• facebook
  • whatsapp
  • telegram

సినిమా, టీవీ రంగాల్లో శిక్షణకు..

చలనచిత్ర, టీవీ పరిశ్రమలతో దశాబ్దాల అనుబంధం ఉన్న రామోజీ గ్రూప్ ఈ రంగాల్లోకి ప్రవేశించాలనుకునే యువతీ యువకులకు శిక్షణ ఇవ్వడానికి రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ (ఆర్ఎఫ్‌టీ) సంస్థను నిర్వహిస్తోంది. దర్శకత్వం, స్క్రీన్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, నటన, ఎడిటింగ్, ఆడియో రికార్డింగ్, తదితర విభాగాల్లో వైవిధ్యమైన కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది.


అంతర్జాతీయ ప్రమాణాలు గల ల్యాబొరేటరీలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది ద్వారా శిక్షణ ఇవ్వడం ఆర్ఏఎఫ్‌టీ ప్రత్యేకత. సినిమా, టీవీ రంగాల్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయి ప్రొఫెషనల్స్‌ను తయారుచేయడం లక్ష్యంగా వివిధ కోర్సులను రూపొందించింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటైన ఈ సంస్థ నిర్వహిస్తోన్న కోర్సుల వివరాలు...


* పీజీ డిప్లొమా ఇన్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ రైటింగ్
పీజీ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ
*డిప్లొమా ఇన్ యాక్టింగ్ (ఫిల్మ్ అండ్ టెలివిజన్)
డిప్లొమా ఇన్ ఎడిటింగ్ (ఫిల్మ్ అండ్ టెలివిజన్)
డిప్లొమా ఇన్ ఆడియో రికార్డింగ్ అండ్ సౌండ్ డిజైన్
   పీజీ డిప్లొమా కోర్సుల వ్యవధి రెండేళ్లు, డిప్లొమా కోర్సుల వ్యవధి ఏడాది. వీటితోపాటు సినిమా, టీవీ రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగాన్ని దృష్టిలో ఉంచుకొని మరో రెండు కొత్త కోర్సులను ఆర్ఏఎఫ్‌టీ ఈ ఏడాది నుంచి ప్రారంభించింది. అవి...

డిప్లొమా ఇన్ డిజిటల్ ఫిల్మ్‌మేకింగ్: తక్కువ తక్కుతో, సాంకేతిక పరిజ్ఞానంపై పెద్దగా అవగాహన లేనివారు కూడా సినిమాలు తీయడానికి డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ అవకాశం కల్పిస్తుంది. సమీప భవిష్యత్తులో ఈ రంగంలో ఏర్పడనున్న విస్తృతమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఈ కోర్సును రూపొందించింది.
డిప్లొమా ఇన్ టీవీ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్: విభిన్న రంగాల్లో పెరుగుతున్న టెలివిజన్ చానెళ్లకు అవసరమైన సుశిక్షితులను తయారు చేయడం ఈ కోర్సు లక్ష్యం.
ఫిల్మ్ స్టడీస్‌కు అవసరమైన పూర్తిస్థాయి లైబ్రరీ, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ గల డిజి ల్యాబ్ సౌకర్యాలు సంస్థలో ఉన్నాయి. సినిమా, టీవీ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన వ్యక్తులతో వర్క్‌షాప్‌లు ఉంటాయి. సిద్ధాంతాలు, ఆచరణకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ఆయా మాధ్యమాల్లోని ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యకలాపాలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తారు.

ఎంపిక విధానం
దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ దశకు ఎంపిక చేస్తారు. యాక్టింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి స్క్రీన్ టెస్ట్ కూడా ఉంటుంది. ప్రవేశ పరీక్షను హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబయి, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, న్యూఢిల్లీ, లక్నో, జైపూర్, భోపాల్, పాట్నా కేంద్రాల్లో నిర్వహిస్తారు. 
పీజీ డిప్లొమా ఇన్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ రైటింగ్, పీజీ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ, డిప్లొమా ఇన్ టీవీ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సులకు ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు
రాసినవారు కూడా అర్హులు.
డిప్లొమా ఇన్ యాక్టింగ్ (ఫిల్మ్ అండ్ టెలివిజన్), డిప్లొమా ఇన్ డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ కోర్సులకు ఇంటర్మీడియట్ / 10+2 ఉత్తీర్ణులు అర్హులు.
డిప్లొమా ఇన్ ఎడిటింగ్ (ఫిల్మ్ అండ్ టెలివిజన్), డిప్లొమా ఇన్ ఆడియో రికార్డింగ్ అండ్ సౌండ్ డిజైన్ కోర్సులకు ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణతతోపాటు ఏదైనా కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ అవసరం.

సంస్థ వెబ్‌సైట్ www.raft.ramojifilmcity.com నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Posted Date: 02-10-2020


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌