• facebook
  • whatsapp
  • telegram

NEET PG: వైద్య విద్యార్థులకు విషమ పరీక్ష!

* బోర్డు తీరుతో గాడితప్పిన వ్యవస్థ

* నీట్‌ పీజీకి ఈ ఏడాది మూడు తేదీలు.. చివరికి వాయిదా 

* కొన్ని గంటల ముందు ప్రకటనతో తీవ్ర నష్టం.. అభ్యర్థులకు ఇక్కట్లు

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యశాస్త్రంలో యూజీ, పీజీ కోర్సులకు పరీక్షల నిర్వహణ, ప్రవేశాల ప్రక్రియ గందరగోళంగా మారుతుండడం విద్యార్థుల్లో ఆందోళన రేపుతోంది. ఒకవైపు నీట్‌ యూజీపై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. పీజీ పరీక్షను అకస్మాత్తుగా వాయిదా వేయడం విద్యార్థులను అయోమయంలో పడేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఎండీ, ఎంఎస్, మెడికల్‌ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌-పీజీ పరీక్షను.. కొన్ని గంటల ముందు వాయిదా వేయడంతో వేలమంది విద్యార్థులు డీలా పడ్డారు. ఆదివారం నిర్వహించాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) శనివారం ప్రకటించడంతో అప్పటికే పరీక్షా కేంద్రాలున్న పట్టణాలకు చేరుకున్న విద్యార్థులు హతాశులయ్యారు. జూన్‌ 23న ఉదయం ఎనిమిదిన్నర గంటలకే పరీక్షా కేంద్రాలకు హాజరు కావాల్సి ఉండటంతో దూర ప్రాంతాల్లోని కేంద్రాలకు వేలమంది జూన్‌ 22న  చేరుకున్నారు. ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి ఇతర రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. అలాంటి వారందరికీ మరింత ప్రయాస తప్పలేదు. ఎంతో మంది తెలుగు విద్యార్థులు కూడా ఇతర రాష్ట్రాల్లోని కేంద్రాలకు ముందుగానే పయనమయ్యారు. కోచింగ్‌కు, ప్రయాణాలకు, వసతికి వేల రూపాయలు వెచ్చించినా

వారికి నిరాశే మిగిలింది. మార్చి.. జులై.. జూన్‌..?

మార్చిలో జరగాల్సిన నీట్‌-పీజీ పరీక్ష ఈ ఏడాది ఇప్పటికి మూడుసార్లు వాయిదా పడింది. దీన్ని మొదట మార్చి ఒకటో తేదీన నిర్వహిస్తామన్నారు. కానీ దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్‌నే ఏప్రిల్‌లో ఇచ్చారు. జులై ఏడో తేదీన పరీక్ష నిర్వహిస్తామని ఎన్‌బీఈఎంఎస్‌ అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు ఆ దిశగా సన్నద్ధమవుతుండగా.. మళ్లీ పరీక్ష తేదీని జూన్‌ 23కు మార్చింది. ఎలాగోలా విద్యార్థులు పరీక్ష రాయడానికి సిద్ధమైతే.. వాయిదా నిర్ణయం వెలువడింది. ఈ పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టత లేదు. 

విద్యాసంవత్సరం అస్తవ్యస్తం 

- సాయి శ్రీహర్ష, ప్రెసిడెంట్, తెలంగాణ జూడా అసోషియేషన్‌
ఎంతో కష్టపడి చదువుకుని సిద్ధమైనవారు పరీక్ష వాయిదా పడటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఎందుకు వాయిదా వేశారో తెలియదు. పేపర్‌ లీకైందా? లేక వేరే కారణాలున్నాయా? ప్రకటించలేదు. వాయిదా వేయాలనుకుంటే కొన్ని రోజుల ముందే ఆ పని చేసి ఉండాల్సింది. అకస్మాత్తుగా ముందు రోజు ప్రకటించడం వేల మందిని అవస్థలకు గురిచేసింది. 

మా ఆశలపై నీళ్లు: వైద్యవిద్యార్థి

 ‘మధ్యతరగతికి చెందిన నేను ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చేశాను. మెరిట్‌లో పీజీ సీటు సాధించేందుకు ఎంతో కష్టపడి చదువుతున్నా. కానీ నీట్‌-పీజీ పరీక్ష నిర్వహణలో జాప్యం.. ఆర్థికంగా సమస్యగా మారింది. చివరకు వాయిదాతో నాలాంటి వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. కనీసం మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో ప్రకటించకపోవడంతో అయోమయంలో పడ్డాం’ అని వైద్య విద్యార్థి ఒకరు తెలిపారు.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.