• facebook
  • whatsapp
  • telegram

Job: అగ్రరాజ్యంలో కొలువుల సంక్షోభం..!

* ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు

తెలంగాణకు చెందిన వెంకట్‌ ఆరేళ్ల క్రితం ఓ ప్రముఖ ఐఐటీలో ఇంజినీరింగ్‌ చేశారు. అనంతరం అమెరికాలో ఎంఎస్‌ చేసి, అక్కడే ఒక పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆయనకు హెచ్‌-1బీ వీసా కూడా వచ్చింది. పొదుపు చర్యల్లో భాగంగా ఏడాదిన్నర కిందట సంస్థ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. మరోచోట ఉద్యోగం లభించక.. వెంకట్‌ ఏడాదిగా న్యూజెర్సీలోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నారు. 

హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థికి ఇంజినీరింగ్‌ పూర్తవగానే రూ.40 లక్షల ప్యాకేజీతో ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఉద్యోగాన్ని ఆఫర్‌ చేసింది. అతను దాన్ని వద్దనుకుని అమెరికా వెళ్లి... ఇటీవలే ఎంఎస్‌ పూర్తి చేశారు. కొన్ని నెలలుగా ఉద్యోగం లభించక సతమతమవుతున్నారు. 

వరంగల్‌కు చెందిన అజయ్‌రెడ్డి ఇంజినీరింగ్‌ పూర్తిచేసి అయిదేళ్లు తెలంగాణలోనే ఒక ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేశారు. ఏడాదిన్నర కిందట అమెరికా వెళ్లి ఎంఎస్‌ చదివారు. అనుభవమున్నా ఆయనకు ఇప్పటివరకు ఉద్యోగం రాలేదు. ఎన్ని సంస్థలకు దరఖాస్తు చేసినా తిరస్కరిస్తున్నాయి. 

అమెరికాలో గత రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన వారిలో వేల మంది మాస్టర్‌ డిగ్రీని చేతపట్టుకొని రోడ్ల వెంట తిరగాల్సి వస్తోంది. ఒకవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యారుణం వారిని భయపెడుతుండగా... మరోవైపు ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నాలుగైదేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తొలగిస్తున్నాయి. బాధితుల్లో చాలామంది హోటళ్లలో, గ్యాస్‌స్టేషన్లలో పనిచేస్తూ మరో ఉద్యోగం సంపాదించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. 

అక్కడే చదివి.. ఉద్యోగం పొందేందుకు... 

అమెరికాలోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకంతో మన దేశం నుంచి ప్రతి ఏడాది విద్యార్థులు అక్కడికి వెళుతుంటారు. ఇలా 2022-23 సంవత్సరంలో దాదాపు రెండు లక్షల మంది వెళ్లారు. వీరిలో తెలుగు విద్యార్థులు 45 వేల నుంచి 55 వేల మంది వరకు ఉంటారని కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు తెలిపారు. అమెరికా వెళుతున్న విద్యార్థుల్లో చాలామంది ఎంఎస్‌లో కంప్యూటర్‌ సైన్స్, దాని అనుబంధ కోర్సులను చదివేందుకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. రెండేళ్ల కిందటి వరకు అమెరికాలో ఎంఎస్‌ చేసిన వారిలో దాదాపు 85% మందికి అక్కడే ఉద్యోగాలు లభించాయి.

నిరుద్యోగ సమస్య ఎందుకంటే.. 

అమెరికాలోని నిబంధనల ప్రకారం ఆ దేశంలో ఎంఎస్‌ పూర్తి చేసిన వెంటనే సంబంధిత యూనివర్సిటీ.. విద్యార్థి పేరిట ఓపీటీ ఐ20 (ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌)ని విడుదల చేస్తుంది. ఇది వచ్చిన నెల రోజుల్లో ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ)కి దరఖాస్తు చేయాలి. దీనికి ఆమోదం లభించిన మూడు నెలల్లో ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి. లేనిపక్షంలో ఆ దేశాన్ని విడిచి పెట్టాలి. అయితే, విద్యార్థులు వర్సిటీ ఫీజుల కోసం రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు బ్యాంకుల నుంచి విద్యారుణం తీసుకుంటారు. స్వదేశానికి వచ్చాక.. ఇక్కడ ఉద్యోగం దొరక్కపోతే ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది. అందుకే ఏదోఒక రూపంలో అమెరికాలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఎంఎస్‌ పూర్తికాకుండా ఉండటానికి ఒకట్రెండు సబ్జెక్టులను అలానే వదిలేస్తున్నారు. మరికొందరు యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గరే రీసెర్చ్‌ సహాయకులుగా చేరుతున్నారు. దీనికి ఎలాంటి జీతం ఉండదు. అయితే, ప్రొఫెసర్‌ ఇచ్చే పత్రంతో ఏడాదిపాటు అమెరికాలోనే ఉండొచ్చు. ఇంకొందరు కన్సల్టెంట్లను సంప్రదించి ఎక్కడో ఒకచోట పనిచేస్తున్నట్లు ధ్రువపత్రం తెచ్చుకుంటున్నారు. సమస్య ఇంతలా వేధిస్తున్నా.. ఏటా అక్కడికి వెళ్లేవారి సంఖ్య మాత్రం తగ్గకపోవడం గమనార్హం. 

ప్రభుత్వ తోడ్పాటు అందిస్తే మార్పునకు అవకాశం 

వచ్చే నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. బైడెన్, డొనాల్డ్‌ ట్రంప్‌ పోటీ పడే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికరంగానికి తోడ్పాటు ఇస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ట్రంప్‌ ఇలాంటి తోడ్పాటు ఇచ్చారని, ఎన్నికల్లో ఆయన గెలిస్తే పారిశ్రామిక రంగానికి మరోసారి చేయూతనిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.