• facebook
  • whatsapp
  • telegram

అవుతారా... సిస్టర్‌?    

విదేశాల్లోనూ విస్తృత అవకాశాలు

సేవాభావముంటే చక్కని కెరియర్‌

అంకితభావంతో వైద్యసేవలు అందించి, రోగులను  కోలుకునేలా చేసే నర్సింగ్‌ వృత్తికి కొవిడ్‌ నేపథ్యంలో ప్రాధాన్యం పెరిగింది. ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ముందున్న అవకాశాల్లో నర్సింగ్‌ విద్య ఒకటి. కోర్సు పూర్తయిన వెంటనే ఉపాధి లభించడం దీని ప్రత్యేకత. ఇంటర్‌ తర్వాత ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో చేరవచ్చు. తర్వాత ఆసక్తిని బట్టి ఉద్యోగం/ ఉన్నత విద్య దిశగా అడుగులు వేయవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంలు, హెల్త్‌ సెంటర్లు, విద్యా సంస్థలు, ఓల్డేజ్‌ హోంలు, కార్పొరేట్‌ సంస్థల్లో నర్సులకు ఉద్యోగాలున్నాయి. విదేశాల్లోనూ చక్కని అవకాశాలు లభిస్తున్నాయి!

ఇంటర్మీడియట్‌లో చదివిన గ్రూపు ప్రకారం నర్సింగ్‌ కోర్సును ఎంచుకోవచ్చు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం కోర్సుల్లో చేరేందుకు అన్ని గ్రూపులవారికీ అవకాశం ఉంటుంది. వీటిని చదువుకున్నవారికి నర్సింగ్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులోకి మాత్రం బైపీసీ విద్యార్థులకే అవకాశం ఉంటుంది. ఈ కోర్సు సంబంధిత విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుపుతారు. ఏఎన్‌ఎం కోర్సుతోనూ ఉపాధి పొందవచ్చు. అయితే మేటి అవకాశాలకు జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ దారిచూపుతాయి. ఎక్కువ కళాశాలలు మహిళల కోసమే కోర్సులు అందిస్తున్నాయి. పరిమితంగానే మేల్‌ నర్సింగ్‌ విద్య అందుబాటులో ఉంది. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో చేరేవారికి ఆ ఏడాది డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండడం తప్పనిసరి.

ఏఎన్‌ఎం: ఆక్సిలరీ నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫ్‌ (ఏఎన్‌ఎం) కోర్సు వ్యవధి రెండేళ్లు. తెలుగు రాష్ట్రాల్లో చాలా కళాశాలలు ఏఎన్‌ఎం చదువులు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలు నేరుగా లభిస్తాయి. ఏఎన్‌ఎం అనంతరం వరుసగా జీఎన్‌ఎం, పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్‌ కోర్సులు పూర్తిచేసుకోవచ్చు. ఏఎన్‌ఎం కోర్సు పూర్తిచేసుకున్నవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలోని ఉప కేంద్రాల్లో (హెల్త్‌ సబ్‌ సెంటర్స్‌) విధులు నిర్వర్తిస్తారు. చిన్నారులకు టీకాలు వేయించడం, బాలింతలకు పౌష్టికాహారం, సప్లిమెంట్లు ఇవ్వడం, సహజ కాన్పులను ప్రోత్సహించడం, ప్రభుత్వ పథకాలు అందేలా చూడడం...వీరి విధుల్లో భాగం. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వీరు ప్రాథమిక సేవలు నిర్వర్తించవచ్చు.  

జీఎన్‌ఎం: జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ (జీఎన్‌ఎం) కోర్సు వ్యవధి మూడేళ్లు. ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ అర్హులే. తెలుగు రాష్ట్రాల్లో వివిధ కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ మార్కుల మెరిట్‌తో కోర్సులో చేరే అవకాశం లభిస్తుంది. దీన్ని పూర్తిచేసుకున్నవారు రెండేళ్ల వ్యవధితో పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు రెగ్యులర్‌ విధానంలో చదువుకోవచ్చు. లేదా ఏదైనా సంస్థలో ఉద్యోగం చేసుకుంటూ దూరవిద్యలో ఇగ్నో నుంచి మూడేళ్ల వ్యవధితో పూర్తిచేసుకోవచ్చు. అనంతరం పోస్టు బేసిక్‌ డిప్లొమా లేదా ఎమ్మెస్సీ నర్సింగ్‌లో చేరవచ్చు. ఆపై ఆసక్తి ఉంటే నర్సింగ్‌లో పీహెచ్‌డీ చేయవచ్చు. 

బీఎస్సీ నర్సింగ్‌: నర్సింగ్‌ విద్యలో ఎక్కువ ప్రాధాన్యం ఉన్న కోర్సు ఇది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. జాతీయ సంస్థలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి సంస్థల్లో సీటు ఇంటర్‌ మార్కుల మెరిట్‌తో లభిస్తుంది. జాతీయ స్థాయి సంస్థలు ప్రవేశ పరీక్షతో అవకాశం కల్పిస్తున్నాయి. బీఎస్సీ నర్సింగ్‌ తర్వాత పోస్టు బేసిక్‌ డిప్లొమా లేదా ఎమ్మెస్సీ నర్సింగ్, ఆపై పీహెచ్‌డీ పూర్తిచేసుకోవచ్చు

ఉన్నత విద్య

పోస్టు బేసిక్‌ డిప్లొమా: ఏదైనా విభాగంలో ప్రత్యేక సేవలు అందించాలనుకున్నవారు బీఎస్సీ నర్సింగ్‌ తర్వాత ఏడాది వ్యవధితో ఉన్న పోస్టు బేసిక్‌ డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు. కార్డియో థొరాసిక్, క్రిటికల్‌ కేర్, మిడ్‌ వైఫరీ, న్యూరో సైన్స్, అంకాలజీ, ఆర్థోపెడిక్‌ అండ్‌ రిహాబిలిటేషన్, సైకియాట్రిక్, నియోనటాల్, ఆపరేషన్‌ రూమ్, ఎమర్జెన్సీ అండ్‌ డిజాస్టర్, ఆప్తాల్మిక్, టీబీ, లెప్రసీ..ఇలా నచ్చిన స్పెషలైజేషన్‌ ఎంచుకునే వీలుంది.  

ఎమ్మెస్సీ నర్సింగ్‌: ఇందులో కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్, మెడికల్‌ సర్జికల్‌ నర్సింగ్, ఆబ్సెస్ట్రిక్‌ అండ్‌ గైనకాలాజికల్‌ నర్సింగ్, మెంటల్‌ హెల్త్‌ నర్సింగ్, చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్‌... తదితర స్పెషలైజేషన్లు ఉంటాయి. కోర్సుల వ్యవధి రెండేళ్లు. బీఎస్సీ నర్సింగ్, పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు వీటిలో నచ్చిన స్పెషలైజేషన్‌ ఎంచుకోవచ్చు. అనంతరం సంబంధిత విభాగాల్లో సేవలు అందించవచ్చు.  

నర్స్‌ ప్రాక్టీషనర్‌ క్రిటికల్‌ కేర్‌ పీజీ రెసిడెన్సీ: బీఎస్సీ నర్సింగ్‌ తర్వాత ఆసక్తి ఉన్నవారు కొన్ని సంస్థలు రెండేళ్ల వ్యవధితో అందిస్తోన్న నర్స్‌ ప్రాక్టీషనర్‌ క్రిటికల్‌ కేర్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాంలో చేరవచ్చు. ఈ కోర్సుకు ప్రాధాన్యం పెరుగుతోంది. డాక్టర్లు అందుబాటులో లేనప్పుడు అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. 

హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌: బీఎస్సీ నర్సింగ్‌ అనంతరం ఎంబీఏ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సునూ చదువుకోవచ్చు.

ప్రముఖ విద్యాసంస్థలు 

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) న్యూదిల్లీతోపాటు భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, పట్నా, రాజ్‌పూర్, రుషికేష్‌ల్లో బీఎస్సీ నర్సింగ్‌ ఆనర్స్‌ కోర్సు మహిళల కోసం అందిస్తున్నారు. రాత పరీక్షతో ప్రవేశం లభిస్తుంది.  

క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ (సీఎంసీ), వెల్లూరు

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజ్‌ (ఏఎఫ్‌ఎంసీ), పుణె

జవహర్‌లాల్‌ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌), పుదుచ్చెరి

పీజీఐఎంఆర్, చండీగఢ్‌

మణిపాల్‌ అకాడెమీ

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల ఆధ్వర్యంలో నడుస్తోన్న కళాశాలలు  

నిమ్స్, అపోలో, యశోదా..తదితర సంస్థలు

అవకాశాలిలా... 

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం- పదివేల జనాభాకు కనీసం 30 మంది నర్సులు ఉండాలి. మన దేశంలో 17 మందే ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అంతకన్నా తక్కువగానే ఉన్నారని ఈ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. ప్రపంచానికి 2030 నాటికి 60 లక్షల మంది సేవలు అవసరమని అంచనా. ఇందులో ఒక్క మన దేశ అవసరాలు తీర్చడానికే 20 లక్షల మంది కావాలి. సేవాభావం, శ్రమించే తత్వం, సహనం, వృత్తి నైపుణ్యం, మెలకువలు ఉన్నవారు తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. 

బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం కోర్సులు పూర్తిచేసుకున్నవారు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ రంగాల్లో చెప్పుకోదగ్గ వేతనాలతో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వేలు, ఇతర కేంద్రీయ సంస్థల్లో చేరినవారు రూ.44,900 మూలవేతనంతో మొదటి నెల నుంచే రూ.75 వేలు అందుకోవచ్చు. వీరిని ఆర్మీలో నేరుగా లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుని రూ.లక్షకు పైగా వేతనం చెల్లిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, హెల్త్‌ సెంటర్లు, సంక్షేమ వసతి గృహాల్లో సేవలు అందించడానికి నర్స్‌ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీరికి ప్రారంభ మూలవేతనం రూ.పాతిక వేలకు పైగా లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర అలవెన్సులతో మొదటి నెల నుంచే దాదాపు రూ.నలభై వేలు అందుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసినవారికి కార్పొరేట్‌ ఆసుపత్రులు ప్రారంభంలో రూ.18 వేల నుంచి రూ.25వేలు వరకు వేతనం అందిస్తున్నాయి. పీజీ పూర్తిచేసుకున్నవారు ఆకర్షణీయ జీతంతో కార్పొరేట్‌ స్పెషాలిటీ వైద్య విభాగాల్లో ప్రత్యేక సేవలు అందించవచ్చు. బోధన రంగాన్నీ ఎంచుకోవచ్చు.

విదేశాల్లో...

సుశిక్షితులైన నర్సులకు విదేశాల్లోనూ విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. సబ్జెక్టు ప్రావీణ్యం, ఆంగ్ల నైపుణ్యం ఉన్నవారు యూఎస్, కెనడా, సింగపూర్, గల్ఫ్, మిడిల్‌ ఈస్ట్‌... తదితర దేశాల్లో పెద్ద మొత్తంలో వేతనాలు అందుకోవచ్చు. విదేశాల్లో ఉద్యోగాన్ని ఆశించేవారు ఆయా దేశాలవారీ నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించాలి. యూఎస్‌ కోసం ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్టు (టోఫెల్‌ లేదా ఐఈఎల్‌టీఎస్‌)లో స్కోరు, నేషనల్‌ కౌన్సిల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జామినేషన్‌ - రిజిస్టర్డ్‌ నర్స్‌ (ఎన్‌సీఎల్‌ఈఎక్స్‌ - ఆర్‌ఎన్‌)లో ఉత్తీర్ణత తప్పనిసరి. కెనడాలో కెరియర్‌ ఆశించేవారు కెనడియన్‌ రిజిస్టర్డ్‌ నర్సెస్‌ ఎగ్జామ్‌ (సీఆర్‌ఎన్‌ఈ), దుబాయ్‌లో పనిచేయడానికి దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ నిర్వహించే పరీక్ష, సౌదీ అరేబియాకు ప్రొమెట్రిక్‌ పరీక్ష, ఖతార్‌కు సుప్రీం కౌన్సిల్‌ ఆఫ్‌ హెల్త్‌ పరీక్ష రాయాలి. కొన్ని దేశాలు రెండు మూడేళ్ల అనుభవం ఉన్నవారిని ఇంటర్వ్యూతోనే ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి.

Posted Date: 08-11-2021


 

ఇంటర్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌