• facebook
  • whatsapp
  • telegram

Admissions: అంబేడ్కర్‌ వర్సిటీ ప్రవేశాలు ఎప్పుడో!

* ఇంతవరకు వెలువడని దూరవిద్య నోటిఫికేషన్‌
 


ఈనాడు, హైదరాబాద్‌: అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరం (2024-25)లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్ర విభజన పూర్తయ్యి పదేళ్లు ముగియడంతో తెలంగాణ వరకే ప్రవేశాలు జరుపుకోవాలా? రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి ప్రవేశ ప్రకటన ఇవ్వాలా? అన్న దానిపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోలేదు. ఏటా జూన్‌లో ప్రవేశ ప్రకటన జారీ అయి..జులై తొలి వారంలో ప్రవేశాలు ప్రారంభమవుతాయి. ఈసారి జులై పూర్తవుతున్నా నోటిఫికేషనే ఇవ్వలేదు. రెండు రాష్ట్రాల నుంచి ప్రతి ఏడాది డిగ్రీ, పీజీ కోర్సుల్లో సుమారు 50 వేల మంది ప్రవేశాలు పొందుతున్నారు. అందులో 60-70 శాతం వరకు తెలంగాణ నుంచి ఉంటున్నారు. ఇంటర్‌ పాసైనవారు, ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా ఇంటర్‌ పూర్తి చేసిన వారితోపాటు పాలిటెక్నిక్, డిప్లొమా చేసిన వారు సైతం అంబేడ్కర్‌ వర్సిటీలో డిగ్రీ చదువుతుంటారు. నోటిఫికేషన్‌పై ఉలుకూపలుకూ లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రవేశ ప్రకటన జారీ ఆలస్యమైతే అభ్యర్థులు వేరే వర్సిటీల్లో చేరతారని, ఫలితంగా ప్రవేశాల సంఖ్య తగ్గుతుందన్న ఆందోళన వర్సిటీ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది.

* మా రాష్ట్రానికీ ప్రవేశాలు జరపాలని ఏపీ లేఖ

తమ రాష్ట్ర విద్యార్థులు కూడా ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలు పొందేలా ఉమ్మడి నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంబేడ్కర్‌ వర్సిటీకి ఇటీవల లేఖ రాసింది. వర్సిటీ పదో షెడ్యూల్‌ కింద ఉండటం... రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవుతున్నందున ఉమ్మడిగా ప్రవేశాలు జరపడం తమ పరిధిలో లేదని వర్సిటీ అధికారులు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి ప్రతిపాదన పంపారు. దీనిపై ఆయన న్యాయ నిపుణుల సలహా కోరినట్లు తెలిసింది. యూజీసీ నిబంధనల ప్రకారం ఆయా వర్సిటీల పరిధిలోని వారు మాత్రమే ప్రవేశాలు పొందాలి. ఒకవేళ ఏపీ విద్యార్థులు ప్రవేశాలు పొంది... ఆ రాష్ట్రంలోని స్టడీ సెంటర్ల ద్వారా తరగతులకు హాజరైతే డిగ్రీ చెల్లుబాటు కాదు. తెలంగాణలోని స్టడీ సెంటర్ల ద్వారా చదువుకుంటే సమస్య ఉండదు. ఇలాంటి సమస్యలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థులు మాత్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.