• facebook
  • whatsapp
  • telegram

ఉపాధికి డిజైన్‌

మగవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నా.. మహిళలు తమ ఇష్టప్రకారం నడిపించే రాజ్యం వంటగది. పిల్లలు అమ్మ నుంచి తాయిలం సంపాదించాలన్నా.. నాన్నకు సిఫారసులు చేరవేసేలా అమ్మను కాకా పట్టాలన్నా.. కొత్త కోడలు కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవాలన్నా ఇదే మూలం. మరి ఆ వంటగదిని అందంగా తీర్చిదిద్దడం ఒక కళే. ఆసక్తి ఉంటేనే అది సాధ్యం. ఆ ఆసక్తిని ఉపాధిగా మార్చుకునేలా చేస్తుంది- మాడ్యులార్‌ కిచెన్‌ కోర్సు!


 

ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో ఒక భాగమే కిచెన్‌ డిజైనింగ్‌. రానురానూ దీనికి ఆదరణ పెరిగి మాడ్యులార్‌ కిచెన్‌ డిజైనింగ్‌ అనే ప్రత్యేక విభాగంగా రూపాంతరం చెందింది. కేవలం వంటగదినే డిజైన్‌ చేయించుకోవాలనుకునేవారు దీన్ని ఎంచుకుంటారు. ముంబై, ఢిల్లీ, చెన్నైల్లో కిచెన్‌ డిజైనింగ్‌ విస్తరించగా.. మన రాష్ట్రంలో ఇప్పుడిపుడే ఆదరణ పెరుగుతోంది.

ఒక మాదిరి కుటుంబ స్థాయి ఉన్నవారైనా ఇంట్లో వంటకు ప్రత్యేక గదిని కేటాయిస్తారు. మిగతావాటితో పోల్చితే వంటగదిని అందంగా ఉంచడం కష్టం. కాబట్టి మాడ్యులార్‌ వంటి తక్కువ నిర్వహణకు వీలైన వంటగదుల అవసరం పెరిగింది.

మాడ్యులార్‌ కిచెన్‌ డిజైన్‌ కోర్సును దీర్ఘ, స్వల్పకాలిక కోర్సులుగా అందిస్తున్నారు. కోర్సుకాలం 3 వారాల నుంచి ఒక సంవత్సరం వరకూ ఉంటుంది.

ఈ కోర్సులో చేరటానికి అర్హతలివి

*¤ చెప్పిన సమయంలో పనిపూర్తి చేయగల స్వభావం

*¤ ఖాతాదారులను ఆకట్టుకునేలా మాట్లాడగలగడం

*¤ రంగుల సమ్మేళనంపై అవగాహన

*¤ త్వరగా అవగాహన చేసుకోగల సామర్థ్యం

*¤ మార్కెట్‌ అవసరాలను గుర్తించగలిగే తత్వం

కోర్సు వివరాలివి

1. కోర్సు పేరు: అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ మాడ్యులార్‌ కిచెన్‌ డిజైన్‌

అందిస్తున్నవారు: ద గ్లోబల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, నాగాలాండ్‌

అర్హత: ఇంటర్‌/ తత్సమానం

కాల వ్యవధి: ఏడాది ఫీజు: రూ.9,125

వివరాలకు: http://nagaland.net.in/Advanced_Diploma_Modular_Kitchen_Design.htm

2. కోర్సుపేరు: మాడ్యులార్‌ కిచెన్‌ కోర్సు అందిస్తున్నవారు: ఖ్యాతి మార్కెటింగ్‌ అర్హత: ఇంటర్‌/ తత్సమానం

కాలవ్యవధి: 3 నుంచి 4 వారాలు

ఫీజు: రూ.21,000 నుంచి రూ.25000

వివరాలకు: khyatimarketing@gmail.com

ఏం నేర్పుతారు?

¤ డిజైన్‌ సంబంధిత అంశాలు

¤ డ్రాయింగ్‌ కాన్సెప్టులు

¤ మాడ్యులార్‌ కిచెన్‌ డిజైనింగ్‌ విధానం

¤ డిజైనింగ్‌కు కావాల్సిన వస్తువులు

¤ ధర నిర్ణయించే విధానం, అంచనా

అవకాశాలెలా..: ఆర్కిటెక్చర్‌, మాడ్యులార్‌ కిచెన్‌ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించవచ్చు

¤ మాడ్యులార్‌ కిచెన్‌ డిజైనర్‌గా సంబంధిత కంపెనీల్లో స్వల్ప, దీర్ఘ కాలిక ఉద్యోగాలు చేయవచ్చు.

మాడ్యులార్‌ కిచెన్‌ డిజైన్‌ అంటే..

వంటగదికి కేటాయించిన స్థలాన్ని సమర్థంగా, సౌకర్యవంతంగా, అందంగా తీర్చిదిద్దడం మాడ్యులార్‌ కిచెన్‌ డిజైనింగ్‌ లో ప్రత్యేకత. అంటే.. ఇల్లు కొత్తదైనా, పాతదైనా వంటగదిని ఆకర్షణీయంగా కనిపించేలా చేయడంతోపాటు సామాను పొందికతో సర్దుకునేలా ఈ విధానంలో ర్యాకులుంటాయి.

ఉదాహరణకు- తక్కువ స్థలం ఉండి, వంటగది సంబంధిత వస్తువులన్నీ అక్కడే ఉండాలని కోరుకునేవారి కోసం కేటాయించిన స్థలంలో ఒదుగుతూ అవసరమైనపుడు తెరచేలా/ కావాల్సినవైపునకు తిప్పుకునేలా ర్యాకులను తయారు చేస్తారు. అదే వంటగది పెద్దగా ఉంటే ప్రతి ఎలక్ట్రానిక్‌ వస్తువుకూ తగిన స్థలాన్ని కేటాయిస్తూ ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. చిన్న చిన్న వస్తువులకు కూడా హైరానా పడకుండా అందుబాటులో ఉండేలా డిజైన్‌ చేస్తారు.

మాడ్యులార్‌ కిచెన్‌ నమూనాను ఈ కింది అంశాలను దృష్టిలో పెట్టుకుని తయారుచేస్తారు.

¤ ఎక్కువగా వినియోగించేవి

*¤ తక్కువ వినియోగం కలవి

*¤ పాత్రలు శుభ్రపరచే స్థలం (సింకు)

*¤ వంటకు కావాల్సినవి (పాత్రలు)

¤ వంటచేసే చోటు

వీటన్నింటి కోసం ముందుగా తయారీ విడి భాగాలతో ఒక నమూనా తయారు చేస్తారు. కేటాయించిన స్థలం, ఖాతాదారుడి బడ్జెట్‌పై వీటి తయారీ ఆధారపడి ఉంటుంది. వంటగదికి కేటాయించిన స్థలాన్ని అంచనావేసి, దానికి అనుగుణంగా డిజైనర్‌ ప్రణాళిక వేసుకుంటారు. అందుకు కావాల్సిన విడిభాగాలను సేకరించి వంటగదిలో అమర్చుతారు. తక్కువ స్థలంలో ఇముడుతూ.. ఎక్కువ అందంగా కనిపించేలా చూడడమే డిజైనర్‌ పని.

తక్కువ సమయంలోనే...

గత పదేళ్ళుగా మాడ్యులార్‌ కిచెన్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాను. తర్ఫీదును కూడా ఇస్తున్నాను. చాలా తక్కువ సమయంలో ఈ కోర్సును నేర్చుకోవచ్చు. ఇప్పుడున్న పోటీతో పోల్చితే ఇటువంటి కొత్తరంగాలు ఉపాధికి హామీ ఇస్తాయి. ఖాతాదారులను సంతృప్తిపరిచేలా కొత్త ఆలోచనలు చేయగలిగే సామర్థ్యం, ఆసక్తి, ఈ రంగంపై కొంత అవగాహన ఉన్నవారెవరైనా దీన్ని నేర్చుకోవచ్చు. పనిని సకాలంలో పూర్తిచేయగలడం తప్పనిసరి.

ఈ కోర్సు చేసినవారికి ఇంటీరియర్‌ డిజైన్‌, కిచెన్‌ పానెళ్లు తయారు చేసే కంపెనీల్లో డిజైనర్‌, ఇన్‌స్టాలర్‌, సూపర్‌వైజర్‌గా అవకాశాలుంటాయి. అభ్యర్థుల సామర్థ్యాలను బట్టి ప్రారంభ జీతం రూ. 8 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. తక్కువ ఖర్చుతో సొంతంగా వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టవచ్చు. ఇది స్త్రీ పురుషులెవరికైనా సరిపోయే రంగం.

Posted Date: 01-12-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌