• facebook
  • whatsapp
  • telegram

Engineering: తెలంగాణలో మరో 10 వేల కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు

దరఖాస్తు చేసుకున్న 50-60 కళాశాలలు


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం (2024-25) లోనే మరిన్ని కంప్యూటర్‌ సైన్స్, ఐటీ సంబంధిత డిమాండ్‌ ఉన్న బీటెక్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. గత ఏడాది కన్వీనర్‌ కోటాలో 68 సీట్లు ఆ బ్రాంచీలవే. ఈసారి మరో 10 వేల వరకు సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా మున్ముందు యాజమాన్య కోటా సీట్లకు కొంత డిమాండ్‌ తగ్గవచ్చని భావిస్తున్నారు. గత విద్యా సంవత్సరం (2023-24) లో కన్వీనర్‌ కోటా 70% కింద 83,766 బీటెక్‌ సీట్లు ఉండగా... అందులో కంప్యూటర్‌ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో 56,811 సీట్లున్నాయి. అంటే అది 68 శాతంతో సమానం. ఇక రాష్ట్రంలో ఉన్న అయిదు ప్రైవేట్‌ వర్సిటీలు, గీతం, కేఎల్, చైతన్య లాంటి డీమ్డ్‌ వర్సిటీల్లోని సీట్లను కలుపుకొంటే 75% వరకు ఉంటాయని అంచనా. రాష్ట్రంలో 156 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. తగిన మౌలిక వసతులు చూపిస్తే ఎన్ని సీట్లకైనా అనుమతిస్తామని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గత ఫిబ్రవరిలో విధి విధానాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

పెంచుకునే సీట్లకు అవసరమైన తరగతి గదులు, కంప్యూటర్లు, అధ్యాపకులను చూపితే చాలు. అయితే, ఆ కళాశాలలు న్యాక్‌ ఏ-గ్రేడ్‌ లేదంటే స్వయం ప్రతిపత్తి హోదా కలిగి ఉండటం తప్పనిసరి. అలాంటి కళాశాలలు రాష్ట్రంలో 65కుపైగా ఉన్నాయి. దాంతో దాదాపు 50 కళాశాలలు కంప్యూటర్‌ సైన్స్‌ సీట్ల కోసం ఏఐసీటీఈకి దరఖాస్తు చేశాయి. ఇప్పటికే కొన్నింటికి అనుమతులూ వచ్చాయి. కొన్ని కళాశాలలు 300-400 కొత్త సీట్లకు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. జూన్‌ 10వ తేదీతో అనుమతుల ప్రక్రియ ముగుస్తుంది. అప్పటికి ఎన్ని కొత్త సీట్లు వచ్చాయో స్పష్టమవుతుందని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. కనీసం 10 వేల వరకు రావొచ్చని ఓ కళాశాల యజమాని ఒకరు తెలిపారు. అంటే వాటిలో ఏడు వేల సీట్లను కన్వీనర్‌ కోటా కింద కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. 


ఒక కొత్త కళాశాల... రెండుచోట్ల సీట్ల పెంపు 

గత విద్యా సంవత్సరం (2023-24) ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్‌లలో జేఎన్‌టీయూహెచ్‌ అనుబంధంగా కొత్త ఇంజినీరింగ్‌ కళాశాలలను ప్రభుత్వం ప్రారంభించింది. శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హడావిడిగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత వాటిల్లో ప్రవేశాలకు అనుమతిచ్చారు. దాంతో కేవలం మూడేసి కోర్సుల చొప్పున ఒక్కో దాంట్లో 180 సీట్లకే ప్రవేశాలు కల్పించారు. అక్కడ సీఎస్‌ఈ, సీఎస్‌ఈ డేటా సైన్స్, ఈసీఈ బ్రాంచీలున్నాయి. ఈసారి కొత్తగా మెకానికల్, ఎలక్ట్రికల్‌ బ్రాంచీలు రానున్నాయి. అంటే ఒక్కో దాంట్లో 120 సీట్లు అదనంగా వస్తాయని జేఎన్‌టీయూహెచ్‌ వర్గాలు తెలిపాయి. దానికితోడు కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను ఇంజినీరింగ్‌ కళాశాలగా ఉన్నతీకరించారు. దాంతో అక్కడ నాలుగు బ్రాంచీల్లో 240 సీట్లు కొత్తగా రానున్నాయి. రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల అదే. అది జేఎన్‌టీయూహెచ్‌కు అనుబంధంగా ఉండనుంది. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

‣ వాయుసేనలో అత్యు్న్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.