• facebook
  • whatsapp
  • telegram

చదువు అర్థవంతంగా ఉండాలి

ఇప్పుడు చదవడంలో రెండో స్థాయిలోకి వద్దాం. ఒక కొత్త విషయాన్ని చదివి అర్థం చేసుకోవడం ఎలా? విస్తారమైన సమాచారాన్ని చదివేటప్పుడు ఏది ముఖ్యం? ఏది అనవసరం? అనేది గ్రహించడం కష్టమే. కథో, నవలో చదివినప్పుడు తప్ప ఏకబిగిన 4, 5 పేజీలు చదివినప్పుడు ఇప్పటి వరకూ చదివినదేమిటో చెప్పమంటే చెప్పటం కష్టమే. మరి పరీక్షలకోసం గంటల తరబడి చదివిన విషయాన్ని బుర్రకెక్కించుకోవడం ఎలా?

   చదివేటప్పుడు అసలు మనం ఎందుకు చదువుతున్నాం అనే ప్రశ్నకు సమాధానం స్పష్టంగా తెలిసి ఉండాలి. న్యూస్‌పేపరు చదివేటప్పుడు, రిఫరెన్సు బుక్ చదివేటప్పుడు, మన రోల్ మోడల్ జీవిత చరిత్ర చదివేటప్పుడు, వ్యక్తిత్వవికాస పుస్తకం చదివేటప్పుడు మన లక్ష్యాలు వేర్వేరుగా ఉంటాయి.

  న్యూస్‌పేపరునే మామూలు పాఠకుడు చదివేటప్పుడు, సివిల్స్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థి చదివేటప్పుడు లక్ష్యాలు వేర్వేరుగా ఉంటాయి. తెలుసుకునేందుకు చదవడం, అవగాహన చేసుకునేందుకు చదవడం, నేర్చుకునేందుకు చదవడం, విమర్శనాత్మకంగా చదవడం వేరుగా ఉంటాయి.

తెలుసుకొనేందుకు చదవడంలో మనం ఒక విషయాన్ని సంబంధించిన వివరాలను తెలుసుకుంటాం. వాటిని గుర్తుంచుకొని తిరిగి ఉపయోగించుకోవాలనే లక్ష్యం ఉండదు. ఆ అంశంలో మనకున్న ఆసక్తిని బట్టి కొన్ని గుర్తుండవచ్చు. కొన్ని గుర్తుండకపోవచ్చు.

  అవగాహన చేసుకొనేందుకు చదవడం లక్ష్యం ఒక కొత్త అంశం గురించిన ప్రాథమిక పరిజ్ఞానం పెంచుకోవడం, ఆ విషయాన్ని మళ్లీ మనం ఇతర అభ్యసన ప్రక్రియల్లో వాడుకొనేందుకు గుర్తుంచుకుంటాం. అంతేకానీ అదే విషయంపై ప్రత్యక్షంగా లోతైన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధపడం.

నేర్చుకునేందుకు చదవడం లక్ష్యం మనం చదివిన సమాచారాన్ని తిరిగి ఉపయోగించగలగడమే. ఇది ప్రశ్నలకు జవాబులు చెప్పడం కానీ, ఆ సమాచారంలో పేర్కొన్న పనిని తిరిగి చేయడం కానీ కావచ్చు.

   విమర్శనాత్మక దృష్టితో చదవడం అంటే మనం ఇప్పటికే నేర్చుకున్న అంశంపై లోతైన అవగాహన పెంచుకొనేందుకు చదువుతున్న అంశాన్ని వివిధ ఇతర అంశాలతో పోల్చిచూసుకునేందుకు చదవడం. విమర్శనాత్మకంగా చదివేటప్పుడు మనం రచయిత లేదా సమాచార మూలంతో ఏకీభవించాలని ఏమీలేదు. దాని సాధికారతను తర్కిస్తూ చదువు సాగుతుంది.

       చదవడం లక్ష్యాలను బట్టి దాన్ని చదివేందుకు అవసరమయ్యే సమయం, పద్ధతి మారతాయి. మామూలు స్కూలు కళాశాల పరీక్షలకు చదివే వాళ్లు 3వ లక్ష్యంతోనూ, సివిల్స్ లాంటి పోటీ పరీక్షలకు చదివేవాళ్లు 4వ లక్ష్యంతోనూ చదువుతారు. కాబట్టి మనం ఆ విధానాలను గురించి వివరంగా పరిశీలిద్దాం.

Posted Date: 11-09-2020


 

అధ్యయనం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం