• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌తోనే రక్షణ కొలువులు

నేవీలో సెయిలర్లు, ఎయిర్‌ఫోర్స్‌ ఎయిర్‌మెన్‌ పోస్టుల భర్తీకి ఏటా ప్రకటనలు వెలువడతాయి. ఇంటర్‌ విద్యార్హతతో వీటికి పోటీపడవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. వాయుసేన, నౌకాదళం ఏ విభాగానికి ఎంపికైనప్పటికీ లెవెల్‌-3 ప్రారంభవేతనాలు అందుకోవచ్చు.

రక్షణదళాల్లో ప్రవేశం పొందగలిగితే భవిత అద్భుతంగా మారిపోతుంది. చిన్నవయసులోనే ఆకర్షణీయమైన కెరియర్‌ను సొంతం చేసుకోవచ్చు. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో తాజా ప్రకటనలు ఇంటర్మీడియట్‌ అర్హత ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం. ఆసక్తి ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకుని, పూర్తిస్థాయిలో సంసిద్ధమవ్వాలి. పరిజ్ఞానపరంగా, శారీరక దార్ధ్యతపరంగా ఉత్తమ ప్రతిభ చూపితే ఉద్యోగ పోటీలో ముందువరసలో నిలవొచ్చు.

నేవీలో సెయిల‌ ఉద్యోగాలు

విద్యార్హత: ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌ల్లో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. ఆర్టిఫీషర్‌ అప్రెంటిస్‌ పోస్టులకు ఈ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ఈ రెండు పోస్టులకూ కేవలం పురుష అభ్యర్థులే అర్హులు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టు (పీఎఫ్‌టీ), మెడికల్‌ టెస్టుల ద్వారా.

పరీక్ష ఇలా...

ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. రుణాత్మక మార్కులున్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. ప్రశ్నపత్రంలో 4 సెక్షన్లు ఉంటాయి. అవి ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, సైన్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌. ప్రశ్నలన్నీ 10+2 (ఇంటర్మీడియట్‌) స్థాయిలోనే ఉంటాయి. సిలబస్‌ వివరాలు నేవీ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. పరీక్ష వ్యవధి గంట. అన్ని సెక్షన్లలోనూ కనీస అర్హత మార్కులు సాధించాలి. నిర్ణీత సగటు కంటే ఎక్కువ స్కోర్‌ ఉన్నవారిని తర్వాత దశకు తీసుకుంటారు.

ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టు (పీఎఫ్‌టీ)

రాత పరీక్షలో ఉత్తీర్ణులకు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో పరుగెత్తాలి. 20 సిట్‌అప్స్‌, 10 పుష్‌అప్స్‌ తీయగలగాలి. క్రీడలు, ఈతలో ప్రావీణ్యం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. ఫిజికల్‌ టెస్టులో అర్హత సాధించినవారికి మెడికల్‌ టెస్టులు నిర్వహిస్తారు. అభ్యర్థులు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.

శిక్షణ.. ఉద్యోగం..

ఏఏ పోస్టుకు ఎంపికైనవారికి 9, ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టుకైతే 22 వారాలపాటు చిలక సరస్సులో శిక్షణ కొనసాగుతుంది. అనంతరం అభ్యర్థులకు కేటాయించిన బ్రాంచ్‌/ ట్రేడ్‌ల్లో ఏదైనా నేవీ శిక్షణ కేంద్రంలో తర్వాత దశ శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో రూ.14600 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా ప్రొఫెషనల్‌ శిక్షణను పూర్తిచేసుకున్నవారిని సైలర్‌ - ఏఏ / ఎస్‌ఎస్‌ఆర్‌ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. విధుల్లో చేరినవారికి రూ. 21700-69100 వేతన శ్రేణితో జీతం లభిస్తుంది. దీంతోపాటు మిలిటరీ సర్వీస్‌ పే రూ.5200, గ్రూప్‌-ఎక్స్‌ పే రూ.6200 (ఏఏ పోస్టులకు), డీఏ ప్రతినెలా లభిస్తాయి. అన్ని ప్రోత్సాహకాలూ కలుపుకుని ఎస్‌ఎస్‌ఆర్‌లు ప్రారంభంలోనే రూ.35 వేలు, ఏఏలు రూ.42 వేల వరకు వేతన రూపంలో పొందవచ్చు. ఏఏకు ఎంపికైనవారు 20 సంవత్సరాలు, ఎస్‌ఎస్‌ఆర్‌లో చేరినవారు 15 ఏళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఆ తర్వాత అభ్యర్థుల ఆసక్తి, నేవీ అవసరాలకు అనుగుణంగా సర్వీస్‌ పొడిగిస్తారు. వ్యవధి తర్వాత పదవీ విరమణ చేసినవారికి పూర్తిస్థాయి పెన్షన్‌ జీవితాంతం లభిస్తుంది.మాస్టర్‌ చీఫ్‌ పెటీ ఆఫీసర్‌-1 హోదా వరకు చేరుకోవచ్చు.

ఎయిర్‌ ఫోర్స్‌లో ఎక్స్‌, వై ట్రేడులు

విద్యార్హత: గ్రూప్‌- ఎక్స్‌ ఉద్యోగాలకు ఇంటర్‌ / ప్లస్‌ 2 మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌లతో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. లేదా 50 శాతం మార్కులతో ఏదైనా మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసినవారు అర్హులే. గ్రూప్‌ - వై విభాగంలో ఇంటర్‌ ఏదైనా గ్రూప్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్‌ పోస్టులకు మాత్రం ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎక్స్‌, వై అన్ని పోస్టులకూ ఇంటర్‌/ డిప్లొమా ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ చదువుకున్న విద్యార్థులు ఎక్స్‌, వైల్లో నచ్చిన గ్రూప్‌ కోసం దరఖాస్తు చేసుకుని పరీక్ష రాసుకోవచ్చు లేదా రెండు గ్రూప్‌లకూ కలిపి నిర్వహించే పరీక్షనూ ఎంచుకోవచ్చు. డిప్లొమా వాళ్లు గ్రూప్‌ ఎక్స్‌ పోస్టులకే అర్హులు.

ఎంపిక విధానం: ఫేజ్‌ 1, ఫేజ్‌ -2 పరీక్షల ద్వారా.

ఫేజ్‌ -1 పరీక్ష ఇలా...

పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. గ్రూప్‌ ఎక్స్‌ ట్రేడ్‌ పరీక్ష వ్యవధి ఒక గంట. ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. గ్రూప్‌ వై పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. ఇంగ్లిష్‌, రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి. గ్రూప్‌ - ఎక్స్‌, వై రెండింటికీ దరఖాస్తు చేసుకున్నవారికి పరీక్ష 85 నిమిషాలు ఉంటుంది. ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. అలాగే తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకూ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. అన్ని ప్రశ్నపత్రాల్లోనూ ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ ప్రశ్నలు సీబీఎస్‌ఈ 10+2 సిలబస్‌ నుంచే వస్తాయి. అభ్యర్థులు https://airmenselection.cdac.in లో మాక్‌ పరీక్షను రాసుకోవచ్చు. సిలబస్‌, మాదిరి ప్రశ్నలు అందుబాటులో ఉంచారు.

శిక్షణ ఇలా...

ఎంపికైనవారికి సంబంధిత ట్రేడుల్లో బెళగవి (కర్ణాటక) ప్రాథమిక శిక్షణ కేంద్రంలో తర్ఫీదు నిర్వహిస్తారు. అనంతరం అభ్యర్థులను సంబంధిత ట్రేడ్‌ శిక్షణ కేంద్రాలకు పంపుతారు. ఆ ట్రేడుల్లో విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు. గ్రూప్‌ ఎక్స్‌లో ఎంపికైనవారు సంబంధిత విభాగాల్లో ఫిట్టర్లగా విధులు నిర్వర్తిస్తారు. గ్రూప్‌ వైలో చేరినవారు టెక్నీషియన్‌గా సేవలు అందిస్తారు. విధుల్లో కొనసాగినవారు భవిష్యత్తులో పదోన్నతుల ద్వారా మాస్టర్‌ వారెంట్‌ ఆఫీసర్‌ (ఎండబ్ల్యువో) స్థాయి వరకు చేరుకోవచ్చు. అలాగే సర్వీసులో కొనసాగుతూ కొన్ని పరీక్షల్లో అర్హతలు సాధించినవారు కమిషన్డ్‌ ఆఫీసర్లు కావడానికీ అవకాశాలు ఉన్నాయి

ఫేజ్‌ -2లో...

అభ్యర్థులు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 6 నిమిషాల 30 సెకెన్లలో పూర్తిచేయాలి. అలాగే నిర్ణీత వ్యవధిలో 10 పుష్‌అప్స్‌, 10 సిట్‌అప్స్‌, 20 స్క్వాట్స్‌ పూర్తిచేయాలి. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టు (పీఎఫ్‌టీ)లో అర్హత సాధించినవారికి అడాప్టబిలిటీ టెస్టు-1 నిర్వహిస్తారు. అభ్యర్థి ఎయిర్‌ ఫోర్స్‌ ఉద్యోగానికి సరిపోతాడో లేదో తెలుసుకోవడానికి ఆబ్జెక్టివ్‌ తరహాలో రాత పరీక్ష ఉంటుంది. టెస్టు -1లో అర్హత సాధించినవారికి టెస్టు 2 నిర్వహిస్తారు. ఇందులో మిలిటరీ వాతావరణానికి అభ్యర్థి అలవాటు పడగలడా లేదా పరిశీలిస్తారు. ఇక్కడ కూడా ఉత్తీర్ణత సాధిస్తే వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణ కోసం ఎంపికచేస్తారు

Posted Date: 09-10-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌