• facebook
  • whatsapp
  • telegram

సేంద్రియ వ్యవసాయంతో లాభాలెన్నో!దేశంలో సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం పెరుగుతోంది. కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాలు ఈ సాగును ప్రోత్సహిస్తున్నాయి. క్షేత్రస్థాయి సమస్యలపై సరైన దృష్టి సారిస్తే ఇది మరింతగా విస్తరిస్తుంది.


సేంద్రియ సాగును ప్రోత్సహించడానికి కేరళ ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాబోయే అయిదేళ్లలో అయిదు వేల హెక్టార్లలో సేంద్రియ సాగును విస్తరించడం దీని లక్ష్యం. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని పదిశాతం పంట భూములను సేంద్రియ సాగుకు కేటాయించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. కీలక ప్రాంతాలతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ధ్రువీకరణ, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌, విలువ జోడింపు, సేంద్రియ సాగుకు సంబంధించిన పథకాలపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. ఇందుకు రైతు ఉత్పత్తి సంఘాలు సహకరిస్తాయి.


కేరళ ప్రభుత్వం 2010లో సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది. దాంతో సేంద్రియ సాగు విస్తీర్ణం 2017-22 మధ్య కాలంలో 7,355 హెక్టార్ల నుంచి 73,543 హెక్టార్లకు పెరిగింది. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా స్థానిక వనరులు, స్వదేశీ పద్ధతులతో చేపట్టే సాగును సేంద్రియ లేదా సహజ వ్యవసాయం అంటారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్‌) సైతం దీనికి సంబంధించి పలు పద్ధతులను సిఫార్సు చేసింది. అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ అనుకూల వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నాయి. సాగును వాతావరణ మార్పులకు అనుగుణంగా మలచడం, గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను తగ్గించడం, వ్యవసాయ ఉత్పాదకత, అన్నదాతల ఆదాయాలను పెంచడం తదితరాలు దీని లక్ష్యాలు. ఇందులో ఒక భాగమే సేంద్రియ వ్యవసాయం. దీనికి సంబంధించి కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం ప్రకృతి వ్యవసాయంపై జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాంతో పాటు పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన(పీకేయూవై), సేంద్రియ ఉత్పత్తులపై జాతీయ కార్యక్రమం వంటి పలు పథకాలను అమలు చేస్తోంది. సేంద్రియ వ్యవసాయం వల్ల భూసారం, నేల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతాయి. రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. దానివల్ల తేనెటీగలు, పక్షులు, సీతాకోకచిలుకల మనుగడకు ఎలాంటి నష్టమూ వాటిల్లదు. నదులు, చెరువులు ఇతర జలవనరుల్లో కాలుష్యమూ తగ్గుతుంది. సేంద్రియ పంటలు వాతావరణ మార్పుల ప్రభావాన్ని చాలావరకు తట్టుకొంటాయి. సేంద్రియ పంట ఉత్పత్తులు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల వంటి పోషకాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఈ ఉత్పత్తులకు అధిక గిరాకీ ఉంటుంది. ఫలితంగా అన్నదాతలు అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. సేంద్రియ సాగు విషయంలో కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి. దీనికి ఎక్కువ మంది కూలీలు అవసరం కాబట్టి రైతులకు ఖర్చులు పెరుగుతాయి. విత్తనం విత్తే దగ్గర నుంచి పంట నూర్పిడి వరకు సేంద్రియ సాగు కొన్ని మార్గదర్శకాల ప్రకారం జరగాలి. వీటిపై రైతులకు అవగాహన కల్పించాలి. ఆయా సేంద్రియ ఉత్పత్తులకు ప్రభుత్వ, అనుబంధ సంస్థల నుంచి ధ్రువీకరణ ఉండాలి. ఇలా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, సేంద్రియ సాగుకు దేశంలో ఆదరణ పెరుగుతోంది.


కొవిడ్‌ తరవాత పోషకాహారంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. మహమ్మారి అనంతరం భారత్‌లో సేంద్రియ ఆహార పదార్థాల విపణి భారీగా వృద్ధిచెందింది. 2022లో ఇండియాలో దాదాపు 91 లక్షల హెక్టార్లలో సేంద్రియ సాగు చేపట్టారు. గత పదేళ్లలోనే భారత్‌లో సేంద్రియ వ్యవసాయం 145శాతం పెరిగినట్లు 2022-23 ఆర్థిక సర్వే వెల్లడించింది. సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులూ ఏటికేడు పెరుగుతున్నాయి. వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎపెడా), వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం భారత్‌లో 2022-23లో 29 లక్షల మెట్రిక్‌ టన్నుల సేంద్రియ ఉత్పత్తులను రైతులు పండించారు. ఎగుమతుల్లో అధికభాగం అమెరికాకు సరఫరా అవుతున్నాయి. తరవాతి స్థానాల్లో ఐరోపా సమాఖ్య, కెనడా ఉన్నాయి. సేంద్రియ సాగు ఉత్పత్తులకు అంతర్జాతీయంగా గిరాకీ పెరుగుతున్న దృష్ట్యా ఆ అవకాశాలను ఇండియా అందిపుచ్చుకోవాలి. దానికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలి. ప్రణాళికాబద్ధంగా సాగు విస్తీర్ణాన్ని పెంచాలి. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. అన్నదాతల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వాల కార్యాచరణ ఉండాలి. అప్పుడే రైతులు సేంద్రియ సాగుకు ఆసక్తి చూపుతారు.


- డి.సతీష్‌బాబు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అసమాన పోరాట శక్తిగా నౌకాదళం

‣ ఇరాన్‌ అమ్ములపొదిలో సరికొత్త క్షిపణి

‣ వర్సిటీ ర్యాంకింగుల్లో మెరుగయ్యేదెన్నడు?

‣ పటిష్ఠ చర్యలతోనే భూతాప నియంత్రణ

‣ జీ20 సారథ్యంలో మేటి విజయాలు

‣ బతుకుల్ని చిదిమేస్తున్న విపత్తులు

‣ కాలుష్య కట్టడికి స్వచ్ఛ ఇంధనాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 06-12-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని