• facebook
  • whatsapp
  • telegram

ఆత్మనిర్భరతే భారత్‌ కర్తవ్యం

రష్యా, చైనా సంబంధాల పట్ల అప్రమత్తత అవసరం

ఇరుగుపొరుగులైన రష్యా, చైనాల మధ్య 1950ల నుంచే స్నేహ సంబంధాలున్నాయి. గత 70 ఏళ్లలో రెండు దేశాలు సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకొని బలీయమైన పొత్తును ఏర్పరచుకున్నాయి. ముఖ్యంగా 1980వ దశకం మధ్యనాళ్ల నుంచి సంబంధాలు మెరుగుపడుతూ వచ్చి 2014 నుంచి రాజకీయ, సైనిక, ఆర్థిక సహకారాలు పటిష్ఠమయ్యాయి. క్షిపణి రక్షణ వ్యవస్థల రూపకల్పనలో, ఉపగ్రహ నావిగేషన్‌ యంత్రాంగాల అనుసంధానంలో, అంతరిక్షంలో రెండు దేశాల సహకారం విస్తృతమైంది. 2003 నుంచి 2022 వరకు రష్యా, చైనాలు కనీసం 78సార్లు సంయుక్త సైనిక విన్యాసాలు జరిపాయి. వాటిలో సగానికిపైగా 2016 నుంచే జరిగాయి. చైనా, రష్యా అధ్యక్షులు షీ జిన్‌పింగ్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌ల మధ్య బలమైన దోస్తీ ఉంది. పుతిన్‌ తనకు అత్యంత సన్నిహిత నేస్తమని జిన్‌పింగ్‌ ప్రశంసిస్తారు. జిన్‌పింగ్‌ 2013లో చైనా అధ్యక్షుడైనప్పటి నుంచి పుతిన్‌తో 39సార్లు సమావేశమయ్యారు. ప్రపంచంలో మరే ఇతర దేశ నాయకుడితో ఆయన ఇన్నిసార్లు సమావేశం కాలేదు.

ఆచితూచి అడుగులు

ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో ప్రారంభమైన ‘షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)’ సదస్సు సందర్భంగా పుతిన్‌, జిన్‌పింగ్‌లు మళ్ళీ సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని పురస్కరించుకుని అమెరికా, ఐరోపాలు రష్యాపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించడంతో పుతిన్‌-జిన్‌పింగ్‌ భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు ఉక్రెయిన్‌ నుంచి పుతిన్‌కు సవాలు ఎదురవుతుంటే, మరోవైపు తైవాన్‌ సమస్యపై చైనాకు అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతోంది. వీగర్‌ వంటి ముస్లిం గ్రూపుల మానవ హక్కులను బీజింగ్‌ కాలరాస్తున్నదని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. భారతదేశానికి చైనాతో సంఘర్షణ వాతావరణం, రష్యాతో బలమైన స్నేహబంధం ఉన్నాయి. ఈ క్రమంలో రష్యా-చైనా సంబంధాలు భారత్‌ను ఏ విధంగా ప్రభావితం చేస్తాయన్నది ప్రశ్న. భారతదేశానికి వ్యూహపరంగా రష్యా చిరకాల భాగస్వామి. ఎన్ని అంతర్జాతీయ సమస్యలు ఎదురైనా రెండు దేశాలూ తమ బంధం చెక్కుచెదరకుండా కాపాడుకొంటూ వస్తున్నాయి. తమ స్నేహానికి ఇతర దేశాలవల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడుతూ వచ్చాయి. చైనా సంగతి వేరు. దక్షిణాసియాలో, హిందూ మహాసముద్రంలో భారత ప్రయోజనాలకు విరుద్ధంగా చైనా వ్యవహరిస్తోంది. భారత్‌, చైనా సరిహద్దు వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగినా రేపు ఎప్పుడైనా ఉన్నట్లుండి ప్రజ్వరిల్లవచ్చు. చైనాను ఎదుర్కోవాలంటే భారత్‌కు ప్రధానంగా రష్యా ఆయుధాలే ఆధారం. మరోవైపు చైనాకు అనుంగు మిత్రదేశమైన పాకిస్థాన్‌తో రష్యా సంబంధాలు పెరుగుతున్నాయి. రష్యన్‌ ఆయుధ పరిజ్ఞానం చైనా ద్వారా పాక్‌కు చేరితే అది భారత్‌కు ఎంతమాత్రం మంచిది కాదు. మరోవైపు రష్యా కూడా అమెరికా, భారత్‌ రక్షణ, ఆర్థిక సంబంధాలు బలపడటాన్ని ఆందోళనగా గమనిస్తోంది. క్వాడ్‌, ఐ2యూ2 కూటముల్లో అమెరికా, భారత్‌లు భాగస్వాములు కావడంపై కలవరపడుతోంది. ఇంతవరకు ఎన్ని అవాంతరాలున్నా భారత్‌, రష్యాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను పదిలంగా కాపాడుకోవడం విశేషం. ఆర్థిక ఆంక్షల మధ్య రష్యన్‌ చమురును భారత్‌ కొనుగోలు చేయడం మాస్కోకు పెద్ద ఊరట. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని పురస్కరించుకుని రష్యాపై ఆంక్షల విధింపును భారత్‌ సమర్థించనందుకు- అమెరికా, ఐరోపా దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే అమెరికా, ఐరోపాల దృష్టి అటే కేంద్రీకృతమై ఇండో పసిఫిక్‌ పట్ల శ్రద్ధ తగ్గుతుంది. దీంతో చైనా దూకుడును అడ్డగించడం భారత్‌కు కష్టమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌ ఆచితూచి అడుగులు వేయకతప్పదు. అమెరికా, రష్యా, చైనాలలో ఏ ఒక్క దేశంపట్లా పూర్తిగా మొగ్గకుండా సమన్వయం పాటిస్తూ తన ప్రయోజనాలను కాపాడుకోవాలి. అమెరికాకు దగ్గరవుతూనే రష్యా, చైనాలతో సహకారం కొనసాగించాలి.

అమెరికా, ఐరోపాలతో సహకారం

భారత్‌, చైనాల మధ్య సరిహద్దు వివాదాలున్నా వాణిజ్య విస్తృతికి అవి ఆటంకం కావాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధి ఉంటే సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడం కష్టమేమీ కాదు. చైనా మీద భారత్‌కు అపనమ్మకం ఉన్నా రష్యా-చైనా-భారత్‌ త్రైపాక్షిక సహకారం పరస్పర విశ్వాస వృద్ధికి తోడ్పడగలదు. బ్రిక్స్‌, ఎస్‌సీఓ, ఆర్‌ఐసీ వేదికలను ఇందుకు ఉపయోగించుకోవాలి. సమర్కండ్‌లో ఎస్‌సీఓ సమావేశం జరగడానికి ముందే హిమాలయాల్లో గోగ్రా-హాట్‌స్పి‌్రంగ్స్‌ ప్రాంతం నుంచి వెనక్కు తగ్గాలని భారత్‌, చైనా సైనిక దళాలు నిశ్చయించడం స్వాగతించాల్సిన పరిణామం. రష్యా సాయంతో చైనాను దారికి తీసుకురావడానికి భారత్‌ ప్రయత్నించాలి. మధ్య ఆసియాలో భారత్‌, రష్యాలకు ఉమ్మడి ప్రయోజనాలున్నాయి. భారత్‌ భద్రతకు హానికరమైన రీతిలో కీలక ఆయుధ పరిజ్ఞానాన్ని చైనాకు బదిలీ చేయవద్దని రష్యాను కోరాలి. ఏదిఏమైనా ఉక్రెయిన్‌ వల్ల రష్యాకు అమెరికా, ఐరోపాలతో వైరం ముదురుతోంది. రష్యా శక్తియుక్తులు అటువైపే కేంద్రీకృతం కానున్నాయి. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చైనా కీలక శక్తిగా నిలుస్తోంది. ఈ పరిణామాలను భారతదేశం స్వయంగా ప్రభావితం చేయలేదు. ప్రస్తుతానికి రష్యా, చైనా పొత్తువల్ల భారత్‌ భద్రతకు ప్రమాదం లేకపోయినా, రోజులన్నీ ఒకే తీరుగా ఉంటాయని చెప్పలేం. కాబట్టి అమెరికా, ఐరోపాలతో సహకారాన్ని భారత్‌ బలపరచుకొంటూనే ఉండాలి. ఉపఖండంలో, హిందూ మహాసముద్రంలో చైనా దూకుడును అడ్డుకోవడానికి సన్నద్ధంగానే ఉండాలి.

సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం

ఇంతవరకు అన్ని అంశాల్లో భారత్‌కు అండగా నిలుస్తూ వచ్చిన రష్యా ఇకపై భారత్‌, చైనా విభేదాల పట్ల ఎలా ప్రవర్తిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2017-2021 మధ్యకాలంలో మొత్తం రష్యన్‌ ఆయుధ ఎగుమతుల్లో 27.9శాతం భారత్‌కే అందాయి. ఈ రక్షణ పొత్తుకు చైనావల్ల ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదమేమీ లేదు. అయితే, రష్యా క్లిష్ట పరిస్థితుల్లో చైనాను కాదని భారతదేశానికి ఎంతవరకు అండగా నిలబడుతుందో చెప్పలేం. అంతర్జాతీయ వ్యవహారాల్లో భావోద్వేగాలకన్నా అవసరాలకే ప్రాధాన్యం ఎక్కువ. ప్రతి దేశమూ తన ప్రయోజనాలు తాను చూసుకుంటుంది. 1962లో భారత్‌, చైనా యుద్ధం జరిగినప్పుడు నాటి సోవియట్‌ యూనియన్‌ వైఖరిని ఇక్కడ గుర్తుకుతెచ్చుకోవాలి. భారత్‌ తన నేస్తమైతే, కమ్యూనిస్టు చైనా తన సోదరుడని నాటి సోవియట్‌ యూనియన్‌ భావించింది. సోవియట్‌ తనకు అడ్డురాదనే ధీమాతోనే చైనా 1962లో భారత్‌పై దురాక్రమణకు ఒడిగట్టింది. రేపు అలాంటి పరిస్థితి పునరావృతం కాబోదనే భరోసా ఏమీ లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశం సొంతంగా ఆయుధ ఉత్పత్తిని పెంచుకుని రష్యాపై ఆధారపడటం తగ్గించుకోవాలి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారేనా?

‣ పాలనలో తగ్గుతున్న జనభాగస్వామ్యం

‣ సాగురంగానికి నీటి కొరత ముప్పు

‣ అభివృద్ధి పథంలో భారత్‌

‣ సంక్లిష్ట సమయంలో స్నేహ మంత్రం

Posted Date: 16-09-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం