• facebook
  • whatsapp
  • telegram

సత్వర ఉపాధికి చక్కని దారి!

పదో తరగతి తర్వాత వేసే అడుగు భవిష్యత్‌ కెరియర్‌ లక్ష్యానికి మార్గం వేస్తుంది. సాంకేతిక విద్యవైపు ఆసక్తి ఉన్నవారు ఇంటర్‌ చదవకుండానే నేరుగా ఆ శిక్షణను అందుకునే అవకాశముంది. అవే పాలిటెక్నిక్‌ కోర్సులు. బీఈ/బీటెక్‌లు  అందుబాటులోకి వచ్చాక వీటిపట్ల కొంత చిన్నచూపు   పెరిగిన మాట వాస్తవమే! అయినా ఈ కోర్సులు అందించే ప్రయోజనాలు ఎన్నో! విజయవంతంగా పూర్తిచేస్తే మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

తెలంగాణలో పాలిటెక్నిక్‌ ప్రవేశపరీక్ష- పాలిసెట్‌ ప్రకటన వెలువడింది. (వెబ్‌సైట్‌: https://polycetts.nic.in ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా వెలువడాల్సి ఉంది .

నేటి తరం హైస్కూలు స్థాయి నుంచే కెరియర్‌పై స్పష్టమైన ప్రణాళికతో ఉంటోంది. సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండటం, వేగంగా స్థిరపడాలనుకోవడం వంటివి అందులో భాగమే. పూర్తిగా సాంకేతిక విభాగం వైపు కెరియర్‌ మలచుకునేవారికి పాలిటెక్నిక్‌ ఒక మంచి మార్గం. వారి ఆలోచనలకూ ఇది సరిపోతుంది. తక్కువ వ్యవధిలో త్వరగా స్థిరపడే వీలు వీటి ద్వారా కలుగుతుంది. అందుకే వీటిని ఉద్యోగాధారిత కోర్సులుగా వ్యవహరిస్తారు.

టెక్నికల్, ఇండస్ట్రియల్‌ ఆర్ట్స్, అప్లయిడ్‌ సైన్సెస్‌ అంశాల్లో పాలిటెక్నిక్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి విద్యార్హతతో వీటిలోకి ప్రవేశం పొందొచ్చు. ఇవి రెండు రకాలు- టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ డిప్లొమాలుగా ఉంటాయి. సిలబస్‌ పరిశ్రమలకు అనుగుణంగా, విద్య పూర్తవడంతోనే విద్యార్థి సంబంధిత పరిశ్రమలో ఉద్యోగం సాధించేలా రూపొందిస్తారు. కోర్సులన్నింటిలో టెక్నికల్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌ల్లో ఇంజినీరింగ్‌ అంశాలుంటాయి. అందుకే వీటిని డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌/ ప్రీ ఇంజినీరింగ్‌గానూ వ్యవహరిస్తారు. 

కోర్సులు..

సివిల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, బయోటెక్నాలజీ, ఏరోనాటికల్, ప్లాస్టిక్, మెటలర్జీ, కంప్యూటర్, ఆటోమొబైల్, ఫ్యాషన్, ఇంటీరియర్, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్, సెరామిక్‌ మొదలైన విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు. కొన్నింటికి మూడున్నరేళ్లు. సెమిస్టర్‌ విధానంలో ఉంటాయి. పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. కోర్సుల కాలవ్యవధిని బట్టి ఆరు నెలల వరకు ఉంటుంది. ప్రవేశం కావాలనుకునేవారు పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌- పాలీసెట్‌ను రాయాల్సి ఉంటుంది. వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రభుత్వ, అనుబంధ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. అమ్మాయిల కోసమే ప్రత్యేకంగా కొన్ని కళాశాలలూ ఉన్నాయి. 

ఉన్నత విద్యావకాశాలు

ఎంచుకున్న విభాగానికి సంబంధించి లోతైన పరిజ్ఞానాన్ని పొందాలనుకునేవారు వీటిని ఎంచుకోవచ్చు. పాలిటెక్నిక్‌ పూర్తిచేసినవారు ఎంచుకోగల కోర్సుల్లో ప్రముఖమైనవి:

బీటెక్‌/ బీఈ 

పాలిటెక్నిక్‌ తర్వాత ఉన్నతవిద్య పరంగా ఎక్కువమంది ఆసక్తి చూపేది బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ/ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కోర్సులవైపే. ప్రవేశపరీక్ష ద్వారా వీటిలోకి ప్రవేశం పొందొచ్చు. రాష్ట్రాలన్నీ ప్రత్యేకంగా ఈసెట్‌ (ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ) నిర్వహించి వచ్చిన ర్యాంకు ఆధారంగా లేటర్‌ ఎంట్రీ అవకాశాన్ని కల్పిస్తాయి. దీంతో నేరుగా ఇంజినీరింగ్‌ రెండో ఏడాదిలోకి ప్రవేశం దొరుకుతుంది. కొన్ని ప్రముఖ కళాశాలలూ ప్రత్యేకంగా ప్రవేశపరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్‌

నాన్‌ ఇంజినీరింగ్‌ కోర్సులవారు వీటికి ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. ఇంజినీరింగ్‌ కాకుండా సంబంధిత విభాగంలో డిగ్రీ కోర్సు చేయాలనుకునేవారూ వీటిని ఎంచుకోవచ్చు. వీరు బీఎస్‌సీ, బీసీఏ కోర్సులను ఎంచుకోవచ్చు. నాన్‌ టెక్నికల్‌ వైపువారు బీకాం, బీఏ వైపు మొగ్గు చూపించొచ్చు. అయితే చాలావరకూ సంస్థలు ఇంటర్మీడియట్‌/ తత్సమాన స్కోరును ఆశిస్తాయి.

ఏఎంఐఈ సర్టిఫికేషన్‌

అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ద ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఇంజినీర్‌ (ఏఎంఐఈ).. అందించే సర్టిఫికేషన్‌ కోర్సును చేయొచ్చు. సాంకేతికంగా దీనిని బీఈ డిగ్రీకి సమానంగా పరిగణిస్తారు. దీనిని పూర్తిచేసినవారికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, ఇండియా సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తుంది. ఏఎంఐఈ పరీక్షలో రెండు సెక్షన్లు ఉంటాయి. సాధారణంగా వీటిని పూర్తిచేయడానికి నాలుగేళ్లు పడుతుంది. పాలిటెక్నిక్‌ డిప్లొమా చేసినవారికి సెక్షన్‌-ఎలోని కొన్ని పేపర్ల (ప్రాజెక్ట్‌) నుంచి మినహాయింపు ఉంటుంది. దీంతో వీరికి ఈ సర్టిఫికేషన్‌ మూడేళ్లలో పూర్తిచేసే అవకాశం ఉంటుంది.

ఉద్యోగావకాశాలు

పాలిటెక్నిక్‌ కోర్సులను ప్రొఫెషనల్‌ కెరియర్‌కు దగ్గరి దారిగా చెబుతుంటారు. మంచి కెరియర్‌ అవకాశాలను అందిస్తుండటమే అందుకు కారణం. ఎన్నో ప్రముఖ సంస్థలు ఇంజినీరింగ్‌ వారితో పోలిస్తే వీరికి తొలి ప్రాధాన్యం ఇస్తుంటాయి..

పీఎస్‌యూలు/ ప్రభుత్వ రంగ సంస్థలుప్రభుత్వ, దాని అనుబంధ సంస్థలు పాలిటెక్నిక్‌ పూర్తిచేసినవారికి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ఇంజినీరింగ్, నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో జూనియర్‌ స్థాయి, టెక్నికల్‌ హోదాలకు ఎంపిక చేస్తుంటారు.

నియమించుకుంటున్న సంస్థలు:

1.రైల్వే 

2.ఆర్మీ

3. గెయిల్‌ (గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌)

4. ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ)

5. డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) 

6.భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) 

7.నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) 

8.పబ్లిక్‌ వర్క్‌ డిపార్ట్‌మెంట్లు 

9.బీఎస్‌ఎన్‌ఎల్‌ 

10.ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లు 

11. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) 12.ఇండియన్‌ పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఐపీసీఎల్‌)

ప్రైవేటు రంగ సంస్థలు

మాన్యుఫాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌ విభాగాలకు సంబంధించిన ప్రైవేటు సంస్థలు డిప్లొమా పట్టాదారులకు అవకాశాలు కల్పిస్తాయి. ఈ సంస్థలూ ప్రభుత్వ విభాగాల్లానే వీరిని జూనియర్‌/ టెక్నికల్‌ స్థాయి హోదాలకే ఎంచుకుంటాయి.

ప్రత్యేకతలివీ!

పాలిటెక్నిక్‌లో ‘చేయడం ద్వారా నేర్చుకోవడం’పై ప్రధాన దృష్టి ఉంటుంది. అందులో భాగంగానే సాంకేతికాంశాలను థియరీ విధానంలో బోధించడంతోపాటు ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికీ సమ ప్రాధాన్యం ఇస్తారు.

విద్యాపరమైన పరిజ్ఞానంతోపాటు భావ వ్యక్తీకరణ, ప్రసంగ నైపుణ్యాలు, విధి నిర్వహణలో పాటించే సూత్రాలు, క్రమశిక్షణ, ప్రెజెంటేషన్లపై పట్టు ఏర్పడుతుంది.

ప్రయోగపూర్వక బోధన కారణంగా విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ అలవడుతుంది. దీనికారణంగా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ సంసిద్ధులు కాగలుగుతారు.

తేడా ఏంటి?

కాస్త మంచి ఉద్యోగంలో స్థిరపడాలంటే కనీస డిగ్రీ ఉండాలనేది చాలామంది ఆలోచన. ఆ క్రమంలోనే పాలిటెక్నికల్‌కు అంతగా ప్రాధాన్యమివ్వరు. నిజానికి.. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది. థియరీకీ, ప్రాక్టికాలిటీకీ  సమ ప్రాధాన్యం ఉంటుంది. దీంతో బేసిక్‌ ఇంజినీరింగ్‌ అంశాల్లో విద్యార్థికి పట్టు ఉంటుంది. ఫలితంగా కోర్సు పూర్తవగానే సంబంధిత రంగంలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగావకాశాలను దక్కించుకునే వీలుంటుంది. డిగ్రీ కోర్సుల్లోనూ ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యమున్నా.. ఎక్కువగా థియరీపైనే దృష్టి ఉంటుంది. దీంతో మంచి ఉద్యోగావకాశాలకు అదనపు అర్హతలు జోడించుకోవాల్సి వస్తుంది.

ప్రయోజనాలెన్నో!

సత్వర ఉపాధి: చదువు పూర్తవగానే స్థిరపడాలనుకునేవారికి ఇది ఉత్తమ ఎంపిక. మూడేళ్ల విద్య అభ్యసించి ప్రభుత్వ, కార్పొరేట్‌ సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. చాలా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాల ద్వారా ఆకర్షణీయ వేతనాలు డిప్లొమా విద్యార్థులకు దక్కుతున్నాయి. 

ప్రాక్టికల్‌ పరిజ్ఞానం: దీనిలో ప్రయోగాత్మకంగా నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఉంటుంది. దీంతో సబ్జెక్టు పరిజ్ఞానం ఎక్కువ. పైగా సాధారణ సాంకేతిక డిగ్రీలతో పోలిస్తే దీన్ని పూర్తిచేయడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ.

మారొచ్చు: పాలిటెక్నిక్‌ విద్య తర్వాత సాంకేతికం కాకుండా ఇతర విద్యను చదవాలనుకునేవారికి అవకాశముంటుంది. విభాగాన్ని మార్చుకోవడంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. 

పేద విద్యార్థుల ఇంజినీరింగ్‌ లక్ష్యానికి సోపానం

"సాంప్రదాయిక ఇంజినీరింగ్‌ కోర్సుల కంటే సంప్రదాయేతర పాలిటెక్నిక్‌ కోర్సులు ఎక్కువ ఉపాధి అవకాశాలను అందిస్తున్నాయి."

చవకైన సాంకేతిక విద్య పాలిటెక్నిక్‌. ఇంజినీరింగ్‌ చదువు ప్రభుత్వ ఆధ్వర్యంలో చాలా తక్కువచోట్ల దొరుకుతుండగా, పాలిటెక్నిక్‌ కళాశాలలు ప్రతి జిల్లాలో రెండుకు మించి ఉన్నాయి. ప్రతి కాలేజీకీ పక్కా భవన నిర్మాణం, ఆధునిక లేబొరెటరీలు, కొన్ని కాలేజీలకు అనుబంధ హాస్టళ్లు ఉన్నాయి. అమ్మాయిల కాలేజీలకు తప్పనిసరిగా హాస్టల్‌ ఉంటుంది. బోధనా సిబ్బంది ఏఐసీటీఈ ప్రామాణికాలతో ఉండాలనే నియమం 2010 నుంచి అమల్లోకి రావటం వల్ల అత్యున్నత విద్యార్హతలతో 2012, 2013ల్లో అనేకమంది బోధనా సిబ్బంది నియమితులయ్యారు. పాత సిబ్బంది కూడా సాంకేతిక విద్యాశాఖ స్పాన్సర్‌ చేసిన క్యాలిటీ ఇంప్రూవ్‌  మెంట్‌ ప్రోగ్రాం ద్వారా విద్యార్హతను పెంచుకొన్నారు. దీంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలిటెక్నిక్‌ విద్య మంచి ప్రమాణాలతో లభిస్తోంది.  

పదో తరగతి పాసైన 3 సంవత్సరాలకే ఉద్యోగ అర్హత రావటంతో అమ్మాయిలు 1990ల తరువాత పెద్ద సంఖ్యలో పాలిటెక్నిక్‌లలో చేరి తరువాత ఉద్యోగపరంగా బాగా స్థిరపడ్డారు. ఆ కాలంలో పోలీసు, రహదారులు-భవన నిర్మాణం లాంటి ప్రభుత్వ శాఖలు, బీఎస్‌ఎన్‌ఎల్, బీహెచ్‌ఈఎల్, బీఈఎల్‌ లాంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలు డిప్లొమా అర్హత ఉన్నవాళ్లకు ఉద్యోగాలు ఇచ్చాయి. కాలక్రమేణా ప్రైవేటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్‌ విద్యను ఉన్నతీకరించారు. మొదట్లో గ్రామాల్లోని చిన్న స్థాయి రైతు కుటుంబాల నుంచి విద్యార్థులు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో బాగానే స్థిరపడ్డారు.

విద్య మొత్తంగా ప్రైవేటీకరణ అయ్యాక ఇప్పుడు మొదటి నుంచి ప్రైవేటు పాఠశాలల్లో చదవగలిగిన కుటుంబాల విద్యార్థులు పాలిటెక్నిక్‌ చదువుకు రావటం లేదు. ప్రభుత్వ బడుల్లో చదివిన అల్పాదాయపు కుటుంబాలవారు మాత్రమే ఇక్కడ చదువుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. డిప్లొమా అనంతరం ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశం ఉండటం వల్ల ఇంటర్‌మీడియట్‌ కార్పొరేట్‌ కాలేజీల ఫీజును భరించలేని పేద విద్యార్థులు ఇంజినీరింగ్‌ విద్యకు పాలిటెక్నిక్‌ ద్వారా సోపానం వేసుకుంటున్నారు. 

సాంప్రదాయిక ఇంజినీరింగ్‌ కోర్సుల కంటే సంప్రదాయేతర పాలిటెక్నిక్‌ కోర్సులు ఎక్కువ ఉపాధి అవకాశాలను అందిస్తున్నాయి. డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అండ్‌ కమర్షియల్‌ కోర్సులో సర్టిఫికెట్‌ పొందినవారికి ఏదో ఒక ఉద్యోగం రావడం ఖాయం. పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డీఫార్మసీ చదివిన విద్యార్థులు ఆ సర్టిఫికెట్‌తో మెడికల్‌ షాపులు పెట్టుకోగలుగుతున్నారు. గార్మెంట్‌ అండ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌ లాంటి కోర్సులు పూర్తిచేసుకున్నవారు బ్యాంకు రుణాలతో బొటిక్స్‌ పెట్టుకుంటున్నారు. ఇలాంటి అనేక కోర్సులకు పాలిటెక్నిక్‌ గతం నుంచీ అవకాశాలు ఇస్తూవస్తోంది. పాలిటెక్నిక్‌ విద్యకు ఎక్కువ ప్రచారం కల్పించి ఉనికిలో ఉన్న బోధనా, బోధనేతర, మౌలిక సదుపాయ వనరులను సద్వినియోగం చేసుకోవాల్సివుంది.

- రమా సుందరి

హెడ్‌ ఆఫ్‌ ఈసా డిపార్ట్‌మెంట్‌, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌, గుంటూరు
 

Posted Date: 02-07-2021


 

టెన్త్ తర్వాత

మరిన్ని