• facebook
  • whatsapp
  • telegram

అంతరిక్షంలో ఆధిపత్య పోరు

‘తార’స్థాయిలో అమెరికా, చైనాల పోటీ

 

 

భూమి మీద ఆర్థికాధిపత్యం కోసం అమెరికా, చైనాల మధ్య రగులుతున్న పోటీ అంతరిక్షానికీ విస్తరిస్తోంది. చంద్రుడు, గ్రహశకలాల్లో నిక్షిప్తమై ఉన్న లక్షల కోట్ల డాలర్ల విలువైన ఖనిజ వనరులను చేజిక్కించుకోవడానికి దేశాలూ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ ఆధిపత్య పోటీలో చైనా, రష్యా ఒక పక్క మోహరించగా- అమెరికా, ఐరోపాలు మరోపక్క నిలిచాయి. ప్రస్తుతానికి భారత్‌ ఈ రెండింటిలో ఏ శిబిరంలోనూ చేరకుండా స్వశక్తితో రోదసిలో దూసుకుపోవడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌ వంటి పారిశ్రామిక వేత్తలు కూడా సొంత రాకెట్లు, ఉపగ్రహాలతో అంతరిక్ష అన్వేషణ కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం అంతరిక్ష వనరుల కోసం పెరుగుతున్న పోటీ పోనుపోను రోదసిలో సైనిక పోటీగా రూపాంతరం చెందడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణ చైనా సముద్రం, అందులోని దీవులు, సహజ వనరులు తమవేనని దబాయిస్తున్న చైనా- 2030కల్లా చంద్రుడిపై తిష్ఠవేసి అక్కడి వనరులూ తమవేనని ప్రకటించదనే భరోసా ఉందా అని అమెరికా కూటమి ప్రశ్నిస్తోంది. చైనా కూడా అమెరికాకు ఇదే ప్రశ్న సంధిస్తోంది. చంద్రుడిపై గనుల తవ్వకం, ఇతర కార్యకలాపాల కోసం అమెరికా ముందుకు తెచ్చిన ఆర్టెమిస్‌ ఒప్పందాలు చంద్రుడిపై కొన్ని భద్రతా మండలాలను ప్రతిపాదిస్తున్నాయి. ఈ ప్రత్యేక మండలాల పేరిట చంద్రుడిపై పెద్ద ప్రాంతాలను కబ్జా చేయాలని అమెరికా, దాని కంపెనీలు కుట్ర పన్నుతున్నాయని చైనా ఆరోపిస్తోంది. చంద్రుడు, కుజుడు, గ్రహశకలాల అన్వేషణతో సహా అన్ని అంతరిక్ష కార్యక్రమాలకు నియమ నిబంధనలను ఐక్యరాజ్యసమితే రూపొందించాలని చైనా డిమాండ్‌ చేస్తోంది. అమెరికా ప్రతిపాదించిన ఆర్టెమిస్‌ ఒప్పందాలపై ఇంతవరకు 19 దేశాలు సంతకం చేశాయి. అమెరికా మొదటి నుంచీ అంతరిక్ష కార్యకలాపాల్లో చైనాను దూరం పెడుతూ వచ్చింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో చైనాకు ప్రవేశం దక్కకుండా చేసింది. దీంతో చైనా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని సాకుగా చూపుతూ అమెరికా, ఐరోపాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన క్రమంలో ఆ దేశం కూడా ఐఎస్‌ఎస్‌ నుంచి వైదొలగే అవకాశం లేకపోలేదు. ఐఎస్‌ఎస్‌ను అమెరికా, రష్యా, జపాన్‌, ఐరోపా, కెనడాలకు చెందిన అంతరిక్ష సంస్థలు నిర్వహిస్తున్నాయి.

 

చైనా, అమెరికాలు భూమిపై పోటీ పడిన మాదిరిగానే అంతరిక్షంలోనూ కాలుదువ్వుతున్నాయి. 2019లో చంద్రుడి వెనక భాగంలో చైనా ఒక రోవర్‌ను దింపింది. అమెరికా తరవాత ఈ విజయం సాధించిన దేశం చైనాయే. 2025లో చంద్రుడిపైకి రోబోలను పంపడానికి చైనా సన్నద్ధమవుతోంది. 2030లో చైనా వ్యోమగామి చంద్రుడిపై దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1972లో చివరిసారిగా చంద్రుడిపైకి అపోలో-17 వ్యోమనౌకను పంపిన అమెరికా, ఇన్నేళ్ల తరవాత ఆర్టెమిస్‌ అనే రాకెట్‌ను పంపడానికి పరీక్షలు నిర్వహిస్తోంది. మొదట రోబోలను, 2025లో మానవులను చంద్రుడిపై దింపాలని లక్షిస్తోంది. చంద్రుడిపై తొలి మహిళా వ్యోమగామిని దింపాలని, అక్కడొక స్థావరాన్ని నెలకొల్పాలని చూస్తోంది. మానవులను చంద్ర, కుజ గ్రహాలకు పంపే స్టార్‌షిప్‌ రాకెట్లను ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ రూపొందిస్తోంది. భారత్‌, రష్యా, జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా సొంతంగా చంద్రమండల యాత్రలు చేపట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. చంద్రుడిపై పుష్కలంగా ఉన్న హీలియం3 ఐసోటోప్‌ను అణు విద్యుత్‌ కేంద్రాల్లో యురేనియానికి ప్రత్యామ్నాయంగా వాడే అవకాశం ఉంది. హీలియం3 ప్రమాదకర రేడియో ధార్మికతను ప్రసరించదు. కేవలం మూడు చెంచాల హీలియం3 ఐసోటోప్‌ అయిదు వేల టన్నుల బొగ్గుకు సమానం. దాన్ని భూమిపైకి తీసుకురావడానికి చైనా, అమెరికా, ఐరోపా దేశాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

 

గ్రహశకలాల తవ్వకం

ప్రస్తుతం సుమారు 40వేల కోట్ల డాలర్లుగా ఉన్న అంతరిక్ష పరిశ్రమ పరిమాణం మరి రెండు దశాబ్దాల్లోనే లక్ష కోట్ల డాలర్లకు చేరుకుంటుందని మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ వేసిన అంచనా ఇక్కడ గమనార్హం. ఉపగ్రహాలు, కమ్యూనికేషన్లు, రిమోట్‌ సెన్సింగ్‌, విమాన, నౌకాయానాలకు నావిగేషన్‌ వంటివన్నీ అంతరిక్ష పరిశ్రమలో అంతర్భాగాలు. ఈ రంగంలో అమెరికాకు ఇప్పటికే చైనా, రష్యాల నుంచి పోటీ ఎక్కువ అవుతోందని ఏప్రిల్‌లో అమెరికా రక్షణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. తరవాత కొద్ది రోజులకే చైనా గ్రహశకలాలపై నిఘా వేసి అవి భూమి మీదకు దూసుకొచ్చే ముందే రాకెట్ల సాయంతో వాటి మార్గాన్ని మార్చడానికి 2025 కల్లా ప్రణాళికలను సిద్ధం చేయనున్నట్లు తెలిపింది. గ్రహ శకలాలపై నిఘా- వాటిలోని లక్షలకోట్ల డాలర్ల విలువైన అరుదైన లోహాలను తవ్వితీయడానికి ఉపయోగపడుతుంది. జపాన్‌ ఇప్పటికే ఒక గ్రహశకలంపై వ్యోమ నౌకను దింపి అక్కడి మట్టి, రాళ్లను తీసుకొచ్చింది. అలాంటి ఘనత సాధించాలని చైనా కూడా తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ ఫోన్లు, ఆటొమొబైల్స్‌లో వాడే పలాడియం వంటి అరుదైన లోహాలు, ప్లాటినం గ్రహశకలాల్లో పుష్కలంగా ఉంటాయి. సైకీ16 అనే గ్రహశకలంపైకి ఈ సంవత్సరంలోనే వ్యోమ నౌకను పంపాలనుకుంటున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఏప్రిల్‌ 11న ప్రకటించింది. 173 మైళ్ల వెడల్పు ఉండే సైకీ16లో విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని అంచనా. అంతరిక్షంలో మొదలైన ఇలాంటి ఆర్థిక పోటీ సైనిక పోరుగా మారడానికి ఎంతోకాలం పట్టకపోవచ్చు. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో అంతరిక్షంలో ఎటువంటి ఉత్పాతాలను సృష్టిస్తాయనేది చెప్పలేం.

 

అరుదైన  లోహాల వేట

 

ఇదీ పరిస్థితి

వాతావరణ మార్పులను నిరోధించాలంటే శిలాజ ఇంధనాలను పక్కనపెట్టి గాలి, సూర్యరశ్మి వంటి పునరుత్పాద]క ఇంధన వనరులతో విద్యుదుత్పాదన ప్రక్రియను అనుసరించక తప్పదు. ప్రస్తుతం కాలుష్య కారక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ నుంచి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు మారాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

 

ఏం కావాలి?

స్మార్ట్‌ ఫోన్లు, డేటా కేంద్రాలు, ఉపగ్రహాలు, సౌర ఘటాలు, పవన విద్యుత్‌ టర్బైన్లు, విద్యుత్‌ వాహనాల బ్యాటరీలు లేనిదే ఈ రూపాంతరీకరణ సాధ్యంకాదు.

 

ఏవి కీలకం?

ఈ అత్యాధుక సాధనాల తయారీకి లిథియం, రీనియం, యాంటిమని, నియోడిమియం, టాంటలుం వంటి అరుదైన లోహాలే కీలకం.

 

ఎక్కడున్నాయి?

అరుదైన లోహాల కోసం చైనా, మంగోలియా, కాంగో, లాటిన్‌ అమెరికా, కజఖ్‌స్థాన్‌లలో సాగుతున్న తవ్వకాలు తీవ్ర పర్యావరణ విధ్వంసాన్ని కలిగించే ప్రమాదం ఉన్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 

ప్రత్యామ్నాయ ప్రయత్నాలివీ

ప్రస్తుతం అరుదైన లోహాల మార్కెట్‌పై చైనా గుత్తాధిపత్యమే కొనసాగుతోంది. దీన్ని ఛేదించడానికి గ్రహశకలాల నుంచి అరుదైన లోహాలను తవ్వి తెచ్చుకోవాలనే లక్ష్యంతో అమెరికా, ఐరోపా తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి.

 

- కైజర్‌ అడపా
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పంటలకు భానుడి సెగ

‣ కల్తీని పారదోలితేనే ఆరోగ్య భారతం

‣ సవాళ్లు అధిగమిస్తేనే సమ్మిళిత అభివృద్ధి

‣ బొగ్గు కొరతతో విద్యుత్‌ సంక్షోభం

‣ ఖలిస్థానీ ముఠాలకు ఐఎస్‌ఐ దన్ను

Posted Date: 10-06-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం