విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Jobs: ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు

* వ్యవసాయేతర రంగంపై అంచనాలు


దేశ ఆర్థిక వ్యవస్థ 2030 వరకు ఏటా సగటున 78.5 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సిన  అవసరముందని ఆర్థిక సర్వే 2023 - 24 అంచనా వేసింది. సోమవారం పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన సర్వే ప్రకారం.. ‘దేశంలో ఉపాధి కల్పనలో ప్రైవేటు రంగానిది కీలక పాత్ర. అయినా ఈ విషయంలో కార్పొరేట్‌ రంగం అంత గట్టిగా అడుగులు వేయలేదు. 33,000 కంపెనీలను శాంపిల్‌గా చేసుకుని జరిపిన సర్వేలో 2019-20 నుంచి 2022-23 వరకు పన్నుకు ముందు లాభం నాలుగింతలైంది. సాధారణ జీడీపీ 9.6% వృద్ధితో రూ.295 లక్షల కోట్లకు చేరింది. కానీ నూతన నియామకాలు, సిబ్బంది వేతనాల్లో వృద్ధి పెద్దగా లేదు. ఉద్యోగాలతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడితేనే ఆర్థిక వృద్ధి సాధ్యం. ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ, ప్రైవేటు రంగంతో కలిసి పనిచేస్తేనే ఇది సాకారమవుతుంది. 


* కార్మిక వ్యవస్థలో వ్యవసాయ రంగ వాటా క్రమంగా తగ్గుతోంది. 2023లో మొత్తం కార్మికుల్లో వ్యవసాయ రంగ వాటా 45.8% కాగా.. 2047 కల్లా 25 శాతానికి పరిమితం కావొచ్చు. అందువల్ల వ్యవసాయేతర రంగంలో ఏటా 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి. ప్రస్తుత పీఎల్‌ఐ (అయిదేళ్లలో 60 లక్షల మందికి ఉపాధి) పథకాలు, మిత్రా టెక్స్‌టైల్‌ పథకం (20 లక్షల ఉద్యోగాలు), ముద్రా తదితరాల ద్వారా ఈ ఉద్యోగాలను పొందే అవకాశం ఉంది. 

భూచట్టాల్లో సంస్కరణలు అవసరం: తాత్కాలిక ఉపాధి పొందే వారికి, సామాజిక భద్రతను కల్పించేందుకు స్టాఫింగ్‌ కంపెనీలు కృషి చేయాలి. ఫ్లెక్సీ వర్కర్ల నియామకాలను పెంచాలి. వ్యవసాయం నుంచి ఇతర రంగాలకు వెళ్లే వారికి, మంచి ఉద్యోగాలను సాధించిపెట్టడమన్నది సవాలే. భూ-కార్మిక చట్టాల్లో సంస్కరణలు - నిబంధనల సరళీకరణ ద్వారా నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వే సూచించింది.   

చౌక దిగుమతుల అంశంలో జాగ్రత్త: ఇతర దేశాల నుంచి వస్తున్న చౌక దిగుమతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సర్వే హెచ్చరించింది. ‘2024లో భౌగోళిక, రాజకీయ సంఘర్షణలు పెరిగితే, సరఫరాపై ప్రభావం పడి వస్తువుల ధరలు అధికమవుతాయి. అది ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తీసుకొస్తుంది. భారత ఆర్థిక రంగ భవిష్యత్‌ అంచనాలు బాగున్నా, మన బలహీనతలపై ఓ కన్నేయడం మర్చిపోరాదని తెలిపింది. 

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి గాథలో కేపిటల్‌ మార్కెట్ల పాత్ర కీలకంగా మారిందని ఆర్థిక సర్వే తెలిపింది. కంపెనీలు మూలధనాన్ని సమీకరించేందుకు, మదుపర్లు ఆకర్షణీయ ప్రతిఫలం కోసం పెట్టుబడులు పెట్టేందుకు కేపిటల్‌ మార్కెట్లపై ఆధారపడటం బాగా పెరిగింది. అంతర్జాతీయ భౌగోళిక- రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక కుదుపుల ప్రభావాన్ని మన మార్కెట్లు తట్టుకుని నిలబడటం ఇందుకు నేపథ్యం. 2023-24లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన వర్థమాన మార్కెట్లలో ఒకటిగా మన మార్కెట్లు నిలిచాయి. విలువపరంగా మన మార్కెట్లు ప్రపంచంలో అయిదో స్థానంలో నిలిచాయి. సాంకేతికత, డిజిటలీకరణ, నియంత్రణపరంగా పటిష్ఠ చర్యల వల్ల కేపిటల్‌ మార్కెట్లలో చిన్న మదుపర్ల ప్రాతినిథ్యం శరవేగంగా పెరుగుతోంది. వీరి స్పందన అధికంగా ఉండటం, బ్యాంకుల్లో వడ్డీ ఎక్కువగా ఉంటున్నందున  కార్పొరేట్‌ సంస్థల నిధుల సమీకరణ కోసం కేపిటల్‌ మార్కెట్లు మరింత ఆకర్షణీయంగా

* మారాయి. సెన్సెక్స్‌ జులై 3న 80,000 మైలురాయిని అందుకుంది. 

*  దేశ స్థూల దేశీయోత్పత్తిలో స్టాక్‌ మార్కెట్ల విలువ నిష్పత్తి 2018-19లో 77 శాతంగా ఉండగా.. 2023-24లో 125 శాతానికి చేరింది. జీడీపీలో మార్కెట్‌విలువ నిష్పత్తి పెరగడాన్ని, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సంకేతంగా తప్పనిసరిగా భావించాల్సిన అవసరం లేదని సర్వే అభిప్రాయపడింది.  





 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

Published at : 23-07-2024 12:16:48

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం