శరవేగంగా విస్తరిస్తోన్న నిర్మాణ రంగం దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో సేవలందించడానికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. ఆ దిశగా సుశిక్షితులైన మానవ వనరులను రూపొందించడానికి దేశంలో పలు సంస్థలు వెలిశాయి. వాటిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రిసెర్చ్ (నిక్మార్) ముఖ్యమైంది. ఈ సంస్థ హైదరాబాద్ క్యాంపస్‌లో వివిధ కోర్సులు అందిస్తోంది. వాటిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది!
నిక్మార్ హైదరాబాద్ (షామీర్పేట) క్యాంపస్‌లో రెండేళ్లు, ఏడాది వ్యవధితో పలు రకాల రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ కోర్సులు అందిస్తున్నారు. ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఆన్లైన్ ఇంటర్వ్యూలతో వాటిలో ప్రవేశం లభిస్తుంది. ఇంటినుంచే పరీక్ష రాసుకుని, ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. అకడమిక్స్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు టాప్ ర్యాంకర్ స్కాలర్షిప్పులు అందిస్తున్నారు. పది, ఇంటర్/డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌లో 95 శాతం మార్కులకు 80 శాతం ట్యూషన్ ఫీజు తగ్గిస్తారు. 90 శాతం మార్కులు ఉంటే 60 శాతం ఫీజులో రాయితీ ఉంటుంది. 85 శాతం మార్కులతో ఫీజులో 40 శాతం మినహాయిస్తారు.
పరీక్ష ఇలా...
నిక్మార్ కామన్ అడ్మిషన్ టెస్టు (ఎన్‌క్యాట్) 180 మార్కులకు ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఇందులో క్వాంటిటేటివ్ అండ్ ఎనలిటికల్ ఎబిలిటీ 72, డేటా ఇంటర్‌ప్రెటేషన్ 36, వెర్బల్ అండ్ జనరల్ ఎబిలిటీ 72 మార్కులకు ఉంటాయి. పరీక్షలో ప్రతిభ చూపినవారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. గ్రూప్ డిస్కషన్‌కు 20, పర్సనల్ ఇంటర్వ్యూకు 30, అప్లికేషన్ రేటింగ్ (అకడమిక్ ప్రతిభ, పని అనుభవం)కు 70 మార్కులు కేటాయించారు. మొత్తం 300 మార్కులకుగానూ చూపిన ప్రతిభ ప్రకారం ప్రవేశాలు లభిస్తాయి. పరీక్షపై అవగాహన కోసం జులై 22న మాక్ టెస్టు నిర్వహిస్తున్నారు.
అవకాశాలిక్కడ...
నిక్మార్‌లో విద్య అభ్యసించినవారు ప్రాంగణ నియామకాల ద్వారా ప్రముఖ స్థిరాస్తి సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. లోథా, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్ బిల్డింగ్ ఇండియా, డీహెచ్ఎఫ్ఎల్, యునీటెక్, టాటా హౌసింగ్, అన్సాల్ ఏపీఐ, రహేజా యూనివర్సల్, లార్సెన్ అండ్ టబ్రో, పంజ్ లాయిడ్ గ్రూప్, 99 యాకర్స్, మ్యాజిక్ బ్రిక్స్, ఇండియా ప్రాపర్టీ, ఇండియా హౌసింగ్.కామ్.. తదితర సంస్థల్లో అవకాశాలుంటాయి. సిమెంట్ పరిశ్రమ, బ్యాంకింగ్, ఫైనాన్స్, విదేశీ నిర్మాణ సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 20
పరీక్ష తేదీ: జులై 23
జీడీ, ఇంటర్వ్యూలు: జులై 26
తరగతులు: ఆగస్టు 16 నుంచి ప్రారంభం..
వెబ్సైట్: https://nicmar.ac.in/
ఇవీ కోర్సులు
పీజీ ప్రోగ్రాం ఇన్ అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ (పీజీపీ ఏసీఎం)
వ్యవధి: రెండేళ్లు
అర్హత: ఇంజినీరింగ్/ ఆర్కిటెక్చర్/ ప్లానింగ్ ఎందులోనైనా 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
పీజీ ప్రోగ్రాం ఇన్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ (పీజీపీ క్యూఎస్సీఎం)
వ్యవధి: ఏడాది
అర్హత: ఏదైనా ఇంజినీరింగ్ విభాగంలో 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
పీజీ ప్రోగ్రాం ఇన్ హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ (పీజీపీ హెచ్ఎస్ఈఎం)
వ్యవధి: ఏడాది
అర్హత: 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ లేదా 50 శాతం మార్కులతో బీఎస్సీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ)తోపాటు సంబంధిత విభాగంలో ఏడాది పని అనుభవం.
పీజీ ప్రోగ్రాం ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్మెంట్ (పీజీపీ ఎల్ఎస్సీఎం)
వ్యవధి: ఏడాది
అర్హత: ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, మేనేజ్మెంట్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కామర్స్, ఆర్ట్స్, అగ్రికల్చర్...వీటిలో ఎందులోనైనా 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
పీజీ ప్రోగ్రాం ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ (పీజీపీ ఈఎం)
వ్యవధి: ఏడాది.
అర్హత: ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, సైన్స్- వీటిలో ఎందులోనైనా 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.