• facebook
  • whatsapp
  • telegram

లలితకళారాధన కోర్సుల్లో!

ఫైన్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

 

 

కళలపై ఆసక్తి, సృజన ఉన్నవారు రాణించడానికి అవకాశమున్న కోర్సుల్లో లలిత కళలు (ఫైన్‌ ఆర్ట్స్‌) ముందుంటాయి. వీటిని బ్యాచిలర్‌ స్థాయిలో చాలా సంస్థలు అందిస్తున్నాయి. వాటిలో హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ ముఖ్యమైంది. ఈ సంస్థ తాజాగా పలు కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన వెలువరించింది. ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో సీట్లు కేటాయిస్తారు. 

అద్భుతమైన సృజన, కళాకృతితో కనువిందుచేసే నైపుణ్యం ఉన్నవారికి ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులు స్వాగతం పలుకుతున్నాయి. ఈ విభాగంలో యూజీ చదువులతోనే ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. మరింతగా రాణించాలనే ఆసక్తి ఉన్నవారు సంబంధిత పీజీ కోర్సుల్లో చేరవచ్చు. ఈ స్థాయిలో స్పెషలైజేషన్‌పై దృష్టి సారించడం వీలవుతుంది. 

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ) కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఎంఎఫ్‌ఏ) వ్యవధి రెండేళ్లు. స్వయం ఉపాధికి, ఏదైనా సంస్థలో పని చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. 

పూర్తిచేసుకున్న కోర్సు ప్రకారం వీరికి సాఫ్ట్‌వేర్, బహుళ జాతి సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఆర్ట్‌ స్టూడియోలు, అడ్వర్టైజింగ్‌ కంపెనీలు, గ్రాఫిక్, ప్రింటింగ్, పబ్లిషింగ్, ఫ్యాషన్‌ సంస్థలు, ఎలక్ట్రానిక్‌ ఇండస్ట్రీ, టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ, ఫిల్మ్‌ అండ్‌ థియేటర్, మల్టీ మీడియా, యానిమేషన్‌...తదితర సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ఆర్ట్‌ గ్యాలరీల్లో వీరు తమ ప్రతిభను చాటవచ్చు ఫొటోగ్రఫీ చేసినవారికి అన్ని చోట్లా అవకాశాలు ఉంటాయి. చాలామంది ఫ్రీలాన్సింగ్, స్వయం ఉపాధి (వర్క్‌ షాపు నడపడం) ద్వారా పెద్దమొత్తంలో సంపాదిస్తున్నారు. ఎండోమెంట్, ఆర్కియలాజికల్‌ విభాగాల్లోనూ వీరికి ఉద్యోగాలున్నాయి.

 

ఇవీ కోర్సులు

జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌.. బీఎఫ్‌ఏలో పెయింటింగ్, అప్లయిడ్‌ ఆర్ట్స్, స్కల్ప్‌చర్, ఫొటోగ్రఫీ, యానిమేషన్‌ కోర్సులు అందిస్తోంది. ప్రవేశపరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సుల్లోకి తీసుకుంటారు. సిలబస్‌ వివరాలు, మాదిరి ప్రశ్నపత్రం వెబ్‌సైట్‌లో ఉంచారు. వాటిద్వారా పరీక్ష, సన్నద్ధం కావాల్సిన అంశాలపై అవగాహనకు రావచ్చు. 

ఆఫ్‌లైన్‌లోనే అన్ని పరీక్షలూ ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. 

అప్లయిడ్‌ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్‌చర్‌ అండ్‌ యానిమేషన్‌ కోర్సులకు... 

పేపర్‌ ఎ: మెమరీ డ్రాయింగ్, కలరింగ్‌ విభాగాల్లో వంద మార్కులకు 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. ఈ విభాగంలో ఏదైనా అంశాన్ని ఇస్తారు. దానికి దృశ్య రూపాన్ని ఇవ్వాలి. ఎంత అందంగా గీశారు, నైపుణ్యం ఎలా ఉంది, ఉపయోగించిన రంగులు... మొదలైనవాటికి ప్రాధాన్యం ఉంటుంది. 

పేపర్‌ బి: ఆబ్జెక్టివ్‌ తరహాలో 50 మార్కులకు 50 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ఇందులో జీకే, కరెంట్‌ అఫైర్స్‌ 15, ఇంగ్లిష్‌ 15, జనరల్‌ ఆర్ట్‌ ఓరియంటెడ్‌ 20 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పేపర్‌ సి: ఆబ్జెక్టివ్‌ డ్రాయింగ్‌లో వంద మార్కులకు 90 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ఇందులో భాగంగా ఏదైనా వస్తువు లేదా బొమ్మ చూపుతారు. ఆ దృశ్యాన్ని పెన్సిల్‌తో గీసి దాని చుట్టూ పరిసరాలను ఊహించి వర్ణణాత్మక చిత్రాన్ని రూపొందించాలి. ఇందులో చిత్ర నైపుణ్యాలు, ఊహ, పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది. 

 

ఫొటోగ్రఫీ కోర్సుకు..

కంపోజిషన్‌ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌ వంద మార్కులకు 90 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ఇందులో డ్రాయింగ్, కంపోజిషన్‌ నైపుణ్యాలు పరిశీలిస్తారు. పెన్సిల్‌తో ఇచ్చిన చిత్రాలకు షేడ్‌లు ఇవ్వాలి. అలాగే అక్కడున్న చిత్రాలను క్రమ పద్ధతిలో అమర్చాలి. ఏదైనా అసంపూర్ణ దృశ్యం ఇచ్చి దాని చుట్టూ ఉండే అవసరమైన ఇతర అంశాలను అందులో చేర్చి తీర్చిదిద్దమంటారు. వీటన్నింటికీ పరీక్షలో ప్రాధాన్యం ఉంటుంది. అలాగే మరో ఆబ్జెక్టివ్‌ టైప్‌ పేపర్‌ 50 మార్కులకు 50 నిమిషాల వ్యవధితో ఇస్తారు. ఇందులో జీకే, కరెంట్‌ అఫైర్స్‌ 15, ఇంగ్లిష్‌ 15, జనరల్‌ ఆర్ట్‌ ఓరియంటెడ్‌ 20 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.  

అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణత.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 20

ఫీజు: రూ.1800 ఎస్సీ, ఎస్టీలకు రూ.900 

పరీక్ష తేదీలు: ఫొటోగ్రఫీ, ఇంటీరియర్‌ డిజైన్‌లకు జులై 2. అప్లయిడ్‌ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్‌చర్, యానిమేషన్‌లకు జులై 3. 

వెబ్‌సైట్‌: https://jnafauadmissions.com

 

ఇంటీరియర్‌ డిజైన్‌లోనూ...

ఈ సంస్థ బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌లో భాగంగా ఇంటీరియర్‌ డిజైన్‌ కోర్సు నడుపుతోంది. అందులోనూ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందుకోసం 200 మార్కులకు 3 గంటల వ్యవధితో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జీకే, కరెంట్‌ అఫైర్స్‌ 20, జనరల్‌ ఆర్ట్‌ 20, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ 50, ఇలస్ట్రేటివ్, ఎనలిటికల్‌ అండ్‌ డిజైన్‌ ఎబిలిటీ 50, మెమరీ డ్రాయింగ్‌ 30, కలర్‌ కోఆర్డినేషన్‌ 30 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.
 

Posted Date: 08-06-2022


 

ఇంటర్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌