• facebook
  • whatsapp
  • telegram

Engineering: బీటెక్‌లో చేరేందుకు ఇన్ని పరీక్షలా?

నీట్‌లా జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌


 

ఇంజినీరింగ్‌ చదవాలనుకునే విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది ప్రారంభం నుంచే మానసిక సంఘర్షణ తప్పడం లేదు. బీటెక్‌ సీటు కోసం ఒక్కో విద్యార్థీ కనీసం ఐదారు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోండగా.. వాటికి సన్నద్ధమయ్యేందుకు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఒక్కో సంస్థ ఒక్కో విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అందుకు అనుగుణంగా సిద్ధమయ్యేందుకు రెండో ఏడాదంతా విద్యార్థులు ఒత్తిడిలోనే గడుపుతున్నారు. వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న మాదిరిగా ఇంజినీరింగ్‌కు సైతం జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్‌ కొన్నేళ్లుగా వినిపిస్తోన్నా, అమల్లోకి రావడం లేదు. బీటెక్‌లో చేరేందుకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల దరఖాస్తులకే రూ.10 వేలకుపైగా ఖర్చవుతున్నాయి. రాష్ట్రంలో నాణ్యమైన ఇంజినీరింగ్‌ కళాశాలలు తక్కువ సంఖ్యలో ఉండటంతో వాటిల్లో సీటు సాధించేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. ఒక దాంట్లో సీటు రాకపోతే మరో దాంట్లోనైనా సాధించాలన్న ఒత్తిడి పిల్లలపై ఉంటోంది. ఇంజినీరింగ్‌ విద్యకు సంబంధించి కొంచెం మంచివి అనుకున్న వర్సిటీల్లో ఫీజులు అధికంగా ఉంటున్నాయి. ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు వస్తేనే రాయితీ ఇస్తామంటూ ప్రైవేటు, డీమ్డ్‌ వర్సిటీలు ప్రకటనలు చేస్తుండడంతో విధిగా వాటిని రాయాల్సి వస్తోంది.


రెండో ఏడాది నుంచే మొదలు

ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది మొదటి నుంచే అటు అకడమిక్‌.. ఇటు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాల్సి వస్తోంది. జనవరి, ఏప్రిల్‌ నెలల్లో ఒకసారి జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రెండింటికీ రాష్ట్రంలో చాలా మంది హాజరవుతున్నారు. తరువాత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈఏపీసెట్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఉంటున్నాయి. ఇవి పూర్తికాకుండానే బిట్స్‌ ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ వస్తుంది. ఈఏపీసెట్‌కు ముందే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ వర్సిటీలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కొంతమంది తెలంగాణ ఈఏపీసెట్‌ను సైతం రాస్తారు. వీటన్నింటికీ దరఖాస్తు చేసి, రాసేందుకు విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పిల్లలు ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరంలోకి వచ్చినప్పటి నుంచి తల్లిదండ్రుల్లో తమ పిల్లలకు ఇంజినీరింగ్‌లో ఎక్కడ సీటు వస్తుందో? వాటి ప్రవేశ పరీక్షలు ఎప్పుడోనన్న ఆందోళన వెంటాడుతోంది. విద్యార్థులు సైతం ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతూనే వర్సిటీలు, కళాశాలల గురించి ఆన్‌లైన్‌లో వెతకడం, సీనియర్ల సలహాలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు.


ప్రతిపాదనలు దాటని ఉమ్మడి పరీక్ష

నీట్‌లా జాతీయస్థాయిలో ఇంజినీరింగ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్‌ ఎప్పట్నుంచో ఉంది. జేఈఈ మెయిన్స్‌ తరహాలోనే ఒక్కటే పరీక్షతో జాతీయ, రాష్ట్రాల విద్యా సంస్థలు, వర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తే విద్యార్థులు ఏడాది పొడవునా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఇబ్బంది ఉండదు. ఈ దిశగా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) గతంలో కమిటీ సైతం ఏర్పాటు చేసింది. కానీ, నిర్ణయం తీసుకోలేదు. ఒకేసారి అకడమిక్, పోటీ పరీక్షల సిలబస్‌లు చదవాల్సి రావడంతో పిల్లల్లో తీవ్ర ఒత్తిడి ఉంటోంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో రాజస్థాన్‌లోని కోట కోచింగ్‌ కేంద్రాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జరిగాయి. వీటన్నింటికీ పోటీ పరీక్షల ఒత్తిడే కారణం.

ఈ ఏడాది ఏపీ ఈఏపీసెట్‌కు 3.61 లక్షల మంది దరఖాస్తు చేయగా 3.39 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో ఇంజినీరింగ్‌ కోసం రాసినవారు 2.58 లక్షల మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్‌కు ఏటా 1.50 లక్షల మంది వరకు హాజరవుతున్నారు. అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 21 వేల మందికి పైగా పరీక్ష రాశారు.

బిట్స్‌తోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ముఖ్యమైన ప్రైవేటు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కొన్ని ఇంటర్మీడియట్‌ అకడమిక్‌ పరీక్షల కంటే ముందే వాటిని పెడుతుండగా, మరికొన్ని తర్వాత నిర్వహిస్తున్నాయి. ఏపీ ఈఏపీసెట్‌ సమయంలోనే బిట్స్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇలాంటి తరుణంలో దేనికి హాజరు కావాలో తెలియక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 


ఇంటర్మీడియట్‌లో 75%పైన మార్కులు సాధించేవారు రాసే ముఖ్యమైన ప్రవేశ పరీక్షలు


‣ జేఈఈ మెయిన్స్‌ రెండు పర్యాయాలు

‣ ఏపీ ఈఏపీసెట్‌ 

‣ తెలంగాణ ఈఏపీసెట్‌

‣ ఎస్‌ఆర్‌ఎం ప్రైవేటు విశ్వవిద్యాలయం

‣ విట్‌ 

‣ గీతం డీమ్డ్‌ వర్సిటీ 

‣ కేఎల్‌యూ

‣ విజ్ఞాన్‌ 

‣ వీఆర్‌ సిద్ధార్థ 

‣ శస్త్ర 

‣ బిట్స్‌

‣ శివనాడర్‌


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!

‣ నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!

‣ సోషల్‌ ట్రోలింగ్‌.. లైట్‌ తీసుకుందాం!

‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.