• facebook
  • whatsapp
  • telegram

అక్షరాస్యతే అభివృద్ధి అస్త్రం

భారతావని అన్ని రంగాల్లో అద్భుత ఫలితాలను సాధిస్తోందని పాలకులు ఘనంగా చాటుతున్నారు. అయితే, దేశంలో సంపూర్ణ అక్షరాస్యత ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. ఫలితంగా ఎంతోమందికి సరైన అభివృద్ధి సాధ్యం కావడం లేదు.

స్వాతంత్య్రం వచ్చే నాటికి ఇండియా అక్షరాస్యత దాదాపు 12శాతం. జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే విద్య కీలకమని గుర్తించిన పాలకులు అక్షరాస్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఆ క్రమంలో దేశీయంగా విస్తృతంగా పాఠశాలలు స్థాపించారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో చదువుకునేందుకు వసతులు కల్పించారు. వీటన్నింటి వల్లా ప్రస్తుతం భారత్‌ అక్షరాస్యత డెబ్భై ఏడు శాతానికి చేరుకొంది. స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు దాటినా నేటికీ వంద శాతం అక్షరాస్యతను సాధించడం సవాలుగానే మిగిలింది. ముఖ్యంగా జాతీయ సగటుకన్నా తెలుగు రాష్ట్రాల్లో ఇది మరింత తక్కువగా ఉంది.

డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యం

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత 66.54శాతం. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 67.02శాతం. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే జోగులాంబ గద్వాల, నారాయణపేట లాంటి వెనకబడిన జిల్లాల్లో అక్షరాస్యత 50శాతాన్ని మించి లేదు. అవే జిల్లాల్లో మహిళా అక్షరాస్యత కేవలం 40శాతమే. ఏపీలో ఉమ్మడి విజయనగరం, కర్నూలు లాంటి జిల్లాల్లో 60శాతం లోపే అక్షరాస్యత నమోదైంది. ఇది అమృత కాలమని, వందేళ్ల దిశగా పయనిస్తున్న స్వతంత్ర భారతావనికి ఇది ఊతమిచ్చే పద్దు అని ఇటీవలి బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. ఈసారి విద్యారంగానికి రూ.1.12 లక్షల కోట్లకు పైగా నిధులను కేటాయించారు. దేశంలో వయోజన విద్యను ప్రోత్సహించేందుకు గతేడాది తెచ్చిన నవీన భారత అక్షరాస్యతా పథకానికి ఇటీవలి పద్దులో రూ.157 కోట్లను ప్రత్యేకించారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60శాతం నిధులిస్తే, రాష్ట్రాలు 40శాతం అందించి అమలు చేయాలి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులను అందించకపోవడంతో కేంద్రం తన వాటాను విడుదల చేయడంలేదు.

వయోజన విద్యను ప్రోత్సహించేందుకు 1956లో జాతీయ ప్రాథమిక విద్యా కేంద్రం ఏర్పాటైంది. ఆ తరవాత కేంద్ర విద్యాశాఖ పరిధిలో వయోజన విద్యా డైరెక్టరేట్ ఆవిర్భవించింది. 1988లో జాతీయ అక్షరాస్యతా మిషన్‌ ప్రారంభం తరవాత వయోజన విద్య ఊపందుకొంది. 2009లో మొదలైన సాక్షర భారత్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో వయోజన విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసి సాయంత్రం వేళలో పెద్దవారికి చదువు చెప్పడం, పుస్తకాల అందజేత, పరీక్షల నిర్వహణ వంటివి కొనసాగాయి. సాక్షర భారత్‌ 2018లో ముగిశాక వయోజన విద్యా కార్యక్రమం కొన్నేళ్లపాటు నిలిచిపోయింది. నిరుడు ప్రకటించిన నవీన భారత అక్షరాస్యతా కార్యక్రమాన్ని అయిదేళ్ల పాటు అమలు చేయనున్నారు. అందుకోసం రూ.1037.90 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. కొత్త విధానంలో డిజిటల్‌ విద్యకు పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా డిజిటల్‌ విధానంలో నగదు చెల్లింపులు, ఇతర సాంకేతిక అంశాలపైనా నిరక్షరాస్యులకు అవగాహన కల్పించనున్నారు.

నవీన భారత అక్షరాస్యతా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.8.54 కోట్లు వెచ్చించాలి. కేంద్రం వాటా పోను ఒక్కో రాష్ట్రం   రూ.3.41 కోట్ల చొప్పున కేటాయించాలి. ఇటీవలి పద్దులో తెలంగాణ రాష్ట్రం   కోటి రూపాయలు ప్రత్యేకించింది. వయోజన విద్యపై సరైన దృష్టి సారించకుండా దేశం వంద శాతం అక్షరాస్యత సాధించడం అసాధ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలు తమ వాటా నిధులను అందించాలి. సమాజంలోని భిన్న వర్గాలను వయోజన విద్యలో భాగస్వాములను చేయాలి. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళల్లో చదువు వచ్చిన వారు నిరక్షరాస్యులకు పాఠాలు బోధించేలా చూడాలి. పాఠశాలల పిల్లలకు ప్రాజెక్టు పనుల్లో భాగంగా వారి సొంత గ్రామాల్లో నిరక్ష్యరాస్యులకు అక్షరాలు నేర్పించేలా ప్రణాళికలు రూపొందించాలి. ఈ క్రతువులో స్వచ్ఛంద సంస్థల సహకారాన్నీ తీసుకోవాలి.

మెరుగైన ఫలితాలు

అక్షరాస్యతను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం గతంలో ‘ఈచ్‌ ఒన్‌ టీచ్‌ ఒన్‌’ నినాదంతో పలు కార్యక్రమాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో చిట్టి గురువులు పేరుతో రెండు దశల్లో విద్యార్థులే నిరక్షరాస్యులకు చదువు చెప్పే కార్యక్రమం సత్ఫలితాలను అందించింది. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను అమలు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. రష్యా యుద్ధం వల్ల అల్లకల్లోలమైన ఉక్రెయిన్‌- 2019 నాటికే సంపూర్ణ అక్షరాస్యత సాధించింది. నార్వే, లక్జెంబర్గ్‌ లాంటి చాలా దేశాలు నూరు శాతం అక్షరాస్యత సాధించాయి. తమ మానవ వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ అభివృద్ధి పథంలో అవి దూసుకుపోతున్నాయి. పేదరికం, నిరుద్యోగం, మూఢనమ్మకాలు వంటి ఎన్నో సమస్యలను తరిమివేసేందుకు అక్షరాస్యతే కీలక అస్త్రం. ఈ క్రమంలో భారత్‌ వందో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే నాటికన్నా నూరు శాతం అక్షరాస్యత సాకారమయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేయాలి. 

- గుండు పాండురంగశర్మ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భూమి ఎందుకు కుంగిపోతుంది?

‣ భూ ఫలకాల మహా ఉత్పాతం

‣ ఒక అభ్యర్థి.. ఒక్కచోటే పోటీ!

‣ భయపెడుతున్న ఎల్‌ నినో

Posted Date: 17-02-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం