• facebook
  • whatsapp
  • telegram

బీమా ఆదుకొంటేనే రైతుకు ధీమాకుంభవృష్టి వర్షాలు, వరదలు దేశంలోని పలు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారీ స్థాయిలో వరదలు వస్తాయని, పంట నష్టం తగ్గించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను అప్రమత్తం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, వాతావరణ శాఖ విఫలమవుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం కొరవడటం, పంటల బీమా పథకాల అమలు రాష్ట్రానికో తీరుగా ఉండటం అన్నదాతలకు శాపంగా పరిణమిస్తోంది.


మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే నినాదంతో అయిదేళ్ల కిందట ‘ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై)’ తీసుకొచ్చింది. అయితే దీని అమలులో అనేక లోపాలు నెలకొన్నాయి. రాష్ట్రానికో విధంగా దీన్ని అమలు చేస్తుండటం వల్ల రైతులకు అన్యాయం జరుగుతోంది. పీఎంఎఫ్‌బీవైను తొలిసారిగా 2018 ఖరీఫ్‌ సీజన్‌లో దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లోని మొత్తం 475 జిల్లాల్లో అమలు చేశారు. అది ఈ ఏడాది 17 రాష్ట్రాల్లోని 390 జిల్లాలకే పరిమితమైంది. అరడజను రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయడం మానేశాయి. ఈ రాష్ట్రాల్లోని పంటలు ఇటీవలి వర్షాలు, వరదలు, కరవు పరిస్థితులకు నాశనమయ్యాయి. దాంతో బాధిత రైతులకు పరిహారం ఎవరు ఇస్తారన్నది జవాబు దొరకని ప్రశ్నగా మారింది.


అమలులో లోపాలు

పంటల బీమా పథకాల అమలులో అనేక లోపాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నా కేంద్రం ఆ దిశగా దృష్టి సారించడంలేదు. దాంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. దేశంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదలైన ఖరీఫ్‌ పంటల సాగు సీజన్‌ సెప్టెంబరు వరకు కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు జూన్‌ ఒకటికల్లా దేశంలోకి ప్రవేశించకపోవడంతో పలు రాష్ట్రాల్లో జూన్‌లో వర్షపాతం లోటు అధికమై కొన్ని రాష్ట్రాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జులైలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి, వరదలు పోటెత్తడంతో పంటలు కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారి పంటలకు బీమా లేనందువల్ల ఎక్కువశాతానికి పరిహారం అందే అవకాశం లేదు. 2018 ఖరీఫ్‌లో 2.16 కోట్ల మందికిపైగా అన్నదాతలు తమ పంటలకు బీమా చేయించారు. ప్రస్తుత ఖరీఫ్‌లో ఆ సంఖ్య 1.16 కోట్లకు తగ్గిపోయిందని కేంద్ర వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడించింది. సాధారణంగా రైతుల సంఖ్య తగ్గినప్పుడు అందుకు తగ్గట్టుగా బీమా సంస్థలకు సమకూరే ప్రీమియం తగ్గాలి. కానీ, వీటికి వచ్చే ప్రీమియం వేల కోట్ల రూపాయల మేర పెరుగుతోంది. పైగా విపత్తుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఇవి చెల్లించే పరిహారం గణనీయంగా తగ్గుతోంది! 2019-20లో బీమా కంపెనీలు రైతుల నుంచి వసూలు చేసిన ప్రీమియం మొత్తం రూ.21,947 కోట్లు. ఇందులో రూ.16,826 కోట్లను తిరిగి వారికి నష్టపరిహారంగా చెల్లించాయి. 2022-23లో వసూలైన ప్రీమియం రూ.27,900 కోట్లు. ఇందులో కేవలం రూ.5,760 కోట్లనే బీమా సంస్థలు రైతులకు చెల్లించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఇటీవల పార్లమెంటుకు వెల్లడించారు. పంటల బీమా పథకాలు అమలవుతున్న రాష్ట్రాలు, జిల్లాలు, రైతుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంటే- బీమా కంపెనీలకు వచ్చే లాభాలు మాత్రం వేల కోట్ల రూపాయల మేర ఎలా పెరుగుతాయని పలు రాష్ట్రాలు, రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బీమా చేయించిన అన్నదాతల్లో సన్నకారు రైతుల వాటా గత ఆరేళ్ల(2018-22)లో 18శాతం నుంచి 13.62శాతానికి తగ్గిపోయింది. బీమా చేయించని పంటలు దెబ్బతిన్నప్పుడు పరిహారం అందే అవకాశంలేక బాధితులకు భరోసా కరవైంది. పంట నష్టాలతో అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 70శాతం వరకు సన్నకారు రైతులే ఉంటున్నారు. విపత్తులకు పంటలు దెబ్బతిన్న 72 గంటల్లోగా బాధిత రైతులు బీమా సంస్థలకు సమాచారం అందించాలని కేంద్రం నిబంధన పెట్టింది. బీమా కంపెనీలు సరిగ్గా స్పందించకపోవడంతో తాము పంటలు కోల్పోయినా పరిహారం రావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియం వసూలులోనూ కంపెనీలు చెప్పిందే వేదం అన్నట్లుగా నడుస్తోంది. పంట రుణాలు ఇచ్చే సమయంలో బీమా ప్రీమియం సొమ్మును బ్యాంకులే మినహాయించి ఆ సంస్థలకు పంపుతున్నాయి. ఏ కంపెనీకి తమ ప్రీమియం వెళ్ళింది, పంట నష్టపోయినప్పుడు ఎవరిని సంప్రతించాలి, ఏ నంబరుకు ఫోన్‌ చేయాలన్న వివరాలను సైతం రైతులకు బ్యాంకులు ఇవ్వడంలేదు. బీమా కోసం రైతుల నుంచి వేల రూపాయల ప్రీమియం తీసుకుంటున్న కంపెనీలు వారికి ఏమాత్రం జవాబుదారీగా ఉండటంలేదు. ప్రీమియం వసూలులో కంపెనీలదే ప్రధానపాత్ర కావడంవల్ల బాధితులకు పరిహారం సరిగ్గా అందడంలేదని తెలంగాణ, గుజరాత్‌ సహా పలు రాష్ట్రాలు ఈ పథకం అమలు నుంచి తప్పుకొన్నాయి.పారదర్శక విధానాలే కీలకం

పంటల బీమా పథకాల్లో పారదర్శకత లోపిస్తోంది. ఏ రైతు ఏ పంటకు ఎంత ప్రీమియం కట్టారు.. పంటనష్టం వాటిల్లినప్పుడు సమీపంలోని ఏ అధికారిని సంప్రదించాలి, బీమా కంపెనీ చిరునామా, ప్రతినిధి ఫోన్‌ నంబరు వంటి వివరాలన్నీ వ్యవసాయశాఖ ఆన్‌లైన్‌లో పెడితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. పంట రుణం ఇచ్చేటప్పుడు బీమా ప్రీమియాన్ని మినహాయించుకునే బ్యాంకులు- పంటనష్టం వాటిల్లినప్పుడు ఎవరిని సంప్రతించాలో రైతులకు స్పష్టంగా వెల్లడించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా పథకాలను అమలుచేయకపోతే రైతులే నేరుగా బీమా చేయించుకునే సదుపాయాలను కేంద్రం సులభతరం చేయాలి. పంట నష్టపోతే బీమా కంపెనీల నుంచి వెంటనే పరిహారం పూర్తిగా అందేలా పారదర్శక విధానాలు తెస్తేనే అన్నదాతలకు భరోసా దక్కుతుంది. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రానికో తీరుగా ప్రభుత్వాలు, బీమా కంపెనీలు రైతులకు అన్యాయంచేస్తే- దేశ ఆహార, ఆర్థిక భద్రతకు తీవ్ర నష్టం వాటిల్లక తప్పదు!


మాయ చేస్తున్న ఏపీ సర్కారు

నష్టపోయిన పంటలకు పరిహారం పంపిణీలో పారదర్శకత ఉంటేనే రైతులకు భరోసా దక్కుతుందని ప్రభుత్వాలు గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్‌ సర్కారు ‘వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా’ను అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ రైతులను మభ్యపెడుతోందనే విమర్శలున్నాయి. మిరప సాగును వర్షాధార భూముల్లో పండే పంటల జాబితాలో చేర్చి పరిహారం సరిగ్గా రాకుండా మాయ చేసింది. సాగునీటి వసతి ఉన్న భూముల్లోనే మిరప పండుతుంది. మామిడి పంటకూ బీమా వర్తింపజేయడం లేదు. ఏ పంట ఎంతమేర దెబ్బతింది, ఏ రైతుకు ఎంత పరిహారం ఎందుకు వచ్చిందనే వివరాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బయటపెట్టడం లేదు. రాజకీయంగా లబ్ధిపొందే ప్రాంతాల్లో ఓట్ల కోసం అవసరమైన వారికి పరిహారం ఎక్కువ ఇస్తున్నందువల్ల నిజంగా పంటలు నష్టపోయినవారికి అన్యాయం జరుగుతోంది.


- మంగమూరి శ్రీనివాస్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సమ సమాజమే ప్రగతి మార్గం!

‣ పత్రికా స్వేచ్ఛకు ముప్పు

‣ కృత్రిమ మేధా.. భస్మాసుర హస్తమా?

‣ పోక్సో కేసులపై మీమాంస

‣ ఏమవుతుంది.. అవిశ్వాసం?

‣ జీవవైవిధ్య రక్షణలో జనభాగస్వామ్యం

Posted Date: 16-08-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని