• facebook
  • whatsapp
  • telegram

రైతులు రెట్టింపు ధరలు పొందే వ్యూహం

సాంకేతికత విస్తరిస్తున్న కొద్దీ వ్యవసాయ రంగంలో మార్కెట్‌ ఎల్లలు చెరిగిపోతున్నాయి. ఈ విషయంలో భారత్‌ ఎంతో వెనకబడింది. మన సాగు ఉత్పత్తులు నేటికీ విదేశీ విపణులపై గట్టి పట్టు సాధించలేకపోతున్నాయి. అవి భారీగా తిరస్కరణకు గురవుతున్నాయి. పాలకుల అలక్ష్యమే దీనికి ప్రధాన కారణం.

మారుతున్న కాలానికి అనుగుణంగా విపణి వ్యూహాలు పదును తేలాల్సిన అవసరం ఉంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తిని సకాలంలో అందించగలిగితే రైతులకు తిరుగే ఉండదు. దానివల్ల వారి ఆదాయాలు రెట్టింపు అవుతాయి. భారత్‌లో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. విదేశాల్లో అధికంగా పండే ఆప్రికాట్‌, ఆపిల్స్‌, నారింజ, కివీ పండ్లు మన దేశాన్ని ముంచెత్తుతున్నాయి. పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలుస్తోంది. అయినా, మన పండ్లు విదేశీ మార్కెట్లపై పట్టు సాధించడం లేదు. మామిడి వంటి ఫలాలు భారీగానే విదేశాలకు చేరుతున్నా, మార్కెట్లను శాసించే పరిస్థితి లేదు. ప్రణాళికా లోపమే దీనికి కారణం. ఏ సమయంలో పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే మంచి ధర వస్తుంది, విపణి వ్యూహాలు, వినియోగదారుల అభిరుచులు, దిగుమతి చేసుకుంటున్న దేశాల ప్రజల అలవాట్లు... ఇవన్నీ తెలుసుకుని అందుకు అనుగుణంగా వ్యూహ రచన చేసుకోవాలి.

కొరవడిన అవగాహన

మన మామిడి అమెరికాకు చేరేసరికి మెక్సికో పండ్లు అక్కడి విపణిని ముంచెత్తుతున్నాయి. ఐరోపా విషయంలో మనపై ఇజ్రాయెల్‌ ఆధిపత్యం వహిస్తోంది. మార్కెట్‌ వ్యూహరచనతో పాటు నాణ్యత, సేంద్రియ సాగు తదితరాలు వాటి ఆధిపత్యానికి కారణం. ఇలాంటి పరిస్థితుల్లో మన యంత్రాంగం, రైతులు రెండు ప్రధానాంశాలపై దృష్టి సారించాలి. ఒకటి... రసాయన అవశేషాలు లేని ఉత్పత్తులను ఎగుమతి చేసేలా చూడటం. రెండు... ఉత్పత్తులకు అధిక ధర వచ్చే మార్కెట్లను అన్వేషించడం. ఇవి సాధ్యం కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధునిక మౌలిక వసతులను విధిగా కల్పించాలి. ప్రస్తుతం చాలా దేశాలు ఎలాంటి రసాయనాలూ వాడని సేంద్రియ ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. తమ ప్రజల ఆరోగ్యం పట్ల అవి శ్రద్ధ వహిస్తూ, దిగుమతయ్యే ఉత్పత్తులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలో మన రైతులు తమ ఉత్పత్తి అంతిమంగా చేరే వినియోగదారుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని ఎగుమతి ప్రమాణాలను పాటించాలి. వీటిపై రైతులకు అవగాహన కల్పించాలి. మార్కెట్లకు మన ఉత్పత్తిని ఏయే సమయాల్లో తీసుకువెళ్తే మంచి ధరలు వస్తాయన్న సమాచారాన్నీ అందించాలి.

ఏ సీజన్‌లో ఏ పంట వేయాలి, వాటికి ఎక్కడ గిరాకీ ఉంది, ఎంత ధర వస్తుంది, రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉండవచ్చు, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు ఎలా ఉంటాయి తదితర విశ్లేషణల సమాచారాన్ని రైతులకు తెలియజేసే వ్యవస్థే భారత్‌లో లేదు. దీన్ని తీర్చిదిద్దడం ఎంతో కీలకం. గతంలో చేతి తొడుగులకు రాయితీలు ఎత్తివేశారనే ఆగ్రహంతో స్పెయిన్‌లో మిర్చి రైతులు ఆ ఏడాది పంట పండించకుండా సమ్మె చేశారని విన్నాం. దానివల్ల అంతర్జాతీయంగా మిర్చికి కొరత ఏర్పడి ధరలు బాగా పెరిగాయి. ఇలాంటి వాటిని గుర్తించి సకాలంలో రైతులకు సమాచారం అందించగలిగితే మంచి ధరలు దక్కుతాయి. ఎగుమతులు పెంచుకోవడానికీ ఆస్కారం ఉంటుంది.

సాగులో సాంకేతికత వృద్ధితో పాటు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే యంత్రాంగం ఉంటేనే రైతుకు మేలు కలుగుతుంది. నాసిక్‌లో పండే ఉల్లికి లావోస్‌లో తీవ్ర గిరాకీ ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం లావోస్‌తో ఒప్పందం కుదుర్చుకుని మంచి ధరలకు ఉల్లిపాయలను విక్రయించవచ్చు. ఇది వ్యాపారుల స్థాయిలోనే జరుగుతోంది. రైతుల కష్టానికి ప్రభుత్వాలు మంచి ధర ఇప్పించే ప్రయత్నం చేయడం లేదు. ఏటా ఉల్లి, టొమాటో తదితరాల ధరల్లో తీవ్ర ఒడుదొడుకుల్ని మనం చూస్తున్నాం. నిరుడు ఉల్లికి ధరలేక మన రైతులు వాటిని రోడ్లపై పారబోస్తుంటే, అంతర్జాతీయంగా కొరత ఏర్పడి ఉల్లి ధరలు భగ్గున మండిపోయాయి. మన రైతులకు మేలు కలిగే అవకాశంగా దాన్ని మలచలేకపోవడం నిస్సందేహంగా పాలకుల బాధ్యతారాహిత్యమే. రైతులకు మార్కెట్లపై అవగాహన లేమి, అందుకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడం దేశీయంగా పెద్ద లోపం. ఇలాంటి కార్యక్రమాలు ఉత్పత్తిదారుల సంఘాలలో (ఎఫ్‌పీఓలలో) తప్ప, రైతు స్థాయిలో జరగడం లేదు.

ఎనిమిదో స్థానంలో..

ఉత్పత్తిని పెంపొందించాలంటే రసాయనాలను వాడాల్సిందేనన్న భ్రమల నుంచి మన రైతులు బయటపడాలి. సహజ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. ఇటీవలి కాలంలో ఊపందుకొంటున్న ఎఫ్‌పీఓలు ఎగుమతులను పెంచుకునేందుకు సేంద్రియ విధానాలను పాటించాలి. నిపుణుల్ని సంప్రదించి మార్కెట్‌ వ్యూహరచనకు ప్రాధాన్యమిస్తే స్థిరమైన రెట్టింపు ధరలు రైతులకు అందుతాయి. ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల పరంగా భారత్‌ తొలిసారి 2019లో తొలి పది దేశాల సరసన నిలిచింది. ఆ ఏడాది తొమ్మిదో స్థానంలో నిలిచిన ఇండియా- 2021లో 5,000 కోట్ల డాలర్ల వ్యవసాయ ఎగుమతులతో ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. ఆయా దేశాల ప్రమాణాలకు అనుగుణంగా దేశీయ సాగును ప్రోత్సహించి, ఎగుమతులను మరింత పెంచేందుకు పాలకులు కృషి చేయాలి. దానివల్ల స్థిరమైన ఆదాయాలు అంది రైతుల జీవితాలు బాగుపడతాయి.

విదేశాల్లో  తిరస్కరణ

భారత్‌లో అధిక దిగుబడులు సాధించే సత్తా కలిగిన అన్నదాతలు ఉన్నారు. అయితే, సాగు ఎగుమతులు మాత్రం రైతు స్థాయిలో పెరగడం లేదు. ఎగుమతులకు అనువైన నాణ్యతా ప్రమాణాలు సాధించలేకపోతుండటమే దానికి ప్రధాన కారణం. మట్టి వాసన ఉందంటూ మన రొయ్యలను విదేశాల్లో తిరస్కరిస్తున్నారు. టెంకె పురుగు, పండు ఈగ సాకుతో మామిడిని, మట్టి, బూజు పేరుతో పొగాకును, రసాయనాల కారణంగా ద్రాక్షను, అఫ్లొటాక్సిన్‌ అవశేషాలుండటం, ఇటుక పొడి కలుపుతున్నారంటూ మిర్చిని కాదంటున్నారు. ఇలా వేల కోట్ల రూపాయల విలువైన మన వ్యవసాయ ఉత్పత్తులు తిరస్కరణకు గురవుతుండటం తీవ్ర విషాదకరం. ఆయా రాష్ట్రాల వ్యవసాయ ఉద్యాన శాఖలే దీనికి కారణం. రైతులకు అంతర్జాతీయ ప్రమాణాల పట్ల అవగాహన కల్పించి, వాటిని ఆచరించేలా చేయడంలో అవి విఫలమవుతున్నాయి.

- అమిర్నేని హరికృష్ణ
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జీఎస్టీ మండలి సంస్కరణల పథం

‣ అంతరిక్ష అన్వేషణకు చంద్రయానం

‣ ప్రజలే సార్వభౌములు!

‣ జనశక్తే ఆర్థిక వృద్ధికి బలిమిగా..

‣ జనశక్తే ఆర్థిక వృద్ధికి బలిమిగా..

‣ సమతా భారత్‌కు ఉమ్మడి పౌరస్మృతి

‣ వ్యర్థాలతో అర్థం.. దేశానికి సౌభాగ్యం

Posted Date: 17-07-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని