• facebook
  • whatsapp
  • telegram

వైద్య వృత్తి... ఎప్పటికీ డిమాండే!

 

సమాజంలో వైద్య సేవలు అందించే వారికి ఉన్న గుర్తింపు ప్రత్యేకమైనది. ఒకనాడు వైద్య రంగం ఎక్కువగా సేవా రంగంలోనే ఉండేది. కాలం మారేకొద్దీ వైద్యం ఒక ఉదాత్తమైన వృత్తిగా గుర్తింపు పొందింది. వైద్య రంగం అంటే కేవలం మనుషులకు సంబంధించిన డాక్టర్ ఒక్కరే కాదు, పశువులు, పాడిపంటలు, ఆయుర్వేదం, ఫార్మసీ వంటి రంగాల్లో చికిత్సలు అందించే వారు కూడా డాక్టర్లుగానే గుర్తింపు పొందారు. సమాజంలో విశిష్టమైన స్థానాన్ని అలకరించిన వైద్య రంగంలో రాణించాలనే ఆసక్తి ఉన్న వారికి అనేక అవకాశాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం.   ఇంటర్ విద్యార్హతతో విలువైన వైద్య విద్యా కోర్సుల్లో చేరడం ద్వారా సమాజానికి సేవ చేశామనే తృప్తి, ఆర్థిక పురోగతి సాధ్యమవుతాయి.

 

ఎం.బి.బి.ఎస్.

బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ అనేది ఎం.బి.బి.ఎస్.కు సంక్షిప్త రూపం. ఈ డిగ్రీ చేసిన వారిని డాక్టర్‌గా గుర్తిస్తారు. ఈ కోర్సు కాల వ్యవధి నాలుగున్నర సంవత్సరాలు. ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేయాలి. ఇంటర్‌లో బైపీసీ చదివినవారు ఈ కోర్సుకు అర్హులు. డాక్టర్లకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ కోర్సు చేసినవారు సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు లేదా ఆస్పత్రుల్లో వైద్యులుగా కెరీర్ ప్రారంభించవచ్చు.

 

బి.డి.ఎస్.

బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ (బి.డి.ఎస్.) సైన్స్ విద్యార్థుల రెండో ఆప్షన్‌గా ఉంటోంది. ఎంబీబీఎస్ సీట్లు లభించని పక్షంలో లేదా డెంటల్ సైన్స్ కెరీర్‌గా ఎంచుకోవాలనే ఆసక్తి ఉన్నవారు బి.డి.ఎస్. వైపు అడుగేస్తున్నారు. కోర్సు కాల వ్యవధి 5 సంవత్సరాలు (ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేయాలి).

డెంటిస్ట్రీలో ఆర్థోడెంటిక్స్, డెంటో-ఫేషియల్ ఆర్థోపిడిక్స్, డెంటల్ పబ్లిక్ హెల్త్ ఎండోడెంటిక్స్, ఆర్థోపిడిక్స్, పీరియాడెంటిక్స్ తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఎం.డి.ఎస్. చేస్తే అధిక అవకాశాలు ఉంటాయి.

 

బీవీఎస్సీ అండ్ఏహెచ్ 

దీని పూర్తి రూపం - బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ అండ్ యానిమల్ హజ్‌బెండరీ. ఈ కోర్సు కాల వ్యవధి 5 సంవత్సరాలు. పశువైద్య విద్యను మనదేశంలో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తోంది. ఈ కోర్సు చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటే ఎంవీఎస్సీ (మాస్టర్ ఇన్ వెటర్నరీ సైన్స్) చేయవచ్చు.

 

బీహెచ్ఎంఎస్

బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అనేది దీని పూర్తిరూపం. కోర్సు కాల వ్యవధి 5 ఏళ్లు. (ఫైనల్ డిగ్రీ తర్వాత ఏడాదిపాటు చేసే ఇంటర్న్‌షిప్‌తో కలిపి). జర్మనీకి చెందిన క్రిస్టియన్ శామ్యూల్ హానెమన్ ఈ వైద్యానికి ఆద్యుడు. ఇటీవల హోమియోపతిక్ మెడిసిన్‌కు ఆదరణ అధికమైంది. ఉపయోగం చాలా సులువుగా ఉండటం, ఆపరేషన్ల లాంటి వాటి జోలికి వెళ్లకుండా కేవలం మెడిసిన్ వాడటం ద్వారా వ్యాధి మూలాలను నివారించే అవకాశం ఉండటంతో అధిక శాతం ప్రజలు హోమియోపతి వైపు దృష్టి సారిస్తున్నారు. 19వ శతాబ్ద తొలినాళ్లలో అమెరికాలో ఈ సబ్జెక్టును వైద్య విద్యలో ఒక పాఠ్య ప్రణాళికగా ప్రవేశపెట్టారు. 1881లో మనదేశంలో కోల్‌కతాలో హోమియోపతిక్ విద్యా సంస్థ ఏర్పాటైంది.

దీన్లో ఉన్నతస్థితికి చేరుకోవాలని ఆసక్తి ఉంటే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి ఆమోదించిన డిగ్రీ, పీజీ కోర్సులు చదవాల్సి ఉంటుంది. డిగ్రీ తర్వాత చేయదగిన పీజీ కోర్సు: ఎం.డి. (హోమియోపతి మూడేళ్లు).

 

తెలుగు రాష్ట్రాల్లో హోమియోపతి కళాశాలలు

1. జె.ఎస్.పి.ఎస్. గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్, హైదరాబాద్.

2. డాక్టర్ గురురాజ్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్, గుడివాడ.

3. డాక్టర్ అల్లు రామలింగయ్య గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్, రాజమండ్రి.

4. గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్, కడప.

5. మహారాజా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి సైన్సెస్, విజయనగరం.

 

నేచురోపతి ( బీఎన్‌వైఎస్) 

బీఎన్‌వైఎస్ పూర్తిరూపం - బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్స్. నేచురోపతిగా అందరికీ తెలిసిన ఈ కోర్సు కాల వ్యవధి 5 సంవత్సరాలు (ఏడాది ఇంటర్న్‌షిప్‌తో కలిపి). మూలికలు, ఇతర వనరుల ఆధారంగా చికిత్సలు చేసే విధానం నేచురోపతి. ప్రకృతిలో లభిస్తున్న వివిధ మూలికలు, వాటివల్ల కలిగే ప్రయోజనాలు తదితర అంశాల గురించి ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. నేచురోపతిక్ ప్రాక్టీషనర్ సర్జరీతో పనిలేకుండా వ్యాధిని ఎలా నివారించాలో ఈ కోర్సు ద్వారా నేర్చుకుంటారు. ఏ ఫలాలు తింటే ఎలాంటి వ్యాధులు తగ్గుతాయి, ప్రకృతి చికిత్సల్లో అనుసరించాల్సిన విధానాలేమిటి మొదలైన అంశాలు నేర్చుకోవచ్చు. క్రమపద్ధతిలో ఆవిరి స్నానం, పండ్ల రసాలను తాగించడం తదితరాల గురించి తెలుసుకోవచ్చు.

 

ఈ కోర్సును అందిస్తున్న కాలేజీలు

1) గాంధీ నేచర్ క్యూర్ కాలేజ్, హైదరాబాద్ (గవర్నమెంట్).

2) నారాయణ నేచర్ క్యూర్ కాలేజ్, నెల్లూరు (ప్రైవేటు).

 

ఫార్మసీ కోర్సులు 

ఫార్మసీ రంగంలో ప్రవేశించాలనుకునే వారికి కింది కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

1) డిప్లొమా ఇన్ ఫార్మసీ (బైపీసీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి).

2) బీ ఫార్మసీ (బైపీసీ/ ఎంపీసీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత).

3) డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫార్మా -డి) (బైపీసీ/ ఎంపీసీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత).

4) బీ ఫార్మసీ తర్వాత 3 సంవత్సరాల పోస్ట్ బ్యాచ్‌లర్ ఫార్మా డి. ఇది ఎంఫార్మసీతో సమానం).

 

ఫార్మా - డి ( డాక్టర్ ఆఫ్ ఫార్మసీ)

ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సే ఫార్మా-డి. 2008లో ఫార్మా-డి కోర్సును ప్రారంభించారు. కాల వ్యవధి 6 సంవత్సరాలు. మూడేళ్లు కాలేజీలో చదవాల్సి ఉంటుంది. తర్వాత రెండు సంవత్సరాలు ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో ఇంటర్న్‌షిప్ చేయాలి. చివరి సంవత్సరం పరిశోధన కార్యక్రమాలుంటాయి. దేశంలో 25కు పైగా కాలేజీల్లో ఈ కోర్సు ఉంది. మొదట ఆంధ్రప్రదేశ్‌లో 15 కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. ఒక్కో కాలేజీకి 30 సీట్లు మాత్రమే కేటాయించారు. వీటిలో 50 శాతం సీట్లను ఎం.పి.సి. విద్యార్థులకు, మరో 50 శాతం సీట్లను బై.పి.సి. విద్యార్థులకు ఇస్తారు. ఎంసెట్ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి. కార్పొరేట్ కంపెనీలు ఫార్మసీ రంగంలోకి ప్రవేశిస్తున్న నేటి తరుణంలో ఈ కోర్సు చేయడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది.

 

బి-ఫార్మసీ (బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ) 

మెడికల్ షాపు నిర్వహించాలంటే బీ ఫార్మసీ లేదా డీ ఫార్మసీ కోర్సు చేసి ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. దీన్ని ఇటీవల కచ్చితంగా అమలయ్యేలా చూస్తున్నారు. తగిన అర్హతలు లేనివారు మెడికల్ షాపులో పనిచేస్తే డాక్టర్ సూచించిన మందులకు బదులు వేరేవి ఇచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులు తలెత్త్తకుండా బి-ఫార్మసీ కోర్సు చేసినవారిని మాత్రమే మెడికల్ షాపులు నిర్వహించేలా చూడాలనేది నిపుణుల అభిప్రాయం. అందుకోసమే ఈ కోర్సును నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారు. ఈ కోర్సు చేసినవారిని ఫార్మాసిస్టులు అంటారు. బి.ఫార్మసీ అనేది కేవలం మందులు ఇవ్వడానికే కాదు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో అవసరమైన నిపుణులను అందించేందుకు ఉపయోగపడుతుంది. కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలు.

 

బీఏఎంఎస్

బీఏఎంఎస్ అంటే.. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. ఈ కోర్సుల కాల వ్యవధి 5 సంవత్సరాలు. ఆయుర్వేదం ఈనాటిది కాదు. వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. ముఖ్యంగా భారతదేశం ఆయుర్వేద వైద్య విద్యకు పెట్టింది పేరు. ఔషధ మొక్కలు వాటి విలువలు తెలియజేసే వైద్యవిధానమే ఆయుర్వేదం. ఈ కోర్సులు చేయడం ద్వారా సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. లేదా ఆయుర్వేద డాక్టర్లుగా కెరీర్ ప్రారంభించవచ్చు.ఉన్నత విద్య కోసం ఎం.డి.ఆయుర్వేదం చేయవచ్చు.

 

ఆయుర్వేద డిగ్రీ కాలేజీలు

1. డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్, హైదరాబాద్.

2. డాక్టర్ ఎన్.ఆర్.ఎస్.గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్, విజయవాడ.

3. ఎ.ఎల్. గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్, వరంగల్.

4. ఎస్.వి. ఆయుర్వేదిక్ కాలేజ్, తిరుపతి.

5. ఎం.ఎన్.ఆర్. ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, సంగారెడ్డి.

6. వాగ్దేవి ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, వరంగల్.

7. వాగీశ్వరి ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, కరీంనగర్.

 

ఉద్యోగాలు

ఉత్తమమైన, ఉన్నతమైన వైద్య రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ వృత్తి క్లర్క్, మేనేజర్, ఆఫీసర్ లాంటి రెగ్యులర్ వృత్తులకు భిన్నమైంది. డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించినవారు రోగులకు సేవ చేయడం ద్వారా ప్రజా సేవలో పాల్గొన్న సంతృప్తిని పొందవచ్చు. ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందవచ్చు. ప్రజల్లో మంచి గౌరవం లభిస్తుంది. మెడికల్ కోర్సులు చేసిన వారిలో ఎక్కువ శాతం సొంతంగా ప్రాక్టీస్ పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. డాక్టర్‌గా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరవచ్చు. రైల్వేలు, బ్యాంకులు, హాస్పిటల్స్‌లో కూడా చేరవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్లు, ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు కూడా హాజరు కావచ్చు.

Posted Date: 27-03-2021


 

ఇంటర్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌