• facebook
  • whatsapp
  • telegram

ఆటను బట్టి ఆహారం!

* స్పోర్ట్స్‌ సైన్స్‌లో పీజీ కోర్సులు

అంతర్జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్నప్పుడు పతకాల పట్టికలో భారత్‌ పేరు కనిపించటం అరుదు.. ఒకవేళ ఉన్నా.. కాంస్యం, రజతంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో యువజన సర్వీసులు, క్రీడామంత్రిత్వశాఖ క్రీడలకు సైన్సును జోడిస్తోంది. శాస్త్రీయమైన విధానంతో క్రీడాకారులను తయారు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొత్త కోర్సులను ప్రవేశపెడుతోంది.

శరీరతత్వాన్ని బట్టి.. ఎవరు ఏ క్రీడకు సరిపోతారో ముందుగానే నిర్ణయించటం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. క్రీడా మంత్రిత్వశాఖ ఇదే ఆలోచించింది. క్రీడాంశాన్ని దృష్టిలో పెట్టుకొని శిక్షణ ఎలా ఉండాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఎప్పుడెప్పుడు తినాలి ఇలా అన్నిటికీ శాస్త్రీయ పద్ధతి ఉండాలని నిశ్చయించింది. ఫలితంగా.. మూడు కోర్సులను జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) రూపొందించడమే కాదు.. నిర్వహించే బాధ్యతలను కూడా తీసుకుంది.

కోర్సులు ఇవీ: 1. ఎమ్మెస్సీ స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌ 2. ఎమ్మెస్సీ స్పోర్ట్స్‌ ఫిజియాలజీ 3. ఎమ్మెస్సీ స్పోర్ట్స్‌ బయోకెమిస్ట్రీ

ప్రస్తుతానికి ఒకే కోర్సు

సరైన పోషకాహారంతో అందరికీ ఆరోగ్యం సాధ్యం. ఈ దిశగా ఇప్పటికే ఎమ్మెస్సీ అప్లైడ్‌ న్యూట్రిషన్‌ కోర్సును జాతీయ పోషకాహార సంస్థ నిర్వహిస్తోంది. ఇప్పుడు క్రీడాకారులకు ఎలాంటి ఆహారం అవసరం అనే అంశంలో కొత్తగా కోర్సును అందిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌ కోర్సును ప్రారంభిస్తోంది. మొత్తం రెండు సంవత్సరాల కోర్సు వ్యవధి. ముందుగా 15 మందితో ఈ కోర్సును ప్రారంభిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి 30 మంది ఉండేలా చూస్తున్నారు. ఈ కోర్సులో ప్రవేశానికి అఖిలభారత స్థాయిలో ఆన్‌లైన్‌ ప్రవేశపరీక్ష ఉంటుంది. ఇందులో మెరిట్‌ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.

మిగతా రెండు కోర్సులను వచ్చేఏడాది ప్రారంభిస్తారు.

ఎవరు అర్హులు?

న్యూట్రిషన్‌ విద్యలో డిగ్రీ చేసినవారు, హోంసైన్సులో ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ డిగ్రీ పూర్తి చేసినవారు, ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌, బీడీఎస్‌, బీపీటీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ జియోథెరపీ) కోర్సులు పూర్తి చేసినవారు ఎమ్మెస్సీ స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌ కోర్సు చదివేందుకు అర్హులు. వైద్యవిద్య చదివినవారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఫీజు ఎంత వసూలు చేయాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 24వ తేదీన ఈ కోర్సు పూర్తి వివరాలు ప్రకటన ద్వారా వెల్లడి కానున్నాయి. ఏడాదికి రూ. లక్ష వరకూ ఫీజు ఉండవచ్చునని తెలుస్తోంది.

కోర్సు ముఖ్య ఉద్దేశం

భారత క్రీడాకారుల ప్రావీణ్యాన్ని పెంపొందించడమే ఈ కోర్సు లక్ష్యం. ఇప్పటివరకూ కోచ్‌ల సూచనలమేరకే క్రీడాకారులు ఆహారం తీసుకుంటున్నారు. క్రీడలో మెలకువల వరకూ కోచ్‌లను పరిమితం చేస్తారు. క్రీడకు తగ్గ ఆహారం అందించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ కోర్సులో ఉంటాయి. ఉదాహరణకు వంద మీటర్లు, 200 మీటర్లు ఇలా లక్ష్యాన్ని బట్టి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఫుట్‌బాల్‌ క్రీడాకారులంతా ఒకే రకమైన ఆహారం తీసుకోరు.. గోల్‌ కీపర్‌ ఆహారం వేరు.. క్రీడలో ఏయే స్థానాల్లో నిలబడుతున్నారో.. దానిని బట్టి ఆహారం అందించాల్సినవసరం ఉంది. శరీరంలో కొవ్వు శాతం ఎంత ఉంది.. శరీరంలో హైడ్రేషన్‌ శాతాలు ఎంత ఉన్నాయనేదాన్ని బట్టి ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. శిక్షణ భారం ఎంత పడుతోంది.. ఎన్ని రోజుల్లో పోటీలుంటాయి.. ఆటకు ముందు.. తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. ఇలా ప్రతి అంశంలో శాస్త్రీయమైన విధానాలను అనుసరించి క్రీడాకారులను తయారుచేయడమే లక్ష్యం.

- లావేటి వేణుగోపాల నాయుడు, ఈనాడు, హైదరాబాద్‌.


ఉద్యోగ అవకాశాలు ఇలా..

ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలాడాలి. ఎవరికి సరిపడే ఆట ఏది అనేది తెలుసుకోవాలి. ఆ ఆటకు సరిపోయే ఆహారం తీసుకోవాలి. ఇలా క్రీడా చైతన్యం పెరిగిన తర్వాత క్రీడా రంగం చాలా అభివృద్ధి చెందుతుంది. క్రీడా అకాడమీలు, క్రీడా సమాఖ్యలతోపాటు ప్రభుత్వ శిక్షణ సంస్థల్లో కూడా ఈ కోర్సులు పూర్తి చేసినవారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పెద్ద సంస్థలు వారి ఉద్యోగులు క్రీడల్లో ప్రావీణ్యం ఉంటే మంచి పనితనం సాధ్యమని భావిస్తాయి. మానవ అభివృద్ధి విభాగాల్లో స్పోర్ట్స్‌ సైన్సు కోర్సులు పూర్తి చేసినవారికి అవకాశం ఉంటుంది.

ఆరోగ్య భారతమే లక్ష్యం

ఎవరు ఏ ఆటకు సరిపోతారో తెలియని పరిస్థితి దేశంలో ఉంది. ఒకరిని చూసి ఒకరు ప్రేరణ పొందొచ్చు కానీ.. వారికి ఆ క్రీడ సరిపోతుందా..? అనేది స్పోర్ట్స్‌ సైన్సు కోర్సులు నిర్ణయిస్తాయి. పెట్రోల్‌తో నడిచే కారులో.. డీజిల్‌ వేస్తే పని చేస్తుందా! అలాగే ఆ శరీరతత్వాన్ని బట్టి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఆహారంతో రూపొందుతున్న శరీరం ఏ క్రీడకు సరిపోతుందో సరిచూడాలి. ఇది చిన్నప్పుడే నిర్ణయించాల్సి ఉంది. 8 ఏళ్ల వయసులో ఎవరు ఏ క్రీడకు సరిపోతారో.. ఎంత శ్రమకు ఆ శరీరం తట్టుకుంటుందో తెలుసుకుని శిక్షణ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయవచ్చు. ఇలా క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చి.. ఆరోగ్య భారతాన్ని తయారు చేయడమే స్పోర్ట్స్‌ సైన్సు కోర్సుల ముఖ్య ఉద్దేశం.

- డా. వై. వెంకటరమణ, ఎన్‌ఐఎన్‌, స్పోర్ట్స్‌ సైన్సు శాఖాధిపతి


 

Posted Date: 03-10-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌