• facebook
  • whatsapp
  • telegram

ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ పరీక్షల్లో మార్కులకు సూచనలు



 


ఏడాదిపాటు ఎంత జాగ్రత్తగా చదివినా.. పరీక్షల సమయంలో మాత్రం కాస్త కంగారుగానే ఉంటుంది. వివిధ రకాల ఆలోచనలతో ఒత్తిడి పెరిగిపోతూనే ఉంటుంది. కొన్ని పద్ధతులతో దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందామా... 


ముందుగా ఒత్తిడికి కారణమవుతున్న ఆలోచనలను గుర్తించి.. వాటి నుంచి బయటపడటానికి సాధ్యమైనంత వరకూ ప్రయత్నించాలి. సాధారణంగా ప్రతికూల ఆలోచనలే ఎక్కువగా ఒత్తిడికి గురిచేస్తుంటాయి. ఉదాహరణకు... బాగా ముఖ్యమనుకుని చదివిన వాటిని పరీక్షలో అడగరేమో, సమయం సరిపోతుందో లేదో, ప్రశ్నను తప్పుగా అర్థంచేసుకుని వేరే సమాధానం రాస్తానేమో, చేతిరాత అంత బాగోదు.. పేపర్లు దిద్దేవారికి అర్థంకాకపోతే ఎక్కువ మార్కులు రావేమో.. ఇలా ప్రతికూల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఒత్తిడిని పెంచుతూనే ఉంటాయి. 

ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కదా. అలాగే ప్రతి ప్రతికూల ఆలోచనకు సానుకూల సమాధానమూ ఉంటుంది. ఆ దిశగా అన్వేషిస్తే... ఈ ఆలోచనలేవీ ఇబ్బందిపెట్టవు. కొన్నిటికి మీకు సమాధానం తట్టలేదనుకోండి. సీనియర్లు, అధ్యాపకులు లేదా కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు కూడా తీసుకోవచ్చు. వాటిల్లో ఆచరణయోగ్యంగా ఉన్నవి అమలు చేయొచ్చు కూడా. 

 సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఒత్తిడిని చాలా   వరకూ నియంత్రించొచ్చు. పరీక్షల ముందు కూడా కొత్త చాప్టర్లను చదివేసి వాటి మీద పట్టు సాధించాలనే నియమం పెట్టుకుంటారు కొందరు. ఇలాంటప్పుడు అందుబాటులో ఉన్న సమయం తక్కువగా ఉండటంతో ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుందే తప్ప తగ్గదు. 

 ప్రతి పనినీ గడువు తేదీలోగా పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. పరీక్షలు జరుగుతున్నప్పుడు అందుబాటులో ఉండే సమయమూ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సబ్జెక్టులవారీగా పునశ్చరణ చేయాల్సిన అంశాలకు టైమ్‌టేబుల్‌ వేసుకుని అమలుచేయాలి. 

 ఒత్తిడికి కారణమయ్యే అన్ని విషయాలనూ మార్చలేకపోవచ్చు. కానీ మీ పరిధిలో దాని తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నించొచ్చు. పరీక్షల సమయంలో ప్రతి చిన్న విషయమూ సవాలుగానే కనిపించచ్చు. కానీ దాన్నో అవకాశంగా మలచుకునే శక్తి మీకే ఉంటుంది. 

 ఇబ్బందుల గురించి పదేపదే ఆలోచించడం వల్ల ఆందోళన మరింత పెరుగుతుందేగానీ తగ్గదు. కానీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం వల్ల మనసు తేలికపడి.. ఒత్తిడి తీవ్రత తగ్గుతుంది. ఆ ఇతరులు.. స్నేహితులు, అధ్యాపకులు, కుటుంబసభ్యులు ఎవరైనా కావచ్చు. 

 పనులన్నింటినీ ఒకేసారి పూర్తిచేసేయాలని ఆరాటపడటం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే పనులను.. అతి ముఖ్యమైనవి, ముఖ్యమైనవి, కొన్నిరోజులపాటు వాయిదా వేసినా ఇబ్బందిలేనివి.. అని విభజించుకుని చేయడానికి ప్రయత్నించాలి. 

 పరీక్షల సమయంలో కొంతసేపైనా వ్యాయామాలు, ధ్యానం చేయడానికి ప్రయత్నించాలి. వీటితో శారీరకంగా చురుగ్గా, మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. 


చివరగా.. పరీక్షల సమయంలో కొద్ది రోజుల్లో రాయాల్సిన పరీక్షల గురించి ఆలోచించాలి. సెలవుల్లో నేర్చుకోవాల్సిన కొత్త భాష, కోర్సుల గురించో, చేయాల్సిన విహార యాత్రల గురించో ఇప్పటినుంచే ఆలోచించడం వల్ల సమయం వృథా తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అందుకే ఆలోచనలు ఎప్పుడూ గతంలోనో, భవిష్యత్తులోనో విహరించకుండా వర్తమానంలో మాత్రమే ఉండేలా జాగ్రత్తపడాలి.


మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Posted Date: 22-03-2024


 

జ్ఞాపకశక్తి

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం