• facebook
  • whatsapp
  • telegram

కళ్లకు కాంతి... కొలువుకు వెలుగు!   

ఇంటర్‌ తర్వాత - ఆప్టోమెట్రీ కోర్సు

 

 

సర్వేంద్రియాల్లో అతి ముఖ్యమైన కళ్లకు ఏమైనా అయితే...వెంటనే ఆసుపత్రికి వెళ్తాం కదా? అక్కడ కంటి వైద్యుల (ఆఫ్తల్మాలజిస్ట్‌) కంటే ముందుగా ఒకరు కళ్లను  నిశితంగా పరీక్షిస్తారు. ఈ పనిచేసేవాళ్లే ఆప్టోమెట్రిస్ట్‌లు. కొన్ని కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఈ సేవలు అందించవచ్చు. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో వాటిలో చేరవచ్చు. చాలా సంస్థలు ఈ చదువులను అందిస్తున్నాయి. వీరికి కళ్ల ఆసుపత్రులతోపాటు కళ్లద్దాల విక్రయశాలలు, లెన్స్‌ తయారీ కేంద్రాల్లోనూ ఉపాధి అవకాశాలుంటాయి. 

 

రోజువారీ పనులు ఇబ్బంది లేకుండా పూర్తిచేసుకోవడానికీ, పుస్తకాలు చదవడానికీ, ప్రకృతి అందాలు వీక్షించడానికీ, టీవీ/సినిమాలు చూడడానికీ- అన్నింటికీ కళ్లే ప్రధానం. ఎక్కువమంది హ్రస్వ లేదా దీర్ఘదృష్టి సమస్యతో బాధ పడుతున్నారు. ఈ విభాగంలో సేవలు అందించడానికి ప్రత్యేకంగా కార్పొరేట్‌ కంటి వైద్యశాలలు విస్తరిస్తున్నాయి. అలాగే కళ్లద్దాల గొలుసుకట్టు దుకాణాలూ పెరుగుతున్నాయి. దీంతో నాణ్యమైన ఆప్టోమెట్రిస్టుల సేవలు కీలకమయ్యాయి. అందువల్ల ఈ చదువులపై ఆసక్తి ఉన్నవారు కోర్సు పూర్తయిన వెంటనే నిశ్చింతగా ఉపాధి పొందవచ్చు. 

 

డిప్లొమా..డిగ్రీ

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఆప్టోమెట్రీలో డిప్లొమా, బ్యాచిలర్‌ కోర్సుల్లో చేరవచ్చు. డిప్లొమాల వ్యవధి రెండేళ్లు. అన్ని గ్రూపుల విద్యార్థులకూ డిప్లొమాలో చేరే అవకాశం ఉంటుంది. ఈ కోర్సు అనంతరం ఆప్టోమెట్రీ యూజీ కోర్సులో నేరుగా రెండో ఏడాదిలో చేరిపోవచ్చు. ఈ అవకాశం కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ వ్యవధి నాలుగేళ్లు. రాష్ట్ర స్థాయి సంస్థల్లో బీఎస్సీ ఆప్టోమెట్రీ కోర్సులో చేరడానికి బైపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. జాతీయ స్థాయిలో పేరున్న సంస్థలు బైపీసీతోపాటు ఎంపీసీ వారికీ అవకాశం కల్పిస్తున్నాయి. 

 

అందువల్ల ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు నాలుగేళ్ల యూజీ కోర్సులో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఇందులో భాగంగా చివరి ఏడాది మొత్తం ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఏదైనా కంటి ఆసుపత్రిలో దీన్ని పూర్తిచేయాలి. అనంతరం ఆసక్తి ఉన్నవారు రెండేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ కోర్సు చదువుకోవచ్చు. దీని తర్వాత పీహెచ్‌డీనీ పూర్తిచేసుకోవచ్చు. బీఆప్టోమెట్రీ అందించే సంస్థల్లో కొన్ని పీజీ, పీహెచ్‌డీలకూ అవకాశం కల్పిస్తున్నాయి. 

 

దేశంలో పేరొందిన నేత్ర వైద్యశాలలు యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ కోర్సుల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నాయి. వీటిలో కొన్ని సంస్థలు బయట నుంచి వచ్చిన యూజీ విద్యార్థులకు ఏడాది ఇంటర్న్‌షిప్‌ అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. ఇంటర్‌ బోర్డు లేదా ఓపెన్‌ విధానంలో బైపీసీ గ్రూపు చదివినవారు, బయాలజీ, ఫిజిక్స్‌ల్లో బ్రిడ్జ్‌ కోర్సు పూర్తిచేసుకున్న ఒకేషనల్‌ విద్యార్థులు రాష్ట్ర స్థాయి సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ప్రారంభమైన సంవత్సరం డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండడం తప్పనిసరి. రాష్ట్ర స్థాయి సంస్థల్లో ఇంటర్‌ మార్కుల మెరిట్‌తో అవకాశం లభిస్తుంది. జాతీయ స్థాయి సంస్థలు ప్రవేశ పరీక్ష లేదా నీట్‌ స్కోర్‌తో చేర్చుకుంటున్నాయి. 

 

ప్రసిద్ధ నేత్ర వైద్యశాలలు యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ కోర్సులు అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఏడాది ఇంటర్న్‌షిప్‌ అవకాశాన్నీ కల్పిస్తున్నాయి 

 

ఇవీ విద్యా సంస్థలు

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆరేళ్ల వ్యవధితో మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ (ఎంఆప్టోమ్‌) కోర్సు అందిస్తోంది..ఇంటర్‌లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులు చదువుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు తప్పనిసరి. పరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సులో చేర్చుకుంటారు. ఇందులో వంద మార్కులకు జనరల్‌ సైన్స్, మ్యాథ్స్‌ అంశాల్లో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. 

 

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) న్యూదిల్లీ క్యాంపస్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ కోర్సు అందిస్తోంది. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది. ఈ సంస్థలో చేరిన విద్యార్థులు ప్రతి నెలా రూ.500 స్టైపెండ్‌ అందుకోవచ్చు. నాలుగో ఏడాది ఇంటర్న్‌షిప్‌లో ప్రతి నెలా రూ. 10,250 ఇస్తారు. బైపీసీ, ఎంపీసీ.. రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. విద్యార్థులు తాము చదివిన గ్రూపు ప్రకారం బయాలజీ లేదా మ్యాథ్స్‌ ఏదో ఒక సబ్జెక్టు ప్రశ్నలకు జవాబులు రాస్తే సరిపోతుంది. 

 

శంకర నేత్రాలయ, చెన్నై ఆధ్వర్యంలో నడుస్తోన్న ఎలైట్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ బ్యాచిలర్, మాస్టర్, డాక్టొరేట్‌ కోర్సులు అందిస్తోంది. బ్యాచిలర్స్‌లో చేరినవారు మొదటి రెండేళ్లు శస్త్ర యూనివర్సిటీ, తంజావూరులో చదువుతారు. తర్వాత రెండేళ్లు ఎలైట్‌ స్కూల్, శంకర నేత్రాలయలో చదువు, ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ప్రవేశం నీట్‌ స్కోర్, ఇంటర్‌ మార్కులతో ఉంటుంది లేదా శస్త్ర వర్సిటీ నిర్వహించే పరీక్షలో ప్రతిభ చూపాలి. ఇక్కడి కోర్సులో చేరడానికి బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.  

 

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ మూడేళ్ల కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు నాలుగో ఏడాది ఇంటర్న్‌షిప్‌ ఎల్‌వీ ప్రసాద్‌ ఐ హాస్పిటల్‌ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్‌ క్యాంపస్‌ల్లో పూర్తిచేయవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం లభిస్తుంది. ఈ సంస్థ వివిధ మాడ్యూళ్లలో పీజీ డిప్లొమా ఇన్‌ ఆప్టోమెట్రీ అండ్‌ విజన్‌ సైన్సెస్‌ కోర్సులను 18 నెలల వ్యవధితో అందిస్తోంది. ఆప్టోమెట్రీలో బ్యాచిలర్‌ కోర్సులు చదివినవారు వీటికి అర్హులు. 

 

మణిపాల్‌ అకాడెమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆప్టోమెట్రీలో యూజీ, పీజీ కోర్సులు అందిస్తోంది. పరీక్ష, ఇంటర్వ్యూలతో ప్రవేశం లభిస్తుంది. బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

 

అమృత విశ్వవిద్యాపీఠం, కోచి క్యాంపస్‌లో ఆప్టోమెట్రీ కోర్సు ఉంది. పరీక్షతో అవకాశం కల్పిస్తారు.

 

భారతీ విద్యాపీఠ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ, పుణెలో యూజీ, పీజీ కోర్సులు ఉన్నాయి. 

 

ఆంధ్రప్రదేశ్‌లో బీ.ఆప్టోమెట్రీ కోర్సును కర్నూల్‌ మెడికల్‌ కాలేజ్, ఆంధ్రా మెడికల్‌ కాలేజ్, సిద్ధార్థ మెడికల్‌ కాలేజ్, కోనసీమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అమలాపురం, బొల్లినేని మెడ్‌ స్కిల్స్‌ శ్రీకాకుళం(రాగోలు), జీఎస్‌ఎల్‌ పారామెడికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ రాజమండ్రి, సమత స్కూల్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ, విశాఖపట్నం (వేపగుంట)ల్లో అందిస్తున్నారు. ఇంటర్‌ బైపీసీ మార్కుల మెరిట్‌తో ప్రవేశాలుంటాయి. గీతం విశ్వవిద్యాలయం విశాఖపట్నం క్యాంపస్‌లో ఆప్టోమెట్రీ కోర్సు ఇటీవలే ప్రారంభించింది. 

 

తెలంగాణలో... యశోద, మల్లారెడ్డి హెల్త్‌ యూనివర్సిటీ..తదితర సంస్థల్లో చదువుకోవచ్చు.

 

ఏయే అవకాశాలు?

దేశంలో పది కోట్ల మంది ఏదో ఒక దృష్టి లోపంతో బాధపడుతున్నారని అంచనా. అవసరాలకు తగ్గ సేవలు అందించడానికి కనీసం లక్ష మంది ఆప్టోమెట్రీషియన్లు ఉండాలి. అయితే అంత మంది అందుబాటులో లేరు. ప్రభుత్వ కంటి ఆసుపత్రుల్లో ఆకర్షణీయ వేతనంతో ఆప్టోమెట్రీషియన్లగా సేవలు అందించవచ్చు. ఎక్కువ అవకాశాలు మాత్రం కార్పొరేట్‌ కంటి ఆసుపత్రులు, కార్పొరేట్‌ కళ్లద్దాల విక్రయ శాలలు, ప్రైవేటు ఆసుపత్రులు, ఎన్జీవోల్లో లభిస్తాయి. కొంత అనుభవం వచ్చిన తర్వాత సొంతంగా కళ్లద్దాల దుకాణం నిర్వహించుకోవచ్చు.ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్, మ్యాక్సీ విజన్, వాసన్‌ ఐ కేర్, అగర్వాల్‌ ఐ హాస్పిటల్‌... తదితర కార్పొరేట్‌ కంటి ఆసుపత్రుల్లో సేవలు అందించవచ్చు. కంటివైద్యులు సేవలందిస్తోన్న ప్రతిచోటా ఆప్టోమెట్రీ నిపుణులు ఉంటారు. టైటాన్‌ ఐ ప్లస్, లెన్స్‌కార్ట్, లారెన్స్‌ అండ్‌ మాయో, విజన్‌ ఎక్స్‌ప్రెస్, జీకేబీ...ఇలా పలు కార్పొరేట్‌ గొలుసుకట్టు ఆప్టికల్‌ దుకాణాల్లో సేవలు అందించవచ్చు. పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసుకున్నవారికి బోధనలో అవకాశాలుంటాయి.

 

ఈ నైపుణ్యాలుండాలి..

ఆప్టోమెట్రిస్ట్‌గా సేవలు అందించాలకునేవారికి దృష్టిలోపం ఉండకపోతే మంచిది. సహనం, సమన్వయంతో వ్యవహరించడం, సరైన నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు ఉన్నవారు ఇందులో రాణించగలరు. కోర్సులో భాగంగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రో బయాలజీ, ఆప్టిక్స్‌పై అవగాహన కల్పిస్తారు. క్లినికల్‌ ఆఫ్తల్మాలజీకి చెందిన ప్రాథమికాంశాల గురించీ వీరు తెలుసుకుంటారు. ఈ సబ్జెక్టుల నుంచి ఆప్టోమెట్రీకి అవసరమైన అనువర్తనాలను అధ్యయనం చేస్తారు.
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తెర మీద... తెర వెనుక

‣ వేగంగా.. ఘనంగా!

Posted Date: 20-10-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌