• facebook
  • whatsapp
  • telegram

అవుతారా..డిజిటల్‌ బ్యాంకర్‌?

ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకూ అంతా ఆన్‌లైన్‌ వ్యవహారమే. కొనుగోళ్లది దీనిలో ప్రధాన పాత్ర. కూరగాయల నుంచి ఖరీదైన వస్తువులూ, సేవల వరకు ప్రతిదానికీ ఆన్‌లైన్‌ వేదిక అయింది. పెరుగుతున్న టెక్నాలజీ ప్రమేయానికి ఉదాహరణలే ఇవి. ఇందుకు కొన్ని పరిస్థితులూ కారణమయ్యాయి. అందుకే బ్యాంకులతో పాటు చాలా రంగాలు డిజిటల్‌ దిశగా అడుగులు వేశాయి. ఈ మార్పు కొన్ని కొత్త కెరియర్ల ఆవిర్భావానికి కారణమైంది. అందులో డిజిటల్‌ బ్యాంకర్‌ ఒకటి. ఆర్థిక సంబంధ చదువులపై ఆసక్తి ఉన్నవారు దృష్టిపెట్టదగ్గ వాటిల్లో ఇదొకటి!

కొత్త టెక్నాలజీలు ప్రతి రంగంలోకి ప్రవేశించడం ఎప్పుడో ప్రారంభమైంది. వినియోగదారుడి అవసరానికి అనుగుణంగా ప్రతి సంస్థా సేవలను అందించడానికి సాంకేతిక సాయాన్ని తీసుకుంటూనే ఉన్నాయి. బ్యాంకింగ్‌ రంగమూ ఇందుకు మినహాయింపు కాదు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ వంటి అధునాతన సాంకేతికత ప్రతి రంగంలోకీ చొచ్చుకొస్తున్న కొద్దీ సమాచార దోపిడీ వంటి వాటికీ ఆస్కారం ఏర్పడుతోంది. దీంతో బ్యాంకింగ్‌ రంగమూ టెక్నాలజీ పరంగా ముందుకు సాగాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాల మేరకు టెక్నాలజీ పరంగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులూ ఈ ప్రక్రియ వేగవంతం అవడానికి కారణమయ్యాయి. దీంతో సంబంధిత నిపుణుల అవసరం పెరుగుతోంది.

పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్‌) సమయంలో నగదుకు చాలా ఇబ్బంది ఎదురైంది. దీంతో చాలామంది డిజిటల్‌ బ్యాంకింగ్‌కు మారారు. అప్పటిదాకా ఆసక్తి చూపని, తెలియనివారూ నేర్చుకుని మరీ వినియోగించడం ప్రారంభించారు. భౌతిక దూరం తప్పనిసరి అయిన కరోనా కారణంగా దీని వినియోగం ఇంకాస్త పెరిగింది. ఆర్‌బీఐ సైతం ఈ సమయంలో డిజిటల్‌ బ్యాంకింగ్, ఆన్‌లైన్‌ చెల్లింపులకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులు చేసేవారి సంఖ్య బాగా పెరిగింది. ఈ మార్పు డిజిటల్‌ బ్యాంకింగ్‌లో కొన్ని కొత్త కెరియర్‌లకు మార్గం వేసింది. 

డిజిటల్‌ బ్యాంకింగ్‌.. ఆర్థిక రంగంలో వస్తున్న కొత్త సృష్టికర్తగా చెప్పొచ్చు. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ బ్యాంకింగ్, యూపీఏ, ఏటీఎం మొదలైవన్నీ దీనికి ఉదాహరణలు. సంప్రదాయ పద్ధతిలో అందుబాటులో ఉండే బ్యాంకింగ్‌ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచే ప్రక్రియ. ఇక్కడ వ్యక్తుల ప్రమేయం ఉండదు. వినియోగదారులే తమ ఆర్థిక లావాదేవీలను మొబైల్, కంప్యూటర్‌ సాయంతో స్వయంగా నిర్వహించుకోవచ్చు. సులభంగా చెప్పాలంటే బ్యాంకింగ్‌ సేవలను ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా పొందే విధానమిది. దీనికి సంబంధించి ప్రత్యేకమైన నిపుణులు అవసరమవుతారు. వీరే డిజిటల్‌ బ్యాంకర్లు. ఆర్థిక సంబంధమైన విద్యను అభ్యసించి, ఈ రంగంలో స్థిరపడాలనుకునేవారు ప్రయత్నించదగ్గ వాటిలో ప్రముఖమైనదిది. 

కెరియర్‌లోకి వెళ్లే మార్గం?

నేరుగా డిజిటల్‌ బ్యాంకింగ్‌లో కోర్సులు ఇంకా అందుబాటులో లేవు. దేశవ్యాప్తంగా చాలా కొద్ది సంస్థలు మాత్రం ఇప్పుడిప్పుడే పరిచయం చేస్తున్నాయి. కానీ నైపుణ్యాలను జోడించుకోవాలనుకునేవారికి ఎన్నో ఆన్‌లైన్‌ వేదికలు కోర్సులను అందిస్తున్నాయి. వీటిలోనూ కొన్ని ప్రత్యేకంగా డిజిటల్‌ అంశాలపై దృష్టిపెడుతున్నవి ఉన్నాయి. బ్యాంకింగ్‌ రంగంపై ఆసక్తి ఉన్నవారు తమకు అనుకూలమైనవాటిని ఎంచుకోవచ్చు. 

ఆర్థిక రంగంలో టెక్నాలజీ అనగానే మొదట గుర్తొచ్చేది ఫిన్‌టెక్‌ కోర్సులు. వీటిలో మాత్రం బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సులతోపాటు ప్రొఫెషనల్స్‌కు సైతం అదనపు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ కోర్సులకు ఇంటర్‌ కామర్స్‌ నేపథ్యంతో పూర్తిచేసినవారు అర్హులు. పీజీ కోర్సులకు డిగ్రీ కామర్స్‌ నేపథ్యం తప్పనిసరి. జైన్‌ విశ్వవిద్యాలయం, బెంగళూరు; బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి; బీఎస్‌సీ ఇన్‌స్టిట్యూట్‌ లిమిటెడ్, ముంబయి; ఐఐఎం- బెంగళూరు, అహ్మదాబాద్‌ మొదలైనవి అందిస్తున్న ప్రముఖ సంస్థలు.

ఇంటర్‌ తరువాత ఈ కెరియర్‌ను ఎంచుకోవాలనుకునేవారికి డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సు అందుబాటులో ఉంది. ఇంటర్‌లో కామర్స్‌ విద్యను పూర్తిచేసినవారు దీనిని ఎంచుకోవచ్చు. డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ కోర్సు కాలవ్యవధి ఏడాది. అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. గ్రాడ్యుయేషన్‌ అనంతరం చేయాలనుకునేవారికి పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కాలవ్యవధి ఏడాది. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ పోగ్రామ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌కు డిగ్రీలో కామర్స్‌ కోర్సులు చదివుండాలి. గ్లోబల్‌ పీజీ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ కోర్సుకు ఏ డిగ్రీవారైనా అర్హులే.ఈ కోర్సులు.. టీకేడబ్ల్యూఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్, న్యూదిల్లీలో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా డిజిటల్‌ బ్యాంకింగ్‌ను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

పీజీ స్థాయిలో ఎంబీఏ ఇన్‌ డిజిటల్‌ ఫైనాన్స్‌ అండ్‌ బ్యాంకింగ్‌ కోర్సు అందుబాటులో ఉంది. కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఇవి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అప్‌గ్రాడ్, ఎడ్యుగ్రోత్, టాలెంట్‌ ఎడ్జ్‌ మొదలైనవి ఆన్‌లైన్‌లో అందిస్తున్నవాటిలో ప్రముఖమైనవి.

ఇంకా.. ఆర్థిక సంబంధమైన విద్యా నేపథ్యం పూర్తిచేసుకుని, బ్యాంకింగ్‌ రంగంవైపు వెళ్లాలనుకునేవారికి టెక్నాలజీ సంబంధిత అదనపు కోర్సులు ఆన్‌లైన్‌ వేదికగా అందుబాటులో ఉన్నాయి. ఈ-కేవైసీ, డిజిటల్‌ పేమెంట్స్, ఏపీఐ బ్యాంకింగ్, క్రిప్టో కరెన్సీ, సైబర్‌ ఫ్రాడ్స్, ఏఐ ఇన్‌ ఫైనాన్స్‌ మొదలైన అంశాలతో కోర్సులను అందిస్తున్నాయి. ఇవన్నీ డిప్లొమా, సర్టిఫికేషన్‌ కోర్సుల రూపంలో అందుబాటులో ఉన్నాయి. వీటిని కొన్ని సంస్థలు ఏ గ్రాడ్యుయేషన్‌ వారికైనా అందిస్తుండగా, కొన్నింటికి డిగ్రీ స్థాయిలో కామర్స్‌ కోర్సులు చదివుండటం తప్పనిసరి. కోర్సుల కాలవ్యవధి సంస్థను బట్టి మారుతోంది. సాధారణంగా నెల నుంచి ఏడాది వ్యవధి వరకూ కాలవ్యవధితో ఉన్నాయి. కోర్స్‌ ఎరా, యుడెమి, లిండా మొదలైనవి వీటిలో ప్రముఖమైనవి.

ఆన్‌లైన్‌ వేదికలు వివిధ కోర్సుల ద్వారా నైపుణ్యాలు  అందిస్తున్నాయి. వీటిలోనూ కొన్ని డిజిటల్‌ అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నాయి. 

ఏం చేస్తారు?

మీ బ్యాంకు నుంచి ఎప్పుడైనా సంబంధిత ఆప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, వివరాలను నమోదు చేసుకోవాల్సిందిగా కాల్‌ అందుకున్నారా? అది డిజిటల్‌ బ్యాంకర్‌ పరిధిలో జరిగే పనే. వీరు మొబైల్‌ బ్యాకింగ్‌ను కొత్త వినియోగదారులు ఎంచుకునేలా, వినియోగించేలా చూడటం వంటివి చేస్తారు. ప్రచార క్యాంపెయిన్‌లను చేయడం, వారికి అవసరమైన సమాచారం అందుబాటులో ఉంచడం వంటివి చేస్తారు. 

బ్యాంకింగ్‌తోపాటు వ్యూహాత్మక ప్రణాళిక, సేల్స్, మార్కెటింగ్, సప్లై చెయిన్, ఫైనాన్స్, రిస్క్‌ మొదలైన బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ అంశాలపై వీరికి లోతైన పరిజ్ఞానం ఉంటుంది. బ్యాంకు సేవల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టడం వంటివి చేస్తారు.

ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీల వివరాలను తెలుసుకోవడం, వినియోగదారుడి అవసరాల మేరకు వాటిని తమ సేవల్లో వినియోగానికి ప్రయత్నిస్తారు.

బ్యాంకులు, వినియోదారులకు మధ్య అంతరాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, వాటిని తగ్గించడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి, ఆచరణలోకి తీసుకొస్తారు.

ఉపాధి అవకాశాలు

కొవిడ్‌-19 వ్యాప్తి తరువాత డిజిటల్‌ బ్యాంకింగ్‌ను ఉపయోగించేవారు పెరిగారు. దేశవ్యాప్తంగా దాదాపుగా మూడొంతుల మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారని అంచనా. పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం వచ్చే 30 ఏళ్లలో చైనా, యూఎస్‌ డొమెస్టిక్‌ బ్యాంకింగ్‌ రంగంలో భారత్‌ మూడో స్థానంలో ఉంటుంది. రానున్న ఏళ్లలో వీరికి అవకాశాలు మరింత పెరుగుతాయి.

ఎన్నో ఆన్‌లైన్‌ దిగ్గజ సంస్థలూ డిజిటల్‌ పేమెంట్‌ మార్కెట్‌పై దృష్టిపెడుతున్నాయి. ఇది 2023నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతమూ రోజూ లక్షల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులతోపాటు ఫిన్‌టెక్‌ సంస్థల్లోనూ సంబంధిత నిపుణుల అవసరం ఉంది. విద్యార్థులతోపాటు, ప్రొఫెషనల్స్‌కూ టెక్నాలజీ నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, డిజిటల్‌ పేమెంట్, డిజిటల్‌ వ్యాలెట్, ఆర్థిక నేపథ్యమున్న సంస్థలూ వీరిని ఎంచుకుంటాయి.
 

Posted Date: 25-01-2022


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌