• facebook
  • whatsapp
  • telegram

రైతుకు మేలు చేసేదే సరైన విధానం



దేశీయంగా సాగు రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు సరైన ఆదాయాలు లభించేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత. అయితే, వ్యవసాయ రంగంలో పాలకుల అనాలోచిత నిర్ణయాలు, తాత్కాలిక విధానాల వల్ల సాగుదారులకు తీవ్ర నష్టాలు తప్పడం లేదు.


బియ్యం ఎగుమతులపై కేంద్రం ఇటీవల నిషేధం విధించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అంతకుముందు వంటనూనెల దిగుమతులపై సుంకం/ సెస్‌/ సర్‌ఛార్జీలను ఒక్కసారిగా 5.5శాతానికి తగ్గించింది. ఆ తరవాత అంతర్జాతీయంగా వంటనూనెల ధరలు తగ్గి స్థిరంగా కొనసాగుతున్నా దిగుమతి సుంకాన్ని మాత్రం పునరుద్ధరించలేదు. భారత్‌లో ప్రభుత్వాలు తాత్కాలిక విధానాలు, అపసవ్య పద్ధతులతో వ్యవసాయంతో చెలగాటం ఆడుతున్నాయనడానికి ఇవి రెండూ స్పష్టమైన ఉదాహరణలు. బియ్యం ఎగుమతుల నిషేధాన్నే చూడండి... దేశం లోపల రాష్ట్రాల మధ్యా బియ్యం విక్రయానికి వీల్లేదంటూ దశాబ్దాలపాటు నిషేధం విధించారు, నియంత్రించారు. మన తెలుగునాటే మంచి ఉదాహరణ ఉంది.


అవసరం ఏమిటి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011లో బియ్యం నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. బీపీటీ రకం ధాన్యం 74 కిలోల బస్తా రూ.750 పలుకుతోంది. అదే సమయంలో పొరుగున కర్ణాటక, మహారాష్ట్రల్లో కొరత వల్ల ధాన్యం బస్తా రూ.1200 ఉంది. అయినా ధాన్యాన్ని ఆ రాష్ట్రాలకు తీసుకెళ్ళకూడదు, అమ్ముకోకూడదని నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అప్పుడు లోక్‌సత్తా అన్ని వర్గాల రైతులను సమీకరించి, పాదయాత్రలు చేసి, నియంత్రణ ఉత్తర్వుల్ని ధిక్కరిస్తూ బియ్యం మూటల్ని పక్క రాష్ట్రాలకు తీసుకెళ్ళి విక్రయించింది. చివరకు ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రోజుల వ్యవధిలోనే అన్ని రాష్ట్రాల్లో ధరలు సమానమయ్యాయి. కేవలం ఒక్క సీజన్లో ఒక్క రకం పంటలో స్వేచ్ఛా వాణిజ్యం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు రూ.3,600 కోట్ల మేర లాభం కలిగింది. అనుచితమైన, అన్యాయమైన, అసంబద్ధమైన ప్రభుత్వ నియంత్రణల వల్ల రైతులు అంతగా నష్టపోతున్నారు. ఆ సమయంలో బాస్మతేతర బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం అమలులో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా మన వద్ద ప్రభుత్వ గోదాముల్లో ఎనిమిది కోట్ల టన్నుల మేర ఆహార ధాన్యాలు మూలుగుతున్నాయి. అవసరానికి మించి ఉత్పత్తి వల్ల భారత్‌లో ధరలు పడిపోయాయి. అదే సమయంలో విదేశాల్లో కొరత వల్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో బియ్యం ఎగుమతులపై ఏకాభిప్రాయ సాధనకు లోక్‌సత్తా మళ్ళీ రైతుల్ని, ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీల్ని సమీకరించింది. నేను అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసి వివరాలన్నీ తెలియజేశాను. ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. అప్పటి నుంచి బియ్యం ఎగుమతుల్లో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది. మళ్ళీ ప్రస్తుతం ఎగుమతులపై నిషేధం విధించాల్సిన అవసరం ఏమొచ్చింది?


ఈ ఏడాది జులై ఒకటి నాటికి భారత ప్రభుత్వ గోదాముల్లో 2.53 కోట్ల టన్నుల బియ్యం నిల్వలున్నాయి. నిబంధనల ప్రకారం 1.54 కోట్ల టన్నులుంటే చాలు. దేశ అవసరాలకు కొరత లేనప్పుడు, ఎగుమతుల్ని నిషేధించడం- మనకు మనం నష్టం చేసుకోవడమే. అది అనాలోచిత చర్య. బియ్యం లాంటి నిల్వ ఉండే పంటల్లో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అనుమతిస్తే రైతులు లాభపడతారు. భారతీయ వ్యవసాయం దీర్ఘకాలంగా సంక్షోభంలో ఉంది. ప్రజల్లో 45శాతం ఇప్పటికీ జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. అయితే, జాతీయాదాయంలో వ్యవసాయం వాటా కేవలం 15శాతమే. సాగు రంగంలో తలసరి ఆదాయం ఇతర రంగాల వారి ఆదాయంలో 22శాతమే. రైతుల ఆదాయాలు పెంచాలంటే, మంచి ధర వచ్చే విధానాల్ని అమలు చేయాలి!


భారత్‌లో సుమారు 20శాతం రైతులు 2.7 కోట్ల హెక్టార్లలో నూనె గింజలు సాగుచేస్తున్నారు. వాటి ఉత్పాదకత తక్కువ, ఉత్పత్తి వ్యయం ఎక్కువ. ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద వంటనూనెల దిగుమతిదారు. నిరుడు రూ.1.51 లక్షల కోట్ల విదేశ మారక ద్రవ్యం చెల్లించి 1.6 కోట్ల టన్నుల వంటనూనెను దిగుమతి చేసుకున్నాం. ‘అయ్యా, ఆ చౌక దిగుమతులపై కాస్త హేతుబద్ధ సుంకం వేయండి, ప్రపంచ మార్కెట్లో భారతీయ రైతు పోటీపడే వెసులుబాటు కల్పించండి...’ అని నాలాంటివాళ్లం ఏళ్ల తరబడి ప్రభుత్వాలను పోరాం. మన రైతులకు సరైన ధర, సాంకేతికతను అందిస్తే- కొద్దికాలంలోనే దేశ అవసరాలకు తగ్గ ఉత్పత్తిని సాధించగలరు. తద్వారా దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేస్తారు. కొన్నేళ్లపాటు పోరాడితే వంటనూనెపై ప్రభుత్వం దిగుమతి సుంకం విధించింది. అదీ నిలకడగా లేదు. 44శాతం నుంచి 27శాతం మధ్య ఊగిసలాడింది.


అపార నష్టం

ఉక్రెయిన్‌ యుద్ధం తరవాత ప్రపంచవ్యాప్తంగా వంటనూనెల ధరలు పెరిగాయి. వినియోగదారులకు ధరలు తగ్గించాలని దిగుమతి సుంకం తొలగించారు. నామమాత్రంగా 5.5శాతం సెస్‌, సర్‌ఛార్జీతో సరిపెట్టారు. ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చినా, ప్రభుత్వం మాత్రం దిగుమతి సుంకం పునరుద్ధరించలేదు. వచ్చే ఏడాది చూద్దామంటూ వాయిదా వేసింది. దాంతో, రైతుల ఆదాయం పడిపోయింది. పామోలిన్‌ నూనెకు ముడిసరకైన పామ్‌ పండ్ల ధరలు గతేడాదితో పోలిస్తే 40-50శాతం మేర పడిపోయాయి. రైతుకొచ్చే నికర ఆదాయం 80-90శాతం దాకా కోసుకుపోయింది. దీర్ఘకాలం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఆదాయాలు కొరవడిన వ్యవసాయ రంగంలో ప్రభుత్వాల నిర్లక్ష్యపూరిత వాణిజ్య విధానాలు అపార నష్టం కలగజేస్తున్నాయి. ఒకవైపు ఎగుమతుల్ని నిషేధిస్తూ మన రైతులు ప్రపంచ మార్కెట్‌ ధరల వల్ల లాభపడకుండా చేస్తున్నారు. మరోవైపు దిగుమతి సుంకాల్ని తగ్గిస్తూ మన సాగుదారులు ప్రతికూల పోటీలో నష్టపోక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు. మన రైతుల్ని తరచూ నష్టపరుస్తున్నది ప్రకృతి వైపరీత్యాలు కాదు... ప్రభుత్వాల అనాలోచిత, తాత్కాలిక విధానాలే!


ఆదాయాన్ని పరిరక్షించేలా..

ఎగుమతుల నిషేధం వల్ల ఇతరత్రా రూపాల్లోనూ మనం ప్రపంచ మార్కెట్లో నష్టపోతాం. ఒక్కసారి అంతర్జాతీయ వాణిజ్యం నుంచి వైదొలగితే, మళ్ళీ ప్రవేశించినప్పుడు మన ఉత్పత్తులకు మార్కెట్లను వెతుక్కోవడం కష్టమవుతుంది. వ్యాపారులు సరఫరా గొలుసుల్లో స్థిరత్వాన్ని చూస్తారు. సరఫరాలు నిలకడగా లేకుంటే మన ఎగుమతిదారులకు, రైతులకు తక్కువ ధరలే దక్కుతాయి. వ్యవసాయం ఎప్పుడూ సంక్లిష్టమైంది. అనిశ్చితమైంది. అందువల్ల, ప్రభుత్వ విధానాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించేలా ఉండాలి. సాగుకు రాయితీలు అవసరం. అయితే, రైతులకు చేసే అత్యుత్తమ సాయం వారికి న్యాయమైన, స్థిరమైన మార్కెట్‌ ధరలు లభించేలా చేయడం. మంచి ఆదాయాన్ని మించిన రాయితీ ఉండదు. కేంద్రం వ్యవసాయానికి ఏటా ఆరు లక్షల కోట్ల రూపాయల దాకా రాయితీలు కల్పిస్తోంది. రాష్ట్రాలు ఉచిత విద్యుత్‌, సాగునీరు, ఇతర రూపాల్లో మరో మూడు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నాయి. వాటివల్ల రైతుల బతుకులు మాత్రం బాగుపడటం లేదు. దానికి కారణం మన ప్రభుత్వాల అనాలోచిత విధానాలే.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అన్నదాతకు అండగా కిసాన్‌ కేంద్రాలు

‣ భావి తరాలకు బంగారు భవిష్యత్తు

‣ తాత్కాలిక ఉద్యోగులకు సామాజిక భద్రత

‣ డ్రాగన్‌తో సయోధ్య సాధ్యమేనా?

‣ లొసుగులు సరిదిద్దితే దండిగా రాబడి

‣ నల్లసముద్రంపై సంక్షోభ మేఘం

‣ పేదరికం తెగ్గోసుకుపోయిందా?

Posted Date: 12-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం