోని సిద్దార్థ ప్రభుత్వ వైద్య కళాశాల (స్టేట్‌ కేటగిరీ)లో 175 సీట్లు ఉన్నాయి.

స్విమ్స్‌ (తిరుపతి)లో 175 సీట్లు ఉండగా.. ఇందులో 23 సీట్లను సి కేటగిరీలో, 26 సీట్లను జాతీయస్థాయి కోటాలో భర్తీ చేస్తారు.

2024-25 విద్యా సంవత్సరంలో కొత్తగా 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఒక్కో కళాశాలకు వంద సీట్ల చొప్పున భర్తీకి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ)కు దరఖాస్తు చేసింది. ఈ కళాశాలలను ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీ చేసిన అనంతరమే సీట్ల భర్తీకి ఆమోదం లభిస్తుంది. 

గత ఏడాది జరిగిన ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీ వివరాల పట్టికలను వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు తాజా అభ్యర్థులకు సీట్ల భర్తీ సరళిపై అవగాహన పెంచుకునేందుకు వీలుంటుంది.
 


 

       మరింత సమాచారం...మీ కోసం!        
 

నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!  

బీఎస్‌ఎఫ్‌లో ఇన్‌స్పెక్టర్ పోస్టులు

ఎన్‌సీబీ, ఫరీదాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ 

ఈఎస్‌ఐసీ, అల్వార్‌లో 115 ఫ్యాకల్టీ పోస్టులు 

రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

నలుగురితో కలిసిపోవాలంటే...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.