• facebook
  • whatsapp
  • telegram

‘ఆహా’రానికి ఆధునిక హంగు! 

ఉపాధికి ఢోకా లేని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కెరియర్‌   

డిప్లొమా, సర్టిఫికెట్, డిగ్రీ, పీజీ, డాక్టొరల్‌ కోర్సులు    

పరిస్థితులు నెమ్మదిగా చక్కబడుతూ విద్యాసంస్థలు ప్రవేశాలకు ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. కాస్త భిన్నంగా, కెరియర్‌కు ఢోకా లేకుండా సాగాలనుకునేవారికి ఎన్నో రంగాలు ఆహ్వానం పలుకుతున్నాయి. వీటిలో ఆహార రంగానికి చెందిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఒకటి. ఎక్కడో దూర ప్రదేశాలు, ఒక్కోసారి వివిధ దేశాలకు చెందిన ప్రత్యేకతలనూ మన ప్రదేశంలోనే రుచి చూడగలగడం.. కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే దొరికేవాటినీ ఏడాది పొడవునా పొందగలుగుతుండటం.. పాల పదార్థాలు కొన్ని రోజులవరకూ నిల్వ ఉండేలా చేయడం.. ఇవన్నీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ద్వారానే సాధ్యమవుతాయి. దీనిలో కెరియర్‌ మలచుకోవాలనుకునేవారికి దేశవ్యాప్తంగా కొన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు వీటిని ప్రయత్నించవచ్చు.

బేక్‌డ్‌ ప్రొడక్ట్స్‌ (కేక్, బ్రెడ్‌ వంటివి), అప్పటికప్పుడు తినడానికి వీలుగా ఉండేవి (రెడీ టూ ఈట్‌ ప్రొడక్ట్స్‌), ఫ్రీజ్‌డ్‌ (కూరగాయలు, మాంసం వంటివి), ఆల్కహాలిక్‌ బెవరేజెస్, డెయిరీ ప్రొడక్ట్స్‌.. మొదలైనవన్నీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ఉదాహరణలే. నిత్య జీవితంలో మనం ఉపయోగించే దాదాపుగా ప్రతి ఆహారపదార్థం ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు గురయ్యేదే. వ్యవసాయ ఉత్పత్తులను ఆహారం లేదా ఇతర పదార్థాల రూపంలోకి మార్చడాన్నే ఫుడ్‌ ప్రాసెసింగ్‌గా చెబుతాం. ఆహారాన్ని సురక్షితం చేయడం, రుచిని నిలకడగా ఉంచడం, ఏడాది పొడవునా అందుబాటులో ఉండేలా చేయడం వంటివి ఈ విధానంలో ప్రధానాంశాలు. మార్కెటింగ్, సరఫరాలను సులభతరం చేయడానికీ ఈ విధానం తప్పక అవసరమవుతుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఫుడ్‌ సైన్స్‌లో ఒక విభాగం. దీనిలో వివిధ పద్ధతులు, టెక్నిక్‌లను ఉపయోగించి ముడి పదార్థాలను ఆహారంగా రూపొందిస్తారు. ఒకరకంగా దీనిని మనుషులు/ జంతువులు ఆహారంగా స్వీకరించడానికి వీలుగా సిద్ధం చేసే ఒక పద్ధతిగా చెప్పొచ్చు. ప్రాసెసింగ్, ప్రిజర్వేషన్, మాన్యుఫాక్చరింగ్, ప్యాకేజింగ్, క్యానింగ్‌ వంటివి దీనిలో భాగమే. 

కెరియర్‌ మలచుకోవాలంటే..?

దీనిలో ప్రవేశించటానికి కొన్ని కోర్సులున్నాయి. ప్రముఖ సంస్థలు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. సాధారణంగా డిప్లొమా, సర్టిఫికెట్, డిగ్రీ, పీజీ, డాక్టొరల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

డిప్లొమా స్థాయిలో ఉన్నవి- ఫుడ్‌ ప్రాసెసింగ్, ఫుడ్‌ ప్రిజర్వేషన్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సులు. పదో తరగతి పూర్తిచేసుకున్నవారు వీటిని ఎంచుకోవచ్చు.

డిగ్రీస్థాయిలో చదవాలనుకునేవారు బీఎస్‌సీ (హోమ్‌సైన్స్‌/ ఫుడ్‌ టెక్నాలజీ/ ఫుడ్‌ సైన్స్‌)ను ఎంచుకోవచ్చు. కాలవ్యవధి మూడేళ్లు. బీటెక్‌- ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఉన్నాయి. కాలవ్యవధి నాలుగేళ్లు. బీఎస్‌సీ కోర్సులకు ఇంటర్‌ ఎంపీసీ/ బైపీసీ చదివినవారు అర్హులు. బీటెక్‌ కోర్సులకు మాత్రం ఎంపీసీ చదివినవారే అర్హులు. బీఓసీ (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) కాలవ్యవధి మూడేళ్లు. దీనికీ ఇంటర్‌ ఏదైనా సైన్స్‌ గ్రూపుతో పూర్తిచేసినవారు అర్హులు.

పీజీ స్థాయిలో ఎంఎస్‌సీ (హోమ్‌సైన్స్‌/ ఫుడ్‌ టెక్నాలజీ/ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌/ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ/ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌/ ఫుడ్‌ సైన్స్‌), ఎంటెక్‌ (హోమ్‌సైన్స్‌/ ఫుడ్‌ టెక్నాలజీ/ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌/ ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌/ ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌/ ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌) కోర్సులున్నాయి. వ్యవధి రెండేళ్లు. ఎంఎస్‌సీ కోర్సులకు డిగ్రీ స్థాయిలో సైన్స్‌ కోర్సులు చదివినవారు అర్హులు. ఎంటెక్‌ కోర్సులకు సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌ చేసినవారు అర్హులు.

పీహెచ్‌డీ కోర్సులకు సంబంధిత విభాగంలో పీజీ చేసుండాలి. చాలావరకూ సంస్థలు తమకంటూ ప్రత్యేకంగా ప్రవేశపరీక్షను నిర్వహించి, వాటి స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు బీటెక్‌ కోర్సులకు జేఈఈ మెయిన్స్‌ స్కోరునూ, ఎంటెక్‌ కోర్సులకు గేట్‌ స్కోరునూ ప్రామాణికంగా తీసుకుని ప్రవేశాలను కల్పిస్తున్నాయి.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌  3 రకాలు

ప్రైమరీ

సులభమైన/ పురాతన పద్ధతుల్లో సిద్ధం చేయగల వాటిని ప్రైమరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కింద చేర్చొచ్చు. ఎండబెట్టడం, పొట్టు తీయడం, చెత్తనుంచి గింజలను వేరుచేయడం, మిల్లు పట్టడం, గింజలను వేరుచేయడం, మాంసాన్ని ప్రాసెస్‌ చేయడం- ఎముకలు తీసేయడం, కోయడం, ఫ్రీజింగ్, క్యానింగ్, గుడ్ల ప్రాసెసింగ్, పాల పాశ్చరైజింగ్‌ వంటివన్నీ దీని కిందకి వస్తాయి.

సెకండరీ

ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో.. నేరుగా ఉపయోగించుకునేలా పదార్థాలను సిద్ధం చేయడం. బ్రెడ్, ఆల్కహాలిక్‌ ప్రొడక్ట్స్‌ తయారీలను దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. సూక్ష్మంగా వంట పద్ధతులుగా చెప్పొచ్చు.

టెరిషియరీ

ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌... ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కిందకి వస్తాయి. నేరుగా తినేయడానికి వీలుగా లేదా కొంత వేడి చేయడం ద్వారా నేరుగా తీసుకునేలా ఉండేవి దీనికిందకి వస్తాయి. ప్యాక్‌డ్‌ చిప్స్, ఏర్‌లైన్స్‌లో ఉపయోగించే రీ హీటెడ్‌ ఫుడ్‌ వంటివి దీనికి ఉదాహరణలు.

తాజా ప్రవేశాలు

తంజావూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ (ఐఐఎఫ్‌పీటీ) ఈ ఏడాదికిగానూ బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులకు ప్రకటన విడుదల చేసింది. ఇది ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడిచే సంస్థ.

బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ): నాలుగేళ్ల కోర్సు. జేఈఈ మెయిన్‌ (2020) పేపర్‌-1లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

ఎంటెక్‌: ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్, ఫుడ్‌ ప్రాసెస్‌ టెక్నాలజీ, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్పెషలైజేషన్లున్నాయి. సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌ చదివినవారు అర్హులు. డిగ్రీలో 70 శాతం మార్కులతోపాటు ఐఐఎఫ్‌పీటీ ప్రవేశపరీక్ష మార్కుల ఆధారంగా ప్రవేశాలుంటాయి.

పీహెచ్‌డీ: ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్, ఫుడ్‌ ప్రాసెస్‌ టెక్నాలజీ ప్రోగ్రాములున్నాయి. ఎంఈ/ ఎంటెక్‌ పూర్తిచేసినవారు అర్హులు. కనీసం 70 శాతం మార్కులు సాధించి ఉండాలి. మెరిట్‌తోపాటు షార్ట్‌ రిటన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ సెప్టెంబరు 30, 2020న‌ ముగిసింది.

వెబ్‌సైట్‌: http://www.iifpt.edu.in/

అవకాశాలేంటి?

దేశంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిటైల్‌ మార్కెట్‌లో 63 శాతం వాటా ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌దే. ఒక నివేదిక ప్రకారం దేశంలో వీటి మార్కెట్‌ విలువ 14,110 బిలియన్లు. కానీ ఈ పరిశ్రమలో డిమాండ్‌కు తగ్గట్టుగా నిపుణులు లేరు. సుశిక్షితులైన నిపుణుల కోసం సంస్థలు ఎదురుచూస్తున్నాయి. దీంతో తాజా గ్రాడ్యుయేట్లతోపాటు అనుభవం ఉన్నవారికీ మంచి ఉద్యోగావకాశాలున్నాయి. ఫుడ్‌ సేఫ్టీ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లు, ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ డిపార్ట్‌మెంట్లు, స్టోరేజ్‌ యూనిట్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ ప్రొడక్షన్‌ సంస్థలు, లెబొరేటరీలు, క్వాలిటీ అస్యూరెన్స్‌ యూనిట్లు మొదలైన వాటిల్లో వీరికి అవకాశాలుంటాయి. వీరిని సాధారణంగా ఫుడ్‌ టెక్నాలజిస్ట్, క్వాలిటీ మేనేజర్, న్యూట్రిషనల్‌ థెరపిస్ట్, ప్రొడక్ట్‌/ ప్రాసెస్‌ డెవలప్‌మెంట్‌ సైంటిస్ట్, ఫుడ్‌ టెక్నాలజిస్ట్‌ హోదాల్లో నియమించుకుంటారు. 

నెస్లే, డాబర్‌ ఇండియా, ఐటీసీ లిమిటెడ్, అగ్రో టెక్‌ ఫుడ్స్, పార్లే, పెప్సీకో, బ్రిటానియా, హిందుస్థాన్‌ యూనీలివర్, గోద్రెజ్, క్యాడ్బరీ, మిల్క్‌ఫుడ్, ఎంటీఆర్, పర్‌ఫెట్టీ మొదలైనవి వీరికి ఉద్యోగాలిస్తున్న ప్రముఖ సంస్థల్లో కొన్ని. ఎంపికైన సంస్థ, అది ఉన్న ప్రదేశం, హోదాను బట్టి జీతభత్యాల్లో మార్పులుంటాయి. సాధారణంగా ప్రారంభ వేతనం ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి రూ. మూడు లక్షల వరకూ ఉంటుంది. అనుభవం పెరుగుతున్న కొద్దీ జీతభత్యాల్లో మంచి పెరుగుదల ఉంటుంది.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ (ఐఐఎఫ్‌పీటీ), తమిళనాడు

సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, మైసూరు

నేషనల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ అనాలిసిస్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, పుణె

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాప్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ, తంజావూరు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ మేనేజ్‌మెంట్, హరియాణ

నేషనల్‌ డెయిరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, కర్నాల్‌

ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌

యూనివర్సిటీ ఆఫ్‌ బాంబే, ముంబయి

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్, ఘజియాబాద్‌

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, ముంబయి

నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్, కాన్పూర్, చెన్నై, కోల్‌కతా.

Posted Date: 06-03-2021


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌