• facebook
  • whatsapp
  • telegram

వేగంగా నేర్చుకునేవాళ్లకు త్వరగా నియామకాలు

నియామక సంస్థల అవసరాలకు తగిన నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు అభ్యర్థులు కృషి చేయాలి. ప్రాంగణ నియామకాల్లో ప్రభావం చూపగల ప్రతి అంశంలోనూ ప్రావీణ్యం పెంచుకోవాలి. సాంకేతికతతో పాటు సాఫ్ట్‌స్కిల్స్‌నూ వృద్ధి చేసుకోవాలి. ఏ విషయాన్నయినా త్వరగా నేర్చుకునే అభ్యర్థులనే సెలక్టర్లు ఇష్టపడతారు. అలాంటి వారినే ఎంపిక చేసుకుంటారు!

సాధారణ వ్యాపార సమస్యలను త్వరగా అర్థం చేసుకుని పరిష్కరించేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించే సామర్థ్యం, ఇతరులతో పోలిస్తే శీఘ్ర అభ్యాసకుల్లో ఎక్కువ. ఇలాంటివారు కొత్త నైపుణ్యాలను నేర్చుకుని వాటిపై పట్టు సాధించడానికి అంకిత భావంతో పనిచేస్తారు. విద్యార్థి దశ నుంచే కొన్ని అంశాలను ఎంపిక చేసుకుని వాటిపై లోతుగా అధ్యయనం చేయడం వల్ల ఉన్నత స్థాయి నైపుణ్యం సంపాదించవచ్చు. మొదటి మెట్టుగా ఆసక్తి ఉన్న అంశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి అభ్యసించాలి. వృత్తి ఉద్యోగాలు మీరు ఎంచుకున్న అంశానికి సహకరించేవిగా, ఆ అంశానికి అనుబంధంగా ఉండేలా చూడాలి.  

నేర్చుకుంటున్న అంశాలపై దృష్టి

సునాయాసంగా ఏ కొత్త విషయాలనూ నేర్చుకోలేము. ఉదాహరణకు కొత్తగా ఫ్రెంచ్‌ లాంటి ఒక విదేశీ భాష నేర్చుకోవాలన్నా, నూతన సాంకేతిక నైపుణ్యం సంపాదించుకోవాలన్నా సాధారణ ప్రయత్నం సరిపోదు. ఇలాంటి కొత్త విషయాలపై ప్రత్యేక సమయం కేటాయించండి. శ్రద్ధ చూపండి. ఇలా చేయడం వల్ల నేర్చుకుంటున్న విషయాలపై దృష్టి ఉంటుంది. కొత్తవి నేర్చుకోవడంతో పాటు వాటిని మీలో నిక్షిప్తం చేసుకోవడం అవసరం. 

నేర్చుకోదలిచిన అంశం క్లిష్టమైనదీ, విస్తృత పరిధి ఉన్నదీ అయితే ఆ విషయాన్ని కొన్ని అర్థ్ధవంతమైన భాగాలుగా విభజించుకుంటే నేర్చుకోవడం సులువు. నిజానికి ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియ నిత్యజీవితంలో అమలుచేస్తున్నదే. ఫోన్‌ నంబర్లు ఇలాగే గుర్తు పెట్టుకుంటాం కదా? ఏ సమాచారాన్నయినా త్వరగా నేర్చుకుని గుర్తుంచుకోవాలంటే ఆ సమాచారాన్ని తార్కికంగా విభజించేందుకు ప్రయత్నించండి. ఉదాహరణకు చరిత్రలో విషయాలను ముఖ్యమైన సంఘటనలూ, యుద్ధాలు లాంటివాటికి అనుసంధానించడం ద్వారా సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. 

గుర్తుంచుకోండి  

సరికొత్త విషయాలు నేర్చుకునేందుకు ఒక షెడ్యూల్‌ తయారుచేసుకుని ఆ షెడ్యూలుకి కట్టుబడి కృషి చేయాలి.  

కొత్త నైపుణ్యాల సాధనలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోండి. 

నూతనంగా నేర్చుకున్న ప్రతి విషయాన్నీ సాధన చేయండి.

నైపుణ్యాల అప్‌గ్రేడ్‌

త్వరితంగా నేర్చుకునే నైపుణ్యం మీలో ఉందన్న విషయాన్ని రిక్రూటర్లకు తెలియజెప్పే అవకాశాలు ఏమిటో చూద్దాం. 

మీ లక్షణాలనూ, నైపుణ్యాలనూ తెలియజెప్పేందుకు రెజ్యూమే సరైన ఉపకరణం. అభ్యర్థి అకడమిక్‌ చదువు, సాంకేతిక నైెపుణ్యాలు, వృత్తిపరమైన నైపుణ్యాలు రెజ్యూమేలో తెలియజెప్పడం సాధారణ అంశం. మీరు క్విక్‌ లర్నర్‌ అనీ, దేన్నయినా త్వరగా గ్రహించి అమలు చేయడం మీ నైపుణ్యమనీ మీరు రిక్రూటర్లకు తెలియజెప్పాలి. రెజ్యూమేలను వడపోసే క్రమంలో రిక్రూటర్లు ‘కీ వర్డ్‌ స్కానర్‌’ లాంటి సాధనాన్ని ఉపయోగిస్తారు. శీఘ్రంగా నేర్చుకునే లక్షణాన్ని తెలియజెప్పేందుకు రెజ్యూమేలో సాఫ్ట్‌ స్కిల్స్‌ విభాగంలో కొన్ని స్టాండర్డ్‌ పదాలను వాడాలి. ఈ విభాగంలో నైపుణ్యాన్ని ప్రముఖంగా తెలిసేలా రెజ్యూమేలో చూపాలి. .  

రెజ్యూమేలో విద్యార్హతలు తెలియజెప్పే విభాగంలో పాఠశాల చదువు, డిగ్రీలు పొందుపరుస్తుంటారు. ఇక్కడ ప్రస్తుతం మీరు అదనంగా ఏదైనా కోర్సులు చదువుతుంటే ఆ కోర్సులూ, తీసుకుంటున్న ఇతర శిక్షణలూ, ధ్రువపత్రాల గురించిన వివరాలను పొందుపరచండి. కొత్త విషయాలను నేర్చుకోవడంలోనూ, నిరంతరమైన నైపుణ్యాలను అప్‌గ్రేడ్‌ చేయడంలోనూ మీ నిబద్ధతను రిక్రూటర్లు గుర్తించగలుగుతారు. ఈ అంశాలు రిక్రూటర్లకు మీపై సానుకూల అభిప్రాయం కలిగిస్తాయి.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నైపుణ్య యువత... భారత్‌ భవిత

‣ దరి చేరనున్న 5జీ సాంకేతికత

‣ సులువుగా... సమగ్రంగా రాజ్యాంగాన్ని చదివేద్దాం!

‣ మార్కుల ఆధారంగా నేవీ ఉద్యోగాలు!

‣ అన్ని అడుగులూ కొలువుల వైపు!

‣ మౌఖిక పరీక్షల్లో ఇవి గుర్తుంచుకోవాలి!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 14-03-2022


 

ప్రజెంటేషన్‌

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం