• facebook
  • whatsapp
  • telegram

మాల్దీవులతో పెరుగుతున్న అంతరం



భారత్‌, మాల్దీవుల మధ్య ఇటీవల దూరం పెరుగుతోంది. మార్చి పదిహేనుకల్లా తమ భూభాగం నుంచి భారత దళాలు వైదొలగాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు ఇటీవల తుది గడువు విధించారు. దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.


హిందూ మహాసముద్రంలోని వందలాది చిన్న చిన్న దీవుల సమూహమే మాల్దీవులు. భారత్‌కు చెందిన లక్షద్వీప్‌కు సమీపంలో ఉండటంతో భద్రతరీత్యా మాల్దీవులు మనకు ఎంతో కీలకం. అక్కడ ఎలాంటి అలజడి రేగినా, పశ్చిమ తీర భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. మాల్దీవులు స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి భారత్‌ దానికి ఉదారంగా సాయం చేస్తోంది. 2004 సునామీ విపత్కర కాలంలో, 2014లో తాగునీటి సమస్య ఏర్పడినప్పుడు మాల్దీవులకు ఇండియా సాయం చేసింది. కొవిడ్‌ కాలంలో ఉచితంగా టీకాలు అందించింది. గ్రేటర్‌ మాలె అనుసంధాన ప్రాజెక్టు, గుల్హిఫాహూ నౌకాశ్రయాలను భారత్‌ అక్కడ నిర్మిస్తోంది. ఆరోగ్య, విద్యా రంగాల్లోనూ చేయూత అందిస్తోంది. అయినా, దాదాపు దశాబ్ద కాలంగా మాల్దీవుల్లో భారత వ్యతిరేక భావజాలం పెరుగుతోంది.


మాల్దీవుల్లో 2013లో అబ్దుల్లా యామీన్‌ సర్కారు చైనా అనుకూల వైఖరి ప్రారంభించింది. బీజింగ్‌ చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌(బీఆర్‌ఐ) పథకంలో చేరడంతో మాల్దీవులపై డ్రాగన్‌ ప్రభావం పెరిగింది. బీఆర్‌ఐ ద్వారా మాల్దీవులను చైనా రుణ ఊబిలోకి దింపుతోందని చాలామంది ప్రజలకు అర్థమవడంతో 2018లో భారత అనుకూల ఇబ్రహీం సొలిహ్‌ను తిరిగి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ తరవాత భారత్‌-మాల్దీవుల సంబంధాలు మళ్ళీ గాడిలో పడ్డాయి. 2023లో భారత వ్యతిరేకిగా పేరొందిన ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తరవాత ఉభయ దేశాల మధ్య దూరం పెరుగుతోంది. లక్షద్వీప్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై మాల్దీవుల మంత్రులు ముగ్గురు ఇటీవల విమర్శలు చేయడంతో వివాదం ముదిరింది. అదే సమయంలో ముయిజ్జు చైనాలో పర్యటించారు. మాల్దీవులను సందర్శించే పర్యటకుల పరంగా భారత్‌ రెండో స్థానంలో నిలుస్తోంది. తాజా వివాదాల వల్ల వారి సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. దీన్ని గ్రహించిన ముయిజ్జు- చైనా పర్యటకులు తమ దేశానికి పెద్దయెత్తున రావాలని విజ్ఞప్తి చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఒక బాలుడిని భారత్‌ అందించిన విమానంలో ఆస్పత్రికి తరలించడానికీ ముయిజ్జు ఇటీవల నిరాకరించారు. చికిత్స ఆలస్యం కావడంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.


మాల్దీవుల్లో ఉన్న భారత సాయుధ దళాలు కేవలం అక్కడి భద్రతాసంస్థలకు సాయం చేస్తుంటాయి. రక్షణ కార్యకలాపాల్లో అవి పాల్గొనవు. కొన్నేళ్ల క్రితం మాల్దీవులు చేసిన అభ్యర్థన మేరకు మన భద్రతా బలగాలు అక్కడ వారికి సాయంగా ఉంటున్నాయి. రెండు హెలికాప్టర్లు, ఒక డార్నియర్‌ విమాన నిర్వహణ కోసం 80 మంది దాకా భారత సిబ్బంది అక్కడ ఉంటున్నారు. వారితో మాల్దీవులకు ఎలాంటి ప్రమాదమూ లేదు. అయితే, ప్రస్తుత అధ్యక్షుడు అతివాదులకు ప్రాధాన్యమిస్తున్నారు. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారించారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా- భారత దళాలను పంపించివేస్తామని ముయిజ్జు హామీ ఇచ్చారు. భారత సేన వెనక్కి తిరిగి వస్తే- ఆ స్థానంలో చైనా దళాలు ప్రవేశించే అవకాశం ఉంది. దానివల్ల మన ప్రాదేశిక సమగ్రతకు పెను సవాలు తప్పదు. డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి తుర్కియేతో 3.7 కోట్ల డాలర్ల ఒప్పందాన్ని మాల్దీవులు కుదుర్చుకొంది. మన దళాలు వెనుదిరిగిన అనంతరం గస్తీని డ్రోన్లతో నిర్వహించాలని మాల్దీవులు యోచిస్తోంది. ఈ డ్రోన్లు భారత ప్రాదేశిక జలాలపై నిఘా పెట్టే ప్రమాదం ఉంది. పశ్చిమ తీరంలో కీలకమైన నౌకాశ్రయాలు, నౌకాదళ కేంద్రాలు ఉన్నాయి. తుర్కియే డ్రోన్లు పాక్‌కు సైతం ఆ సమాచారాన్ని అందించే ప్రమాదముంది. ప్రధాని మోదీ చుట్టుపక్కల ఉన్న దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నారు. శ్రీలంక, మాల్దీవులు వంటివి డ్రాగన్‌ ఉచ్చులో పడుతుండటం ఇండియా సమగ్రతకు ఇబ్బందికరమే. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ మాల్దీవుల్లో పర్యటించారు. అక్కడ భారత్‌ చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేస్తామని, అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. ఏది ఏమైనా మాల్దీవుల్లో డ్రాగన్‌ ఆటలు సాగకుండా భారత్‌ జాగరూకతతో వ్యవహరించాలి. దౌత్య విధానాల ద్వారా మాల్దీవులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలి.


- కె.శ్రీధర్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రాజ్యాంగమే రక్షణ ఛత్రం

‣ అడుగంటుతున్న జలాశయాలు

‣ స్వచ్ఛత కొరవడిన సర్వేక్షణ్‌

‣ భారత్‌ - యూకే వ్యూహాత్మక సహకారం

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 29-01-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం