• facebook
  • whatsapp
  • telegram

సేద్యం కోర్సులతో ఉద్యోగాల పంట!

ఆధునిక జీవితంలో ఆహారం, ఆరోగ్యంపై ప్రజల్లో శ్రద్ధ, అవగాహన పెరుగుతున్నాయి. శాస్త్రీయమైన, వినూత్న పద్ధతుల్లో సాగుచేసిన పంటలకు ఆదరణ ఎక్కువవుతోంది. దీంతో వ్యవసాయం, అనుబంధరంగాలు, కొత్త రకాల ఉత్పత్తులు, ప్యాకింగ్‌, సరఫరా, మార్కెటింగ్‌.. ఇలా ఎన్నో రకాల ఉద్యోగాలకు అవకాశం ఏర్పడింది. అందుకే యువత ఆధునిక సేద్యం వైపు దృష్టిసారించి అనువైన కెరియర్‌ను నిర్మించుకోడానికి ఆసక్తిని చూపుతోంది. అలాంటి వారికి బైపీసీ లేదా ఎంపీసీ గ్రూప్‌లతో ఇంటర్మీడియట్‌ తర్వాత పలు రకాల అగ్రి కోర్సులు ఆహ్వానం పలుకుతున్నాయి. 

వ్యవసాయం పట్ల చిన్న చూపు చూసే వాళ్లు తమ అభిప్రాయాలను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలూ అగ్రికల్చర్‌ వైపు తమ దృష్టిని సారిస్తున్నాయి. ప్రజల్లో ఆరోగ్యకరమైన ఉత్పత్తులపై స్పృహ ఇందుకు ఒక కారణం. పెద్ద పెద్ద కొలువులను సైతం పక్కనపెట్టి యువత దీనివైపు చూస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆధునిక ధోరణులు, నూతన పద్ధతులు, సంబంధిత అంశాలపై లోతైన అవగాహన కలిగించే అనేక కోర్సులు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రంగంపై ఆసక్తి ఉండి, కెరియర్‌ నిర్మించుకోవాలనుకునేవారు వీటిని చేయవచ్చు. కేవలం వ్యవసాయం, దాని అనుబంధ విభాగాలే కాకుండా వివిధ ఉత్పత్తులు, పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలతోపాటు మార్కెటింగ్‌ ఆర్థిక సూత్రాల అధ్యయనం వంటి ఎన్నో రకాల ఉద్యోగాలను పొందవచ్చు.

అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌

వ్యవసాయ రంగానికి ఆధునిక హంగులను జోడించడంపై ఆసక్తి ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్చు. అగ్రికల్చర్‌ ఇంజినీర్లు తమ పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయానికి అవసరమైన మెషినరీ, పరికరాలను తయారు చేస్తారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలతో ఉండే నాలుగేళ్ల కోర్సు ఇది. ఇందులో భాగంగా ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడేవాటి డిజైనింగ్‌, రూపకల్పన, అప్పటికే ఉన్నవాటిని అభివృద్ధి చేయడం, మెషినరీ, దాని తయారీ విధానం వంటివన్నీ నేర్చుకుంటారు. ఎన్నో రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఇంటర్‌లో ఎంపీసీ చదివినవారు అర్హులు. కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ/ రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షల ద్వారా ప్రవేశం పొందవచ్చు.
 

బీఎస్‌సీ అగ్రికల్చర్‌ 

వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, శాస్త్రీయ పరికరాలను ఉపయోగించి ఉత్పాదకతను పెంచే పరిజ్ఞానాన్ని అందించే కోర్సు ఇది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన పద్ధతులను అభివృద్ధి పరచడమే దీని ఉద్దేశం. అగ్రికల్చర్‌, లాండ్‌ సర్వేయింగ్‌, సాయిల్‌ సైన్స్‌, వాటర్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, యానిమల్‌, పౌల్ట్రీ మేనేజ్‌మెంట్‌, బయోటెక్నాలజీ మొదలైనవన్నీ కోర్సులో భాగమే. కాలవ్యవధి నాలుగేళ్లు. ఇంటర్‌ బైపీసీ గ్రూప్‌ ఉత్తీర్ణులు అర్హులు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ ర్యాంకు, ఇతర రాష్ట్రాల్లో సంబంధిత ప్రవేశపరీక్షల మెరిట్‌ ఆధారంగా సీటు లభిస్తుంది.

బీఎస్‌సీ హార్టికల్చర్‌

పండ్లు, కూరగాయలు, ఔషధాలు, అలంకరణ పూలు మొదలైనవాటి పెంపకం గురించి కోర్సులో భాగంగా తెలుసుకుంటారు. తోటలు, ఉద్యానవనాల పెంపకంపై ఆసక్తి ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్చు. ఈ పరిజ్ఞానం నర్సరీలు, గ్రీన్‌హౌజ్‌లు, ప్లాంటేషన్లు మొదలైనవాటి నిర్వహణకు ఉపయోగకరం. కోర్సు వ్యవధి- మూడేళ్లు. ఇంటర్‌లో బైపీసీ చదివినవారు అర్హులు. హార్టిసెట్‌ రాయడం ద్వారా ప్రవేశం పొందవచ్చు.
 

బీఎఫ్‌ఎస్‌సీ - ఫిషరీస్‌

చేపల పెంపకం, సేకరణ పద్ధతుల గురించి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్సెస్‌లో అధ్యయనం చేస్తారు. వివిధ రకాల నీరు/ మెరైన్‌ వాతావరణంలో ఎలా చేపలను పెంచవచ్చనేది తెలుసుకుంటారు. మత్స్యాల జీవన విధానం, వివిధ రకాల జాతుల పెంపకం వంటివీ చదువుకుంటారు. చేపల నిల్వ, రవాణా పద్ధతులూ ఇందులో భాగంగా ఉంటాయి. కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. ఇంటర్‌లో బయాలజీ చదివినవారు అర్హులు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
బీటెక్‌ ఇన్‌ డెయిరీ టెక్నాలజీ

ఇది ఫుడ్‌ టెక్నాలజీ, ప్రాసెసింగ్‌ పరిశ్రమలో భాగం. పాలు, సంబంధిత ఉత్పత్తులకు సంబంధించింది. నాలుగేళ్ల కోర్సు. విద్యార్థులు డెయిరీ పదార్థాల ఉత్పత్తి, ప్రాసెసింగ్‌, క్వాలిటీ కంట్రోల్‌ మొదలైన అంశాలను నేర్చుకుంటారు. వీటితోపాటు వివిధ ప్యాకేజింగ్‌, స్టోరేజ్‌, పంపిణీ అంశాలనూ తెలుసుకుంటారు. ఇంటర్‌లో ఎంపీసీ పూర్తిచేసినవారు అర్హులు. జేఈఈ, ఐసీఏఆర్‌ నిర్వహించే ప్రవేశపరీక్షల ద్వారా ప్రవేశం లభిస్తుంది.

బీవీఎస్‌సీ- యానిమల్‌ హజ్బెండరీ 

పశువులు, కోళ్లు, బాతుల వంటి వాటి పెంపకానికి సంబంధించిన కోర్సు బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ. వీటి పోషణ, అభివృద్ధికి అవసరమైన షెడ్‌ మేనేజ్‌మెంట్‌, ఆహారం, పోషణ ప్రమాణాలు, ప్రొడక్ట్స్‌ రవాణా మొదలైన అంశాలను అభ్యర్థులు తెలుసుకుంటారు. కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. ఇంటర్‌లో బయాలజీ చదివినవారు అర్హులు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ ద్వారా కోర్సు ప్రవేశాలు నిర్వహిస్తున్నారు.

బీఎస్‌సీ అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ వివిధ సాంకేతిక నైపుణ్యాలు- జెనెటిక్‌ ఇంజినీరింగ్‌, మాలిక్యులర్‌ డయాగ్నోస్టిక్స్‌, వ్యాక్సిన్లు, టిష్యూ కల్చర్‌ వంటి వాటిని అర్థం చేసుకోవడం, మేళవించడం దీనిలో భాగం. మంచి జీన్స్‌ను గుర్తించి, వాటిని వేరే మొక్కల్లో ప్రవేశపెట్టడం లేదా వాటిలో కొన్ని మార్పులు చేసి, సత్ఫలితాలు సాధించేలా చేయడం వీరి పని. పాల ఉత్పత్తిని పెంచడం, జంతువుల రోగాలను గుర్తించడం, వ్యాధుల నిరోధం, ఆహార పదార్థాల తయారీలో సరికొత్త మార్గాలను అభివృద్ధి చేయడమూ వీరి విధులు. కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. ఇంటర్‌లో బైపీసీ చదివినవారు అర్హులు. నేరుగా ప్రవేశాలుంటాయి. కొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థలు మాత్రం సొంతంగా ప్రవేశపరీక్షలను నిర్వహిస్తున్నాయి.

బీఎస్‌సీ సెరికల్చర్‌ 

ముడి పట్టును ఉత్పత్తి చేసే పట్టు పురుగుల పెంపకానికి సంబంధించిన కోర్సు ఇది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగానిది ప్రధాన పాత్ర. పట్టు పురుగుల పెంపకం, సిల్క్‌కు గ్రేడ్‌ ఇవ్వడం, దాన్ని పరీక్షించడం, సీడ్‌ టెక్నాలజీ, సిల్క్‌ వేవింగ్‌ టెక్నాలజీ, సిల్క్‌ డైయింగ్‌, ప్రింటింగ్‌ మొదలైన వాటన్నింటినీ అధ్యయనం చేస్తారు. కోర్సు కాలవ్యవధి నాలుగేేళ్లు. ఇంటర్‌లో బైపీసీ పూర్తిచేసినవారు అర్హులు. ప్రవేశాలు నేరుగానే నిర్వహిస్తున్నారు. చాలా కొద్ది సంస్థలు మాత్రం ఎంట్రన్స్‌ టెస్ట్‌ జరుపుతున్నాయి.
బీఎస్‌సీ అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌

వ్యవసాయ పరిశ్రమకు ఆర్థిక సూత్రాలను అన్వయించటం దీనిలో భాగం. మార్కెట్‌ పోకడలను అంచనా వేయడం, వాణిజ్య పద్ధతులను పరిశీలించడం, కస్టమర్ల అవసరాలు, వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులు మొదలైన అంశాలను తెలుసుకుంటారు. బైపీసీ చదివినవారు అర్హులు. రాష్ట్రాల ప్రవేశపరీక్షల ద్వారా అడ్మిషన్లు ఉంటాయి.

బీఎస్సీ, బీబీఏ - అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌

వ్యవసాయానికి సంబంధించిన అన్ని వ్యాపార వ్యవహారాల అధ్యయనం బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (కమర్షియల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)లో ఉంటాయి. కొన్ని సంస్థలు ప్రవేశ పరీక్షల ద్వారా మరికొన్ని నేరుగా అడ్మిషన్లు ఇస్తున్నాయి. కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు. ఇంటర్‌లో బయాలజీ చదివినవారు అర్హులు.
 

బీఎస్‌సీ ఆగ్రానమీ

అగ్రికల్చర్‌ సైన్స్‌, టెక్నాలజీ కోర్సు ఇది. ప్లాంట్‌ జెనెటిక్స్‌, ఆహారం, ఇంధనం, ఫైబర్‌, పునరుద్ధరణకు తోడ్పడే మొక్కలపై దీనిలో దృష్టిసారిస్తారు. దీనిలో భాగంగా ప్లాంట్‌ ఫిజియాలజీ, మెటియోరాలజీ, సాయిల్‌ సైన్స్‌ అంశాలను అధ్యయనం చేస్తారు. కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు. ఇంటర్‌ మ్యాథ్స్‌, బయాలజీతో పూర్తిచేసినవారు అర్హులు. చాలావరకూ నేరుగా ప్రవేశాలను కల్పిస్తున్నాయి. కొద్ది సంస్థలు మాత్రం ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి.
ఇంకా.. బీఎస్‌సీ- జెనెటిక్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌, బీఎస్‌సీ యానిమల్‌ హజ్బెండరీ, బీఎస్‌సీ సాయిల్‌ అండ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌, బీఎస్‌సీ అగ్రికల్చర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ ఫామ్‌ మేనేజ్‌మెంట్‌, బీఎస్‌సీ క్రాప్‌ ఫిజియాలజీ, బీఎస్‌సీ ఫారెస్ట్రీ వంటి కోర్సులూ అందుబాటులో ఉన్నాయి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు
ఆచార్య జయశంకర్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌
ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, గుంటూరు
ఎన్‌జీరంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, గుంటూరుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు కళాశాలలు
ఎస్‌వీ అగ్రికల్చరల్‌ కాలేజీ, తిరుపతి
డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్‌
శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర హార్టీకల్చర్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌
శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తిరుపతి
పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, హైదరాబాద్‌
కర్ణాటక వెటర్నరీ యానిమల్‌ అండ్‌ ఫిషరీస్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ, బీదర్‌
రాజస్థాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్సెస్‌, బికనీర్‌
జునాగఢ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ
బిర్సా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, రాంచీ
అసోం అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, జోరాట్‌
యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌, బెంగళూరు
మరట్వాడా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, పరబానీ
మహాత్మా ఫూలే కృషి విద్యాపీఠ్‌, మహారాష్ట్ర
తమిళనాడు అగ్రికల్చర్‌ యూనివర్సిటీ.
యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌, బెంగళూరు.

Posted Date: 06-11-2021


 

ఇంటర్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌