• facebook
  • whatsapp
  • telegram

ఉద్వేగాల నియంత్రణ.. ఉద్యోగాలకు సాధన

* జాబ్‌ స్కిల్స్‌ 2024 వివరాలు


ఐటీ, కార్పొరేట్‌ సంస్థలు  ఉద్యోగుల ఎంపికలో ఒక లక్షణాన్ని అంతిమంగా పరిశీలిస్తాయి. కానీ దీన్ని ఎక్కడా బయటికి చెప్పవు. ఒకవేళ ఎవరైనా అడిగినా, ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ సున్నితంగా తప్పించు కుంటాయి. నిజానికి ఉద్యోగార్థి పెంపొందించు కోవాల్సిన నైపుణ్యాల జాబితాలో చేర్చాల్సిన ఆ లక్షణం ఏమిటి? అదే ‘ఉద్వేగాల నియంత్రణ’. 


కంపెనీల ఎంపికల్లో పరిగణనలోకి తీసుకునే నైపుణ్యాల్లో టెక్నికల్‌ స్కిల్స్‌ నేరుగా కన్పిస్తాయి. సాఫ్ట్‌ స్కిల్స్‌ మాత్రం చాలావరకు అభ్యర్థిలో అగోచరంగా ఉంటాయి. తీవ్ర పోటీ వాతావరణంలో పరుగెత్తే కంపెనీలకు కావలసింది... వేదాంతవేత్తలు, స్థితప్రజ్ఞులు కాదు కానీ మానసికంగా స్థిమితంగా ఉండేవారు అవసరం. కౌమారప్రాయ దశ దాటివచ్చిన యువత ప్రసిద్ధ కంపెనీల్లో బాధ్యతాయుత ఉద్యోగిగా చేరినప్పుడు వారి వ్యవహారశైలి సంస్థ గౌరవానికి భంగం కలిగేలా ఉండకూడదు. సాటి ఉద్యోగులకు అసౌకర్యంగానూ ఉండరాదు. ఏ ఉద్యోగీ ఏకాకిగా పనిచేయడు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహోద్యోగులతో అనుసంధానమై ఉంటాడు. అందుకే అందరితో సయోధ్యతో పనిచేయగలగాలి. దీనికి ఆధారం- ఉద్యోగికి మానసిక ఉద్వేగాలపై ఉండే అదుపు.


స్ట్రెస్‌ ఇంటర్‌వ్యూ..

ఒక ప్రశ్న, సంభాషణ, సంఘటన, సన్నివేశానికి సాధారణంగా ఎక్కువమంది సందర్భాన్ని అనుసరించి స్పందిస్తారు. కానీ కొందరు అతిగా స్పందిస్తారు. అతికొంతమందిలో అసలు స్పందనే కన్పించదు.

అతిగా స్పందించడం, అసలు స్పందనే కనబరచకపోవడం.. ఈ రెండూ అసాధారణమే. ఇటువంటి ఉద్యోగి కారణంగా సంస్థల్లో సమస్యలు తలెత్తుతాయి. అందుకే కంపెనీలు ముందుగానే ప్రాంగణ ఎంపికల్లో భాగంగా అభ్యర్థి భావోద్వేగాలను పరీక్షిస్తాయి. ఇందుకు హెచ్‌.ఆర్‌. నిపుణులు ప్రయోగించే సాధనం ‘స్ట్రెస్‌ ఇంటర్‌వ్యూ’.

ఒక అభ్యర్థి మానసిక ఉద్వేగాలను పరిశీలించాలనుకున్నప్పుడు హెచ్‌.ఆర్‌. సిబ్బంది ఏం చేస్తారు? తమతో ఇంటర్వ్యూలో టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ని కూడా కూర్చోబెట్టుకొని, ఆ  అభ్యర్థి చదివిన సబ్జెక్టుపై తరచి తరచి ప్రశ్చిస్తారు. సబ్జెక్టు ప్రశ్నలు, ఆద్యంతాల వరకూ వెళతాయి. ఏదో ఒక పాయింట్‌ వద్ద అభ్యర్థి వీటిని తట్టుకోలేక అసహనాన్ని ప్రదర్శించడమో, తన ఉద్వేగాలపై నియంత్రణ కోల్పోవడమో జరుగుతుంది.

నిజానికి ఇక్కడ, ఇంటర్వ్యూలో ఆశిస్తున్నది- అభ్యర్థి సాంకేతిక పరిజ్ఞానం అద్భుతంగా ఉండాలని కాదు. అభ్యర్థి సహన శక్తినీ, ఉద్వేగాలపై అదుపునూ మాత్రమే గమనించాలను కుంటున్నారు.


  ఇలాంటి సందర్భంలో దీన్ని ఒక దశలో గుర్తించిన అభ్యర్థి కలవరపడకుండా, తనకు తెలిసినంతవరకూ జవాబులు చెప్పి, తెలియనివాటికి సంయమనంతో, ప్రశాంతవదనంతో స్పందిస్తే... తనకు తెలియని విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పినా కంపెనీ ప్రతినిధులు హర్షిస్తారు. ఆ అభ్యర్థికి ఉద్వేగాలపై గల పట్టుకు మంచి గ్రేడ్‌ ఇస్తారు.


  ఐక్యూ (ఇంటలిజెన్స్‌ కోషెంట్‌) ఉన్న అభ్యర్థులు కోకొల్లలుగా మార్కెట్‌లో లభ్యమవుతున్నారు. ఈ తరుణంలో ఈక్యూ (ఇమోషనల్‌ కోషెంట్‌్) మెరుగ్గా ఉన్నవారి కోసం కంపెనీలు వెదుకుతున్నాయి. స్వీయ ఉద్వేగాలను అర్థం చేసుకోవడం, తన భావోద్వేగాలను సానుకూల పంథాలో వినియోగించగల సామర్థ్యాన్ని పెంచుకోవడం, సాటివారితో స్పర్థలు నివారించి, సవాళ్ళను ఎదుర్కొనేలా స్వీయ ఉద్వేగాలను మలచుకోవడం... ఇలాంటివి పెంపొందించుకున్నవారికి సంస్థలు ఎంతో విలువ ఇస్తున్నాయి.


‘మీలో అన్ని సామర్థ్యాలున్నాయా?’

ఇంటర్వ్యూల్లో మరో తరహావి ఉంటాయి. వీటిలో అభ్యర్థిలో గుర్తించిన ప్రతికూల విషయాలను అతడి ముఖంపైనే చెప్పేస్తుంటారు. ఉదాహరణకు అభ్యర్థి పోస్టుగ్రాడ్యుయేషన్‌లో ప్రవేశించి పరిస్థితులు అనుకూలించక మొదటి సంవత్సరంలో వైదొలగాడనుకోండి... ‘ఇలా మధ్యలో దేనినైనా వదిలేయడమే మీ లక్షణమా?’ అనీ, ఆశిస్తున్న వేతనం కాలమ్‌ చూసి ‘ఇంత అడుగుతున్నారు... మీలో అన్ని సామర్థ్యాలున్నాయా?’ అనీ కవ్వించే ధోరణిలో ప్రశ్నలు వేస్తుంటారు. వీటికి రెచ్చిపోయే అభ్యర్థికి బయటికి దారి చూపిస్తారన్నది చెప్పనవసరం లేదు. అలాకాక, సమయస్ఫూర్తితో ‘అప్పుడు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పీజీ వదిలేశాను కానీ ఎప్పటికైనా పూర్తి చేస్తాను’, ‘తగినంత సామర్థ్యం ఉందనే అనుకుంటున్నాను. ఒకవేళ కంపెనీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఎక్కువగా ఉంటే వాటిని అందుకునేందుకు సామర్థ్యాలు మెరుగుపరచుకుంటాను’.. ఇలాంటి సమాధానాలు అభ్యర్థి ఆత్మవిశ్వాసాన్ని చూపుతాయి. ఎంపికైన వారి జాబితాలోకి తీసుకువెళతాయి.


నేర్చుకునే లక్షణం  

ఉద్యోగార్థికి తెలియనిదీ- ప్రాంగణ ఎంపికలకు వచ్చే కంపెనీల ప్రతినిధులకు తెలిసినదీ అయిన విషయం ఒకటి ఉంది. తాము ఎంపిక చేసుకుంటున్న అభ్యర్థుల్లో ప్రస్తుతం ఉన్నవి పరిమిత నైపుణ్యాలే అని కంపెనీలకు తెలుసు. నిజానికి ఎంపికయిన అభ్యర్థి మాత్రం తనలో బ్రహ్మాండమైన స్కిల్స్‌ ఉన్నందునే ఇంతమందిలో తను ఎంపికయ్యాననుకుంటాడు. అభ్యర్థుల్లోని నైపుణ్యాలు తమకు కావలసినంత లేకపోయినా, వారిలోని ఒక లక్షణాన్ని గుర్తించి సంస్థ ఎంపిక చేసుకున్నదన్న విషయం చాలామందికి తెలియదు. ఆ లక్షణమే- నేర్చుకునే సామర్థ్యం (లెర్నింగ్‌ ఎబిలిటీ). కంపెనీలు తమకు కావలసిన నైపుణ్యాలన్నీ మూటగట్టి అభ్యర్థి నెత్తిన ఉండాలని కోరుకోవడం లేదు. అసలు చాలా సందర్భాలలో సంస్థలకు అవసరమైన స్కిల్స్‌ అప్పటికప్పుడు అభ్యర్థుల్లో లేకపోయినా కంపెనీలు వారిలో కొత్త విషయాలపై ఆసక్తి, నేర్చుకోవాలన్న జిజ్ఞాసను గుర్తించి వారిని ఎంపిక చేసుకుంటున్నాయి.


నేర్చుకునే లక్షణం కంపెనీల దృష్టిలో అభ్యర్థిని తేజోవంతంగా నిలుపుతోంది. ఎందువల్లనంటే శరవేగంగా పురోగమిస్తున్న సాంకేతిక విజ్ఞాన వికాసంలో ఈ రోజున్న టెక్నాలజీ రేపు మసకబారుతోంది. అలాంటప్పుడు ఉద్యోగార్థిలో ప్రస్తుతం ఉన్న స్కిల్స్‌ కొంతకాలం వరకే అక్కరకు వస్తాయి. ఆపై అప్రస్తుతమవుతాయి. అప్పుడు కంపెనీకి కావలసిన సాంకేతికతను ఉద్యోగి అందుకోగలగాలి, నేర్చుకోగలగాలి. అలాంటివారికే ప్రాంగణ ఎంపికల్లో కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.


ప్రామిసింగ్‌గా ఉంటేనే ఇంప్రెషన్‌

కొంగొత్త ఆలోచనలతో కళకళలాడాల్సిన ఉద్యోగార్థి ఈసురోమని ఉంటే కంపెనీలకు గిట్టదు. సంస్థలకు గట్టి మేలు జరగాలంటే అభ్యర్థులు అన్నివిధాలా విలువైనవారిగా (రిసోర్స్‌ఫుల్‌) కన్పించాలి. ఇలా ఉండాలంటే- అభ్యర్థి తన సబ్జెక్టులో తాజా విషయాలు క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి. మార్కెట్‌లో ఏం జరుగుతుందో చెప్పగలిగి ఉండాలి. ఉదాహరణకు ఒక ఐటీ విద్యార్థికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వివిధ రంగాల్లో విస్తరిస్తున్న వైనం కొంతైనా తెలిసివుండాలి. దీనిపై కనీసం ఐదారు నిమిషాలు తడుముకోకుండా చెప్పగల సమాచారంతో ఉండాలి. అలాగే, వివిధ ప్రశ్నలకు స్పందించే సమయంలో తనలో ఉన్న నూతన ఆలోచనలను ఎదుటివారిని ఆకట్టుకునేలా చెప్పగలగాలి. అలాంటి అభ్యర్థులను కంపెనీకి పనికి వచ్చేవారిగా గుర్తిస్తారు. 


మేనేజ్‌మెంట్‌ రివ్యూ

ఇటీవల కొన్ని ప్రసిద్ధ కంపెనీల ఎంపికల్లో ‘మేనేజ్‌మెంట్‌ రివ్యూ’ అనే రౌండ్‌ ఉంటోంది. ఉద్యోగం ఆశిస్తున్నవారిలో నిక్షిప్తమై ఉన్న సామర్ధ్యాలు, నైపుణ్యాలు ఏమిటన్న కోణంలో దీనిలో పరిశీలిస్తున్నారు. ఎంపికయ్యే వ్యక్తి భవిష్యత్తులో కంపెనీకి భారం కాకూడదు. ఆ అభ్యర్థి తన సామర్థ్యాలతో కంపెనీకి ఆస్తి (అసెట్‌) కావాలన్నది ఈ రౌండ్‌లో పరిశీలించే కోణం. కంపెనీలో ఎదిగే లక్షణాలున్న అభ్యర్థులను గుర్తించడమే మేనేజ్‌మెంట్‌ రివ్యూ లక్ష్యం. ఈ రౌండ్‌లో ప్రామిసింగ్‌గా కన్పించిన అభ్యర్థి పట్ల కంపెనీ ప్రతినిధులు ఇంప్రెస్‌ అవుతారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  ప్రాంగణ నియామకాల తులాభారంలో అభ్యర్థి టెక్నికల్, సాఫ్ట్‌ స్కిల్స్‌ రెండూ ఇరువైపులా సమానంగా ఉండాలి. డొమైన్‌ పరిజ్ఞానంలో దడదడలాడించేస్తున్న వ్యక్తికి సాఫ్ట్‌ స్కిల్స్‌లో చెమట పట్టేస్తుంటే కంపెనీకి కొరగాడు. అలాగే సాఫ్ట్‌ స్కిల్స్‌లో యోధానుయోధుడైనా డిగ్రీ చేసిన ప్రధాన సబ్జెక్టులో నీళ్లు నములుతుంటే సంస్థలకు ఏ ఉపయోగమూ ఉండదు.

  ఇప్పటివరకూ వరుస కథనాల్లో ప్రస్తావించిన 15 నైపుణ్యాలను సమానంగా మెరుగుపరుచుకుంటే అభ్యర్థి మెయిల్‌ బాక్స్‌లో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ చేరుతుంది. ఇవేమీ సాధ్యం కానంత బ్రహ్మవిద్యలో, నేర్చుకోలేనంత నైపుణ్యాలో కావు. కావలసిందల్లా- అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టటం! 



- యస్‌.వి. సురేష్‌ 

సంపాదకుడు, ఉద్యోగ సోపానం 

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పీఎన్‌బీలో 1,025 కొలువులు

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Posted Date: 21-02-2024


 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం