• facebook
  • whatsapp
  • telegram

ముందుచూపుతో తప్పిన ముప్పు

ఆర్‌సీఈపీ వాణిజ్యంతో ఇండియా దిగుమతుల దిబ్బ.. ఎగుమతులకు దెబ్బ



ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సీఈపీ) ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం! ముసాయిదా తయారీ దశ నుంచే ఇందులో పాల్గొన్న భారత్‌, తరవాత తప్పుకొంది. ఆర్‌సీఈపీలో ఎగుమతులపై ఆధారపడిన దేశాలే అధికం. దేశీయ పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో భారత్‌ వెనక్కితగ్గింది. ఫలితంగా చైనా ఎగుమతులు మనదేశాన్ని ముంచెత్తే ముప్పు తప్పినట్లయింది. ప్రస్తుత భాగస్వామ్య దేశాల పరిస్థితే ఇందుకు నిదర్శనం.


ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో పాటు 10ఆగ్నేయాసియా దేశాల సంఘం భాగస్వాములుగా ఏర్పడిన ‘ఆర్‌సీఈపీ’ భారీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)గా పేరొందింది. ఈ దేశాలన్నీ కలిసి ప్రపంచ    జీడీపీలో 30శాతానికి సమానమైన వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 30శాతం ఈ దేశాల్లోనే ఉంది. వాణిజ్య, వాణిజ్యేతర సుంకాల సర్దుబాటు, కస్టమ్స్‌ సుంకాల మౌలిక రేటులో మార్పులు, పెట్టుబడులకు సంబంధించి భారతదేశ సమాఖ్య స్వభావాన్ని గుర్తించకపోవడం తదితర కారణాలతో మనదేశం ఆర్‌సీఈపీ నుంచి తప్పుకొంది. అన్నింటినీ మించి చైనా ఆధిపత్యం కారణంగా భారత్‌ దూరంగా ఉండిపోయింది.


భారీ వాణిజ్య లోటు

చైనాతో భారత్‌కు ఎఫ్‌టీఏ లేకపోయినా భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటోంది. ఆర్‌సీఈపీ వల్ల భారత్‌లోకి చైనా ఉత్పత్తులు భారీగా వచ్చిపడి వాణిజ్య లోటు మరింత పెరిగే ముప్పుంది. చైనా వస్తువులు ఆర్‌సీఈపీలోని ఇతర సభ్య దేశాలగుండా భారత్‌లోకి వెల్లువెత్తే ప్రమాదమూ ఉంది. అదేస్థాయిలో చైనా, ఇతర సభ్య దేశాల్లో భారతీయ ఉత్పత్తులకు ప్రవేశం లభించదనేది సుస్పష్టం. ఆర్‌సీఈపీ సభ్య దేశాల నుంచి పారిశ్రామిక, ఎలెక్ట్రానిక్‌ వస్తువులు భారీగా ప్రవహించి భారత్‌లో పారిశ్రామికీకరణ దెబ్బతింటుంది. కేవలం వ్యవసాయ ప్రధాన దేశంగా భారత్‌ మిగిలిపోయే ముప్పు ఉంది. చైనా నుంచి మన దేశానికి అధిక నైపుణ్యాలు అవసరమైన ఆధునిక సాంకేతిక ఉత్పత్తులు దిగుమతి అవుతుంటే- భారత్‌ ప్రధానంగా ముడిసరకులు, వ్యవసాయోత్పత్తులను మాత్రమే చైనాకు ఎగుమతి చేయగలుగుతోంది. చైనా తన ఎగుమతి మార్కెట్లను అంతకంతకూ విస్తరించుకుంటూ పోతోందే తప్ప భారతీయ వస్తువుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. గత అయిదేళ్లలో భారత్‌ వాణిజ్య లోటులో 70శాతం చైనా సహా ఇతర ఆర్‌సీఈపీ దేశాలతోనే ఏర్పడింది. ఈ దేశాలు వాణిజ్యేతర సుంకాలను తగ్గించడానికి ఒప్పుకోవడం లేదు. 2011 నుంచీ ఆర్‌సీఈపీ ముసాయిదా రూపకల్పనలో పాలుపంచుకొన్న భారత్‌, 2019లో బ్యాంకాక్‌లో జరిగిన మూడో శిఖరాగ్ర సభలో తప్పుకొంటున్నట్లు ప్రకటించింది.


ఆర్‌సీఈపీ 2022 జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చింది. అంతకుముందు చైనా ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాలకే ఎగుమతులు చేసేది. ఆర్‌సీఈపీ అమలులోకి వచ్చిన రెండేళ్లలో 10 ఆగ్నేయాసియా దేశాల సంఘమైన ఆసియాన్‌కు చైనా ఎగుమతులు వెల్లువెత్తాయి. ఇప్పుడు అమెరికా, ఐరోపాల స్థానాన్ని ఆసియాన్‌ దేశాలు ఆక్రమిస్తున్నాయి. గడచిన 12 నెలల్లో ఆసియాన్‌కు చైనా నెలకు 60,000 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది. ఆర్‌సీఈపీలో చైనా ఆధిపత్యమే ఇందుకు కారణం. చైనా విడిభాగాలు మొదట ఆసియాన్‌ దేశాలకు చేరి, అక్కడ తుది వస్తువులుగా కూర్పు చేసుకుని మిగతా ప్రపంచానికి ఎగుమతి అవుతున్నాయి. 2023లో ఆర్‌సీఈపీలోని 14 దేశాలతో చైనా వాణిజ్య విలువ లక్షా 77 వేల కోట్ల డాలర్లకు చేరింది. ఇది 2021కన్నా 5.3 శాతం ఎక్కువ. 2021తో పోలిస్తే 2023లో ఆర్‌సీఈపీకి చైనా ఎగుమతులు పెరిగిపోయాయి. లిథియం బ్యాటరీలు, ఆటో విడిభాగాలు, ఎలెక్ట్రానిక్‌ వస్తువుల  ఎగుమతులు ఉద్ధృతమయ్యాయి. ఆర్‌సీఈపీకి ముందు 2021లో ఆసియాన్‌ దేశాలతో చైనాకు 6,120 కోట్ల డాలర్ల వాణిజ్య మిగులు ఉండగా, 2023లో అది 10,670 కోట్ల డాలర్లకు పెరిగిపోయింది. 2021లో జపాన్‌తో చైనాకు 3,130 కోట్ల డాలర్ల వాణిజ్య లోటు ఉండగా, 2023లో 30 కోట్ల డాలర్ల మిగులు ఏర్పడింది. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో మాత్రం చైనాకు వాణిజ్య లోటు కొనసాగుతోంది. అయితే దక్షిణ కొరియాతో లోటు మునుపటికన్నా తగ్గింది. మొత్తంమీద ఆర్‌సీఈపీ వాణిజ్యం చైనాకే అనుకూలంగా మారింది.


జాగ్రత్తపడిన భారత్‌

ఆర్‌సీఈపీ ముందునాటి రోజులకన్నా తరవాతనే ఆసియాన్‌ దేశాలకు చైనాతో వాణిజ్య లోటు విపరీతంగా పెరిగిపోయింది. ఒకవేళ భారత్‌ ఆర్‌సీఈపీలో చేరి ఉంటే చైనా వస్తువులు వచ్చిపడి మన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను దారుణంగా దెబ్బతీసేవి. భారీ పరిశ్రమలూ ఈ దుష్ప్రభావాన్ని తప్పించుకోగలిగేవి కావు. స్వదేశంలో పారిశ్రామిక రంగానికి చేయూత ఇవ్వడానికి ప్రభుత్వం చేపట్టిన మేకిన్‌ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం వంటివి పడకేసి ఉండేవి. సరిహద్దు సంఘర్షణలు జరుగుతున్న వేళ చైనాపై కీలక వస్తు దిగుమతుల కోసం ఆధారపడటం భారతదేశ భద్రతకూ ప్రమాదకరంగా పరిణమించేది. అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ పడగలిగే సత్తాను భారత్‌ కోల్పోయి ఉండేది. 1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన భారత్‌ వాటి నుంచి ఆశించిన ప్రయోజనాలను పొందుతోంది. నేడు అంతర్జాతీయ వాణిజ్యం చాలా సంక్లిష్ట రూపు ధరించింది. ప్రభుత్వ విధానాలు, లావాదేవీల ఖర్చులు, ఉత్పత్తి స్థాయి వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇవి కొన్ని దేశాలకు, కొన్ని సంస్థలకు లాభసాటిగాను, ఇతరులకు నష్టదాయకంగా ఉంటున్నాయి. ఈ సవాళ్లను అధిగమించి అంతర్జాతీయ విపణికి ఎగుమతులను పెంచాలంటే పోటీ సామర్థ్యాన్ని పెంచుకోవడం ఆవశ్యకం. అందుకోసం భారత్‌ తన మౌలిక వసతులను, రవాణా, కమ్యూనికేషన్లను విస్తరించాలి. చట్టాలు, కార్మిక విపణిలో సంస్కరణలు తీసుకురావాలి. ఆధునిక సాంకేతికతలను, నవకల్పనలను చేపట్టాలి. ప్రభుత్వం సరైన విధానాలను అమలుచేసి అంతర్జాతీయ విపణిలో భారతీయ పరిశ్రమలు సమర్థంగా పోటీ పడేలా అండగా నిలవాలి.


డ్రాగన్‌కు మిగులు

చైనా పారిశ్రామిక ఎగుమతులు నానాటికీ పెరిగిపోతున్నాయి. అణు రియాక్టర్లు, బాయిలర్లు, యంత్రాలు, రైల్వే, ప్లాస్టిక్‌, రసాయనాలు, ఇనుము, ఉక్కు ఎగుమతులు పెరుగుతూ చైనాకు వాణిజ్య మిగులును సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా యంత్రాలు, యంత్ర విడిభాగాల ఎగుమతులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. మోటారు వాహనాల ఎగుమతులు 180 కోట్ల డాలర్ల నుంచి 1520 కోట్ల డాలర్లకు పెరిగాయి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డిజిటల్‌ బాటలో సత్వర న్యాయం

‣ మాల్దీవులతో పెరుగుతున్న అంతరం

‣ రాజ్యాంగమే రక్షణ ఛత్రం

‣ అడుగంటుతున్న జలాశయాలు

‣ స్వచ్ఛత కొరవడిన సర్వేక్షణ్‌

‣ భారత్‌ - యూకే వ్యూహాత్మక సహకారం

Posted Date: 07-02-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం