• facebook
  • whatsapp
  • telegram

APPSC: ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తారా?  

* కేవలం 2,250 పోస్టుల భర్తీ నిమిత్తం 35 నోటిఫికేషన్లు వెలువడ్డాయి

ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ)ను కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. కమిషన్‌ను సంస్కరించి, ఉద్యోగాల నియామక ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు. యూపీఎస్సీ తరహాలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతున్నారు. గత ఐదేళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా కేవలం 2,250 పోస్టుల భర్తీ నిమిత్తం 35 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. 

హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా..

గత తెదేపా ప్రభుత్వ హయాంలో 2018 డిసెంబరు 31న 162 గ్రూపు-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. దీని ప్రకారం ప్రిలిమ్స్‌ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నిర్వహించిన మెయిన్స్‌ ఫలితాలను 2021 ఏప్రిల్‌ 28న వెల్లడించారు. ఈ పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేశారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికి విరుద్ధంగా మూల్యాంకనం చేయడాన్ని ఆక్షేపించిన హైకోర్టు.. మాన్యువల్‌గా ప్రధాన పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే, న్యాయస్థానం ఆదేశాల మేరకు జవాబు పత్రాలను ఒకసారి కాకుండా, రెండుసార్లు మాన్యువల్‌గా మూల్యాంకనం చేయడంపై పలువురు అభ్యర్థులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. డిజిటల్‌ విధానంలో మంచి మార్కులు సాధించి, ఇంటర్వ్యూలకు ఎంపికైన చాలామంది అభ్యర్థులు.. మాన్యువల్‌ మూల్యాంకనంలో తప్పిపోయారు. చివరకు మౌఖిక పరీక్షల ద్వారా ఎంపికైన వారి జాబితాను రద్దు చేయాలని, మెయిన్స్‌ మళ్లీ నిర్వహించాలని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులిచ్చింది. కమిషన్‌ దీనిపై అప్పీల్‌ చేయగా డివిజన్‌ బెంచ్‌ ‘స్టే’ ఇచ్చింది. ఇలా నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికి విరుద్ధంగా మూల్యాంకనం చేపట్టి, మొత్తం నియామక ప్రక్రియనే వివాదాస్పదం చేసిన ఘనత ఏపీపీఎస్సీది. మరోపక్క, గ్రూపు-1 ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు మౌఖిక పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయో వెల్లడించకుండా గోప్యత పాటిస్తోంది. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంల వారీగా ఎంపికైన వారి వివరాలూ బయట పెట్టడంలేదు. అభ్యర్థుల మార్కులు, మాధ్యమాన్ని వెల్లడించకపోవడం పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తోంది. 

* గ్రూపు-1 నియామకాలకు ఇంటర్వ్యూలు ఉండవని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్నే అమలు చేసింది. ఇంటర్వ్యూ లేకుండా గ్రూపు-1 ద్వారా ఎంపికైన వారు భవిష్యత్తులో అఖిల భారత సర్వీసు అధికారులుగా పదోన్నతులు పొందాలంటే ఇబ్బందులు ఎదురవుతాయన్న కీలక అంశాన్ని విస్మరించింది. వైకాపా ప్రభుత్వంలో రాజకీయ ప్రాపకంతో సభ్యులుగా నియమితులైన వారి సమక్షంలో గ్రూపు-1 అభ్యర్థుల ఇంటర్వ్యూలు జరిగాయి. 
 



మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

‣ వాయుసేనలో అత్యు్న్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు

‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.