• facebook
  • whatsapp
  • telegram

NEET: నీట్‌.. జవాబులేని ప్రశ్నలెన్నో!

* సకాలంలో స‌మ‌స్య‌ను పరిష్కరించాలని ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు ఆదేశం 

మన దేశంలో శిక్షణ పొందిన వైద్యులు, వృత్తి నిపుణులకు విదేశాల్లో మంచి గుర్తింపు ఉంది. వైద్యుల పట్ల సమాజం ఎనలేని గౌరవం చూపుతుంది. మెరికల్లాంటి విద్యార్థులు వైద్య విద్యపై మక్కువ చూపించడానికి ఇవే కారణం. అటువంటి వైద్యవిద్య ప్రవేశాల్లో గందరగోళం చోటుచేసుకోవడం విచారకరం. ఈ క్రమంలో ‘నీట్‌’ నిర్వహణలో ఎక్కడైనా 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నాసరే, దాన్ని సకాలంలో పరిష్కరించాలని, విశ్వాసం పెంచుకోవాలని జాతీయ పరీక్ష సంస్థను సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది.

ఈనాడు, హైదరాబాద్‌:  దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మెడికల్‌ సీట్లకు ఎన్నో రెట్లు అధికంగా ఆశావహులు పోటీ పడుతుంటారు. అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్ష కోసం కఠోరంగా శ్రమిస్తారు. ఈ క్రమంలో ప్రవేశ ప్రక్రియ అత్యంత వివాద రహితంగా ఉండాలని కోరుకోవడం సహజం. జాతీయ స్థాయిలో వైద్యవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షను ‘నేషనల్‌ ఎలిజిబిలిటీ అండ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌)’గా వ్యవహరిస్తారు. 2013 నుంచి నిర్వహిస్తున్న ఈ పరీక్షను మొదట్లో కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్‌ఈ) నిర్వహించేది. 2017 నుంచి కేంద్ర విద్యాశాఖ పరిధిలోని జాతీయ పరీక్ష సంస్థ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ-ఎన్టీయే) నిర్వహిస్తోంది. స్వయంప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని తద్వారా ప్రజల్లో అనుమానాలకు తావులేకుండా, నమ్మకం కలిగించాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. కానీ, ఈ ఏడాది జరిగిన పరీక్షల్లో ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే.

సంజాయిషీ పేలవం...

నాలుగు పాఠ్యాంశాల్లో 200 ప్రశ్నలకుగాను 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సరైన సమాధానానికి నాలుగు మార్కుల చొప్పున ఒక విద్యార్థికి గరిష్ఠంగా 720 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. తప్పు సమాధానం రాస్తే ఒక మార్కు తొలగిస్తారు. సాధారణంగా ఇద్దరికో ముగ్గురికో రావలసిన నూరు శాతం అంటే 720కి 720 మార్కులు ఈసారి ఏకంగా 67 మంది విద్యార్థులు సాధించడంతో సమస్య మొదలైంది. అత్యధిక మార్కులు వచ్చినవారిలో ఎనిమిది మంది ఒకే పరీక్ష కేంద్రంలో, ఆరుగురు ఒకే గదిలో పరీక్ష రాయడం అనుమానాలకు ఊతమిస్తోంది. దీనికి పరీక్ష నిర్వాహక సంస్థ ఇచ్చిన సంజాయిషీ పేలవంగా ఉంది. గత ఏడాది కంటే ఎక్కువగా మూడు లక్షల మంది పరీక్ష రాశారని, పరీక్ష పత్రం సులువుగా ఉందని చేస్తున్న వాదనలో పస లేదు. మూడు లక్షల మంది అదనంగా రాస్తే మరొకరికో, ఇద్దరికో నూరు శాతం మార్కులు వస్తాయి. మరోవైపు, ఈసారి పరీక్ష కఠినంగా ఉందని ఫలితాల వెల్లడికి ముందే పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. కొంతమంది విద్యార్థులకు అసంబద్ధంగా మార్కులు రావడం, కొందరు విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు ఇచ్చామని ఎన్టీయే చెప్పడంతో పరీక్షపై నీలినీడలు అలముకున్నాయి. 1563 మంది విద్యార్థులకు పరిపాలనాపరమైన ఇబ్బందుల వల్ల పరీక్ష సమయం తగ్గిందని, అందుకు పరిహారంగా గ్రేస్‌ మార్కులు ఇచ్చినట్లు నిపుణుల కమిటీ వెల్లడించింది. పరీక్ష సమయం తగ్గితే, పరిహారంగా అదనపు సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. అందుకు భిన్నంగా గ్రేస్‌ మార్కులు కలపడంతో పెద్ద వివాదానికి తెరతీసినట్లయింది. గ్రేస్‌ మార్కుల వివాదానికి ఆధారంగా... 2018 నాటి పంజాబ్, హరియాణా హైకోర్టు ఆదేశాలను ఎన్టీయే అధికారులు ఉటంకించారు. అయితే, ఆ ఆదేశాలు న్యాయవిద్యకు సంబంధించినవి. అవి వైద్య, ఇంజినీరింగ్‌ విద్యకు వర్తించవని తెలుస్తోంది. ఎన్ని గ్రేస్‌ మార్కులను, ఏ ప్రాతిపదికన ఇచ్చారనే అంశాలపైనా స్పష్టత కొరవడింది. మొదటి ర్యాంకు సాధించిన వారిలో పలువురు గ్రేస్‌ మార్కుల ద్వారా లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. నిపుణుల కమిటీ గ్రేస్‌ మార్కులు ఇచ్చిన వారందరికీ మళ్ళీ పరీక్ష పెట్టాలని యోచిస్తోంది. అయితే, ప్రశ్నపత్రం ఇంతకుముందు పరీక్ష స్థాయిలో ఉంటుందా, రెండోసారి పరీక్ష రాసే విద్యార్థులకు తక్కువ మార్కులు వస్తే బాధ్యత ఎవరిది వంటివి జవాబు దొరకని ప్రశ్నలే! కొన్ని ప్రశ్నలకు జవాబులు తప్పు అని గ్రహించిన 13 వేల మంది విద్యార్థుల నుంచి ఆక్షేపణలు వ్యక్తమయ్యాయి. వాటికి సరైన సమాధానాన్ని ఇవ్వకుండా 2018లోని ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకం ఆధారంగా ఆ ప్రశ్నకు గ్రేస్‌ మార్కులు ఇవ్వడం అసంబద్ధంగా ఉంది. 2024లో పరీక్ష రాసే విద్యార్థులు ఇటీవలి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలా, లేదా 2018 నాటివి చదవాలా అనేది మరో సందేహం. కొంతమంది విద్యార్థుల జవాబు పత్రాల్లోని సమాధానాల మేరకు ఫలితాలు లేవని, తక్కువ మార్కులు వచ్చాయనే ఆరోపణలూ ఉన్నాయి. అదే నిజమైతే విద్యార్థులందరికీ పునఃమూల్యాంకనం చేపట్టాల్సి వస్తుంది.

తక్షణ కర్తవ్యం

పరీక్షల నిర్వహణలో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతాలు, విభిన్న వివాదాలు తరచూ పునరావృతమవుతుంటే విద్యావ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదముంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో దేశ విశ్వసనీయత దెబ్బతినే ముప్పుంది. అందుకని, అవసరమైతే ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలి. పరీక్ష విధానాల్లో సమూల మార్పులు తీసుకొచ్చి, పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. విచారణ, న్యాయప్రక్రియ పేరిట అసాధారణ జాప్యం చేసి విద్యార్థుల భవిష్యత్తుకు విఘాతం కలగకుండా ప్రభుత్వాలపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సాంకేతిక సహకారంతో దేశమంతటా ఏకకాలంలో పరీక్ష నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడించేలా చర్యలు చేపట్టాలి. నిరపరాధులైన విద్యార్థుల హక్కుల్ని కాపాడుతూ, అక్రమ మార్గాల్లో ర్యాంకులు సాధించిన వారిని గుర్తించి శిక్షించాలి. తద్వారా విద్యావ్యవస్థపై విశ్వసనీయతను పెంపొందించాలి. పరీక్షల నిర్వహణలో ఇతర దేశాలకూ ఆదర్శంగా నిలవాలి.

హడావుడిగా...

ఈసారి నీట్‌ పరీక్షల్లో ప్రణాళిక ప్రకారం కుట్ర జరిగిందన్నది ఒక వాదన. ఫిబ్రవరి 9 నుంచి నెల రోజులపాటు దరఖాస్తుకు అనుమతి ఇచ్చిన ఎన్టీయే, తరవాత వారం రోజులు పొడిగించడం కొంతమందికి లబ్ధి చేకూర్చడానికే అనే వాదన వినిపిస్తోంది. బిహార్, గుజరాత్‌ రాష్ట్రాల్లో పరీక్షకు ముందే నగదు చేతులు మారిన సంఘటనలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. జూన్‌ 14వ తేదీన ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా, 10 రోజులు ముందుగానే సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజైన జూన్‌ 4వ తేదీన విడుదల చేయడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీట్‌ అవకతవకల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే హడావుడిగా ముందుగానే ఫలితాలు వెల్లడించారనేది ఆరోపణ.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లౌడ్‌ కంప్యూటర్‌లో ఉద్యోగాల మథనం

‣ డిజిటల్‌ బిజినెస్‌ కోర్సులో అడ్మిషన్లు

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌

‣ బైపీసీ తీసుకుంటే.. కెరియర్‌ అవ‌కాశాలివే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.