* ఐసెట్‌కు 2022 నుంచి వారి దరఖాస్తులే అధికం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఐసెట్‌కు పోటీపడుతున్న అమ్మాయిల సంఖ్య అబ్బాయిలను దాటిపోతోంది. ఈ ధోరణి 2022 నుంచే మొదలైనా.. ఈసారి మరింత పెరగడం విశేషం. వైద్య విద్య (ఎంబీబీఎస్) తోపాటు సంప్రదాయ పీజీ కోర్సులైన ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ కోర్సుల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ప్రవేశాలు పొందుతున్నారు. తాజాగా వాటి సరసన ఎంబీఏ, ఎంసీఏ కూడా చేరాయి. 2022లో తొలిసారిగా ఐసెట్ దరఖాస్తుల్లో అమ్మాయిల సంఖ్య అబ్బాయిల్ని దాటింది. 2022లో 783, 2023లో 1,709 మంది ఎక్కువగా ఉన్నారు. ఈసారి ఆ వ్యత్యాసం 3,777కు పెరిగింది. జూన్ 5, 6 తేదీల్లో జరిగే ఐసెట్‌కు మొత్తం 86,184 దరఖాస్తు వచ్చాయి. ఈ పరీక్షలో ఇదో రికార్డు అని కన్వీనర్ నర్సింహాచారి చెప్పారు.
ఎందుకు ఆసక్తి..?
ముఖ్యంగా ఎంబీఏలో చేరేందుకు అమ్మాయిలు ఎందుకు ఆసక్తి చూపుతున్నారనడానికి నిపుణులు పలు కారణాలు చెబుతున్నారు. ‘రాష్ట్రంలో ఏటా డిగ్రీ కోర్సుల్లో చేరుతున్న సుమారు 2.50 లక్షల మందిలో 60 శాతం మంది అమ్మాయిలే ఉంటున్నారు. బీటెక్‌లో కూడా కనీసం 35-40 శాతం ఉంటున్నారు. ఎంబీఏలో ఏ డిగ్రీ వారైనా చేరొచ్చు. దానికితోడు ఆ కోర్సు చదివితే ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు’ అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తెలిపారు. ఎంబీఏ చదివితే అటు టెక్నాలజీ, ఇటు మేనేజ్మెంట్ రంగాల్లో ఎదిగేందుకు దోహదపడుతుందని వారు భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హెచ్‌సీయూ మాజీ ప్రో వైస్ ఛాన్స్లర్, మేనేజ్మెంట్ సీనియర్ ఆచార్యుడు బి.రాజశేఖర్ మాట్లాడుతూ.. అబ్బాయిలు డిగ్రీ, బీటెక్ తర్వాత విదేశాల్లో ఉన్నత విద్యకు ఎక్కువగా వెళ్తున్నారని, దానివల్ల ఇక్కడ ఎంబీఏ, ఎంసీఏల్లో చేరుతున్న అమ్మాయిల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు. విద్యార్థులు బీటెక్ తర్వాత వెంటనే ఎంబీఏ చదివితే ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయనుకుంటున్నారని చెప్పారు. బీకాం చదివిన వారు గతంలో ఎంకాంలో చేరేవారని, ఇప్పుడు ఎంబీఏలో చేరుతున్నారని చెప్పారు. ఎంబీఏలో ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్ తదితర స్పెషలైజేషన్లు ఉన్నందున ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఇంటర్మీడియట్లో ఏ కెరియర్‌కు ఏ గ్రూపు?
‣ సివిల్స్ ప్రిలిమ్స్ మెలకువలు
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.