• facebook
  • whatsapp
  • telegram

ఇష్టం పెంచుకుంటే.. కష్టం కాదు!

మార్కుల సాధనకు విద్యార్థులకు సూచనలు



కొంతమంది విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులంటే ప్రత్యేకాసక్తి ఉంటుంది. వాటిల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు. కానీ మరికొన్నిటిలో మాత్రం వెనకబడిపోతుంటారు. ఆ పాఠ్యభాగాలను చదవడానికి అంతగా ఆసక్తి చూపించరు. ఏదో మొక్కుబడిగా మార్కుల కోసమన్నట్టు వాటిని తిరగేస్తుంటారు. ఆ సబ్జెక్టులపై అయిష్టత పోగొట్టుకుని, ఆ స్థానంలో ప్రత్యేకాభిమానం పెంచుకోవచ్చు. ఎలా అంటే..


‘ఉన్నత పాఠశాల స్థాయి వరకూ మన అభిరుచులతో సంబంధం లేకుండా.. తప్పనిసరిగా అన్ని సబ్జెక్టులూ చదవాల్సిందే. కళాశాల్లో చేరిన తర్వాత కొన్ని సబ్జెక్టులనే ఎంచుకోవచ్చు. అప్పుడు అంతా మన ఇష్టమే కాబట్టి ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందీ ఉండదు’ అనుకుంటారు కొంతమంది. అయితే విద్యార్థి దశ దాటి.. ఉద్యోగిగా విధులు నిర్వర్తించే సమయంలోనూ ఆసక్తిలేని సబ్జెక్టులతో మళ్లీ అవసరం పడొచ్చు. ఉదాహరణకు.. కొన్ని సందర్భాల్లో బిజినెస్‌ మేనేజర్‌కు చరిత్ర.. డిజైనర్లు, ఆర్టిటెక్ట్‌లకు గణితం, వైద్యులకు ఎలక్ట్రానిక్స్‌ పరిజ్ఞానం అవసరం పడొచ్చు. అందుకే పాఠశాల స్థాయి దాటితే చాలు.. అన్ని సబ్జెక్టులతో ఉండే బంధం తెగిపోతుందనుకోవడం పొరపాటే. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దేనిపైనా అయిష్టతనూ, వ్యతిరేకతనూ పెంచుకోకూడదు.   


ఒక్కో సబ్జెక్టు ప్రాధాన్యం తెలుసుకుంటే త్వరలోనే దానిపై ఆసక్తి ఏర్పడుతుంది, ఇష్టపడటం మొదలవుతుంది. ఆ తర్వాత ఏదీ కష్టంగా ఉండదు, విసుగ్గా అనిపించదు. వాస్తవానికి సమస్య అనేది ఆ సబ్జెక్టుల్లో ఉండదు. అంతా మన ఆలోచనా విధానంలోనే ఉంటుంది. ‘ఈ సబ్జెక్టు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎంత చదివినా అర్థం కాదు’ అంటూ ప్రతికూలంగా ఆలోచిస్తే.. అది ఎప్పటికీ అలాగే కనిపిస్తుంది. కొంచం కష్టంగా అనిపించినా.. నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే దానిపైన ఇష్టమూ పెరుగుతుంది. 


కాబట్టి ఒక సబ్జెక్టు అంతగా ఆసక్తిగా అనిపించకపోయినా.. తక్కువ మార్కులు వచ్చినా.. ఇక అది అర్థం కాదనే నిర్థరణకు వచ్చేయకూడదు. దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవడం ద్వారా మొదట్లోనే సమస్యకు అడ్డుకట్ట వేయొచ్చు. అందరూ అన్ని సబ్జెక్టుల్లోనూ ప్రావీణ్యం సంపాదించలేకపోవచ్చు.. కానీ ఆసక్తిని పెంచుకుని చదవడం వల్ల లాభాలేగానీ ఎలాంటి నష్టమూ ఉండదని గుర్తుంచుకోవాలి.


చరిత్ర 

మనుషుల స్వభావాన్ని విశ్లేషించడానికీ, విభిన్న పరిస్థితుల్లో మనుషులు ఎలా ప్రతిస్పందిస్తారో అంచనా వేయడానికీ ఇది తోడ్పడుతుంది. గతంలో ఇతరులు చేసిన పొరపాట్ల గురించి తెలుసుకుని.. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఉదాహరణకు చరిత్ర పాఠాల్లో.. యుద్ధాలు, అవి తలెత్తడానికి గల కారణాల గురించి తెలుసుకుంటాం. వర్తమాన పరిస్థితుల్లోనూ వివిధ దేశాల మధ్య అవే కారణాలతో సమస్యలు తలెత్తొచ్చు. అలాంటప్పుడు గతంలో వాటిని ఎలా పరిష్కరించారో అవగాహన అవసరం. సమాజం, ఆర్థిక వ్యవస్థ, జీవనశైలిలో వస్తోన్న మార్పుల గురించి అవగాహనా పెంచుకోవచ్చు. 


భూగోళశాస్త్రం 

ప్రపంచాన్నీ, దాని చుట్టూ ఉన్న ప్రకృతినీ అర్థం చేసుకోవడానికి ఈ శాస్త్రం తోడ్పడుతుంది. దీని అధ్యయనంలో భాగంగా.. భిన్నమైన వాతావరణ పరిస్థితులు, సంస్కృతుల గురించి తెలుసుకుంటారు. మానవ జీవితాల మీద విభిన్న వాతావరణ పరిస్థితులు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోవచ్చు. విద్య, ఉద్యోగాల కారణంగా ఇతర దేశాల్లో ఉండాల్సి వచ్చినా ఆ దేశాల నైసర్గిక స్వరూపం, వాతావరణ, సామాజిక పరిస్థితుల గురించి అవగాహన పెంచుకోవచ్చు. ఈ శాస్త్రం మీద సరైన అవగాహన లేకపోతే చరిత్రనూ సరిగా అర్థం చేసుకునే అవకాశం ఉండదు.


విజ్ఞానశాస్త్రం 

ఇది అభివృద్ధికి ద్వారం లాంటిదని చెప్పొచ్చు. ప్రకృతి నియమాలను అర్థం చేసుకోవచ్చు. సైన్స్‌లో భాగమైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, జీవశాస్త్రాలను అధ్యయనం చేయడం వల్ల అంతరిక్షం, సమయం, జీవరాశులపై పదార్థాలు చూపే ప్రభావాన్ని తెలుసుకోవచ్చు. చేసే వృత్తులతో సంబంధం లేకుండా దీనిపైన పెంచుకునే ఆసక్తి అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ శాస్త్ర అధ్యయనం ఎప్పటికీ వృథా కాదు. మనిషి జీవితంలోని ప్రతి దశలోనూ దీనితో సంబంధం కొనసాగుతూనే ఉంటుంది. 


గణితం 

తార్కిక, హేతుబద్ధమైన ఆలోచనా విధానానికి పదునుపెడుతుంది. సమస్యా పరిష్కార నైపుణ్యం దీని అధ్యయనంతో అలవడుతుంది. విశ్లేషణాత్మక ఆలోచనలకు, నగదు నిర్వహణకు, వివిధ వస్తువులు, సేవలు, స్థలాల విలువను లెక్కించడానికీ తోడ్పడుతుంది. నిత్య జీవితంలో వస్తువులు కొనడం, అమ్మడం దగ్గర నుంచి అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలకూ ఈ శాస్త్ర పరిజ్ఞానమే కీలకం. విద్యార్థి దశ దాటగానే గణితంలో అవసరం తీరిపోదు. మనిషి జీవితంలోని ప్రతి దశలోనూ ఈ శాస్త్రంతో అవసరం కొనసాగుతూనే ఉంటుంది.


భాషలు

ఎదుటివారికి మన అభిప్రాయాలు, ఆలోచనలు తెలియజేయడానికి భాష ఎంతో అవసరం. భావ ప్రకటనకిది చక్కని సాధనంలా పనిచేస్తుంది. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకూ మనిషి జీవితంలో భాష ప్రధాన భాగమవుతుంది. ఇతరుల ఆలోచనలు మనకు అర్థం కావాలన్నా.. మనల్ని ఎదుటివారు అర్థంచేసుకోవాలన్నా భాష తెలిసివుండటం ఎంతో అవసరం. అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్‌ తెలిసి ఉంటే ప్రపంచంలో ఏ మూలకైనా నిరభ్యంతరంగా వెళ్లి రావచ్చు. హిందీ మాట్లాడగలిగితే దేశంలో ఎక్కడైనా కార్యకలాపాలు సాగించవచ్చు.  

మన ఆలోచనలను సహజంగా, సమర్థంగా తెలియజేయడానికి మాతృభాషను మించిన సాధనం లేదు. దీనిద్వారా ద్వారా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢపడుతుంది. తరతరాల సంప్రదాయాలూ, కుటుంబ విలువలనూ అర్థం చేసుకోవడానికిది తోడ్పడుతుంది. విదేశాల్లో జీవిస్తున్నా.. ఇంట్లో అందరూ అమ్మభాషలోనే మాట్లాడుకోవడం వల్ల దాంట్లోని మాధుర్యాన్నీ ఆస్వాదించవచ్చు. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న ప్రణాళికతో మెరుగైన కెరియర్‌

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 10-01-2024


 

అధ్యయనం

మరిన్ని