• facebook
  • whatsapp
  • telegram

వయసు 80 పీజీలు 20.. చదువుల్లో రాణిస్తున్న వీరాస్వామి!


ఆయన వయసు 80 ఏళ్లు.. పేరు పక్కన డిగ్రీలను రాయాల్సి వస్తే అది పొడుగాటి లైనే అవుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పటికి 20 పీజీలు పూర్తిచేశారు. నిత్య విద్యార్థిగా ఇంకా చదువుతూనే ఉన్నారు. ఆయనే వరంగల్‌కు చెందిన డాక్టర్‌ అంకతి వీరస్వామి. ఆయన ఇంతవరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 3, కాకతీయ నుంచి 7, ఇందిరాగాంధీ వర్సిటీ నుంచి 4, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి 3, పలు రాష్ట్రాలకు చెందిన ఇతర యూనివర్సిటీల నుంచి మరో 3 పీజీలు చేశారు. ఇక్కడితో ఆయన చదువు ఆపలేదు. తాజాగా ఇగ్నో నుంచి ఎంఏ ఆంత్రోపాలజీ పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచిచూస్తున్నారు. ఆయన 1962లో హెచ్‌ఎస్సీ ఉత్తీర్ణులయ్యారు. తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసి 1968లో వరంగల్‌లోని ఎయిడెడ్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1973లో దూరవిద్య ద్వారా బీఏ చేశారు. 1978లో బీఈడీ పూర్తిచేశారు. చదువంటే ఎంతో ఇష్టపడే వీరస్వామి 1981లో హిమాచల్‌ప్రదేశ్‌లో ఎంఈడీ చేస్తున్న సమయంలో ఒక ప్రొఫెసర్‌ మూడు పీజీలు పూర్తి చేయడం చూసి స్ఫూర్తి పొందారు. దూరవిద్య ద్వారా వివిధ విశ్వవిద్యాలయాల్లో వరుసగా పీజీలు చేస్తూనే ఉన్నారు. ఉస్మానియా వర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంతోపాటు మరో రెండు, మద్రాసు యూనివర్సిటీ నుంచి సైకాలజీ, పొట్టి శ్రీరాములు వర్సిటీ నుంచి ఎంసీజే, ఎంఏ జ్యోతిషం ఇలా అనేక పీజీలు చేశారు. మొత్తం పాతిక పీజీలు చేయాలన్నదే తన సంకల్పమని వీరస్వామి వెల్లడించారు. 2002లో ఉద్యోగ విరమణ పొందాక వరంగల్‌ స్తంభంపల్లిలో తన పేరిటే ఏవీఎస్‌ పాఠశాల నెలకొల్పారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తన పిల్లలు, శిష్యులను కూడా పీజీలు చేసేలా స్ఫూర్తి నింపారు. ఈ వయసులోనూ నిత్యం యోగా చేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు. ఎయిడ్స్‌పై అవగాహన, యోగాతోపాటు అనేక అంశాలపై ఇప్పటికీ రేడియో, టీవీల్లో బుర్రకథలు చెబుతారు. న్యూయార్క్‌కు చెందిన ఒక వర్సిటీ వీరస్వామికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. రోజూ రాత్రి 7.30 నుంచి పదిన్నర వరకు పుస్తకాలు చదువుతూ ఉంటేనే తన బుర్ర చురుగ్గా ఉంటుందని ఆయన చెబుతున్నారు.


ఈనాడు, వరంగల్‌


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

Posted Date: 13-07-2024


  • Tags :

 

ఇత‌రాలు

మరిన్ని