• facebook
  • whatsapp
  • telegram

వాతావరణ మార్పులతో దిగుబడి తెగ్గోతవాతావరణ మార్పులు వ్యవసాయానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. ప్రపంచ ఆహార భద్రతను కాపాడేందుకు దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.


వాతావరణ మార్పుల ఫలితంగా గత రెండేళ్లలో రైతుల ఆదాయం సగటున 15.7శాతం తెగ్గోసుకుపోయిందని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. ప్రతి ఆరుగురు అన్నదాతల్లో ఒకరు 25శాతం కంటే ఎక్కువ ఆదాయాన్ని నష్టపోయినట్లు గుర్తించింది. తమ పొలాలపై వాతావరణ మార్పులు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయంటూ 71శాతం రైతులు అభిప్రాయపడినట్లు అది వివరించింది. భారత్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, చైనా, జర్మనీ, కెన్యా, ఉక్రెయిన్‌, అమెరికాల్లోని కొందరు రైతుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధ్యయనకర్తలు ఈ వివరాలు వెల్లడించారు. వాతావరణ మార్పులతో పాటు ఆర్థిక సవాళ్లూ రాబోయే మూడేళ్లలో అన్నదాతలకు కీలకం కానున్నాయి. ఇప్పటికే ఎరువుల ఖర్చు, ఇంధన వ్యయం, ఆదాయ అస్థిరత వంటివి రైతులకు భారంగా పరిణమించాయి. సర్వేలో పాల్గొన్న రైతుల్లో 80శాతం గ్రీన్‌హౌస్‌ వాయువులను తగ్గించే చర్యలను తీసుకోవడం లేదా అందుకు ప్రణాళికలు రూపొందించడం చేస్తున్నట్లు అధ్యయనకర్తలు వెల్లడించారు.


ప్రపంచ ఆహార సరఫరాలో చిన్న, సన్నకారు రైతులది కీలక పాత్ర. మన దేశంలో వీరి సంఖ్య అధికం. కూలి, ఎరువుల ఖర్చులు పెరుగుతున్న క్రమంలోనే పంటలపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతుండటంతో రైతుల ఆదాయాలు గణనీయంగా పడిపోతున్నాయి. నష్టాలను తగ్గించడం, మౌలిక వసతుల కల్పన వంటి చర్యల ద్వారా అన్నదాతలకు ఆర్థిక భద్రత కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, సర్వేలో పాల్గొన్న 80శాతం రైతులు సాగు రంగం భవిష్యత్తు పట్ల సానుకూలంగా స్పందించడం విశేషం. వాతావరణ మార్పులవల్ల భారత్‌లో వర్షాధార వరి సాగు దిగుబడి 2050కల్లా 20శాతం, 2080నాటికి 47శాతం తగ్గుతుందని అంచనా. ఇవే సంవత్సరాల్లో నీటిపారుదల వ్యవస్థల ద్వారా సాగయ్యే వరి దిగుబడి వరసగా 3.5శాతం, అయిదు శాతం చొప్పున తగ్గుతుందని భావిస్తున్నారు. గోధుమల దిగుబడి 2050కల్లా 19.3శాతం, 2080నాటికి 40శాతం తగ్గుతుందన్న అంచనాలు ఉన్నాయి. మొక్కజొన్న దిగుబడి ఇదే కాలంలో వరసగా 18, 23 శాతాల చొప్పున కుంచించుకుపోతుందని చెబుతున్నారు.


వాతావరణ మార్పులవల్ల దిగుబడులే కాదు, వాటిలోని పోషకాల నాణ్యతా తగ్గిపోతోంది. దీనిపై దృష్టి సారించిన కేంద్రప్రభుత్వం- వాతావరణ మార్పులను సమర్థంగా తట్టుకొనేలా వ్యవసాయాన్ని తీర్చిదిద్దడానికి కొన్ని ప్రణాళికలు రూపొందించింది. వీటిలో ముఖ్యమైనది- జాతీయ సుస్థిర వ్యవసాయ కార్యక్రమం (ఎన్‌ఎమ్‌ఎస్‌ఏ). వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యూహాలను రూపొందించి అమలుపరచడం దీని ప్రధాన లక్ష్యం. దేశంలో ఆహారోత్పత్తిని ప్రస్తుత స్థాయిలో కొనసాగించడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించేందుకు కేంద్ర వ్యవసాయశాఖ, భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యాన ఓ ప్రాజెక్టు అంకురించింది. పంటలు తీవ్ర వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా సాంకేతికతలను అభివృద్ధి చేసి, ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ఉద్దేశం.


భారత్‌లో సుమారు సగం సాగు భూమి వర్షాధారితం. అందువల్లే, వాతావరణ మార్పులు సేద్య రంగానికి అధిక నష్టాలను కలగజేస్తున్నాయి. వీటి పరిష్కారానికి అధునాతన సాగు పద్ధతులను అవలంబించాలి. అధిక ఉష్ణాగ్రతలను, నీటి ఒత్తిడిని తట్టుకొనే వంగడాలను అభివృద్ధి పరచాలి. ఆధునిక సాగు పరిరక్షణ విధానాలు, సమర్థ మందుల నిర్వహణతో ‘స్మార్ట్‌ వ్యవసాయం’ వైపు అడుగులు వేయాలి. నిరుడు దేశంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోధుమల దిగుబడి తగ్గింది. ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో భారీ వానలవల్ల ఆహార పంటలకు నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల కూరగాయల సాగు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ నేపథ్యంలోనే గోధుమలు, బియ్యం, కందిపప్పు, మినప్పప్పు తదితర దినుసుల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. గత ఏడాది పాకిస్థాన్‌లో వచ్చిన వరదలవల్ల దాదాపు 16లక్షల హెక్టార్లలో వ్యవసాయం దారుణంగా దెబ్బతింది. ఈ ఏడాది పలు ఐరోపా దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీర్ఘకాలిక వ్యూహాలతో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు, ప్రజలు కృషి చేసినప్పుడే- ఇటువంటి విపత్తుల నుంచి కొంతైనా ఉపశమనం లభిస్తుంది.


- డి.ఎస్‌.బాబు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అసమానతలపై పోరుకు హేతుబద్ధ పన్నులు

‣ భారత్‌ దౌత్యానికి అగ్ని పరీక్ష!

‣ పర్యావరణ పరిరక్షణకుహరిత ఇంధనం

‣ యుద్ధ జ్వాలల్లో భూగోళం

‣ మదుపరులకు మేలెంత?

‣ చైనా ఎత్తులకు పైయెత్తు!

Posted Date: 07-11-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని