• facebook
  • whatsapp
  • telegram

సరికొత్త కాంబినేషన్లతో స్వాగతిస్తోంది డిగ్రీ!

అడ్మిషన్ల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇంటర్మీడియట్‌ తర్వాత వృత్తివిద్యల్లో ప్రవేశాలకు ఏటా పోటీ పెరుగుతున్నప్పటికీ మరో పక్క సంప్రదాయ డిగ్రీ కోర్సులూ పెద్ద ఎత్తునే ఆదరణ పొందుతున్నాయి. ఇప్పటి కాలానికీ, అవసరాలకూ తగ్గట్టుగా ఈ డిగ్రీ కోర్సుల్లో మార్పులు ప్రవేశపెడుతుండటం దీనికో కారణం. రెండు తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ కళాశాలల ప్రవేశాల పరిస్థితి ఏమిటి? విద్యార్థులు గమనించదగ్గ అంశాలేమిటి? 

ఇంజినీరింగ్‌ లాంటి వృత్తి విద్యా కోర్సులపై ఎంత మోజున్నా...మెడికల్‌ సీటంటే ఎంత క్రేజ్‌ ఉన్నా...ఇంటర్‌మీడియట్‌ పాసయ్యేవారిలో సగానికి పైగా విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లోనే చేరుతున్నారు. దాదాపు 2.50 లక్షల మంది డిగ్రీలో ప్రవేశాలకు సై అంటున్నారు. అందుకు తగ్గట్లే సంప్రదాయ డిగ్రీ కోర్సు కాలానుగుణంగా మారుతోంది. ఈ విద్యా సంవత్సరం కూడా మరిన్ని కళాశాలల్లో కొత్త కాంబినేషన్లు వచ్చి చేరాయి. బీఎస్‌సీ డేటా సైన్స్, బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌ అనే కొత్త కోర్సులు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని కళాశాలల్లో అందుబాటులో వస్తున్నాయి. 

ప్రతిభను బట్టి విద్యార్థులకు 2021-22 విద్యా సంవత్సరంలో సీట్లు కేటాయించే సింగిల్‌ విండో విధానమైన డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌- తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ ఇటీవలే విడుదలైంది. మూడు విడతల్లో సీట్లను భర్తీ చేస్తారు. మొదటి విడతలోనే ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకుంటే నాణ్యమైన కళాశాలలో సీట్లు దొరకడం ఖాయం.

ఈసారి కొత్తదనం ఇదీ

డిగ్రీ విద్యకు జవసత్వాలు కల్పించే సంస్కరణలు గత మూడు నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. చాయిస్‌ బేస్‌డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌)తో సెమిస్టర్‌ విధానం అమలుతో డిగ్రీ రూపులేఖలే మారిపోయాయి. గత ఏడాది నాలుగు పట్టికల్లో నుంచి మూడు సబ్జెక్టులను ఎంచుకునే బకెట్‌ విధానం, వివిధ కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం లాంటి కొత్త నిర్ణయాలు అమలయ్యాయి. తమ కళాశాలలో విద్యార్థికి ఆసక్తి ఉన్న సబ్జెక్టు లేకుంటే మూక్స్‌ విధానంలో ఆన్‌లైన్‌ కోర్సును చదువుకునే అవకాశమూ కల్పించారు. ఈసారి కూడా డిగ్రీ విద్యకు సంబంధించి మరికొన్ని నూతన నిర్ణయాలు అమలుకానున్నాయి.

హైదరాబాద్‌ నగరంలోని నాలుగు విశ్వవిద్యాలయ, ప్రభుత్వ కళాశాలల్లో బీఏ ఆనర్స్‌ కోర్సును ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతారు. ఇప్పటివరకు 150 క్రెడిట్లు ఉంటే ఆనర్స్‌ కోర్సులో 180 క్రెడిట్లు ఉంటాయి. అంటే ఈ కోర్సులో ఏదైనా ఒక సబ్జెక్టుపై ప్రత్యేక ఫోకస్‌ ఉంటుంది.‣ క్లస్టర్‌ విధానాన్ని అమలు చేస్తారు. ప్రభుత్వ కళాశాలలు మానవ వనరులు, ప్రయోగశాలలు, ఇతర వనరులను వినియోగించుకుంటాయి. ఇతర సంస్థలతోనూ ఒప్పందం చేసుకొని పరస్పరం ప్రయోజనం పొందుతాయి. ఫలితంగా విద్యార్థులు నాణ్యమైన విద్యకు చేరువవుతారు. 

ఏదైనా ఒక సబ్జెక్టుపై ఆసక్తి ఉండి అది తాను చదివే కళాశాలలో లేకుంటే అది ఉన్న చోటకు వెళ్లి విద్యార్థులు చదువుకోవచ్చు. ఉదాహరణకు ఐఐటీ హైదరాబాద్‌లో పబ్లిక్‌ పాలసీ కోర్సు ఉంది. ఆ సంస్థతో కూడా ఒప్పందం చేసుకొని ఆ కోర్సులో ఒక సబ్జెక్టు ఐఐటీలో చదువుకునే అవకాశం కల్పించాలన్న ప్రణాళికను ఈ విద్యా సంవత్సరం పట్టాలెక్కించాలన్నది లక్ష్యం. అదే జరిగితే విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.

అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం రూపొందించిన ఆన్‌లైన్‌ పాఠాలు, కోర్సు మెటీరియల్‌ మొదలైనవాటిని కూడా తెలంగాణ రాష్ట్రంలో అందరూ వినియోగించుకోవచ్చు.

ఎన్నో సబ్జెక్టులు.. చాయిస్‌ మీదే

బకెట్‌ సిస్టమ్‌తో సబ్జెక్టులను ఎంచుకోవడంలో చాయిస్‌ పెరిగింది. 

ఉదాహరణకు హైదరాబాద్‌ నగరంలోని సిటీ కళాశాలలో బీఎస్‌సీ భౌతికశాస్త్రం విభాగంలో గతంలో ఏడు కాంబినేషన్లు ఉండగా ఇప్పుడు 23 కాంబినేషన్లకు పెరిగింది. గణితం+స్టాటిస్టిక్స్‌+డేటా సైన్స్‌ (ఎంఎస్‌డీఎస్‌); గణితం, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ (ఎంఎస్‌సీఎస్‌); గణితం, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ (ఎంఈసీఎస్‌); గణితం, ఫిజిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌(ఎంపీసీఎస్‌) లాంటి కాంబినేషన్లు వచ్చాయి. బీఎస్‌సీ లైఫ్‌ సైన్స్‌ విభాగంలో మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, అప్లైడ్‌ న్యూట్రిషన్‌ లాంటి పదుల సబ్జెక్టులున్నాయి. ఆసక్తిని బట్టి వాటిని ఎంచుకోవచ్చు. 

బీకాంలో జనరల్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, ఆనర్స్‌ కాకుండా బిజినెస్‌ అనలిటిక్స్, టాక్సేషన్‌ లాంటి కోర్సులు వచ్చాయి. 

విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి ఆయా కాంబినేషన్లను ఎంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.‘ఆసక్తి ఉన్న కోర్సును నాణ్యమైన విద్య అందించే కళాశాలలో చదివితే డిగ్రీతోనే మంచి ఉద్యోగావకాశాలు పొందొచ్చు’ అని రాష్ట్ర డిగ్రీ, పీజీ ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.పరమేశ్వర్‌ సూచించారు. కరోనా కారణంగా లైఫ్‌ సైన్సెన్‌ విభాగానికి సమీప భవిష్యత్తులో డిమాండ్‌ పెరగనుందన్నారు. ఆయా పరిశ్రమలు ఖర్చులను తగ్గించుకునేందుకు డిగ్రీ విద్యార్హత కలిగినవారిని ఎక్కువమందిని కొలువుల్లోకి తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఆయన చెప్పారు.

ఇదీ రిజిస్ట్రేషన్‌ విధానం

దోస్త్‌ ప్రవేశ ప్రక్రియ చాలా సులభం. విద్యార్థులు ఎవరి ప్రమేయం లేకుండా స్వయంగా తమ డిగ్రీ అడ్మిషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌ను సందర్శించి తమ ఇంటర్‌ హాల్‌ టికెట్‌ నంబరు ద్వారా లాగిన్‌ అయి పేరు నమోదు చేసుకోవచ్చు. ఆధార్‌ సంఖ్యతో అనుసంధానం చేసిన మొబైల్‌ ఉంటే చాలు. రూ.200 చెల్లించడం ద్వారా రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ఆ తర్వాత దోస్త్‌ ఐè,† పిన్‌/పాస్‌వర్డ్‌ వస్తుంది. దరఖాస్తు ఫారం తెరవడానికి వాటిని ఉపయోగించాలి. 

సీట్ల కేటాయింపునకు ముందు నాలుగు దశలుంటాయి. 

1. విద్యార్థి రిజిస్ట్రేషన్‌ 

2. ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు 

3. దరఖాస్తు ఫారమ్‌ నింపడం 

4. వెబ్‌ ఆప్షన్లు. అయిదో దశలో సీట్లు కేటాయిస్తారు. ఒకవేళ ఆధార్‌ నెంబరుతో అనుసంధానం చేసిన మొబైల్‌ లేకుంటే అన్ని జిల్లాల్లోని పలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలకు వెళ్లి అక్కడి సిబ్బంది సహకారం తీసుకోవచ్చు.

ప్రవేశాలు మూడు విడతల్లో 

మొదటి విడత

రిజిస్ట్రేషన్లు: జులై 1 నుంచి 15 వరకు

వెబ్‌ ఆప్షన్లు: జులై 3 నుంచి 16వ తేదీ వరకు

సీట్ల కేటాయింపు: 22వ తేదీ

సీట్లు పొందిన విద్యార్థుల ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: 23 నుంచి 27వ తేదీ వరకు

రెండో విడత

రిజిస్ట్రేషన్‌: జులై 23 నుంచి 27వ తేదీ వరకు

వెబ్‌ ఆప్షన్లు: 24 నుంచి 29వ తేదీ వరకు

సీట్ల కేటాయింపు: ఆగస్టు 4న

మూడో విడత

రిజిస్ట్రేషన్‌: ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు

వెబ్‌ ఆప్షన్లు: 6 నుంచి 11వ తేదీ వరకు

సీట్ల కేటాయింపు: ఆగస్టు 18న

తరగతుల ప్రారంభం: సెప్టెంబరు 1న

దోస్త్‌ ద్వారా ప్రవేశాలు: 6 విశ్వవిద్యాలయాల (ఓయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు) పరిధిలో.

కళాశాలలు: 137 ప్రభుత్వ యూనివర్సిటీలు, కళాశాలలు; సుమారు 851 ప్రైవేటు కాలేజీలు

మొత్తం సీట్లు: 3.87 లక్షలు

కోర్సులు: బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీఎస్‌సీ డేటా సైన్స్, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ (బీవోక్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (బీఎస్‌డబ్ల్యూ).

ఇవే కాకుండా రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్‌) ఆధ్వర్యంలో నడిచే పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని డీ ఫార్మసీ, డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ (డీహెచ్‌ఎంసీటీ) కోర్సుల్లో సీట్లనూ దోస్త్‌ ద్వారానే భర్తీ చేస్తున్నారు. ఇది గత విద్యా సంవత్సరం (2020-21) నుంచి మొదలైంది.

వెబ్‌సైట్‌: https://dost.cgg.gov.in/

ఏపీలో సెప్టెంబరులో!  

ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలను ఈ ఏడాది సెప్టెంబరులో నిర్వహించే అవకాశం ఉంది. ఎంసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత సీట్ల భర్తీ చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటిలోనూ ఆన్‌లైన్‌లోనే సీట్లను భర్తీ చేస్తారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 4,24,937 సీట్లు అందుబాటులో ఉండగా.. గత ఏడాది 61.84 శాతం భర్తీ అయ్యాయి.

ఈ ఏడాది డిగ్రీ ప్రవేశాల్లో తెలుగు మాధ్యమం ఉండదు. మొదటి ఏడాది ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉంటుంది. తెలుగు మాధ్యమాన్ని తొలగించనున్నట్లు ఇప్పటికే ఉన్నత విద్యామండలి ప్రకటించింది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సును గత ఏడాది నుంచి ప్రవేశ పెట్టారు. విద్యార్థులు మూడేళ్ల తర్వాత బయటకు వెళ్లిపోవాలనుకుంటే డిగ్రీ ఇస్తారు. నాలుగేళ్లు పూర్తి చేస్తే పీహెచ్‌డీ, పీజీలో ఏడాది సమయం తగ్గుతుంది. ఏటా మొత్తం విద్యార్థుల్లో 25 శాతం మంది తెలుగు మాధ్యమంలో చేరుతున్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రామీణులే ఉంటున్నారు. ఈసారి తప్పనిసరిగా ఆంగ్లంలోనే చదవాల్సి ఉంటుంది. 

ఓటీపీ విధానం అమలు..

దరఖాస్తు సమయంలో విద్యార్థుల మొబైల్‌ ఫోన్‌కు ఓటీపీ నంబరు వచ్చేలా సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేస్తున్నారు. కిందటి ఏడాది విద్యార్థుల ఆన్‌లైన్‌ దరఖాస్తులో కళాశాలల ఎంపికను కొన్నిచోట్ల విద్యాసంస్థల యాజమాన్యాలే చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఈ కొత్తవిధానాన్ని ప్రవేశపెడుతున్నారు. విద్యార్థులు ఓటీపీ నంబరు చెబితేనే ఇతరులు ఆన్‌లైన్‌ దరఖాస్తులను నింపేందుకూ, పరిశీలించేందుకూ అవకాశం ఉంటుంది.

గత ఏడాది జిల్లాల వారీగా..

గత విద్యా సంవత్సరంలో ఎక్కువగా అనంతపురంలో సీట్లు భర్తీ అయ్యాయి. అందుబాటులో ఉన్న సీట్లలో 68 శాతం నిండాయి. అత్యల్పంగా పశ్చిమగోదావరిలో 55 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.

పారాహుషార్‌

ప్రవేశ ప్రక్రియ ముగిసే వరకూ విద్యార్థులు తమ దోస్త్‌ ఐడీ, పిన్‌ జాగ్రత్తగా, గోప్యంగా ఉంచాలి. వాటిని ఎవరితోనూ పంచుకోరాదు.

దరఖాస్తు ఫారంలో అన్నీ సరైన వివరాలు నింపాలి. వివరాలు నింపిన తర్వాత అన్నీ సరిచూసుకోవాలి. ఒకసారి వివరాలు సమర్పించిన తర్వాత వాటిని మార్చలేం.

ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా తమ సీటును (ఏ దశలోనైనా) ధ్రువీకరించే విద్యార్థులు ఆగస్టు 23 నుంచి 31వ తేదీ వరకు.. తమకు కేటాయించిన కళాశాలను వ్యక్తిగతంగా సందర్శించి ధ్రువపత్రాలను ప్రిన్సిపల్‌కు సమర్పించాలి. కళాశాల రుసుమును చెల్లించాలి. అప్పుడే మీ సీటు ధ్రువీకరించినట్లవుతుంది. కేవలం సెల్ఫ్‌ రిపోర్టింగ్‌తో సీటు 100 శాతం ఖరారైనట్లు కాదు.

అధిక ఆప్షన్లు మరవొద్దు 

కళాశాలల యాజమాన్యాలు తమ సంస్థల్లో చేరాలని ప్రలోభాలు పెడుతుంటాయి. వాటికి లొంగిపోవద్దు. మీ మార్కులకు తగ్గట్లు మంచి కళాశాలలో సీటు దక్కేలా చూసుకోండి. ఎవరికీ మీ ధ్రువపత్రాలు ఇవ్వొద్దు. ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవడం అత్యంత ముఖ్యం. చాలామంది తక్కువ మార్కులున్నా రెండు మూడు కళాశాలలు లేదా కోర్సులను మాత్రమే ఎంచుకొని సీటు రాలేదని మా వద్దకు వస్తున్నారు. ఇంటర్‌ ఒకేషనల్‌ విద్యార్థులు బ్రిడ్జి కోర్సు చదవకుండానే డిగ్రీలో చేరొచ్చు. వందల మంది విద్యార్థులు బీఏ కోసం దిల్లీ వెళుతున్నారు. అలాంటి నాణ్యమైన కోర్సుల కోసమే ఇక్కడా ఈసారి బీఏ ఆనర్స్‌కు శ్రీకారం చుడుతున్నాం. డిగ్రీ చదివినా ఉద్యోగావకాశాలు పెంచేలా ఇంటర్న్‌షిప్‌ లాంటి అనుభపూర్వక విద్యను అందించే దిశగా కసరత్తు చేస్తున్నాం. - ఆచార్య ఆర్‌.లింబాద్రి, కన్వీనర్, దోస్త్‌
 

Posted Date: 05-07-2021


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌