• facebook
  • whatsapp
  • telegram

మెడికల్‌ డివైసెస్‌లో ఎంటెక్‌

ఫార్మసీ, ఇంజినీరింగ్‌, మెడికల్‌ అభ్య‌ర్థుల‌కు అవ‌కాశం 

ప్రముఖ సంస్థల్లో పీజీ చేయాలనుకునేవారికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌) ఓ కొత్త అవకాశాన్ని కల్పిస్తోంది. తాజాగా మెడికల్‌ డివైసెస్‌లో ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. నైపర్‌లు- గువాహటి, హైదరాబాద్, ఎస్‌ఏఎస్‌ నగర్‌ (మొహాలీ)ల్లో ఇది అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సుల్లో ప్రవేశానికి ప్రయత్నించవచ్చు.

వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్సల్లో ఉపయోగించే యంత్రాలు, పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ వంటివన్నింటినీ మెడికల్‌ డివైసెస్‌గానే పరిగణిస్తారు. ఇవి- ఆక్టివ్‌ మెడికల్‌  డివైసెస్, ఆక్టివ్‌ ఇంప్లాంటబుల్‌ మెడికల్‌  డివైసెస్, ఇన్‌ విట్రో డయాగ్నోస్టిక్‌ మెడికల్‌  డివైసెస్‌ అని మూడు రకాలుగా ఉంటాయి. హియరింగ్‌ ఎయిడ్స్, ఇన్ఫ్యూజన్‌ పంప్స్, వెంటిలేటర్లు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, యూరిన్, హెచ్‌ఐవీ టెస్ట్‌ కిట్లు.. మొదలైనవన్నీ వీటికిందకే వస్తాయి. 

ప్రపంచవ్యాప్తంగా మెడికల్‌  డివైసెస్‌ బాగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటి. ఈ పరికరాలకు పెరుగుతున్న గిరాకీ, మెరుగుదల, కొత్త యంత్రాల అభివృద్ధి కారణంగా సంబంధిత నిపుణుల అవసరం పెరుగుతోంది. దానికి తగ్గట్టుగా నిపుణులు అందుబాటులో ఉండటం లేదు. ఈ కొరతను తీర్చాలనే ఉద్దేశంతో నైపర్‌లు- గువాహటి, హైదరాబాద్, ఎస్‌ఏఎస్‌ నగర్‌ (మొహాలీ) ఈ స్పెషలైజేషన్‌తో ఎంటెక్‌ కోర్సును ప్రవేశపెట్టాయి. 
 

2019 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మెడికల్‌  డివైసెస్‌ మార్కెట్‌ విలువ 456.9 యూఎస్‌ బిలియన్‌ డాలర్లు. 2023నాటికి 603.5 యూఎస్‌ బిలియన్లకు చేరుతుందని అంచనా. గత ఏడాది సర్వే ప్రకారం గ్లోబల్‌ మెడికల్‌  డివైసెస్‌ మార్కెట్‌లో ఉత్తర అమెరికా 39.4% వాటాతో ప్రథమ స్థానంలో ఉంది. వీటిని తయారుచేసే ప్రధాన 20 దేశాల్లో భారత్‌ ఒకటి అయినప్పటికీ మన దేశ వాటా తక్కువనే చెప్పాలి. ఏషియా- పసిఫిక్‌ మార్కెట్‌లో చైనా, జపాన్‌ల తరువాత వీటి ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ దీని వాటా 11 యూఎస్‌ బిలియన్‌ డాలర్లే. దాదాపుగా 85-90% మెడికల్‌  డివైసెస్‌ను భారత్‌ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.  

దేశవ్యాప్తంగా 800 మెడికల్‌ డివైస్‌ ఉత్పత్తి సంస్థలున్నాయి. డిజిటైజేషన్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో దేశంలో మెడికల్‌  డివైసెస్‌లకూ ప్రాధాన్యం పెరుగుతోంది. వీటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కంటే దేశంలోనే కొత్త సృజనలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వమూ ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే సంబంధిత నిపుణులను సిద్ధం చేయాలనే ఉద్దేశంతో నైపర్‌ మెడికల్‌ డివైసెస్‌లో పీజీ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. మూడు నైపర్లలో ఈ కోర్సును ప్రవేశపెట్టింది. నైపర్‌ గువాహటి ఐఐటీ గువాహటి, వైజాగ్‌లోని ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌ (ఏఎంటీజీ)తో కలిసి దీనిని అందిస్తోంది.
 

ఎవరు అర్హులు?

కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ప్రాక్టికల్, జాబ్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామ్‌గా దీన్ని రూపొందించారు. చేరినవారికి ఫెలోషిప్‌ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఫార్మసీ, ఇంజినీరింగ్‌ (బీటెక్‌/బీఈ), మెడికల్‌ (ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్‌సీ) గ్రాడ్యుయేట్లు అర్హులు. డిగ్రీ స్థాయిలో 60% మార్కులు తప్పనిసరిగా ఉండాలి. జీప్యాట్‌/ గేట్‌ స్కోరు ఉండాలి. 

మెడికల్‌ డివైసెస్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, క్లినికల్‌ సైన్స్, ఇంజినీరింగ్‌ అంశాలు కోర్సులో భాగంగా ఉంటాయి. ఉమ్మడి ప్రవేశపరీక్ష- నైపర్‌ జేఈఈ ఆధారంగా ప్రవేశాలను కల్పించనున్నారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ఒక్కో నైపర్‌లో 10 సీట్లను మాత్రమే భర్తీ చేయనున్నారు. సెమిస్టర్‌ విధానం ఉంటుంది. క్రెడిట్‌ విధానం ఉంటుంది. మొదటి సెమిస్టర్‌కు 16, రెండో సెమిస్టర్‌కు 14 క్రెడిట్లు ఉంటాయి. రెండో ఏడాది ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్‌/ ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌తోపాటు రిసెర్చ్‌ అండ్‌ థీసిస్‌ వర్క్‌ ఉంటుంది. రెండో ఏడాదికి 20 క్రెడిట్లు కేటాయించారు. 
 

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ నైపర్‌ జేఈఈ తేదీ: డిసెంబరు 4, 2020

వెబ్‌సైట్‌: http://niperguwahati.ac.in/
 

Posted Date: 31-01-2022


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌