• facebook
  • whatsapp
  • telegram

చదవడం ఓ ప్రాథమిక నైపుణ్యం

చదవడం అనేది విద్యార్థులకు కావాల్సిన ప్రాథమిక నైపుణ్యాల్లో ఒకటి. చదవడం అంటే.. 'అక్షరరూపంలో ఉన్న కొత్త సమాచారాన్ని ఎవరి సహాయం లేకుండా చదివి, అర్థం చేసుకోగలగాలి అంటే అవసరాన్ని బట్టి తిరిగి సొంతమాటల్లో చెప్పడమూ, రాయడమూ చేయగలగాలి. చదవడానికి సంబంధించిన సమస్యలు రెండురకాలు. ఒకటి అక్షరాలను పదాలను వేగంగా గుర్తుపట్టి కలిపి చదవగలగడం. తెలుగులోకానీ, ఇంగ్లిష్‌లో కానీ ఒకటిరెండు అక్షరాలు, (పొల్లులు వత్తులు) తేడా వస్తే పదాలు మారడం, దాని వల్ల వాక్యార్థమే మారిపోతుంది. పొరపాట్లు లేకుండా చదవడం అనేది కేవలం చిన్న పిల్లల సమస్య అనుకుంటారు చాలామంది. ఈ సమస్య తమకు ఉందని అంగీకరించేందుకు కూడా ఇష్టపడరు. ఇది చిన్నప్పటి సమస్యేకానీ, దాన్ని చిన్నతనంలోనే పరిష్కరించుకోకపోతే అది పెద్దయ్యాక కూడా వెంటాడుతూనే ఉంటుంది, ఏ సమస్యా దానంతటదే పరిష్కారం కాదు, ఏ నైపుణ్యమూ దానంతటదే పట్టుబడదు. సమస్య పరిష్కారం కావాలన్నా, నైపుణ్యం పట్టుబడాలన్నా మనం దాని మీద శ్రద్ధ పెట్టి తగినంత కృషి చేయాల్సిందే.

      తప్పులు లేకుండా చదవడం రావాలంటే వార్తాపత్రికనో, చందమామలాంటి కథల పుస్తకాన్నో నిదానంగా పైకి చదవాలి. పైకి చదువుతున్నప్పుడు సాధారణంగా మన తప్పులు మనకే తెలుస్తాయి. ఇలా పైకి చదవడం ద్వారా హైస్కూలు, కాలేజీస్థాయిలో 90 నుంచి 95 శాతం పొరపాట్లు ఎవరి సహాయమూ లేకుండా పరిష్కరించుకోవచ్చు. ఆంగ్లంలో అయితే ఈ శాతం తగ్గుతుంది. కానీ ఆ భాషలో కూడా పైకి చదివే అలవాటు చేసుకుంటే 50 నుంచి 60 శాతం తప్పులను పరిహరించే వీలుంది.

      ఈ విషయం మీకు మరింత బాగా అర్థం కావాలంటే సైకిలు తొక్కడాన్ని ఉదాహరణగా తీసుకోవాలి. సైకిలు ఎక్కి దాన్ని తొక్కడం అనేది అనేక చిన్నచిన్న పనుల సమాహారం. చేతులతో సైకిలును సరిగ్గా నిలబెట్టడం, తోసుకుంటూ దానికి కొద్దిగా వేగాన్ని అందించడం, ఒకకాలు పెడలు మీద పెట్టి, రెండోకాలు లేపి అవతలి పెడలు మీద వేయడం ఇవన్నీ కొత్తలో కంగారు పెట్టే పనులే. వీటిలో ఏది సరిగ్గా చేయకపోయినా సైకిలు పడిపోతుంది. సైకిలు ఎక్కిన తర్వాత కూడా అది పడిపోకుండా ఉండాలంలే తగినంత వేగంగా తొక్కాలి. శరీరానికీ, చేతులకీ, కాళ్లకీ మధ్య సమన్వయం ఉండాలి. దీనిలో తేడా వస్తే సైకిలు బాలెన్సు తప్పి పడిపోతుంది. అయితే ఒకసారి సైకిలు తొక్కడం అలవాటయ్యాక మనం ఈ పనులన్నీ సహజంగానే, ఏమాత్రం కష్టపడకుండా, ఆలోచించకుండా చేసేస్తాం.

       చదవడం కూడా అంతే. కంటితో అక్షరాలను చూసి గుర్తుపట్టడం, వాటి శబ్దాన్ని నోటితో పలకడం ఆ శబ్దసమూహానికి అర్థాన్ని గుర్తుతెచ్చుకొని, దాన్ని అక్కడి సందర్భానికి తగినట్లు సమన్వయం చేసుకోవడం.. ఇవన్నీ ఒకదాని వెంట మరొకటి వేగంగా క్రమం తప్పకుండా జరిగితేనే చదవడం అనే ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఈ పనులు వరుసగా, వేగంగా, సక్రమంగా సాగడానికి (అ) ఆ పనుల మీద దృష్టి పెట్టాలి. (ఆ) ఆ పనులు అసంకల్పితంగా చేయడం వచ్చేంత వరకూ సాధన చేయాలి.

ప్రస్తుతం హైస్కూలు దశలో ఎక్కువగా చూచి రాయడం, చూడకుండా రాయడం అనే రెండు పనుల మీదే దృష్టి పెడుతున్నారు. పదిహేను ఇరవై సంవత్సరాలకు పూర్వం చదవడం, అప్పజెప్పించుకోవడం మీద ఎక్కువ శ్రద్ధ ఉండేది. నిజానికి ఈ రెండు అంశాల్లో ఏదీ సమగ్రమైన భాషానైపుణ్యాలను అందించలేదు. చిన్నవయసులో వినడం, చదవడం, మాట్లాడటం, రాయడం అనే నాలుగు భాషా నైపుణ్యాలు పిల్లలకు అలవడాలంటే ఈ జంట పనులను కూడా తగిన పాళ్లలో మిశ్రమం చేయాలి. వీటికి కథలు, వార్తాపత్రికలు పైకి చదవడం, కథలు, వ్యాసాలు సొంతవాక్యాల్లో రాయడం అనే ఇంకో రెండు పనులు జతచేయాలి.

      మళ్లీ సురేష్ విషయానికొద్దాం. సురేష్‌కు కూడా చదవడంలో సమస్య ఉందో లేదో ఎలా తెలుసుకోవడం? దీనికి మార్గం పైకి చదివి చూడటమే. సహజంగానే మొదట్లో తడబాట్లు, పొరపాట్లు ఎదురవుతాయి. ఒక్కోటాపిక్‌లో రెండేసి పేజీల చొప్పున అంతకు ముందు చదవని వేర్వేరు టాపిక్‌లు వరుసగా పది పేజీలు చదివి చూడాలి. అర్థమవుతోందా లేదా అని ఆలోచన కాసేపు పక్కన పేట్టేయాలి. మొదటి పేజీ నుంచి పదో పేజీకి వచ్చేసరికి తడబాటు, పొరపాట్లు తగ్గుతాయి. అలా తగ్గితే చదవడంలో సమస్య లేనట్లే. కానీ పొరపాట్ల సంఖ్యా, తడబాటు ఒకేలా ఉంటే అక్షరాలు గుర్తుపట్టడంలో కానీ, పదాలను కూడబలుక్కోవడంలో కానీ ఎక్కడో సమస్య ఉందన్నమాట. ఎలాంటి పదాల దగ్గర ఆ సమస్య వస్తోందో గమనించాలి. ఆ అక్షరాలకు సంబంధించిన సమస్య సరిచేసుకోవాలి. చదువుతున్న కొద్దీ కొత్తపదాలు పరిచయమవుతాయి. చదవడానికి సంబంధించి భాషానైపుణ్యాల కొరత కారణంగా తలెత్తే సాంకేతిక సమస్యను ఈ విధంగా పరిష్కరించుకోవచ్చు.

Posted Date: 11-09-2020


 

అధ్యయనం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం