• facebook
  • whatsapp
  • telegram

సృజనకు చిరునామా... ఫైన్‌ ఆర్ట్స్‌

ఇంటర్‌ తర్వాత

 

 

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్న విద్యార్థుల ముందున్న ఉమ్మడి అవకాశాల్లో లలిత కళలు (ఫైన్‌ ఆర్ట్స్‌) ఒకటి. కళాత్మక అభిరుచి, ప్రాథమిక నైపుణ్యం, సృజన ఉన్నవారు ఈ కోర్సుల్లో చేరి రాణించవచ్చు. శిలను శిల్పంగా మార్చడంలో.. ప్రకృతి అందాలను ఫొటో ఫ్రేముల్లో బంధించడంలో.. ఆకర్షణీయ ఆకృతులు రూపొందించడంలో... ఊహలను సాక్షాత్కరింప జేయడంలో ప్రతిభను మెరుగుపరచుకోవడానికి ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులు దోహదపడతాయి. 

 

మనసులోని ఊహలకు ఆకర్షణీయమైన రూపాన్ని ఇవ్వడమే ఫైన్‌ ఆర్ట్స్‌. ఈ లలిత కళా కోర్సులను అండర్‌గ్రాడ్యుయేషన్‌లో భాగంగా చదువుకోవచ్చు. ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపులవారికీ వీటిలో చేరే అవకాశం ఉంటుంది. సాధారణ డిగ్రీల మాదిరి మూడేళ్లు కాకుండా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ) కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. పరిమిత సంస్థలు బీఏ ఫైన్‌ ఆర్ట్స్‌ పేరుతో మూడేళ్ల వ్యవధితోనూ కోర్సులు నడుపుతున్నాయి. చాలా విశ్వవిద్యాలయాలు తమ ప్రాంగణాల్లోనే ఈ యూజీ కోర్సులు అందిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగాలను నెలకొల్పాయి. వాటిలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు బోధిస్తున్నాయి. రాత పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థల్లో ఇంటర్‌ మార్కుల మెరిట్‌తో చేరే అవకాశమూ ఉంది. 

 

యూజీ కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత పీజీ దిశగా అడుగులేయవచ్చు లేదా ఉపాధి ప్రయత్నాలూ చేసుకోవచ్చు. సంబంధిత విభాగాల్లో స్పెషలైజేషన్‌ చేయాలనుకున్నవారు ఉన్నత విద్యలో చేరి, నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. ఫైన్‌ ఆర్ట్స్‌ చదువులను జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో వివిధ సంస్థలు అందిస్తున్నాయి. కొన్ని చోట్ల సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులూ ఉన్నాయి. అయితే మేటి అవకాశాలు పొందడానికి కనీసం బ్యాచిలర్‌ స్థాయి చదువులైనా పూర్తిచేయాల్సి ఉంటుంది. అనంతరం స్వయం ఉపాధి, ఫ్రీలాన్సింగ్‌ దిశగా అడుగులేయవచ్చు. 

 

బీఎఫ్‌ఏ 

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ)లో అప్లయిడ్‌ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్‌చర్, ఫొటోగ్రఫీ,...తదితర కోర్సులను తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. వీటి కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీని నెలకొల్పారు. కొన్ని సంస్థలు పాటరీ అండ్‌ సిరామిక్స్, టెక్స్‌టైల్‌ డిజైన్‌ కోర్సులను ఫైన్‌ ఆర్ట్స్‌లో భాగంగా యూజీ స్థాయిలో అందిస్తున్నాయి. ఈ తరహా చదువులపై ఆసక్తి ఉన్నవారు బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, విశ్వభారతి, రవీంద్ర భారతి విశ్వవిద్యాలయాల్లో చేరవచ్చు. ఆయా సంస్థలను బట్టి ఫైన్‌ ఆర్ట్స్‌ లేదా విజువల్‌ ఆర్ట్స్‌ పేరుతో వీటిని నడుపుతున్నారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), తిరుపతి ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రెడిషనల్‌ స్కల్ప్‌చర్‌ ఆర్కిటెక్చర్‌ సంస్థ ప్రత్యేకంగా దేవతామూర్తుల విగ్రహాలు, బొమ్మల తయారీలో శిక్షణ అందిస్తుంది. ఇక్కడ శిక్షణ పొందినవారు దేవాలయాలకు కావాల్సిన ఆకృతులు అందించవచ్చు. పదో తరగతి విద్యార్హతతో స్టోన్, ఉడ్, సిమెంట్, మెటల్‌ స్కల్ప్‌చర్‌ కోర్సులను డిప్లొమాలో భాగంగా ఇక్కడ చదువుకోవచ్చు. రాతపరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి. చదువు, వసతి, భోజనం ఉచితంగా అందిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత టీటీడీ నుంచి ఉపాధినీ ఆశించవచ్చు. వీరు తెలుగు విశ్వవిద్యాలయం అందించే బీఎఫ్‌ఏ కోర్సులోనూ చేరవచ్చు.  

 

ఉన్నత విద్య

బీఎఫ్‌ఏ అనంతరం రెండేళ్ల వ్యవధితో ఎంఎఫ్‌ఏ కోర్సుల్లో చేరవచ్చు. ఫైన్‌ ఆర్ట్స్, విజువల్‌ ఆర్ట్స్, పెయింటింగ్, ప్రింట్‌ మేకింగ్, స్కల్ప్‌చర్, ఆర్ట్‌ హిస్టరీ అండ్‌ విజువల్‌ స్టడీస్, అప్లయిడ్‌ ఆర్ట్స్, ప్లాస్టిక్‌ ఆర్ట్స్, పోటరీ అండ్‌ సిరామిక్స్, టెక్స్‌టైల్‌ డిజైన్‌..తదితర కోర్సులు పీజీలో అందిస్తున్నారు. ఫైన్‌ ఆర్ట్స్‌లో యూజీ చదువులు అందిస్తోన్న సంస్థలన్నీ దాదాపు పీజీ, పీహెచ్‌డీ కోర్సులను నడుపుతున్నాయి. కొన్ని సంస్థల్లో యూజీ లేనప్పటికీ పీజీ స్థాయిలో ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులు ఉన్నాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో కోర్సులు నడుపుతోంది. ఎంఎఫ్‌ఎ అనంతరం నేరుగా పీహెచ్‌డీ కోర్సులు పూర్తిచేసుకోవచ్చు. బోధన రంగంలో సేవలందించాలని ఆశించేవారికి పీహెచ్‌డీ ఉపయోగపడుతుంది.

 

అవకాశాలు 

కళలకు ఆదరణ ఉన్నంతవరకు ఫైన్‌ ఆర్ట్స్‌కి ఢోకాలేదనే చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న విభిన్న రకాల విగ్రహాలు, ఆకృతులు శిల్పకళా నిపుణులు రూపొందించినవే. వీటిని లోహం, మట్టి, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్, చెక్క...మొదలైనవాటితో తయారుచేస్తారు. ఇప్పుడు పెద్దఎత్తున విగ్రహాలు తయారు చేస్తున్నారు. అందువల్ల స్కల్ప్‌చర్‌ కోర్సు పూర్తిచేసుకున్నవారి ఉపాధికి ఢోకాలేదనే చెప్పుకోవచ్చు. వివిధ కళాకృతులు, చిత్రాలను అప్లయిడ్‌ ఆర్ట్స్, పెయింటింగ్‌ నిపుణులు రూపొందిస్తారు. 

స్వయం ఉపాధికీ, ఏదైనా సంస్థలో పని చేసుకోవడానికి ఫైన్‌ చదువులు ఉపయోగపడతాయి. చదువుకున్న విభాగాన్ని బట్టి సాఫ్ట్‌వేర్, బహుళ జాతి సంస్థల్లోనూ వీరికి కొలువులు లభిస్తాయి. ఆర్ట్‌ స్టూడియోలు, అడ్వర్టైజింగ్‌ కంపెనీలు, గ్రాఫిక్, ప్రింటింగ్, పబ్లిషింగ్, ఫ్యాషన్‌ సంస్థలు, ఎల్రక్టానిక్‌ ఇండస్ట్రీ, టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ, ఫిల్మ్‌ అండ్‌ థియేటర్, మల్టీ మీడియా, యానిమేషన్‌...తదితర సంస్థల్లో అవకాశాలు పొందవచ్చు. ఆర్ట్‌ గ్యాలరీల్లో వీరు తమ ప్రతిభను చాటవచ్చు. టెక్స్‌టైల్‌ కోర్సులు చదివినవారు వస్త్ర పరిశ్రమలో సేవలు అందించవచ్చు. ఫొటోగ్రఫీ చేసినవారికి అన్ని చోట్లా అవకాశాలు ఉంటాయి. చాలామంది ఫ్రీలాన్సింగ్, స్వయం ఉపాధి (వర్క్‌షాపు నడపడం) ద్వారా పెద్దమొత్తంలో సంపాదిస్తున్నారు. ఎండోమెంట్, ఆర్కియలాజికల్‌ విభాగాల్లో వీరికి ఉద్యోగాలు లభిస్తాయి.

 

ఏ సంస్థలో ఏ కోర్సులు?

జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌: బీఎఫ్‌ఏలో పెయింటింగ్, అప్లయిడ్‌ ఆర్ట్స్, స్కల్ప్‌చర్, ఫొటోగ్రఫీ, యానిమేషన్‌  

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీ, కడప: బీఎఫ్‌ఎలో భాగంగా పెయింటింగ్, అప్లయిడ్‌ ఆర్ట్స్, స్కల్ప్‌చర్, ఫొటోగ్రఫీ, యానిమేషన్‌ కోర్సులు 

ఉస్మానియా యూనివర్సిటీ: బీఎఫ్‌ఏ ఫొటోగ్రఫీ కోర్సును మూడేళ్ల వ్యవధితో అందిస్తోంది. ఈ విశ్వవిద్యాలయం పెయింటింగ్, అప్లయిడ్‌ ఆర్ట్స్‌ కోర్సులను బీఎఫ్‌ఏలో భాగంగా అయిదేళ్ల వ్యవధితో పదో తరగతి అర్హతతో నడుపుతోంది. 

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం: స్కల్ప్‌చర్, పెయింటింగ్, ప్రింట్‌ మేకింగ్‌ కోర్సులు  

ఆంధ్రా యూనివర్సిటీ: నాలుగేళ్ల వ్యవధితో పెయింటింగ్, స్కల్ప్‌చర్‌ కోర్సులు  

కేఎల్‌ యూనివర్సిటీ: పెయింటింగ్, స్కల్ప్‌చర్, యానిమేషన్‌ అండ్‌ వీఎఫ్‌ఎక్స్, డిజిటల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌లో బ్యాచిలర్‌ కోర్సులను ఫైన్‌ ఆర్ట్స్‌లో భాగంగా అందిస్తోంది. 

రవీంద్ర భారతీ యూనివర్సిటీ:  రవీంద్ర సంగీత్, వోకల్‌ మ్యూజిక్, డ్యాన్స్, డ్రామా, ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌ కోర్సులను బీఏలో మూడేళ్ల వ్యవధితో అందిస్తోంది. ఇదే సంస్థ విజువల్‌ ఆర్ట్స్‌లో నాలుగేళ్ల వ్యవధితో పెయింటింగ్, స్కల్ప్‌చర్, గ్రాఫిక్స్‌ (ప్రింట్‌ మేకింగ్‌), అప్లయిడ్‌ ఆర్ట్, హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్‌ కోర్సులను బీఎఫ్‌ఏలో అందిస్తోంది. 

బెనారస్‌ హిందూ యూనివర్సిటీ: పెయింటింగ్, టెక్స్‌టైల్‌ డిజైన్, ప్లాస్టిక్‌ ఆర్ట్స్, పోటరీ అండ్‌ సిరామిక్స్, అప్లయిడ్‌ ఆర్ట్స్‌ కోర్సులను నాలుగేళ్ల వ్యవధితో యూజీలో అందిస్తోంది. ఇవే కోర్సులు పీజీలోనూ ఉన్నాయి.

విశ్వభారతీ యూనివర్సిటీ: అయిదేళ్ల వ్యవధితో పదో తరగతి విద్యార్హతతో బీఎఫ్‌ఏలో పెయింటింగ్, మ్యూరల్, స్కల్ప్‌చర్, గ్రాఫిక్‌ ఆర్ట్, డిజైన్‌ (టెక్స్‌టైల్‌/ సిరామిక్‌) కోర్సులు అందిస్తోంది. ఈ చదువుల్లో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తిచేసుకున్నవారి కోసం రెండేళ్ల వ్యవధితో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులు అందిస్తోంది. ఇంటర్‌ విద్యార్హతతో బీఎఫ్‌ఏలో భాగంగా హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్‌ కోర్సు చదువుకోవచ్చు.   

ఎంఐటీ ఏడీటీ యూనివర్సిటీ, పుణె: ఈ సంస్థ బీఎఫ్‌ఏలో అప్లయిడ్‌ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్‌చర్, సిరామిక్స్, మెటల్‌ వర్క్స్‌ కోర్సులను అందిస్తోంది. వీటిలో పెయింటింగ్‌ మూడేళ్లు, మిగిలినవి నాలుగేళ్ల వ్యవధి. ఈ కోర్సులను పీజీలోనూ చదువుకోవచ్చు. 

జామియా మిల్లియా ఇస్లామియా: ఈ కేంద్రీయ సంస్థ అప్లయిడ్‌ ఆర్ట్, ఆర్ట్‌ ఎడ్యుకేషన్, పెయింటింగ్, స్కల్ప్‌చర్‌ కోర్సులను యూజీ, పీజీ స్థాయుల్లో నడుపుతోంది. 

జేజే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఆర్ట్స్‌: నాలుగేళ్ల అప్లయిడ్‌ ఆర్ట్స్‌. 

గోవా కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌: అప్లయిడ్‌ ఆర్ట్, పెయింటింగ్‌.

లక్నో, అలహాబాద్, పట్నా యూనివర్సిటీలు, సావిత్రీ భాయి ఫూలే పుణె యూనివర్సిటీ ఫైన్‌ ఆర్ట్స్‌ చదువులను అందిస్తున్నాయి.

Posted Date: 03-11-2021


 

ఇంటర్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌