• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌కు ఇతర మార్గాలు

ఇంజినీరింగ్ చేయాలనే ఆసక్తి ఉన్నా పరిస్థితుల కారణంగా కొందరు ఇంజినీరింగ్ కోర్సులో చేరలేకపోవచ్చు. మరికొందరు ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలు రాసినా అనుకున్న ర్యాంక్ లభించక ఇంజినీరింగ్‌లో ప్రవేశించలేకపోవచ్చు. అంతమాత్రాన ఇంజినీరింగ్ కెరీర్‌కు దూరం కావాల్సిన అవసరంలేదు. రెగ్యులర్ ఇంజినీరింగ్ డిగ్రీతో సమానమైన గుర్తింపు ఉన్న కోర్సులను ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) వంటి సంస్థలు అందిస్తున్నాయి. వీటిలో చేరడం ద్వారా ఇంజినీరింగ్ డిగ్రీ చేసినట్లు అవుతుంది.
ఇంజినీరింగ్ వృత్తిలో ఎదగాలనే ఆసక్తి ఉన్నవారికి పలు సంస్థలు విలువైన, ఉన్నతమైన ఇంజినీరింగ్ ప్రోగ్రాములను అందిస్తున్నాయి.

 

వాటిలో ముఖ్యమైనవి...

1) ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా).

2) ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఐఈటీిఈ)

3) ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఇండియా)

4) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్

ఇంజినీరింగ్ రంగంలో నిపుణులైన సాంకేతిక సిబ్బందిని అందించాలనే లక్ష్యంతో 1914లో భారత్‌లో మొదటిసారిగా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఇండియా - ఐ.ఎం.ఇ.ఐ.) ఏర్పడింది. రెగ్యులర్ విధానంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరలేకపోయినవారికి, వివిధ సాంకేతిక వృత్తుల్లో చేరి భవిష్యత్తు కోసం ఇంజినీరింగ్ డిగ్రీ సాధించాలని తపించేవారికి ఈ సంస్థ అండగా నిలుస్తోంది. కాలక్రమేణ విద్యార్థుల ఆదరణ, డిమాండ్ పెరిగేకొద్దీ 1920లో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) ఏర్పడింది. తర్వాత కాలంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లాంటి పలు సంస్థలు ఆవిర్భవించాయి.
 

అర్హతలు

సాధారణంగా ఇంజినీరింగ్ కోర్సు చేయాలంటే ఎంసెట్ లేదా ఇతర జాతీయ స్థాయి పరీక్షలు రాయాలి. ఈ సంస్థలు అందించే ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సుకు ఇవేమీ అవసరంలేదు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్థులై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో సగటున 45 శాతం మార్కులు అవసరం.
 

ప్రవేశ విధానం

ఈ సంస్థల్లో ప్రవేశానికి విద్యార్థులు మొదట మెంబర్‌షిప్ పొందాలి. దీనికోసం తమ పేరును నమోదు చేసుకోవాలి. అర్హతలను పరిశీలించిన తర్వాతే వీరికి మెంబర్‌షిప్ ఇస్తారు. అక్కడి నుంచి కెరీర్ ప్రారంభమైనట్లు భావించాలి. వయసు 17 ఏళ్లు నిండాలి.
 

డిగ్రీ ఎలా ఇస్తారు?

ఈ సంస్థలు ప్రతి సంవత్సరం జూన్, డిసెంబరు మాసాల్లో రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తాయి. జూన్‌లో పరీక్షలు రాయాలంటే సెప్టెంబరు/ అక్టోబరులో మెంబర్‌షిప్ పొందాలి. డిసెంబరులో పరీక్షలు రాయాలంటే ఏప్రిల్/మేలో మెంబర్‌షిప్ పొందాలి. తర్వాత ఒక్కోవిభాగాన్ని సంస్థ సూచించిన కాలంలోగా పూర్తిచేయాలి. విద్యార్థులు అన్ని పేపర్లలో ఆయా సంస్థలు నిర్ణయించిన మార్కులను సాధించాలి. అదే సమయంలో ప్రాక్టికల్స్‌లో తప్పకుండా ఉత్తీర్ణులు కావాలి. అప్పుడే వారికి 'అసోసియేటెడ్ మెంబర్‌షిప్' హోదా లభిస్తుంది. సకాలంలో అన్ని పరీక్షలు పూర్తిచేసిన వారికి గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రదానం చేస్తారు.
అవసరమైనప్పుడు శిక్షణ: సహజంగా శిక్షణ అంతా దూర విద్యా విధానంలోనే ఉంటుంది. సబ్జెక్టులకు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను విద్యార్థులకు సూచిస్తారు. ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తోంది. దీనికోసం కొంత స్వల్ప మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుంది.

 

ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ 

ఆధునిక జీవనశైలిలో అంతర్భాగమైన ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్‌లో నిపుణులకు నిత్యం డిమాండ్ ఉంటోంది. సమర్ధులైన నిపుణులు ఉంటేనే ఈ రంగం సరైన ప్రతిఫలాలను అందించగలదు. ఈ వాస్తవాన్ని గుర్తించిన ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఐఈటీఈ) పారిశ్రామిక రంగానికి, సమాజ అవసరాలకు ఉపయోగపడే విధంగా నిపుణులకు తర్ఫీదునివ్వడంలో కృషి చేస్తోంది. 1953 లో ఏర్పాటైన ఈ సంస్థ ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్స్ రంగాల్లో కొత్తగా ఆవిష్కృతమవుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు చేర్చడంలో, సమర్థులుగా వారిని తీర్చి దిద్దడంలో కృషి చేస్తోంది. కరస్పాండెన్స్ విధానంలో బోధన ఉంటుంది. రాష్ట్రంలోని విద్యార్థులకు ఈ కోర్సులను మరింత అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రాంతీయ కార్యాలయాన్ని 1973లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ నిర్వహిస్తున్న ప్రోగ్రాములు..

1) డిప్లొమా ఇన్ ఐఈటీఈ

2) ఏఎంఐఈటీఈ (బీటెక్ డిగ్రీతో సమానం)

ప్రవేశం: మొదట మెంబర్‌షిప్ తీసుకోవాలి. ఇది 5 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. తర్వాత అర్హులైన వారికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

1) డిప్లొమా ఇన్ ఐఈటీఈ: ఈ కోర్సు చేయడానికి పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ డిప్లొమా పొందినవారు ఐఈటీఈ అందించే అసోసియేట్ మెంబర్ కోర్సులో ప్రవేశానికి అర్హులవుతారు.

2) ఏఎంఐఈటీఈ: అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీర్స్ - ఏఎంఐఈటీఈ పూర్తి రూపం. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుకు అర్హులు లేదా డిప్లొమా ఇన్ ఐఈటీఈ ఉండాలి.

ఇది గ్రాడ్యుయేట్ ఎగ్జామ్‌గా కూడా గుర్తింపు పొందింది. ఇందులో ఎ, బి సెక్షన్లుంటాయి.సెక్షన్-ఎలోని అన్ని సబ్జెక్టులను ఒకేసారి పూర్తి చేయాలి. తర్వాత సెక్షన్ - బి రాయవచ్చు. ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. పరీక్షల్లో ఉత్తీర్ణులైనా ప్రాక్టికల్స్‌లో కూడా పాస్ కావాలి. తర్వాతే ఏఎంఐఈటీఈ సర్టిఫికెట్ ఇస్తారు.

వెబ్‌సైట్: http://www.iete.org
 

ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ 

పారిశ్రామిక మార్కెట్లో మెకానికల్ ఇంజినీర్ల డిమాండ్‌ను గమనించడంతోపాటు, ఆధునిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో 1914 లో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఇండియా) ఏర్పడింది. ఈ సంస్థ మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ కోర్సును నిర్వహిస్తోంది. దీన్ని టెక్నికల్ ఇంజినీరింగ్ అని కూడా పిలుస్తారు. ఈ సంస్థ రెండు రకాలైన మెంబర్‌షిప్‌లను అందిస్తోంది. సంవత్సరానికి రెండుసార్లు జూన్, డిసెంబరుల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

మెంబర్‌షిప్‌ల వివరాలు ...

స్టూడెంట్ మెంబర్‌షిప్ (డిప్లొమాతో సమానం): ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి. వయసు 16 సంవత్సరాలు నిండి ఉండాలి. దీనిలో సెక్షన్-ఎ, సెక్షన్-బి విభాగాలు ఉంటాయి. సబ్జెక్టుల్లో మెకానికల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ మొదలైనవి ఉన్నాయి. రెండు సెక్షన్‌లలో అర్హత పొందితే అసోసియేట్ మెంబర్‌షిప్‌కు హాజరయ్యే అవకాశం లభిస్తుంది.

అసోసియేట్ మెంబర్‌షిప్: దీన్నే డిగ్రీ లెవెల్ ఎగ్జామినేషన్ అని కూడా పిలుస్తారు. స్టూడెంట్ మెంబర్‌షిప్ అర్హతతో పాటు వయసు 18 సంవత్సరాలు నిండిన వారికి ఈ మెంబర్‌షిప్ ఇస్తారు.

ఇక్కడకూడా సెక్షన్-ఎ,సెక్షన్-బి విభాగాలు ఉంటాయి. అన్ని సబ్జెక్టుల్లో అర్హత సాధించడంతోపాటు ప్రాజెక్టు రిపోర్టు సకాలంలో పూర్తిచేసినవారికి 'అసోసియేట్ మెంబర్‌షిప్' లభిస్తుంది.

వెబ్‌సైట్: www.imeindia.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్

ఇంజినీరింగ్‌లో మెటలర్జికల్ ఇంజినీరింగ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రంగంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెటలర్జికల్ ఇంజినీరింగ్ నిపుణులను తీర్చిదిద్దడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ కృషి చేస్తోంది. కోల్‌కతా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ సంస్థ అందించే ఇంజినీరింగ్ డిగ్రీ, రెగ్యులర్ విధానంలో దేశ, విదేశీ యూనివర్సిటీలు నిర్వహించే మెటలర్జికల్ ఇంజినీరింగ్ డిగ్రీతో సమానమైందిగా గుర్తింపు పొందింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సులో చేరవచ్చు.

వెబ్‌సైట్: www.iim-india.net
 

ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) 

దేశ సాంకేతిక అవసరాలకు తగిన విధంగా ప్రతిభావంతులైన ఇంజినీర్లను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏర్పడిన సంస్థే 'ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్'. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే సమర్థులైన ఇంజినీర్లను అందించేందుకు కృషి చేస్తున్న ఈ సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. దేశం సాంకేతికంగా పురోభివృద్ధి చెందాలంటే ఇంజినీరింగ్ నిపుణుల కొరత నివారించాలని ఇండస్ట్రియల్ కమిషన్ 1916లో సిఫార్సు చేసింది. దీనికి అనుగుణంగా 1920లో కోల్‌కతాకు చెందిన థామస్ హాలెండ్ కృషి చేశారు. ఫలితంగా 1920లో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) రూపుదాల్చింది. సంస్థ సభ్యులను 'ఛార్టర్ ఇంజినీర్‌'గా పిలుస్తారు. ఈ సంస్థకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 103 బ్రాంచీలున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ముఖ్య సమాచార కేంద్రం ఉంది. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, కడప, కాకినాడ పట్టణాల్లో ప్రాంతీయ కేంద్రాలున్నాయి.అందిస్తున్న డిగ్రీ: ఏఎంఐఈ (అసోసియేట్ మెంబర్‌షిప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్). ఈ డిగ్రీ నాన్-ఫార్మల్ విధానంలో ఇంజినీరింగ్ డిగ్రీతో సమానం. మొత్తం 14 బ్రాంచీల్లో ఏఎంఐఈని అందిస్తోంది. అవి...

1) మెకానికల్

2) ఎలక్ట్రికల్

3) సివిల్

4) మెటలర్జీ

5) కెమికల్

6) ఆర్కిటెక్చర్

7) టెలికమ్యూనికేషన్స్

8) టెక్స్‌టైల్స్

9) అగ్రికల్చర్

10) కంప్యూటర్స్

11) ఏరోస్పేస్

12) ప్రొడక్షన్

13) మెరైన్

14) ఎన్విరాన్‌మెంటల్.
 

టెక్నీషియన్ మెంబర్‌తో కెరీర్ ప్రారంభం: సంస్థలో మొదట మెంబర్‌షిప్ పొందిన వారిని 'టెక్నీషియన్ మెంబర్ పేరుతో పిలుస్తారు. కోర్సు విధానం: ఇందులో సెక్షన్-ఎ, సెక్షన్-బి ఉంటాయి.

సెక్షన్ - ఎ: దీనికి నాన్ -డిప్లొమా, డిప్లొమా విద్యార్థులు అర్హులు. నాన్- డిప్లొమా విభాగానికి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్లో సగటున 45 శాతం మార్కులు ఉండాలి. డిప్లొమా విభాగానికి పాలిటెక్నిక్ తత్సమాన డిప్లొమా అవసరం. వయసు 18 సంవత్సరాలు ఉండాలి.

సెక్షన్-ఎలో 10 సబ్జెక్టులుంటాయి. ఒక్కో సబ్జెక్టులో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు రావాలి. తర్వాత గైడ్ పర్యవేక్షణలో ప్రాక్టికల్ శిక్షణ పొందాల్సి ఉంటుంది. దీనికోసం ఇన్‌స్టిట్యూషన్ గుర్తించిన వారిలో ఒకరిని రిఫరీగా ఎంచుకోవాలి. ఇక్కడ అభ్యర్థి ప్రతివారం రిఫరీ పర్యవేక్షణలో అసైన్‌మెంట్లు, ప్రాజెక్టు వర్కును పూరిచేయాలి. తర్వాత సెక్షన్-బి రాసేందుకు అనుమతి లభిస్తుంది.

పరీక్ష విధానం కఠినతరం: ఈ సంస్థ నిర్వహించే పరీక్షల నిర్వహణ విధానం సాధారణ పరీక్షల మాదిరి ఉండదు. అకడమిక్ సబ్జెక్టు నిపుణులతోపాటు ఇండస్ట్రీ నిపుణులు కూడా సహకరిస్తారు. వీరు ఎంపిక చేసిన ప్రొఫెసర్లు ప్రతి సబ్జెక్టు మీద ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు. తర్వాత వీటిని కంప్యూటర్లో ఫీడ్ చేసి ర్యాండమ్‌గా వచ్చిన ప్రశ్నలతో చివరి ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు.

సెక్షన్-బి: ఇందులో అభ్యర్థి తనకు నచ్చిన పేపర్లను ఎంపిక చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ కాలేజీల్లో మాదిరి కోర్సులో చేరేటప్పుడే బ్రాంచీలను ఎంపిక చేసుకోవాల్సిన అవసరంలేదు. సెక్షన్-ఎ పూర్తి చేసిన తర్వాత జాబ్ మార్కెట్లో ఏ బ్రాంచీకి ఎక్కువ డిమాండ్ లభిస్తోందో దానికి తగిన విధంగా బ్రాంచీని ఎంపిక చేసుకోవచ్చు. కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు 'గ్రాడ్యుయేట్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్' (ఇండియా) సర్టిఫికెట్ 'ప్రదానం చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో చేయవచ్చు

వెబ్‌సైట్: www.ieindia.org
 

చక్కటి భవిష్యత్తు

ఆర్థిక స్థోమత లేక ఇంజినీరింగ్ చేయలేకపోయిన వారికి ఏఎంఐఈ చక్కటి భవిష్యత్తుకు ఊతమిస్తోంది. అంతేకాదు ఇంజినీరింగ్ మధ్యలోనే ఆపేసి వివిధ సాంకేతిక రంగాల్లో స్థిరపడి తిరిగి ఇంజినీరింగ్ చదవాలనే వారికి కూడా ఈ కోర్సు ఎంతో ఉపయోగకరం. వర్కింగ్ ఇంజినీర్లు తమ వృత్తిలో అభివృద్ధి చెందడానికి ఈ కోర్సు ఒక ప్రధాన అర్హతగా నిలుస్తోంది. ఇంటర్ పూర్తి చేసినవారు కూడా రెగ్యులర్ ఇంజినీరింగ్‌కాలేజీలో ఇంజినీరింగ్ చేరలేకపోయినా, ఏఎంఐఈ చదివితే వీరుకూడా రెగ్యులర్ బీఈ/ బీటెక్ చేసినట్లే. కాబట్టి విద్యార్థులు ఉన్నత విద్యార్జనకు, ప్రస్తుతం ఇంజినీరింగ్ సంబంధిత రంగాల్లో పనిచేస్తున్నవారు ఉన్నత స్థితికి ఏఎంఐఈ చేయడం మంచిదే.

బీఈ, బీటెక్‌తో సమాన గుర్తింపు

ఇంజినీరింగ్ కోర్సులను రెగ్యులర్‌గా చేస్తేనే కాదు ఈ సంస్థలు నిర్వహిస్తున్న డిగ్రీలకు కూడా ప్రభుత్వ గుర్తింపు ఉంది. రోజువారీ క్లాసులు లేకపోయినా, ప్రాక్టికల్స్ విషయంలో ఏమాత్రం వెనక్కుతగ్గని ఈ సంస్థలు అందిస్తున్న ఇంజినీరింగ్ డిగ్రీకి మంచి గుర్తింపు ఉంది. ఈ కోర్సులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు దేశంలోని అన్ని రకాల యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలుగుర్తించాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేయవచ్చు. ఒకవేళ ఇప్పటికే ఏదైనా ఇంజినీరింగ్ రంగంలో ఉంటే పదోన్నతులకు, ఇతర ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలకు ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది

Posted Date: 02-11-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌