• facebook
  • whatsapp
  • telegram

ఎగుమతుల వృద్ధిలో అసమానతలు

కేంద్ర ప్రభుత్వ ఊతం అవసరం

 

 

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా నేటికీ వాణిజ్య రంగం స్వయంసమృద్ధికి నోచుకోకపోవడం బాధాకరం. స్వాతంత్య్రానంతరం 1972-73లో రూ.104 కోట్లు, 1976-77లో రూ.69 కోట్ల మేర వాణిజ్య మిగులు కనిపించింది. మిగతా అన్ని సంవత్సరాలూ వాణిజ్యలోటే నమోదయింది. అభివృద్ధి విషయంలో కొన్నేళ్ల క్రితం వరకు భారత్‌తో దాదాపు సమానంగా ఉన్న చైనా- ప్రస్తుతం భారీగా వాణిజ్య మిగులుతో అతిపెద్ద ఎగుమతిదేశంగా ముందుకు దూసుకుపోతోంది. ప్రపంచవస్తు వాణిజ్యం 2021లో 22 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి పెరిగినట్లు అంచనా. 2020తో పోలిస్తే ఇది 23శాతం ఎక్కువ. కొవిడ్‌ రాకకు ముందు ఏడాది (2019)తో పోలిస్తే 11శాతం అధికం. భారత్‌ నుంచి ఎగుమతులు పెరగడానికి ఇది మంచి తరుణం. 2021 జనవరి నుంచి నవంబరు వరకు ఎగుమతులు 35,400 కోట్ల డాలర్లకు పెరిగాయి. గత ఏడాది అదే కాలంతో పోలిస్తే ఇది 104.5శాతం అధికం. 2021 మొదటి మూడు త్రైమాసికాల్లో నమోదైన మన ఎగుమతులు- అంతకు ముందు ఏడాది నమోదైన ఎగుమతుల కన్నా అధికం. నాలుగో త్రైమాసికంలో ఎగుమతులు 39.6శాతం మేర పెరుగుతాయని ఎగ్జిం బ్యాంక్‌ అంచనా కట్టింది. కానీ, ఎగుమతుల వృద్ధిలో పలు రంగాల మధ్య అసమాన ధోరణులు గోచరిస్తున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజినీరింగ్‌ పరికరాలు, మందులు, వజ్రాలు, ఆభరణాలు, వస్త్రాలు, రెడీమేడ్‌ దుస్తులు, పారిశ్రామిక సరకులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండు పెరిగి, ధరలు పుంజుకోవడంతో ఆయా వస్తువుల ఎగుమతుల విలువ హెచ్చింది. ఆటొమోటివ్‌, ఎలెక్ట్రానిక్‌ ఎగుమతులు తగ్గాయి. తూర్పు మధ్య, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ఆహార భద్రతకు ప్రాధాన్యం పెరిగింది. ఆ దేశాలకు భారత్‌ ఆహార ధాన్యాల విషయంలో ఒక నమ్మకమైన సరఫరా దేశంగా ఎదిగింది.  

 

ముందున్న సవాళ్లెన్నో...

మత్స్య ఉత్పత్తులకు రాయితీలిచ్చే అంశం దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంది. దోహా సదస్సు నిర్ణయాలపై స్పష్టత కొరవడింది. వీటితో పాటు బహుళ వాణిజ్య విధానాల సంస్కరణల అమలు వంటివి భారత విదేశీ వాణిజ్య నియమాలకు సవాలుగా మారుతున్నాయి. కొన్ని భాగస్వామ్యదేశాలతో వాణిజ్య వివాదాలూ కొనసాగుతున్నాయి. ప్రాంతీయ సమైక్యత దిశగా బలమైన దేశాలు అడుగులు వేయడం 2021లో ఒక ముఖ్య పరిణామం. భారత్‌ నుంచి యూఏఈకి ఎగుమతి కాబోయే సరకుల విలువలో 90శాతంపై కస్టమ్స్‌ సుంకాన్ని రద్దు చేస్తామంటూ ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)’ కింద తాజాగా యూఏఈ ప్రకటించింది. భారత్‌కు అమెరికా, చైనాల తరవాత అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశం యూఏఈ. ఈ ఒప్పందం వల్ల సుమారు 10 లక్షల మందికి కొత్తగా ఉపాధి సృష్టించవచ్చని అంచనా. ఈ తరహా ఒప్పందాలు విదేశీ వాణిజ్య రంగంలో భారత కీర్తి ప్రతిష్ఠలను మరింత ఇనుమడింపజేస్తాయి. ఎగుమతులకు మౌలిక వసతులను కల్పించడంలో రాష్ట్రాలు కూడా భాగస్వామ్యం వహించాలి. 2021 మార్చి 12 నాటికి కేవలం 18 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే ఈ తరహా భాగస్వామ్యానికి అంగీకరించాయి. అంగీకరించని రాష్టాల ఎగుమతులు మొత్తం ఎగుమతుల్లో మూడోవంతుకన్నా ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా ముందుకువస్తే ఎగుమతులు మరింతగా పెరుగుతాయి.

 

బడ్జెట్‌లో చోటు దక్కని అంశాలు

ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించే ప్రధాన రంగాల్లో ఒకటైన విదేశీ వాణిజ్యాన్ని ఇటీవలి కేంద్ర బడ్జెట్లో చిన్నచూపు చూశారనే చెప్పాలి. 16 ఏళ్ల సెజ్‌ చట్టానికి సంస్కరణల ప్రతిపాదన మినహా- విదేశీ వాణిజ్యం గురించి మరే ఇతర అంశాలనూ బడ్జెట్‌ ప్రస్తావించలేదు. మహమ్మారి ప్రవేశానికి ముందే దేశంలో ప్రైవేటు వినియోగ వ్యయం, పెట్టుబడుల వ్యయాలు తగ్గడంతో వృద్ధిరేటు తిరోగమనంలో పయనించింది. అదృష్టవశాత్తు, ఎగుమతులు గత మూడు త్రైమాసికాల్లో ఆశాజనకంగా పెరిగి, ఆర్థికవృద్ధికి ఊతమిచ్చాయి. 2021 ఏప్రిల్‌-డిసెంబరు మధ్య సరకుల ఎగుమతులు 30,100 కోట్ల డాలర్లకు పెరిగాయి. గత ఏడాది అదే కాలంతో పోలిస్తే ఇది 49.7శాతం అధికం. 2020 సంవత్సరంలో అదే కాలంతో పోలిస్తే ఇది 26.5శాతం ఎక్కువ. అంటే మహమ్మారి రాకముందున్న వృద్ధికన్నా 2021 మూడు త్రైమాసికాల్లో నమోదైన వృద్ధి అధికమన్నమాట. ఆర్థికవృద్ధికి మరింత ఊతమివ్వాలంటే, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకొంటున్న ప్రైవేటు వినియోగం, పెట్టుబడులను ఇతోధికంగా పెంచాలి. దానివల్ల ఎగుమతుల రంగం జోరందుకుంటుంది. కానీ, ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో దీని ప్రస్తావన లేదు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంవల్ల భారత్‌ తప్ప మిగిలిన ఆసియా దేశాలు ఇతర దేశాలతో వేగంగా స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను చేసుకొని లబ్ధి పొందాయి. ఈ విషయంలో భారత్‌ కొంత వెనకబడింది. బడ్జెట్‌లో సుంకాల రహిత మార్కెట్‌ ప్రదేశానికి ఎగుమతిదారులకు ఎలాంటి రాయితీలూ ప్రకటించలేదు. పెరుగుతున్న అధిక విదేశీ మార్కెటింగ్‌ ఛార్జీలు ఎగుమతిదారులకు ముఖ్యంగా ఎగుమతుల ప్రక్రియలో చురుగ్గా ఉంటున్న లక్షకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లకు పెనుసవాలుగా మారాయి. కేంద్రం వీటికి ‘మార్కెటింగ్‌ ఎక్సెస్‌ ఇనీషియేటివ్‌’ ద్వారా ఇస్తున్నది కేవలం రూ.300 కోట్లు మాత్రమే. భారత్‌ ఆశిస్తున్న అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలంటే ఎగుమతుల ఆదాయం కనీసం ఒక లక్ష కోట్ల డాలర్లు వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలి. ఒప్పందాలు చేసుకోవాలి. ఇందుకోసం స్వేచ్ఛా వాణిజ్యం వైపు అడుగులు వేయాలి. కేంద్రం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలవల్ల- బలమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న సంస్థలు ఎగుమతులను మరింత పెంచడం సాధ్యమవుతుంది. ఎగుమతుల ప్రోత్సాహానికి ఇస్తున్న రుణాల వడ్డీపై కొంత వెసులుబాటు కల్పించే (ఇంట్రస్ట్‌ ఈక్వలైజేషన్‌) పథకాన్ని మరి కొంతకాలం అమలు చేయడం ద్వారా ఎగుమతులకు మరింత ఊతం ఇచ్చినట్లవుతుంది.

 

రవాణా వ్యయాలను తగ్గిస్తే మేలు

పెరిగిన రవాణా ఖర్చులు, కంటైనర్ల కొరత ఎగుమతులకు ప్రతిబంధకాలుగా మారాయి. ఈ విషయంలో తాజా కేంద్ర బడ్జెట్‌ కొంత ఉపశమనం కలిగించే విధంగా ఉండాల్సింది. 2019 నవంబరులో కంటైనర్‌ రవాణా ఛార్జీల మోత 1,290 డాలర్లుగా ఉంటే- 2022 జనవరి నాటికి అది 9,800 డాలర్లకు ఎగబాకింది. పెరుగుతున్న రవాణా ఛార్జీలకు అనుగుణంగా ఇటీవలి బడ్జెట్‌లో కొన్ని పన్ను రాయితీలు కల్పించి ఉండాల్సింది. పీఎల్‌ఐ పథకం కింద స్థానికంగా కంటైనర్ల తయారీకి ప్రపంచ స్థాయి షిప్పింగ్‌ రూట్లకు ప్రోత్సాహకాలు కల్పిస్తే బాగుండేది. దీనివల్ల విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న కంటైనర్లపై, విదేశీ రూట్లపై ఆధారపడకుండా ఉండవచ్చు. దానివల్ల సుమారు 4000 కోట్ల డాలర్లు రవాణా సేవలపై వెచ్చించే పరిస్థితి తప్పేది. స్వయంసమృద్ధిపరంగానూ అది మంచి పరిణామం అయ్యేది!
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆధునిక యుగంలోనూ అసమానతలు

‣ మౌలిక వృద్ధికి నిధుల సమీకరణే కీలకం

‣ రైతుల్లో అవగాహనతోనే సక్రమ వాడకం

‣ దేశ రక్షణలో నారీ శక్తి

 

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 09-03-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం