• facebook
  • whatsapp
  • telegram

నేర్పిస్తారు.. మెరిపిస్తారు!

క్లయింట్లను ట్రెండీగా తీర్చిదిద్దే ఇమేజ్‌ కన్సల్టెంట్లు

కొన్ని సినిమాల్లో గమనించారా! హీరో/ హీరోయిన్‌ పల్లెటూరి నుంచి రావడం.. తోటివారు వారిని దూరంగా ఉంచడమో, హేళన చేయడమో చేస్తుంటారు. తరువాత వాళ్లు తమని తాము పూర్తిగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తారు. చూస్తున్నవారికి ఇదంతా సినిమాటిక్‌గా అనిపిస్తుంది కదా! కానీ నిజానికి ఇదో కెరియర్‌. వ్యక్తులే కాదు, సంస్థలూ ఇలాంటివారికి ప్రాధాన్యం ఇస్తాయి. వారే ఇమేజ్‌ కన్సల్టెంట్లు. కాస్త భిన్నమైన కెరియర్‌ కోసం చూసేవారు ప్రయత్నించదగ్గ వాటిల్లో ఒకటి. ఆ కెరియర్‌ విశేషాలేంటో తెలుసుకుందామా?

కొందరు స్నేహితులు మన దుస్తులు, ప్రవర్తన విషయంలో కొన్ని సలహాలిస్తుంటారు. ఒక్కోసారి అవి చాలా ప్రభావాన్ని చూపుతుంటాయి. దీనిలో సాధారణంగా ఎదుటివారి  తీరు, మనస్తత్వాల ఆధారంగా అభిప్రాయాన్ని చెబుతుంటారు. ఇదంతా వ్యక్తిగతం. ప్రొఫెషనల్‌ విషయానికొస్తే.. ఒక వ్యక్తిపై చూసిన కొన్ని సెకన్లలోనే అభిప్రాయం ఏర్పడుతుందనేది నిపుణుల మాట. అందుకే మొదట్లోనే సానుకూలంగా ఉండేలా చూసుకోవాలని విద్యార్థులకూ, ఉద్యోగార్థులకూ సలహాలిస్తుంటారు. ఇమేజ్‌కి ఉన్న ప్రాధాన్యమే ఇది. వృత్తిగతంగా ఈ విషయంగా సాయమందించేవారూ ఉన్నారు. వారిని ఇమేజ్‌ కన్సల్టెంట్లుగా వ్యవహరిస్తారు. వీరు తమ క్లయింట్లకు ఆకర్షణీయమైన, సరైన ఇమేజ్‌ను సృష్టించడంలో సాయమందిస్తారు.

ప్రవేశించేదెలా?
ఇమేజ్‌ కన్సల్టెన్స్‌కు సంబంధించి ప్రత్యేకంగా డిగ్రీ, పీజీ కోర్సులంటూ ఏమీ లేవు. కాకపోతే పబ్లిక్‌ రిలేషన్స్, ఫ్యాషన్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, మాస్‌ కమ్యూనికేషన్‌ మొదలైన సంబంధిత కోర్సులు దీనికి దగ్గరగా ఉంటాయి. అయితే ఈ కెరియర్‌లో కొనసాగాలనుకునేవారు సంబంధిత సర్టిఫికేషన్‌ను చేసి ఉండటం తప్పనిసరి.

కొన్ని ప్రముఖ సంస్థలు వీటిని అందిస్తున్నాయి. సంస్థను బట్టి కోర్సుల్లో మార్పులుంటున్నాయి. కొన్ని సంస్థలు ఫౌండేషన్, అడ్వాన్స్‌డ్‌ కోర్సులుగా విభజించి అందిస్తుంటే.. మరికొన్ని ఇమేజ్‌ కన్సల్టెంట్‌ సర్టిఫికేషన్‌ పేరిట అందిస్తున్నాయి. సాధారణంగా వీటి కాలవ్యవధి 10 నెలల నుంచి ఏడాదిన్నర వరకూ ఉంటున్నాయి. కొన్ని సంస్థలు ప్రవేశపరీక్ష నిర్వహిస్తుండగా చాలావరకూ వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలను కల్పిస్తున్నాయి. ఇంటర్‌ కనీస విద్యార్హత. కొన్ని సంస్థలు డిగ్రీని తప్పనిసరి చేశాయి.

అపియరెన్స్‌ కన్సల్టింగ్‌; కలర్‌ అనాలిసిస్‌; ఇమేజ్‌ మేనేజ్‌మెంట్‌; ఎటికెట్‌ ప్రోటోకాల్‌; కమ్యూనికేషన్‌ మేనేజ్‌మెంట్‌; వార్డ్‌రోబ్‌ ప్లానింగ్‌; ఎంప్లాయబిలిటీ, జాబ్‌ స్కిల్‌ ట్రెయినింగ్‌; సాఫ్ట్‌స్కిల్స్‌/ బిహేవియరల్‌ స్కిల్‌ ట్రెయినింగ్‌; గ్రూమింగ్, ఎటికెట్‌ కోచింగ్‌; మీడియా/ఫిల్మ్‌/ టీవీ స్టైలింగ్‌; మేకోవర్‌ కన్సల్టింగ్‌; ఈవెంట్‌ స్టైలింగ్‌; పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌  ట్రెయినింగ్‌; పర్సనల్‌ బ్రాండింగ్‌/ ఎగ్జిక్యూటివ్‌ ప్రెజెన్స్‌  ట్రెయినింగ్‌; జ్యూలరీ అండ్‌ యాక్సెసరీ స్టైలింగ్‌; పబ్లిక్‌ స్పీకింగ్‌ అండ్‌ ప్రెజెంటేషన్‌ స్కిల్స్‌ మొదలైన అంశాలను కోర్సులో భాగంగా నేర్పిస్తారు.

అవకాశాలెలా?
ప్రస్తుతం ఆదరణ పెరుగుతున్న కెరియర్లలో ఇమేజ్‌ కన్సల్టెంట్‌ ఒకటి. గత కొన్నేళ్లుగా దీనికి ప్రాచుర్యం పెరుగుతోంది. ఆధునిక ప్రపంచంలో స్వరూపం, వ్యక్తిత్వం రెండింటికీ ప్రాధాన్యమెక్కువ. వీటిని సాధించడానికి కొంత తోడ్పాటు అవసరమవుతోంది. ఇందుకుగానూ సంబంధిత నిపుణుల అవసరం పెరుగుతోంది. వీరు తమ క్లయింట్ల అవసరాల ఆధారంగా ప్రత్యేకంగా శిక్షణ విధానాన్ని రూపొందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వీరికి డిమాండ్‌ పెరుగుతోంది. విద్యార్థుల నుంచి వర్కింగ్‌ ప్రొఫెషనల్స్, వ్యాపారస్థుల వరకూ వీరి అవసరం ఉంది. 

వీరిని వార్డ్‌రోబ్‌ కన్సల్టెంట్, ఫ్యాషన్‌ స్టైలిస్ట్, సాఫ్ట్‌స్కిల్‌ ట్రైనర్, మేకోవర్‌ కన్సల్టెంట్‌లుగానూ వ్యవహరిస్తారు. వ్యక్తిగతంగానే కాకుండా సంస్థలూ వీరిని ఎంచుకుంటాయి. వీరు వ్యక్తిగతంగా కనిపించేతీరుతోపాటు ప్రెజెంటేషన్, పబ్లిక్‌ స్పీకింగ్‌ అంశాల్లోనూ శిక్షణనిస్తారు. 

చాలావరకూ సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించేవారే ఎక్కువ. కన్సల్టెన్నీ సంస్థలూ వీరికి ఉద్యోగావకాశాలను కల్పిస్తాయి. సాధారణంగా వీరిని స్టైలిస్ట్, సాఫ్ట్‌స్కిల్‌ ట్రెయినర్, ఎటికెట్‌ కన్సల్టెంట్, పర్సనల్‌ కోచ్, బాడీ లాంగ్వేజ్‌ ఎక్స్‌పర్ట్, పబ్లిక్‌ స్పీకింగ్‌ కోచ్‌ మొదలైన హోదాలకు ఎంచుకుంటారు.

ఏం చేస్తారు?

ఇమేజ్‌ కన్సల్టెంట్లను ఆర్టిస్టులుగా వ్యవహరిస్తే.. దీనిలో వ్యక్తి కాన్వాస్, దానిపై వేసే చిత్రం వ్యక్తి కనిపించే తీరు, వారి సాఫ్ట్‌స్కిల్స్‌ అవుతాయి. ఇమేజ్‌ అంటే కనిపించే తీరుకే పరిమితమవదు. అందులో వారి ప్రవర్తన, వ్యక్తిత్వాలకీ ప్రాధాన్యముంటుంది. కాబట్టి వీరు..
వోకల్‌ కమ్యూనికేషన్‌ 
నాన్‌వెర్బల్‌ కమ్యూనికేషన్‌ 
బిజినెస్, సోషల్‌ ఎటికెట్‌ అంశాలు మొదలైనవాటిపై దృష్టిపెడతారు.

వీరు తమ క్లయింట్లను అంతర్గతంగా, బాహ్యంగా ఉన్నతంగా తీర్చిదిద్దుతారు. వారిని మెరుగుపరచి, విజయం దిశగా తీసుకెళతారు. క్లయింట్ల అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దుతారు. ఇందులో భాగంగా వారికి అసెస్‌మెంట్, సైకోమెట్రిక్‌ టెస్ట్‌లనూ నిర్వహిస్తారు. వాటి ఫలితాల ఆధారంగా వారికి తగిన ప్రణాళిక రూపొందించి, దానికి అనుగుణంగా మార్పునకు ప్రయత్నిస్తారు.

ఇమేజ్‌ కన్సల్టింగ్‌ అనగానే చాలామంది ఫ్యాషన్‌ పరంగా పొరబడుతుంటారు. ఫ్యాషన్‌ డిజైనర్‌ దుస్తులను డిజైన్‌ చేస్తారు. ఇమేజ్‌ కన్సల్టెంట్‌ తమ క్లయింట్‌ మేనిచాయ, వ్యక్తిత్వం, శరీరతత్వం, చేసే పని, తమ లక్ష్యాల ఆధారంగా వారికి దుస్తులను ఎంపిక చేస్తారు. వీరి పనిలో దుస్తులది ఒక పాత్ర మాత్రమే. వీరు ప్రవర్తన, కమ్యూనికేషన్‌ అంశాలు.. శరీర భాష, ప్రవర్తన తీరు మొదలైన విషయాల్లోనూ మార్గనిర్దేశం చేస్తారు. సంబంధిత అంశాల్లో మెంటరింగ్‌ చేస్తూ శిక్షణనిస్తారు. తద్వారా సానుకూల ప్రభావం వారిపై పడేలా చూస్తారు. అవకాశాలు వచ్చినపుడు ప్రదర్శించే వీలుగా అవసరమైన సాఫ్ట్‌స్కిల్స్‌ను నేర్పిస్తారు. ఒకరకంగా క్లయింట్‌ను విశ్లేషించి వ్యక్తిగతంగా, వృత్తిగతంగా వారిలో ఉత్తమ అంశాలు ఎదుటివారికి ప్రదర్శితమయ్యేలా చూస్తారు. 

ఏ నైపుణ్యాలుండాలి?
మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు 
వ్యక్తులతో త్వరగా కలిసిపోవడం, సమయపాలన 
రంగులు, ఫ్యాషన్‌పై కొంత అవగాహన 
పరిస్థితి, సమయానికి అనుగుణంగా మారగలగడం 
మార్కెటింగ్‌ అంశాలపై అవగాహన 
ఓపిక, ఆత్మవిశ్వాసం 
సానుకూల దృక్పథం

అందిస్తున్న ప్రముఖ సంస్థలు
పెరల్‌ అకాడమీ, ముంబయి, దిల్లీ, జయపుర, బెంగళూరు
ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇమేజ్‌ మేనేజ్‌మెంట్, ముంబయి
ఇమేజ్‌ ఎడ్జ్‌ అకాడమీ, ముంబయి
కోర్‌ ఇంప్రెషన్స్, న్యూదిల్లీ
మై ఆరా ఫినిషింగ్‌ స్కూల్, అహ్మదాబాద్‌
ఇమేజ్‌ కన్సల్టింగ్‌ బిజినెస్‌ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్, ముంబయి, దిల్లీ, పుణె, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు.

కొన్ని సంస్థలు ఫౌండేషన్, అడ్వాన్స్‌డ్‌; మరికొన్ని ఇమేజ్‌ కన్సల్టెంట్‌ సర్టిఫికేషన్‌ పేరిట కోర్సులు అందిస్తున్నాయి 

కొన్ని ప్రముఖ ఉద్యోగాలు

ఎగ్జిక్యూటివ్‌ కన్సల్టెంట్‌
వ్యాపారం, కార్పొరేట్‌ సంస్థల ప్రతిష్ఠను పెంచడంపై పనిచేస్తారు. వాటికి ప్రొఫెషనల్‌ లుక్‌ ఇవ్వడం, సానుకూల దృక్పథం ఏర్పడేలా చేయడం వంటివి చేస్తారు. ఈవెంట్లు, స్పీచ్‌లు, ప్రెజెంటేషన్లు సిద్ధం చేయడంపైనా పనిచేస్తారు.

ఫ్యాషన్‌ అండ్‌ వార్డ్‌రోబ్‌ కన్సల్టెంట్‌
వ్యక్తుల తీరు ఆధారంగా వారి స్టైల్, దుస్తులను తీర్చిదిద్దుతారు. శరీరం, మనస్తత్వం ఆధారంగా ఎంచుకోవాల్సిన రంగులు, డిజైన్‌లు, యాక్సెసరీలు మొదలైనవాటిపై పనిచేస్తారు. తమ అపియరెన్స్‌ను మార్చుకోవాలనుకునే వ్యక్తులు, బిజినెస్‌ ప్రొఫెషనల్స్‌కు సాయమందిస్తారు. వారికోసం వారి వార్డ్‌రోబ్‌ సిద్ధం చేయడం, పర్సనల్‌ షాపింగ్‌ వంటివి చేస్తారు. హెల్త్, ఫిట్‌నెస్‌కు సంబంధించి రెకమెండేషన్‌నూ చేస్తారు.

పర్సనల్‌ ఇమేజ్‌ కన్సల్టెంట్‌
వ్యక్తుల వ్యక్తిత్వం, కనిపించేతీరు మొదలైన వాటి విషయంలో పనిచేస్తారు.

సాఫ్ట్‌స్కిల్‌ ట్రెయినర్‌
కమ్యూనికేషన్, సమయపాలన, పరిస్థితులకు అనుగుణంగా మారగలగడం.. మొదలైన నైపుణ్యాలపై శిక్షణనిస్తారు.

ఎటికెట్‌ ట్రెయినర్‌
మర్యాదలు, ప్రవర్తన తీరు, శరీర భాష మొదలైన వాటిపై శిక్షణనిస్తారు.

సాధారణంగా వీరిని ఉద్యోగార్థులు, కన్సల్టెన్సీలు, పబ్లిక్‌ రిలేషన్స్‌ సంస్థలు, ఫ్యాషన్‌ సంబంధిత సంస్థలు, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, విద్యార్థులు, కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లు, బిజినెస్‌ ఓనర్లు, ఫ్రంట్‌లైన్‌ ఎంప్లాయీస్, లాయర్లు, సినిమా రంగానికి సంబంధించినవారు, రాజకీయ నాయకులు, విద్యాసంస్థలు, ఈవెంట్‌ ఆర్గనైజేషన్‌ సంస్థలు, ఎన్‌జీఓలు, ఫ్యాషన్‌ రిటైల్, స్పోర్ట్స్, మీడియా సంబంధిత వ్యక్తులు మొదలైనవారు ఎంచుకుంటారు.

వీరికి ప్రత్యేకంగా ఇంత అని చెప్పగలిగే జీతభత్యాలు ఉండవు. ఎంపికైన సంస్థ, వ్యాపార తీరును బట్టి ఆదాయం ఉంటుంది. కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారికి మంచి ఆదాయం ఉంటుంది. సాధారణంగా గంటకు కనీసం రూ.2000 నుంచి అనుభవం ఆధారంగా రూ. లక్షల వరకూ సంపాదించుకోగలుగుతారు. అనుభవానికి ఈ రంగంలో ప్రాధాన్యమెక్కువ. సంస్థల్లో చేరినవారికి సంవత్సరానికి రూ.అయిదు నుంచి రూ.ఎనిమిది లక్షల వరకూ చెల్లిస్తారు.

Posted Date: 01-12-2020


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌