• facebook
  • whatsapp
  • telegram

NEET UG: పరీక్ష కేంద్రాల వారీగా నీట్‌-యూజీ ఫలితాలు వెల్లడించండి  

* ఎన్టీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు
 


దిల్లీ: నీట్‌-యూజీ 2024 ఫలితాలను నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా జులై 20న మధ్యాహ్నం 12 గంటల్లోపు విడుదల చేయాలని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)ను గురువారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్త వహించాలని పేర్కొంది. మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా..లేదా అని తెలుసుకోవడానికే ఈ జాబితాను కోరుతున్నామని తెలిపింది. ‘‘ఫలితాలను ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయండి. విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడండి. కేంద్రాల వారీగా మార్కుల సరళి ఎలా ఉందో చూస్తాం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మే 5న జరిగిన నీట్‌-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 40కిపైగా పిటిషన్లపై విచారణ జరుపుతున్న భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ జె.బి. పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రల ధర్మాసనం గురువారం వాదనల సందర్భంగా కొన్ని కీలక అంశాలను లేవనెత్తింది. దేశవ్యాప్తంగా పేపర్‌ లీకైందని నిరూపించాలని పరీక్ష రద్దు కోరుతూ దాఖలైన పిటిషనర్లకు సూచించింది. అలాంటి సాక్ష్యాలుంటేనే మళ్లీ పరీక్ష నిర్వహణ సాధ్యమవుతుందని తెలిపింది.

‘‘మళ్లీ పరీక్ష నిర్వహించాలంటే అందుకు బలమైన పునాది ఉండాలి. మొత్తం పరీక్ష పవిత్రతపై ప్రభావం పడిందని నిరూపించాలి’’ అని సీజేఐ పేర్కొన్నారు. ప్రాథమికంగా ఆధారాలను పరిశీలిస్తే ప్రశ్నపత్రం లీకేజీ హజారీబాగ్, పట్నాలకే పరిమితమైనట్లు కనిపిస్తోందని ధర్మాసనం తెలిపింది. గోధ్రాలో ప్రశ్నపత్రం లీక్‌ కాలేదని..అక్కడ పరీక్ష కేంద్ర నిర్వాహకుడు కొందరి విద్యార్థుల ఓఎమ్మాఆర్‌ షీట్లను నింపడానికి మాత్రమే డబ్బు తీసుకున్నాడని పేర్కొంది. డబ్బుల కోసం ప్రశ్నపత్రం దొంగిలించేవారు దేశవ్యాప్తంగా లీక్‌ చేయాలని అనుకోరని వ్యాఖ్యానించింది. ఝార్ఖండ్‌లోని హజారీ బాగ్‌ కేంద్రంలో మాత్రమే ప్రశ్నపత్రం లీకైందని, అదీ కేవలం 45 నిమిషాల ముందు మాత్రమేనని ఎన్టీఏ, కేంద్రం పేర్కొనడంపైనా ధర్మాసనం సందేహాలు వ్యక్తంచేసింది. 45 నిమిషాల్లో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం.. విద్యార్థులు వాటిని గుర్తుంచుకోవడం సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించింది. తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.


NEET 2024 MOCK COUNSELLING (ANDHRA PRADESH

NEET 2024 MOCK COUNSELLING(TS)

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.