ఉద్యోగం సంపాదించడానికి అకడమిక్ మార్కులు ఒక అంశం మాత్రమే. ఎంపికకు అవసరమయ్యే కొన్ని అంశాల్లో అందరికీ కనిపించేవి కొన్ని. ఉదా: అభ్యర్థి మార్కులు, ప్రాజెక్ట్ వర్క్, ఇతర సర్టిఫికెట్లు లాంటివి. అలాగే, కంటికి కనిపించని అంశాలు కొన్నిటిని పరిశీలించి సంతృప్తిచెందాకే అభ్యర్థిని ఎంపిక చేసుకుంటారు. అంతర్లీనంగా అలాంటి లక్షణాలున్నవారే ఉద్యోగాలకు ఎంపికవుతారు. వాటిలో ఒకానొకటి- నాయకత్వ లక్షణం. వృత్తి ఉద్యోగాల్లో సహద్యోగులతో సమన్వయం చేసుకుంటూ, సంస్థ లక్ష్యాలు సాధించడానికి అభ్యర్థికి నాయకత్వ లక్షణాలు అవసరం!
సంస్థలు ఉద్యోగుల సామర్ధ్యాలు, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ, ఉత్పాదకత పెంచి, ఉత్పాదక వ్యయం తగ్గించుకునే మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు నాయకత్వ లక్షణాలుండాలని అవి కోరుకుంటాయి. అందువల్ల ప్రతి ఉద్యోగీ తన పరిధిలో తానొక నాయకుడిగా ప్రవర్తించాలి. తన పనితీరుతో, ఇతరుల్లో స్ఫూర్తి నింపగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. విద్యార్థి దశ నుంచే ఈ సాధన ప్రారంభించాలి. ఉద్యోగ నియామకాల్లో నాయకత్వ లక్షణాలు, కార్యనిర్వహణ సామర్థ్యాలు అభ్యర్థిలో ఏ స్థాయిలో ఉన్నాయో గమనిస్తారు. ఇందుకోసం కొన్ని నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి.
సమయ నిర్వహణ
ఉద్యోగ నిర్వహణలో సమయపాలన క్లిష్టమైన అంశం. ఒక వ్యక్తి వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ, తన విలువైన సమయాన్ని అన్ని పనులకూ ఉపయోగించాలి. విద్యార్థి చదువుతోపాటు ఇతర కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ సమయాన్ని వినియోగించుకుని, సమర్థంగా తన బాధ్యతలను నిర్వర్తించడం ఒక నైపుణ్యం. ఈ నైపుణ్యం అలవడాలంటే ఎదురుచూడని అంతరాయాలను ఎదుర్కొంటూ పనిచేసేందుకు అలవాటుపడాలి. పనులు, సమయాన్నీ సమాన ప్రాధాన్యంతో పూర్తిచేయడానికి ఒక క్యాలండర్‌ను అనుసరించే అలవాటు చేసుకోవాలి.
సమస్యను అవకాశంగా..
ఏ పనినైనా ఒక లక్ష్యంగా భావించి, విధానాన్ని నిర్ణయించుకుని, ఆ దిశగా పనిచేయడం ఒక మానసిక స్థితిగా మారాలి. అత్యంత విశ్వసనీయతతో పనిచేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతి సమస్యనూ ఒక అవకాశంగా మలచుకునే నైపుణ్యం అలవడాలి. సృజనాత్మకంగా ఆలోచించి, అందరికంటే భిన్నంగా కార్యాచరణ చేయడం ఒక మంచి నైపుణ్యం.
నిర్ణయాలు తీసుకోవడం
అధికారం, నాయకత్వం రెండూ ఒకటి కావు. నాయకులు తీసుకునే నిర్ణయాలు మంచైనా, చెడైనా సంస్థపై ప్రభావం చూపుతాయి. ఈ నిర్ణయాల ప్రభావంతో ఒక్కోసారి సంస్థ మనుగడ ప్రశ్నార్థకమవొచ్చు. అందువల్ల నిర్ణయం తీసుకునేముందు ఆ అంశానికి సంబంధించిన అన్ని వివరాలూ సేకరించి, బృందంతో కూలంకషంగా చర్చించడం ఒక అలవాటు కావాలి. ప్రతి నిర్ణయం ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు నిర్ణయాలకు సవరణలు అవసరమవ్వొచ్చు. అందుకు అంగీకరించగల మానసికస్థితిని అలవరచుకోవాలి. ఒక నిర్ణయాన్ని అమలుపరచడానికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో నాయకుడు పని చేస్తుంటాడు. నిర్ణయం ఏదైనప్పటికీ చర్చించాల్సి వస్తే పూర్తి గణాంకాలు దగ్గర పెట్టుకుని దృఢంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి.
సహాయపడితే ధీమా
సంస్థలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించే సామర్థ్యం ఉన్నవారిని ఇతరులు అనుసరిస్తారు. ఉదా: మీరు విద్యార్థి దశలోనే ఒక సంఘం నిర్వహిస్తూ, కొంతమందికి సహాయపడితే మీలో ఆత్మవిశ్వాసం పెరిగి మీకో గుర్తింపు వస్తుంది.
వ్యక్తిగత సామాజిక బాధ్యత
ఒక వ్యక్తిగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం సముచితం. కొంతమంది విద్యార్ధులతో ఒక జట్టు తయారు చేసి వారి సహకారంతో మీ చదువుకూ, సిలబస్‌కూ అతీతంగా ఒక ప్రాజెక్ట్ చేపట్టండి. ఆ ప్రాజెక్ట్ సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి.
సవాళ్ళు ఎదుర్కొనే నైపుణ్యం
సమస్యలను సవాల్ చేయండి. ఈ సవాళ్ళు సమాజానికి ఆమోదయోగ్యమైనవిగా ఉండాలి. ఇలాచేయడంతో మీ పరిధి దాటి ముందడుగు వేసే అవకాశముంటుంది. మీ సహవిద్యార్థులతో కలిసి ఒక జట్టుగా పనిచేసేందుకు మార్గాలు అన్వేషించండి. అందరి ఆలోచనలు ఒకే విధంగా ఉండవు. ఒక సభ్యుని బలాలు, మరో సభ్యుని అలోచనల్లోని బలహీనతలను భర్తీ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతటి క్లిష్ట సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు. ఆలోచనలే మార్పునకు మూలం. మార్పు తీసుకురాగల ఆలోచనలున్నవారినే సంస్థలు ఉద్యోగులుగా తీసుకుంటాయి. తాజా ఆలోచనలతోనే పోటీని విజయవంతంగా ఎదుర్కొనగలం. సంస్థ అభివృద్ధికి సృజనాత్మక ఆలోచనలు అవసరం. వీటినే విద్యార్థుల నుంచి రిక్రూటర్లు ఆశిస్తారు.

*************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ సరైన శరీర భాషతో ఉద్యోగ విజయం!
‣ తీరదళంలో నావిక్....యాంత్రిక్!